తెలుగువాడీ వాడి వేడీ
తెలుగువాడి వాడీ వేడీ - తేటతెలుగు నీటుదనం - కలబోసి - మాటల బొమ్మలు కట్టిన ఆంధ్ర కథా విష్ణువు కీర్తిశేషులు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. మానవత్వానికి కిరీటం పెట్టి, మాట మాటకీ పదునుపెట్టి, గురి చూసి విసిరే బాణం ఆయన శైలి. అది ఒక్కొక్కసారి పూలను రువ్వితే - మరొక్కొక్కసారి ఇంద్రధనుస్సులా విచ్చుకుని మనిషి మనస్సు రంగుల్ని ఆవిష్కరిస్తుంది. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మల్లాది నరసింహ శాస్త్రి, ఆయన మనవడి భార్య శైలజా సుమన్ సాక్షితో పంచుకున్న జ్ఞాపకాలు...
నాన్నగారిలో మూర్తీభవించిన మానవత్వం, సహనం రెండూ ఎక్కువే. ఏదైనా పని మీద బయటకు వెడుతున్నప్పుడు ఎవరైనా ఎదురు వచ్చి, ‘‘శాస్త్రిగారూ! మీరు ఈ పద్యం వినాలి’’ అంటే, ఆయన ఉన్నచోటునే నిలబడి వినేవారు. ఒక్కోసారి రోడ్డు మీద గంటల తరబడి నిలబడి కూడా వినేవారు. కొత్త కొత్త రచయితలను ఎంతో ఇష్టంగా ప్రోత్సహించేవారు. నాన్నగారు ఎవరితోనైనా శ్రద్ధాభక్తులతో మాట్లాడేవారు.
తన జీవితంలో పెద్ద మలుపు రావడానికి నాన్నగారి మాటలే కారణమని అక్కినేని నాగేశ్వరరావు గారే స్వయంగా చెప్పారు. మా ఇంట్లో నాన్నగారి తరవాత సాహిత్య వారసత్వం మా తమ్ముడు సూరిశాస్త్రికి అబ్బింది. వాడు కథలూ, కవిత్వమూ రాసేవాడు. జ్యోతిష్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. దురదృష్టవశాత్తూ వాడు చాలా కాలం క్రితమే పోయాడు. వాడంత కాకపోయినా, నేను కూడా అప్పుడప్పుడు కథలు రాసేవాడిని. రేడియోలో పనిచేసే రోజులలో చాలా రాశాను. ఆర్. కె. నారాయణ్ రచించిన ‘గైడ్’ నవలను తెలుగులోకి అనువదించాను.
మల్లాది రామకృష్ణశాస్త్రిగారి భార్య వెంకట రమణమ్మగారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, (ఇద్దరూ లేరు) ఇద్దరు మగ పిల్లలు. నరసింహశాస్త్రిగారు పెద్దబ్బాయి. రెండో అబ్బాయి సూరిశాస్త్రి (లేరు).
‘కృష్ణాతీరం’ నవల అసంపూర్ణంగా ఉండిపోయింది. ఒకసారి నా మిత్రుడు ఉషశ్రీతో ‘నువ్వు ఇది పూర్తి చేయకూడదా?’ అని అడిగితే, ‘‘ఆ పుస్తకానికి నేను నమస్కారం పెడతాను కాని, దానిని ముట్టుకోను, ఉన్నది ఉన్నట్టు ప్రచురించేద్దాం. మళ్లీ ఆయనే పుట్టి ఆయనే ఆ నవల పూర్తి చేస్తారని విశ్వాసంతో ఉండు’’ అన్నాడు.
నాన్నగారిది విలక్షణమైన మార్గం. ఆయన రాసిన కథలు వేరే వారి పేరు మీద వచ్చాయని, వాటిని నాన్నగారి పేరు మీద ప్రచురించమని చాలామంది సన్నిహితులు నాకు సలహా ఇచ్చారు. నేను చేయనని చెప్పాను. ఎందుకంటే నాన్నగారికి ఒకరిని నిందించడమంటే ఇష్టం ఉండదు. నేను ఆయన మార్గమే అనుసరిస్తున్నాను. నాన్నగారితో కొంతమంది ‘మీ పాటలు సముద్రాల గారి పేరుతో వస్తున్నాయేంటి’ అని అడిగితే, ‘అది నాకొక కలం పేరు అనుకోండి’ అనేవారే కానీ, ఏ రచయిత మీదా ఈగ వాలనిచ్చేవారు కాదు. నాన్నగారు ఆయన రాసిన పాటల ద్వారా తనకు మంచి పేరు రావాలని కాకుండా, చిత్రం విజయవంతం కావాలని ఆశించేవారు.
సినీ రంగంలోకి కొత్తగా వచ్చిన హీరోలకు పేరు వచ్చేలా పాటలు రాసేవారు. కొత్త వారిని ప్రేమగా ఆశీర్వదించేవారు. సినీరంగంలో... ఫ్లోర్ బాయ్ దగ్గర నుంచి మహానటుడు ఎస్వీ రంగారావు వంటి నటుల దాకా అందరూ నాన్నగారిని పితృభావంతో చూసేవారు. ఆయన పోయిన తర్వాత ఆశ్చర్యంగా ఆయనతో సంభాషించని వారు కూడా ఆయన రచనలు చదవాలనుందని చెప్పేవారు. నాన్నగారు, సముద్రాల వారు... ఒకరినొకరు ‘అన్నగారూ’ అని పిలుచుకునేవారు. తరవాతి తరం వారైన మేము అన్నదమ్ముల బిడ్డల్లా పెరిగాం. నాన్నగారే నాకు తండ్రి, గురువు, దైవం.
