Malladi Ramakrishna sastry
-
తెలుగువాడీ వాడి వేడీ
తెలుగువాడి వాడీ వేడీ - తేటతెలుగు నీటుదనం - కలబోసి - మాటల బొమ్మలు కట్టిన ఆంధ్ర కథా విష్ణువు కీర్తిశేషులు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. మానవత్వానికి కిరీటం పెట్టి, మాట మాటకీ పదునుపెట్టి, గురి చూసి విసిరే బాణం ఆయన శైలి. అది ఒక్కొక్కసారి పూలను రువ్వితే - మరొక్కొక్కసారి ఇంద్రధనుస్సులా విచ్చుకుని మనిషి మనస్సు రంగుల్ని ఆవిష్కరిస్తుంది. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మల్లాది నరసింహ శాస్త్రి, ఆయన మనవడి భార్య శైలజా సుమన్ సాక్షితో పంచుకున్న జ్ఞాపకాలు... నాన్నగారిలో మూర్తీభవించిన మానవత్వం, సహనం రెండూ ఎక్కువే. ఏదైనా పని మీద బయటకు వెడుతున్నప్పుడు ఎవరైనా ఎదురు వచ్చి, ‘‘శాస్త్రిగారూ! మీరు ఈ పద్యం వినాలి’’ అంటే, ఆయన ఉన్నచోటునే నిలబడి వినేవారు. ఒక్కోసారి రోడ్డు మీద గంటల తరబడి నిలబడి కూడా వినేవారు. కొత్త కొత్త రచయితలను ఎంతో ఇష్టంగా ప్రోత్సహించేవారు. నాన్నగారు ఎవరితోనైనా శ్రద్ధాభక్తులతో మాట్లాడేవారు. తన జీవితంలో పెద్ద మలుపు రావడానికి నాన్నగారి మాటలే కారణమని అక్కినేని నాగేశ్వరరావు గారే స్వయంగా చెప్పారు. మా ఇంట్లో నాన్నగారి తరవాత సాహిత్య వారసత్వం మా తమ్ముడు సూరిశాస్త్రికి అబ్బింది. వాడు కథలూ, కవిత్వమూ రాసేవాడు. జ్యోతిష్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. దురదృష్టవశాత్తూ వాడు చాలా కాలం క్రితమే పోయాడు. వాడంత కాకపోయినా, నేను కూడా అప్పుడప్పుడు కథలు రాసేవాడిని. రేడియోలో పనిచేసే రోజులలో చాలా రాశాను. ఆర్. కె. నారాయణ్ రచించిన ‘గైడ్’ నవలను తెలుగులోకి అనువదించాను. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి భార్య వెంకట రమణమ్మగారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, (ఇద్దరూ లేరు) ఇద్దరు మగ పిల్లలు. నరసింహశాస్త్రిగారు పెద్దబ్బాయి. రెండో అబ్బాయి సూరిశాస్త్రి (లేరు). ‘కృష్ణాతీరం’ నవల అసంపూర్ణంగా ఉండిపోయింది. ఒకసారి నా మిత్రుడు ఉషశ్రీతో ‘నువ్వు ఇది పూర్తి చేయకూడదా?’ అని అడిగితే, ‘‘ఆ పుస్తకానికి నేను నమస్కారం పెడతాను కాని, దానిని ముట్టుకోను, ఉన్నది ఉన్నట్టు ప్రచురించేద్దాం. మళ్లీ ఆయనే పుట్టి ఆయనే ఆ నవల పూర్తి చేస్తారని విశ్వాసంతో ఉండు’’ అన్నాడు. నాన్నగారిది విలక్షణమైన మార్గం. ఆయన రాసిన కథలు వేరే వారి పేరు మీద వచ్చాయని, వాటిని నాన్నగారి పేరు మీద ప్రచురించమని చాలామంది సన్నిహితులు నాకు సలహా ఇచ్చారు. నేను చేయనని చెప్పాను. ఎందుకంటే నాన్నగారికి ఒకరిని నిందించడమంటే ఇష్టం ఉండదు. నేను ఆయన మార్గమే అనుసరిస్తున్నాను. నాన్నగారితో కొంతమంది ‘మీ పాటలు సముద్రాల గారి పేరుతో వస్తున్నాయేంటి’ అని అడిగితే, ‘అది నాకొక కలం పేరు అనుకోండి’ అనేవారే కానీ, ఏ రచయిత మీదా ఈగ వాలనిచ్చేవారు కాదు. నాన్నగారు ఆయన రాసిన పాటల ద్వారా తనకు మంచి పేరు రావాలని కాకుండా, చిత్రం విజయవంతం కావాలని ఆశించేవారు. సినీ రంగంలోకి కొత్తగా వచ్చిన హీరోలకు పేరు వచ్చేలా పాటలు రాసేవారు. కొత్త వారిని ప్రేమగా ఆశీర్వదించేవారు. సినీరంగంలో... ఫ్లోర్ బాయ్ దగ్గర నుంచి మహానటుడు ఎస్వీ రంగారావు వంటి నటుల దాకా అందరూ నాన్నగారిని పితృభావంతో చూసేవారు. ఆయన పోయిన తర్వాత ఆశ్చర్యంగా ఆయనతో సంభాషించని వారు