For East is East and West is West and the twain shall never meetఅన్నాడు రుడ్‌యార్డ్ కిప్లింగ్ దొరగారు ఢంకా బజాయించి. ఈస్టీస్టే ఎస్టెస్టే అన్నాడు కృష్ణ కృష్ణావతారం సినిమాలో.. కాని భిన్నధ్రువాలు ఆకర్షించుకుంటాయి అని సూదంటురాళ్ళ శాస్త్రం ఘోషిస్తోంది. రైలు పట్టాలు కలవ్వు - సమానాంతరంగా వెళ్లాయి కాని అడంగి (గమ్యం) ఒక్కటే. ఆ రెండూ అలా వుంటేనే గమ్యం చేరగలం. అలాగే కాడిఎడ్లు - కలవ్వు కాని కలిసి నడుస్తాయి. అదీ చమత్కారం. రమణది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం. బాపు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం (కంతేరు). ఆ రెండు పట్టాలూ చెట్టాపట్టాలేసుకుని నడవడం పరుగెత్తడం మొదలై 66 ఏళ్ళయింది. తూర్పుప్పడమరలు కలవ్వని కదూ అనుకుంటున్నారు! దక్షిణ భారతదేశం దక్షిణం చివర కన్యాకుమారి వుంది.
అక్కడ పౌర్ణమినాడు అస్తమించే సూర్యబింబం, ఉదయించే చంద్రబింబం ఒకేసారి పక్కపక్కనే కనిపిస్తాయి. ఆలుమగలయినా ఆప్తమిత్రులయినా అన్నదమ్ములయినా చిరకాల బాంధవ్యాన్ని నిలబెట్టి నడిపే సూత్రం - భరించడం. ఒకరి సుగుణాలు నచ్చినప్పుడు ప్రేమించడం సహజం, మామూలే. కాని నచ్చని గుణాలు కనిపించినప్పుడు వాటిని సహించడం, భరించడం అదే ప్రత్యేకత... ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. మనకి నచ్చని గుణాలన్నీ చెడ్డవి అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది తెలుసుకుంటే స్నేహదీపం అఖండంగా వెలుగుతుంది.
అతనికి ప్రథమ కోపం. తిక్క దూకుడు. ముందర అపార్థం చేసుకుని ఆనక అర్థం చేసుకోవడం. అతను అపార్థసారథి అయితే నేను అప్పార్థసారథిని. అంటే అప్పులతో - ఋణానుబంధాలతో బంధాలను గట్టిపరచుకునేవాడిని.
నిజానికి ఎవడి సొమ్ము వాడు ఖర్చుపెట్టుకుని అప్పు చేయకుండా బతికేస్తూ వుంటే జీవితం డల్‌గా, చెరువులో నీరులా కదలకుండా పడివుంటుంది. అదే అప్పులుచేస్తూ, మస్కాలిస్తూ తీరుస్తూవుంటే - తిట్లూ, కొట్లాటలూ సందడితో బతుకు సెలయేరులా పరుగులు పెడుతుంది. జలపాతంలా ఉరుకుతుంది.
బాపుకి అప్పులివ్వడం తప్ప అడగడం తెలీదు. నాకు అప్పు చేయడం తప్ప ఇవ్వడం తెలీదు. ఈ మధ్య కొంచెం డబ్బుచేశాక... వద్దులెండి.
బాపు రోజుకి 16-18 గంటలు పనిచేస్తాడు. నేను 16-18 గంటలు పడుకుంటాను. అదేమిటి అంటే ఆలోచిస్తున్నాను అంటాను.
1942లో మేము మెడ్రాసు పిఎస్ హైస్కూలులో, అయిదు ఆరు క్లాసులు కలిసి చదువుకున్నాం. హైకోర్టు జడ్జి చేసిన చింతగుంట రాఘవరావు గారి అబ్బాయి - మల్లికార్జున్ (ఇతనూ హైకోర్టు రిజిస్ట్రారు చేశాడు) - పుట్టు జీనియస్ అల్లాడి నరేంద్ర, కర్రావారి అబ్బాయి రమణి, హైకోర్టు జడ్జిగా చేసిన పెనుమెత్స శ్రీరామరాజూలాంటివాళ్ళు క్లాసుమేట్లు.
టిన్‌టిన్ కథలలో కెప్టెన్ హడాక్ వుంటాడు. బ్లిస్టరింగ్ బార్నకిల్స్ అంటూ మొదలుపెట్టి తిట్లదండకం చదువుతుంటాడు. తెలుగు టీచరు దొండపండు రామ్మూర్తి గారు కూడా - అలాగే - ఆనాడే - అలాంటి తిట్లు చదివేవారు. ఇడ్డియట్ - బఫూన్ - స్కౌండ్రల్ - దున్నపోతు - పందికొక్కు - రికామీ గొడ్డు అంటూ గొణుగుతూనే వుండేవాడు.