నిరంతరం ఆయన నా వెంట ఉండి నడిపిస్తున్నారనిపిస్తుంది. నరసింహశాస్త్రిగారు తన కోడలు శైలజా సుమన్ గురించి చెబుతూ, ‘‘శైలజ మాకు పరాయి సంబంధం కాదు. జంధ్యాల రాధాకృష్ణగారి అమ్మాయి. వాళ్లు మాకు బంధువులు కూడా. మా అబ్బాయి సుమన్‌తో సంబంధం కుదిరేనాటికి శైలజ ఇంకా చదువుతోంది. రిజల్ట్స్ వచ్చేనాటికి రేడియోలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయించాను. ఉద్యోగంలో ప్రవేశించి, స్వయంకృషితో తొందరగానే మంచి పేరు సంపాదించుకుంది’’ అని మురిపెంగా ముగించారు.
హ్యూమర్‌తో పాటు హ్యుమానిటీ ఉన్న మనిషి
మాది బందరు. మా ఊరిలో ‘మల్లాది వారి పాట’ అని గొప్పగా చెప్పుకునేవారు. ఏ పండగ, పేరంటం వచ్చినా, ‘శ్రీలలితా శివజ్యోతి’ పాట లేని ఇల్లు కనపడేది కాదు. ఏ ఇంట చూసినా ‘రహస్యం’ చిత్రంలోని ‘గిరిజా కల్యాణం’ యక్షగానం ప్రస్తావన లేకుండా ఉండేది కాదు. ఆ యక్షగానం మీద వ్యామోహంతో మా అమ్మాయికి ‘గిరిజబాల’ అని పేరు పెట్టాం. నేను మల్లాది రామకృష్ణశాస్త్రిగారి పుస్తకాలు చదవడం కంటె, ఆయన పాటలు వింటూ పెరిగాననడం సబబుగా ఉంటుంది. చిరంజీవులు, జయభేరి... ఆయన పాటలన్నీ తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి.
‘మనం తెలుగువాళ్లం’ ‘ఈ అమ్మాయి తెలుగమ్మాయి’ లాంటి పదాలు వింటుంటాం కానీ, అక్షరాలా తెలుగు నుడికారం, తెలుగు భాష, తెలుగు సంస్కృతిని పుణికి పుచ్చుకున్న మనిషి మల్లాదివారు. ఆయన పాటలు ‘అమ్మా, గోపెమ్మా’ ‘బుజ్జి’ ‘కన్నా’ వంటి తెలుగు పదాలతో మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మల్లాది వారి గురించి అలా తెలుసుకుంటూ పెరిగాను. పెద్దయ్యాక కొన్ని కథలు చదివాను. వాటి మీద కొంత పరిజ్ఞానం సంపాదించాను. మల్లాది వారి పాటల్లో ‘బావామరదళ్లు’ చిత్రంలోని ‘అందమె ఆనందం’ పాట చాలా ఇష్టం. ఆయన రాసిన చిరంజీవులు చిత్రంలోని ‘కనుపాప కరవైన కనులెందుకు’ అనే పాట తరచుగా గుర్తు వస్తూ ఉంటుంది. అది ఆయన జీవితంలో ఎదురైన సంఘటన ఆధారంగా రాసిన పాటలా అనిపిస్తుంది. మల్లాది వారు రాసిన పాటలలో కొన్ని పదాలను సీనియర్ సముద్రాల వారు మార్చి సులువుగా అర్థమయ్యేలా చేసేవారట.
ఆ విషయం స్వయంగా అక్కినేని నాగేశ్వరరావుగారే చెప్పారు. సముద్రాలవారు అక్కినేనిని పిలిచి ‘మల్లాది రామకృష్ణశాస్త్రి’ గారి ఇంటికి వెళ్లి ఆయన రాసిన పాటలు తీసుకురమ్మని పంపేవారట. ఆ పాటలు తెస్తూ, దారిలో వాటిని తెరచి, ‘ఎలా రాశారో’ అని చూస్తూ వచ్చేవారట అక్కినేని. మల్లాది వారంటే ఏఎన్నార్‌కి ప్రాణం. మల్లాది వారికి పలు భాషలలో ప్రావీణ్యం ఉంది. అంతకంత చమత్కారమూ ఉంది. సినిమా డెరైక్టర్ ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్లు ఈయనకి కారు పంపేవారు. అనుకోకుండా ఒక డెరైక్టరు ఇల్లు మల్లాది వారి ఇంటి ఎదురుగానే. అయితే ఆనవాయితీ ప్రకారం ఆయన కారు ఎక్కాలి. అందుకని చమత్కారంగా కారుకి ఇటు వైపు నుంచి లోపలికి ఎక్కి అటు వైపు నుంచి దిగారట.
ఆయనలో మానవతావాది ఉన్నాడని చెబుతారు. ఆయన చెప్పు తెగితే దానిని పదే పదే కుట్టించుకునేవారే కానీ కొత్తది కొనేవారు కాదట. ‘ఎందుకు శాస్త్రిగారూ కొత్తవి కొనుక్కోవచ్చు కదా!’ అని ఒకసారి ఆ చెప్పులు కుట్టే వ్యక్తి అడిగితే, ‘నేను కొత్త చెప్పులు కొనుక్కుంటే నువ్వెలా బతకాలి’ అన్నారట. ఆయనలో హ్యూమర్, హ్యుమానిటీ - రెండూ ఉండేవి. తెలుగుదనమంటే తాతగారే! అంతే! నేను అంతటి గొప్పవారింట అడుగు పెట్టినందుకు ఎప్పుడూ గర్వపడతాను.
- సంభాషణ: డా. పురాణపండ వైజయంతి