కూడా ఆయన రచనలు చదవాలనుందని చెప్పేవారు. నాన్నగారు, సముద్రాల వారు... ఒకరినొకరు ‘అన్నగారూ’ అని పిలుచుకునేవారు. తరవాతి తరం వారైన మేము అన్నదమ్ముల బిడ్డల్లా పెరిగాం. నాన్నగారే నాకు తండ్రి, గురువు, దైవం. నిరంతరం ఆయన నా వెంట ఉండి నడిపిస్తున్నారనిపిస్తుంది. నరసింహశాస్త్రిగారు తన కోడలు శైలజా సుమన్ గురించి చెబుతూ, ‘‘శైలజ మాకు పరాయి సంబంధం కాదు. జంధ్యాల రాధాకృష్ణగారి అమ్మాయి. వాళ్లు మాకు బంధువులు కూడా. మా అబ్బాయి సుమన్‌తో సంబంధం కుదిరేనాటికి శైలజ ఇంకా చదువుతోంది. రిజల్ట్స్ వచ్చేనాటికి రేడియోలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయించాను. ఉద్యోగంలో ప్రవేశించి, స్వయంకృషితో తొందరగానే మంచి పేరు సంపాదించుకుంది’’ అని మురిపెంగా ముగించారు. హ్యూమర్‌తో పాటు హ్యుమానిటీ ఉన్న మనిషి మాది బందరు. మా ఊరిలో ‘మల్లాది వారి పాట’ అని గొప్పగా చెప్పుకునేవారు. ఏ పండగ, పేరంటం వచ్చినా, ‘శ్రీలలితా శివజ్యోతి’ పాట లేని ఇల్లు కనపడేది కాదు. ఏ ఇంట చూసినా ‘రహస్యం’ చిత్రంలోని ‘గిరిజా కల్యాణం’ యక్షగానం ప్రస్తావన లేకుండా ఉండేది కాదు. ఆ యక్షగానం మీద వ్యామోహంతో మా అమ్మాయికి ‘గిరిజబాల’ అని పేరు పెట్టాం. నేను మల్లాది రామకృష్ణశాస్త్రిగారి పుస్తకాలు చదవడం కంటె, ఆయన పాటలు వింటూ పెరిగాననడం సబబుగా ఉంటుంది. చిరంజీవులు, జయభేరి... ఆయన పాటలన్నీ తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. ‘మనం తెలుగువాళ్లం’ ‘ఈ అమ్మాయి తెలుగమ్మాయి’ లాంటి పదాలు వింటుంటాం కానీ, అక్షరాలా తెలుగు నుడికారం, తెలుగు భాష, తెలుగు సంస్కృతిని పుణికి పుచ్చుకున్న మనిషి మల్లాదివారు. ఆయన పాటలు ‘అమ్మా, గోపెమ్మా’ ‘బుజ్జి’ ‘కన్నా’ వంటి తెలుగు పదాలతో మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మల్లాది వారి గురించి అలా తెలుసుకుంటూ పెరిగాను. పెద్దయ్యాక కొన్ని కథలు చదివాను. వాటి మీద కొంత పరిజ్ఞానం సంపాదించాను. మల్లాది వారి పాటల్లో ‘బావామరదళ్లు’ చిత్రంలోని ‘అందమె ఆనందం’ పాట చాలా ఇష్టం. ఆయన రాసిన చిరంజీవులు చిత్రంలోని ‘కనుపాప కరవైన కనులెందుకు’ అనే పాట తరచుగా గుర్తు వస్తూ ఉంటుంది. అది ఆయన జీవితంలో ఎదురైన సంఘటన ఆధారంగా రాసిన పాటలా అనిపిస్తుంది. మల్లాది వారు రాసిన పాటలలో కొన్ని పదాలను సీనియర్ సముద్రాల వారు మార్చి సులువుగా అర్థమయ్యేలా చేసేవారట. ఆ విషయం స్వయంగా అక్కినేని నాగేశ్వరరావుగారే చెప్పారు. సముద్రాలవారు అక్కినేనిని పిలిచి ‘మల్లాది రామకృష్ణశాస్త్రి’ గారి ఇంటికి వెళ్లి ఆయన రాసిన పాటలు తీసుకురమ్మని పంపేవారట. ఆ పాటలు తెస్తూ, దారిలో వాటిని తెరచి, ‘ఎలా రాశారో’ అని చూస్తూ వచ్చేవారట అక్కినేని. మల్లాది వారంటే ఏఎన్నార్‌కి ప్రాణం. మల్లాది వారికి పలు భాషలలో ప్రావీణ్యం ఉంది. అంతకంత చమత్కారమూ ఉంది. సినిమా డెరైక్టర్ ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్లు ఈయనకి కారు పంపేవారు. అనుకోకుండా ఒక డెరైక్టరు ఇల్లు మల్లాది వారి ఇంటి ఎదురుగానే. అయితే ఆనవాయితీ ప్రకారం ఆయన కారు ఎక్కాలి. అందుకని చమత్కారంగా కారుకి ఇటు వైపు నుంచి లోపలికి ఎక్కి అటు వైపు నుంచి దిగారట. ఆయనలో మానవతావాది ఉన్నాడని చెబుతారు. ఆయన చెప్పు తెగితే దానిని పదే పదే కుట్టించుకునేవారే కానీ కొత్తది కొనేవారు కాదట. ‘ఎందుకు శాస్త్రిగారూ కొత్తవి కొనుక్కోవచ్చు కదా!’ అని ఒకసారి ఆ చెప్పులు కుట్టే వ్యక్తి అడిగితే, ‘నేను కొత్త చెప్పులు కొనుక్కుంటే నువ్వెలా బతకాలి’ అన్నారట. ఆయనలో హ్యూమర్, హ్యుమానిటీ - రెండూ ఉండేవి. తెలుగుదనమంటే తాతగారే! అంతే! నేను అంతటి గొప్పవారింట అడుగు పెట్టినందుకు ఎప్పుడూ గర్వపడతాను. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