సత్తిరాజువారి సత్రంలాంటి ఇంటిలో ఒక రాజూ రాణీ - అయిదుగురు పిల్లలూ (అందులో ఒక్క ఆడపిల్ల) ఏడుగురు అత్తగార్లు - అయిదుగురు పిల్లలు స్నేహితులు, నాలాంటి ఆస్థాన ఫ్రెండ్సు - వీళ్ళుకాక ఇద్దరు ముగ్గురు కోర్టుపక్షులూ వుండేవాళ్ళు.
కలవారి కూతురు, మరో కలవారి కోడలూ అయిన సూర్యకాంతమ్మగారు అంత సంపద వుండి కూడా అందరికీ సేవచేస్తూ చారన్నమే పరమాన్నంగా, గడపే తలగడగా, తిన్నవాళ్ల త్రేనుపులే తన ఊపిరిగా సంసారం నడిపేవారు. బాపు తండ్రి వేణుగోపాలరావుగారు నిజానికి కోపాలరావుగారు. కాని చాలా మంచివారు. ఆయనకి ఆస్తమా బాధ. ఒక డాక్టరు-ఆర్సెనిక్ గోల్డ్ ఇంజక్షన్ ఇవ్వడంతో-అది వికటించి బాధ వ్రతరమయిపోయింది. ఆ బాధ పిల్లలు చూడటం ఇష్టంలేక వారిని కోపంతో తిట్లతో భయపెట్టి దూరంగా వుంచేవారు. అయినా బాపూ నేనూ రాత్రివేళ మేడమీద గదిలో నేలమీద పడుకుని చెవులు నేలకి ఆన్చి, ఆయన మూలుగులు విని బాధపడుతుండేవాళ్లం. క్యాలెండరు దేవుడికి దండాలు పెట్టేవాళ్లం. అంత బాధలోనూ సిగరెట్లు కాల్చి అగరొత్తులు వెలిగించేవాళ్లం....
అదే కోతి కొమ్మచ్చి ...అంటే!
(కోతి కొమ్మచ్చి బాపూరమణీయం మొదటి భాగంనుంచి)
ఆ మేరుపర్వతం ముందు..
కార్టూనిస్టుగా నా పయనం 1959లో మొదలైంది. ఆ యేడు ఆంధ్రపత్రిక వారపత్రికలో నా తొలి కార్టూన్ అచ్చయింది. అయితే బాపుగారితో నా పరిచయం 1976లో కానీ సాధ్యపడలేదు. అప్పుడు కూడా ఒకవైపు మనసులో భయపడుతూనే ధైర్యం కూడగట్టుకుని ఆయన ముందు నిలబడ్డాను. ఆరోజు పరిచయం అయింది మొదలుకుని క్రమం తప్పకుండా ఆయనను కలిసేవాడిని. కేవలం ఆయన ఔదార్యంతోటే వారి సరసన నిలిచి కొన్ని పనులు చేయగలిగాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో రూపొందించిన వీడియో పాఠాలకు యానిమేషన్ చేసే గొప్ప అవకాశం నాకు బాపుగారే కల్పించారు.
తొలిపరిచయం తర్వాత గత నలభై ఏళ్లుగా ఆయనతో స్నేహం, సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు కార్టూనిస్టులందరూ ఆయనకు ఏకలవ్య శిష్యులే. తెలుగులో ఉన్నంతమంది కార్టూనిస్టులు ఏ తెలుగేతర ప్రాంతంలోనూ లేరంటే అది బాపు గారి చలవే అని చెప్పాలి. ఆయన వంటి ప్రజెంటర్ కూడా లేరు. చిత్రలేఖనం, స్టోరీ ప్రజెంటేషన్, సినిమా కళను ఔపోసన పట్టడం ఒకే వ్యక్తిలో మూర్తీభవించిన రూపమే బాపు.
రెండు లేక మూడు మాసాల క్రితం హైదరాబాద్‌లో నందగోపాల్ గారి పుస్తకావిష్కణ సందర్భంగా బాపుగారిని చెన్నైలో కలిసి విషయం చెప్పాను. తిరిగి వస్తుండగా ఎందుకోగానీ నన్ను గట్టిగా కౌగలించుకుని ఉండిపోయారు. అప్పటికే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ముళ్లపూడి వెంకటరమణ గారు తనువు చాలించడం, కొన్ని నెలల క్రితం ఆయన సతీమణి కన్నుమూయడం. ఈ రెండు దెబ్బలతో ఆయన తట్టుకోలేకపోయారు. గుండెభారం తగ్గించుకోవడానికి ఆయనతో నా జ్ఞాపకాలను పంచుకుంటున్నాను కాని మాలాంటి చిత్రకారులకు ఆయన లేరన్న విషయం జీర్ణం చేసుకోవడం కష్టమే. చివరగా ఒక్కమాట.. ఆ మహా మేరు పర్వతం ముందు మేము ఇసుక రేణువుల వంటివాళ్లం.
- జయదేవ్ (ప్రముఖ కార్టూనిస్టు)
తూగోజీ - పగోజీ
Published Mon, Sep 1 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM
Advertisement