తూగోజీ - పగోజీ
For East is East and West is West and the twain shall never meetఅన్నాడు రుడ్యార్డ్ కిప్లింగ్ దొరగారు ఢంకా బజాయించి. ఈస్టీస్టే ఎస్టెస్టే అన్నాడు కృష్ణ కృష్ణావతారం సినిమాలో.. కాని భిన్నధ్రువాలు ఆకర్షించుకుంటాయి అని సూదంటురాళ్ళ శాస్త్రం ఘోషిస్తోంది. రైలు పట్టాలు కలవ్వు - సమానాంతరంగా వెళ్లాయి కాని అడంగి (గమ్యం) ఒక్కటే. ఆ రెండూ అలా వుంటేనే గమ్యం చేరగలం. అలాగే కాడిఎడ్లు - కలవ్వు కాని కలిసి నడుస్తాయి. అదీ చమత్కారం. రమణది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం. బాపు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం (కంతేరు). ఆ రెండు పట్టాలూ చెట్టాపట్టాలేసుకుని నడవడం పరుగెత్తడం మొదలై 66 ఏళ్ళయింది. తూర్పుప్పడమరలు కలవ్వని కదూ అనుకుంటున్నారు! దక్షిణ భారతదేశం దక్షిణం చివర కన్యాకుమారి వుంది. అక్కడ పౌర్ణమినాడు అస్తమించే సూర్యబింబం, ఉదయించే చంద్రబింబం ఒకేసారి పక్కపక్కనే కనిపిస్తాయి. ఆలుమగలయినా ఆప్తమిత్రులయినా అన్నదమ్ములయినా చిరకాల బాంధవ్యాన్ని నిలబెట్టి నడిపే సూత్రం - భరించడం. ఒకరి సుగుణాలు నచ్చినప్పుడు ప్రేమించడం సహజం, మామూలే. కాని నచ్చని గుణాలు కనిపించినప్పుడు వాటిని సహించడం, భరించడం అదే ప్రత్యేకత... ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. మనకి నచ్చని గుణాలన్నీ చెడ్డవి అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది తెలుసుకుంటే స్నేహదీపం అఖండంగా వెలుగుతుంది. అతనికి ప్రథమ కోపం. తిక్క దూకుడు. ముందర అపార్థం చేసుకుని ఆనక అర్థం చేసుకోవడం. అతను అపార్థసారథి అయితే నేను అప్పార్థసారథిని. అంటే అప్పులతో - ఋణానుబంధాలతో బంధాలను గట్టిపరచుకునేవాడిని. నిజానికి ఎవడి సొమ్ము వాడు ఖర్చుపెట్టుకుని అప్పు చేయకుండా బతికేస్తూ వుంటే జీవితం డల్‌గా, చెరువులో నీరులా కదలకుండా పడివుంటుంది. అదే అప్పులుచేస్తూ, మస్కాలిస్తూ తీరుస్తూవుంటే - తిట్లూ, కొట్లాటలూ సందడితో బతుకు సెలయేరులా పరుగులు పెడుతుంది. జలపాతంలా ఉరుకుతుంది. బాపుకి అప్పులివ్వడం తప్ప అడగడం తెలీదు. నాకు అప్పు చేయడం తప్ప ఇవ్వడం తెలీదు. ఈ మధ్య కొంచెం డబ్బుచేశాక... వద్దులెండి. బాపు రోజుకి 16-18 గంటలు పనిచేస్తాడు. నేను 16-18 గంటలు పడుకుంటాను. అదేమిటి అంటే ఆలోచిస్తున్నాను అంటాను. 1942లో మేము మెడ్రాసు పిఎస్ హైస్కూలులో, అయిదు ఆరు క్లాసులు కలిసి చదువుకున్నాం. హైకోర్టు జడ్జి చేసిన చింతగుంట రాఘవరావు గారి అబ్బాయి - మల్లికార్జున్ (ఇతనూ హైకోర్టు రిజిస్ట్రారు చేశాడు) - పుట్టు జీనియస్ అల్లాడి నరేంద్ర, కర్రావారి అబ్బాయి రమణి, హైకోర్టు జడ్జిగా చేసిన పెనుమెత్స శ్రీరామరాజూలాంటివాళ్ళు క్లాసుమేట్లు. టిన్టిన్ కథలలో కెప్టెన్ హడాక్ వుంటాడు. బ్లిస్టరింగ్ బార్నకిల్స్ అంటూ మొదలుపెట్టి తిట్లదండకం చదువుతుంటాడు. తెలుగు టీచరు దొండపండు రామ్మూర్తి గారు కూడా - అలాగే - ఆనాడే - అలాంటి తిట్లు చదివేవారు. ఇడ్డియట్ - బఫూన్ - స్కౌండ్రల్ - దున్నపోతు - పందికొక్కు - రికామీ గొడ్డు అంటూ గొణుగుతూనే వుండేవాడు. సత్తిరాజువారి సత్రంలాంటి ఇంటిలో ఒక రాజూ రాణీ - అయిదుగురు పిల్లలూ (అందులో ఒక్క ఆడపిల్ల) ఏడుగురు అత్తగార్లు - అయిదుగురు పిల్లలు స్నేహితులు, నాలాంటి ఆస్థాన ఫ్రెండ్సు - వీళ్ళుకాక ఇద్దరు ముగ్గురు కోర్టుపక్షులూ వుండేవాళ్ళు. కలవారి కూతురు, మరో కలవారి కోడలూ అయిన సూర్యకాంతమ్మగారు అంత సంపద వుండి కూడా అందరికీ సేవచేస్తూ చారన్నమే పరమాన్నంగా, గడపే తలగడగా, తిన్నవాళ్ల త్రేనుపులే తన ఊపిరిగా సంసారం నడిపేవారు. బాపు తండ్రి వేణుగోపాలరావుగారు నిజానికి కోపాలరావుగారు. కాని చాలా మంచివారు. ఆయనకి ఆస్తమా బాధ. ఒక డాక్టరు-ఆర్సెనిక్ గోల్డ్ ఇంజక్షన్ ఇవ్వడంతో-అది వికటించి బాధ వ్రతరమయిపోయింది. ఆ బాధ పిల్లలు చూడటం ఇష్టంలేక వారిని కోపంతో తిట్లతో భయపెట్టి దూరంగా వుంచేవారు. అయినా బాపూ నేనూ రాత్రివేళ మేడమీద గదిలో నేలమీద పడుకుని చెవులు నేలకి ఆన్చి, ఆయన మూలుగులు విని బాధపడుతుండేవాళ్లం. క్యాలెండరు దేవుడికి దండాలు పెట్టేవాళ్లం. అంత బాధలోనూ సిగరెట్లు కాల్చి అగరొత్తులు వెలిగించేవాళ్లం.... అదే కోతి కొమ్మచ్చి ...అంటే! (కోతి కొమ్మచ్చి బాపూరమణీయం మొదటి భాగంనుంచి) ఆ మేరుపర్వతం ముందు.. కార్టూనిస్టుగా నా పయనం 1959లో మొదలైంది. ఆ యేడు ఆంధ్రపత్రిక వారపత్రికలో నా తొలి కార్టూన్ అచ్చయింది. అయితే బాపుగారితో నా పరిచయం 1976లో కానీ సాధ్యపడలేదు. అప్పుడు కూడా ఒకవైపు మనసులో భయపడుతూనే ధైర్యం కూడగట్టుకుని ఆయన ముందు నిలబడ్డాను. ఆరోజు పరిచయం అయింది మొదలుకుని క్రమం తప్పకుండా ఆయనను కలిసేవాడిని. కేవలం ఆయన ఔదార్యంతోటే వారి సరసన నిలిచి కొన్ని పనులు చేయగలిగాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో రూపొందించిన వీడియో పాఠాలకు యానిమేషన్ చేసే గొప్ప అవకాశం నాకు బాపుగారే కల్పించారు. తొలిపరిచయం తర్వాత గత నలభై ఏళ్లుగా ఆయనతో స్నేహం, సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు కార్టూనిస్టులందరూ ఆయనకు ఏకలవ్య శిష్యులే. తెలుగులో ఉన్నంతమంది కార్టూనిస్టులు ఏ తెలుగేతర ప్రాంతంలోనూ లేరంటే అది బాపు గారి చలవే అని చెప్పాలి. ఆయన వంటి ప్రజెంటర్ కూడా లేరు. చిత్రలేఖనం, స్టోరీ ప్రజెంటేషన్, సినిమా కళను ఔపోసన పట్టడం ఒకే వ్యక్తిలో మూర్తీభవించిన రూపమే బాపు. రెండు లేక మూడు మాసాల క్రితం హైదరాబాద్‌లో నందగోపాల్ గారి పుస్తకావిష్కణ సందర్భంగా బాపుగారిని చెన్నైలో కలిసి విషయం చెప్పాను. తిరిగి వస్తుండగా ఎందుకోగానీ నన్ను గట్టిగా కౌగలించుకుని ఉండిపోయారు. అప్పటికే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ముళ్లపూడి వెంకటరమణ గారు తనువు చాలించడం, కొన్ని నెలల క్రితం ఆయన సతీమణి కన్నుమూయడం. ఈ రెండు దెబ్బలతో ఆయన తట్టుకోలేకపోయారు. గుండెభారం తగ్గించుకోవడానికి ఆయనతో నా జ్ఞాపకాలను పంచుకుంటున్నాను కాని మాలాంటి చిత్రకారులకు ఆయన లేరన్న విషయం జీర్ణం చేసుకోవడం కష్టమే. చివరగా ఒక్కమాట.. ఆ మహా మేరు పర్వతం ముందు మేము ఇసుక రేణువుల వంటివాళ్లం. - జయదేవ్ (ప్రముఖ కార్టూనిస్టు) -
గురుతు చెరగని మనిషి
రేఖ పుట్టిన దగ్గరినుంచీ అనాది మానవ జీవన కాలం నుంచి ఎంతమంది చిత్రకారులు.. ఎన్ని లక్షలు, కోట్ల గీతలు వేసి ఉంటారు. కానీ బాపూ గీత కొట్టొచ్చినట్లుంది. బాపూ బొమ్మ అప్పుడే పుట్టినట్లుంటుంది. తెలుగు జీవంతో ముద్దుగా, ఒద్దికగా ఉంటుంది. ప్రత్యేక శైలికి చెందిన చిత్రకారుడిగా ఆయన స్థానం ఎప్పటికీ చెరగనిదీ, చలించనిదీ. ఆయన చిత్రకళలాగే ఆయన చలన చిత్ర కళా అద్భుతమైంది. బాపు...తన కలలను కాన్వాస్తోనే పంచుకున్నవాడు. రంగుల జలపాతాలను ఉరికించినవాడు. వేల ఇంద్రధనుస్సులను నేల మీద పరిచినవాడే కాదు, వెండితెర మీద రంగులతో మాట్లాడించినవాడు. వందల పేజీల భావాన్ని ముఖపత్రం మీది సప్తవర్ణ మౌనంతో ఆవిష్కరించినవాడు. కొంటె బొమ్మల బాపు.. నిజానికి కోటి బొమ్మల వేలుపు. ‘నా బొమ్మ తగిలించడానికి గోడ లేకుండా పోయింద’ని తన ఆత్మీయుడు ముళ్లపూడి గురించి బాధపడిన బాపు, ఎన్నెన్నో బొమ్మలను మూసిన కళ్లలోనే వదిలేసి వాటికి కాన్వాసే లేకుండా చేశాడు. బుడుగు, సీగానపెసూనాంబ, అప్పారావు వంటి సాదాసీదా మనుషుల బొమ్మలు మొదలు ఆజానుబాహులైన పురాణ పురుషులూ, ఆకర్ణాంత నయనాలతో అచ్చెరువొందించే పురాణ స్త్రీల బొమ్మలూ, సమకాలీనుల క్యారికేచర్లు... ఎన్ని వందలు ఆయన కుంచె నుంచి జనం మధ్యకు వచ్చాయి! బాపు తెలుగు వర్ణమాలను సప్తవర్ణ శోభితం చేయాలని స్వప్నించాడు. అక్షరానికి కొత్త రూపు ఇచ్చాడు. రాత మీద మమకారం పెంచాడు. తెలుగు నుడికారాన్ని రేఖలుగా మలిచాడు. తెలుగునేల సౌందర్యానికి కొత్త రంగులద్దాడు. ఆరుద్ర చెప్పినట్టు ‘కొంటెబొమ్మల బాపు/ కొన్నితరముల సేపు/ గుండెలూయలూపు/ ఓ కూనలమ్మా!’ బాపు లేని తెలుగునేల, రంగు వెలిసిన కల. ‘సాక్షి’తో ప్రయాణం ప్రారంభించిన బాపు గారికి ‘తెలుగువారి మనస్సాక్షి’ నివాళి జంటతారలలో మరో తార కూడా వెళ్లిపోయింది. తాత్కాలిక వియోగం తర్వాత తిరిగి బాపు-రమణ కలిసిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో బాపుగారు తెలుసు. తెలుగు వారికి మరీనూ. కళాకారులకీ, రచయితలకీ, సినిమావారికీ మరీమరీ తెలుసు. తెలుగు సినీ గమనంలో బాపు ఓ ప్రత్యేక ప్రవాహం. మొదటి సినిమాతోటే తన ముద్రను ప్రత్యేకంగా చాటి సాక్ష్యంగా నిలబెట్టిన ఘనత బాపూది. ఆయన సినిమాల్లో ఏ దృశ్యం గుర్తు తెచ్చుకున్నా ఆయన గుర్తొస్తారు. ఆయన గుర్తొస్తే చాలు.. ఆయన అద్భుతంగా మన ముందు నిలిపిన దృశ్యాలు గుర్తొస్తాయి. ‘సాక్షి’ సినిమాలో ఒక సామాన్యుడికి రౌడీ అంటే ఉండే భయం, నిస్సహాయత కళ్లముందు కదిలితే ‘బుద్ధిమంతుడు’లో ఎ.ఎన్.ఆర్ భగవంతుడితో జరిపిన సంభాషణా చాతుర్యం మనని ఎప్పటికీ వదలదు. ‘గంగావతరణం’, ‘సంపూర్ణ రామాయణం’లో రావణుడు, ‘శ్రీరామరాజ్యం’లో సీతమ్మ తల్లి భూమాత ఒడి చేరిన తీరు ఒకటేమిటి, అనేకానేక దృశ్యాలు దేనికదే ప్రత్యేకం. బాపు దేన్నయినా అందంగానే తీస్తారు అన్నది చాలామంది అభిప్రాయం. దేనిలోనయినా అందాన్ని, సౌందర్యమూలాన్ని పట్టుకోవటం ఆయనకే చెల్లిన ప్రత్యేక బాణీ. దృశ్యం, మాట, పాట, సంగీతం, చీకటి వెలుగులు, అందాల రంగుల కలయిక, అద్భుత ఊహాలోకం, నిఖార్సయిన జీవితం.. వీటన్నిటి కలగలుపు మంచి చిత్రమైతే, అవన్నీ బాపూ గారి సినిమాలు. పాఠ్య పుస్తకాల్లాంటి సినిమాలు తీసినా, ప్రేక్షకులు పరవశించి పదే పదే చూసిన సినిమాలు తీసినా ఆయనకే చెల్లింది. చలన చిత్రాల్లో నలుపు తెలుపు నుంచి రంగుల చలన చిత్రాల వరకు సాగింది ఆయన ప్రస్థానం. చిత్రకారుడిగానే కాదు, చిత్రదర్శకుడిగా కూడా నిరంతర అధ్యయన శీలి. అయినా ఒక్కమాటగానైనా తనకి చలనచిత్రాల గురించి ఇంత తెలుసు, అంత తెలుసు అని ఏనాడూ అనని సౌమనస్యజీవి. ఒక్కసారైనా ఆయన తమ కథకు బొమ్మేస్తే చాలు అని కోరుకున్న రచయితలు ఎందరో. కథా హృదయం పట్టుకుని అది ప్రతిబింబించేలా ఇలస్ట్రేషన్ చెయ్యటం ఆయనకే చెల్లింది. కథ బావుండక పోవచ్చునేమో కానీ, బాపూ వేసిన బొమ్మ బావుండని సందర్భాలు లేవనే చెప్పాలి. రేఖ పుట్టిన దగ్గరినుంచీ అనాది మానవ జీవన కాలం నుంచి ఎంతమంది చిత్రకారులు.. ఎన్ని లక్షలు, కోట్ల గీతలు వేసి ఉంటారు. కానీ బాపూ గీత కొట్టొచ్చినట్లుంది. బాపూ బొమ్మ అప్పుడే పుట్టినట్లుంటుంది. తెలుగు జీవంతో ముద్దుగా, ఒద్దికగా ఉంటుంది. ప్రత్యేక శైలికి చెందిన చిత్రకారుడిగా ఆయన స్థానం ఎప్పటికీ చెరగనిదీ, చలించనిదీ. ఆయన చిత్రకళలాగే ఆయన చలన చిత్ర కళా అద్భుతమైంది. స్నేహంతో, స్నేహం కోసం చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన తీరే విలక్షణం. వారు ఎన్నుకున్న కథా వస్తువులు, చిత్రీకరణ తీరులో వారి ముద్ర సుస్పష్టం. వేల కొద్దీ ఉన్న తెలుగు సినిమాలలో బాపూ సినిమా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొదటి ఫ్రేమ్ నుంచి ముగింపు వరకు ఎక్కడా మర్యాదని దాటకపోవటం బాపూ సినిమా ప్రత్యేకత. రామభక్తి అయినా, రావణనీతి అయినా, అభినవ రామాయణం ‘ముత్యాల ముగ్గు’ అయినా, ఆ నడక, నడత వారిదే. ప్రతి సినిమా ఓ పుస్తకం. ఓ అధ్యయన గ్రంథం. ఎన్నో రంగాలకి చెందిన, దేశ విదేశీ స్నేహ సంపద అపారం బాపుగారికి. ఆయనకి రచన నచ్చితే ఎంత బలవంతం చేసినా ఆయన వేసిన బొమ్మలకి పారితోషికం తీసుకోకపోవటం మిత్రులకి తెలుసు. బాపూ గారి బొమ్మల్ని చూసి మురిసిన వారిలో మూడు నాలుగు తరాల వారు ఉన్నారు. బొమ్మలూ, సినిమాలనే కాదు. బాపు గారు తెలుగు కథల్ని కూడా బాగా ఎరిగిన వ్యక్తి. బాపూ మన్నన పొందితే అది అంతర్జాతీయ స్థాయి కథ అని ధీమాగా చెప్పొచ్చు. దానికి తార్కాణంగా ఆయన సంకలనం చేసిన ‘కథ’ సంకలనాన్నే చెప్పొచ్చు. 1960 నవంబర్‌లో ‘కథ’ అన్న పదకొండు కథల సంపుటిని ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వారు తమ ఇంటింటా స్వంత గ్రంథాలయం ప్రణాళికలో భాగంగా ప్రచురించారు. ఈ పదకొండు కథలకి బొమ్మలు వేయటమే కాక ఆ కథల్ని ఎంపిక చేసి సంకలనం చేసింది బాపు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఇది ఒక విశిష్ట కథా సంకలనం. కళ్యాణ సుందరీ జగన్నాథ్ ‘మాడంత మబ్బు’, రాచకొండ విశ్వనాథశాస్త్రి ‘వర్షం’, కొడవటి గంటి కుటుంబరావు ‘ఫాలౌట్’, సి. రామచంద్రరావు ‘నల్లతోలు’, అరిగే రామారావు ‘నచ్చినోడు’, రావి కొండలరావు ‘మాయమైన మనీపర్సు’, రుద్రాభట్ల నరసింగరావు ‘వరలక్ష్మికి వరుడు’, పూసపాటి కృష్ణం రాజు ‘సీతాలు జడుపడ్డది’, భమిడిపాటి జగన్నాథరావు ‘లౌక్యుడు’, శివరాజు సుబ్బులక్ష్మి ‘మనోవ్యాధికి మందుంది’, మల్లాది రామకృష్ణ శాస్త్రి ‘కొమరయ్య కోన’ ఈ పదకొండు కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. వీటిని చదివితే వ్యక్తుల మనస్తత్వం, వివిధ సందర్భాల ప్రభావం, సంస్కృతీ బలం, ఆధునిక మార్పులు, మనుషుల్లో హెచ్చుతగ్గులు, ఆశ నిరాశల శక్తి వెరసి మొత్తం తెలుగు జీవితం అంతా కళ్లముందు పరుచుకుంటుంది. ఒక కథ పోలిక మరో కథలో ఎంతమాత్రం లేకపోవటం ఈ సంకలనం ప్రత్యేకత. రచయితలు ఎంత ప్రతిభతో ఈ కథలను రాశారో, అంతటి ప్రతిభతో వీటిని సంకలనం చేశారు బాపూ. నచ్చిన రచనని పనిగట్టుకుని ఓ ఉద్యమంలా ప్రచారం చెయ్యటంలోనూ, అద్భుతమైన సంగీత, సాహిత్య, సినిమా సంపదని ప్రోది చెయ్యటంలోనూ ఆయన ప్రత్యేకత ఆయనదే. మహా గాయకుడు బాలమురళీ కృష్ణ గారిచేత తన అన్ని సినిమాల్లోనూ పాడించారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో! ఆయనకు నా పైన అమితమైన వాత్సల్యం ఉండేది. ఆయన నన్ను ఫ్రెండ్ అనేవారు. చిన్నవాడిననీ, చితకవాడిననీ చూసింది ఎప్పుడూ లేదు. నాకు ఫలాని ఆర్టిస్టు బొమ్మలంటే ఇష్టం అని తెలుసుకుని వారి బొమ్మల పుస్తకాలు ఎక్కడున్నా తెప్పించి ప్రజెంట్ చేసేవారు. ఒకసారి సెర్గియొ టొప్పి అనే చిత్రకారుడి పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవని దిగాలు మొహం పెట్టుకుని ఆయన ముందు నిలబడితే, నా మొహంలో నవ్వు తెప్పించడానికి ఇరవై వేల రూపాయల చెక్కు నా పేర రాసి నా మొహాన నవ్వు రప్పించారు. నేను మంచి ఉద్యోగంలో పెద్ద పొజిషన్లో ఉండాలని ఎప్పుడూ కోరుకునేవారు. ఓసారి బెంగళూరులో ఒక పెద్ద సంస్థలో నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ సాయంకాలం నాకు ఫోన్ చేసి ‘ఏవండీ! నేనూ రమణగారూ మీ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నామ’ని ఆనందపరిచారు. క్రమక్రమంగా ఆయన్ని కలిసిన ప్రతిసారీ హెచ్చరించేవారు. ‘మీరు మీ టాలెంట్‌ని వృధా చేసుకుంటున్నారు. నా మాట విని ఈ ఇలస్ట్రేషన్ వదిలేయండి. టెక్నాలజీ వైపు మళ్లండి..’ ఆయనకు ఏం చెప్పాలో నాకు తోచేది కాదు. గత సంవత్సరం డిసెంబర్ 15న ఆయన పుట్టిన రోజు. హెల్త్ చెకప్‌కు హైద్రాబాద్ వచ్చారు. ఆస్పత్రిలో ఆయన్ని కలవడం అంతగా ఇష్టపడేవారు కాదు. ఆయన హైద్రాబాద్‌కు వచ్చినా నేను కలవకపోతే మొహం మాడ్చుకునేవాడిని. చెకప్ అయిపోయాక వెళ్లేదారిలో సాక్షి ఆఫీసు ముందు ఆగి, కిందికి రమ్మన్నారు. రోడ్‌పై ది గ్రేట్ బాపుగారు ప్రేమగా తన చేతుల్లోకి నా చేతుల్ని తీసుకున్నారు. ఆయన చేతుల మధ్యనుంచి ఒక కవర్ నా చేతులపైకి వచ్చింది. ‘పెద్దవాణ్ణి ఇస్తున్నా.. కాదు అనరాదు..’ అంటూ చిరునవ్వుతో నా తల నిమిరి కారెక్కి కూచున్నారు. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీన మధ్యాన్నం ఫోన్ చేశారు. ‘నాకో సహాయం చేయాలండీ’ అన్నారు. ‘ఏంటి సార్’ అనడిగాను. ‘మీకు ప్రపంచంలోని ఇంతమంది చిత్రకారుల బొమ్మలు వారి రీతులు తెలుసు కదా. విజయవాడ గంధం ప్రసాద్ గారు నా బొమ్మలన్నీ కలిపి ఒక బుక్ తెస్తున్నారు. దానికి మీరు ముందుమాట వ్రాయాలని నా కోరిక’ అన్నారు. నేను తెలీక ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. దాని ఫలం పేరు బాపు. - అన్వర్ చిన్నబోయిన ముఖచిత్రం కుంచె కన్నీటి కెరటమైంది. తెలుగు అక్షరం చిన్నబోయింది. ముఖ చిత్రం మూగబోయింది. వర్ణాలన్నీ వివర్ణమయ్యాయి. ఆయన బొమ్మలన్నీ కొలువు దీరి నాన్న దూరమయ్యాడని వెక్కివెక్కి రోదించాయి. తెలుగింట్లో బుడుగులు, బాపు బొమ్మలాంటి అమ్మాయిలు శోకతప్తులయ్యారు. బాపు ఇక లేరన్న వార్త ఆయన అభిమానులందర్నీ కలచి వేసింది. కవిత్వాన్ని మహాకవి శ్రీశ్రీ ఏరీతిగా భూమార్గం పట్టించారో..చిత్రకళను బాపు ప్రజల్లోకి తీసుకువచ్చారు. ఇదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. గతంలో రవివర్మ ఆ పని మొదలుపెడితే బాపు దానిని కొనసాగించారన్నమాట కూడా ఉంది. గీత రహస్యాన్ని అతను కాచివడబోశాడు. ‘బాపు చిత్రాలు చూచి ఆనందించడం మన కళాభిజ్ఞతకు వన్నె..’ అని మల్లాది రామకృష్ణశాస్త్రి గారన్నమాటలు అక్షర సత్యం. చిత్రకళను ప్రజల్లోకి తీసుకురావటం అంత ఆషామాషీ కాదు. ఇతర చిత్రకారులు అసూయపడే విధంగా ఆయన గీత ఉంటుందన్నది నండూరి రామమోహనరావు వ్యాఖ్య. తన గాలిబ్ గీతాలకు బాపు వేసిన బొమ్మలను చూసి దాశరథి మురిసిపోయారు. ‘దూది చూడడానికి సాదాగా ఉంటుంది. కానీ అది ఎందరి మానాలను కాపాడుతుందనీ..బాపు బొమ్మలు అంతే నిరాడంబరంగా ఉంటాయి. కానీ గుండె పొరల వెనకాల ఉన్న స్వాభిమానాలకు హాయిగా చురకలు పెడతాయి.. బాపులో ఒక దర్శకుడు ఉన్నాడు.. దార్శనికుడు ఉన్నాడు’ అంటారు సినారె. ‘బాపు ప్రతిభ తెలుగు తల్లి ప్రాంగణంలో పెట్టిన మంచి ముత్యాల ముగ్గు ..ఇంది ఎంచిన సత్యాల నిగ్గు..’అన్నారు ఆరుద్ర. అది 1943వ సంవత్సరం...అది న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య)గారి ‘బాల’ పత్రికా కార్యాలయం. పదేళ్ల బాలుడు ఆయన ఎదురుగా నిల్చుని నేను బొమ్మలు గీస్తాను. మీ పత్రికలో వేస్తారా అని ధైర్యంగా అడిగేశాడు. వెంటనే అతని ఉత్సాహాన్ని గమనించి రంగులు, కుంచెలు ఇచ్చి బొమ్మలు గీయమన్నారు. చకచకా అతను వేసిన చిత్రాలన్నింటినీ చూసి ఆశ్చర్యపడి తన పత్రికలో వేయించారు. ఆ బాలుడి గీతాభ్యాసం అలా మొదలై ఏడు దశాబ్దాలపాటు తెలుగు భాష గీతనే మార్చేసింది. సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఆ బుడతడు అనంతర కాలం బాపుగా అవతరించి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. తొలినాళ్లలో బాపు చిత్రకళాభ్యాసానికి గురువులైన గోపులుగారు, చామకూరగారు మెరుగులు దిద్దారు. అప్పటి నుంచి బాపు బొమ్మలు, కార్టూన్లు, కామిక్స్, కవర్ డిజైన్లు దర్శనమివ్వటం ప్రారంభించాయి. 1954లో ఫ్రీ హేండ్ అవుట్‌లైన్ అండ్ మోడల్ డ్రాయింగ్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. 1955లో ఆంధ్రపత్రికలో రాజకీయ కార్టూనిస్టుగా రంగప్రవేశం. 1978లో లండన్‌లో ‘వన్‌మేన్ షో’ప్రదర్శన. ప్రతి గీత ప్రాణం పలుకుతుంది. ఆయన రాసిన ప్రత్యక్షరం నవలాస్యం చేస్తుంది. 1955-65 మధ్యకాలంలో ఆర్టిస్టుగా, ఆర్ట్ డైరక్టర్‌గా ఉద్యోగం. ఆయన మృతితో ఒక తెలుగు జాతి వెలుగు రేఖ చీకటైపోయింది. బాపు టైటిల్‌తోనే ఏదైనా పుస్తకానికి సార్థకత. ఈ ఏడాదిలోనే మా నాన్నగారు మధునాపంతులవారి పుస్తకానికి ఆయన వేసిన ముఖచిత్రమే ఇటీవల కాలంలో ఆయన వేసిన టైటిల్ అయి ఉంటుందని భావిస్తున్నాను. నా అభ్యర్థన మేరకు పదికి పైగా పుస్తకాలకు అద్భుతమైన ముఖచిత్రాలను సహృదయంతో వేసి ఇచ్చిన ఆయన రుణం తీరేదెలా..! - మధునాముర్తి మిత్రుడు కె. వివేకానందమూర్తితో కలిసివెళ్లి ఆయన ఇంట్లో నేను ఆత్మీయంగా గడిపిన కాలం మరపురాదు. అలాగే శ్రీరామరాజ్యం చిత్రాన్ని గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆయన పక్కనే కూర్చుని చూసిన సమయం కూడా.. చక్కటి చిరునవ్వు, మెత్తటి పాట, నిష్కర్షగా నిజ వ్యక్తీకరణ, ఇంక మళ్లీ అలా ఆయన్ను చూడలేం అన్న బాధ, ఆయన కళ్లబడరన్న దిగులు. నాకే కాదు.. నన్ను మించి ఎందరెందరికో.. ఓ గొప్ప, అపురూప వ్యక్తి కాలంలో కలిసిపోయారు. కానీ ఆయన గురుతు, గీత, మాట, చేత, దృశ్యం, తెలుగుతనం, చిలిపితనం, మొహమాటం ఎప్పటికీ అలాగే ఉంటాయి. ప్రత్యక్షంగా ఎరిగిన వారికి ఆయన మరపురారు. అలా ఎరగనివారికి ఆయన బొమ్మలు, చలనచిత్రాలు, రాతలు మరపురావు. - వి.రాజారామమోహనరావు (వ్యాసకర్త నవలా రచయిత, సినీ విమర్శకులు )