బాపుగారికి ఓసారి లవ్‌లెటర్ రాశా!
బాపు గారిని నేను మొట్టమొదటిసారి కలిసింది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో. మా అమ్మా నాన్నలతో నేను చెన్నై వెళుతున్నాను. బాపుగారు కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. ఆయనను చూడగానే, దగ్గరికెళ్లి పలకరించాను. కట్ చేస్తే.. పది రోజుల తర్వాత బాపుగారి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ‘‘బాపుగారు ‘సుందరకాండ’ సినిమా తీయనున్నారు. మిమ్మల్నే హీరోయిన్‌గా అనుకుంటున్నారు’’ అన్నది ఆ ఫోన్ సారాంశం. ఒక రకమైన ఉద్వేగంతో బాపుగారిని కలిశాను. ఆ సినిమాకు నన్ను ఎంపిక చేశారు.
షూటింగ్ మొదలుపెట్టాక అతి తక్కువ సమయంలోనే బాపు గారికి దగ్గరయ్యాను. మేమిద్దరం మంచి స్నేహితుల్లా మెలిగేవాళ్లం. ఆ చిత్రం షూటింగ్ బొబ్బిలిలో జరిగినప్పుడు, మా అందరికీ ఓ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. బాపు గారు మాత్రం మరో హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్ విషయంలో ఆయనకేదో సెంటిమెంట్ ఉందట. బాపుగారు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే అంటూ, నాకు కూడా ఆ హోటల్‌లో ఓ గది బుక్ చేయమన్నాను. కానీ, ఆ హోటల్ అంత బాగుండదని చెప్పారు. అయినా ఫరవాలేదంటూ.. నేనూ ఆ హోటల్‌కు మారిపోయాను. బాపుగారి ఎదురు గదిలో దిగాను. అప్పుడాయన నా దగ్గరకు వచ్చి ‘నా కోసం నువ్వీ హోటల్‌కు వచ్చావ్ కదా!’ అంటూ, ‘ఒక్క అరగంట వెయిట్ చెయ్’ అని నా గది మొత్తం శుభ్రం చేయించారు. కొత్త దుప్పట్లు, దిండు గలీబులు వేయించారు. బాత్రూమ్ శుభ్రం చేయించారు. కొత్త బక్కెట్, మగ్ తెప్పించారు. రూమ్ స్ప్రేతో ఆ గదంతా ఘుమఘుమలాడేలా చేశారు. అక్కడ దోమలు ఎక్కువగా ఉండటంతో నా మంచానికి దోమ తెర ఫిక్స్ చేయించారు. ఇదంతా బాపు గారి గొప్పతనానికి నిదర్శనం.
బాపు గారు నన్ను ‘చామ్’ అని పిలిచేవారు. ఆ పిలుపు నాకు కొత్తగా ఉండేది. ‘మీరేమో చాలా ట్రెడిషనల్... కానీ, నన్ను వెస్ట్రన్ స్టయిల్‌లో పిలుస్తున్నారు. కారణం ఏంటి?’ అని అడిగితే... నవ్వేసి ఊరుకునేవారు. ఆయన అలా పిలవడం నాకు చాలా హాయిగా ఉండేది.
సుందరకాండ’ షూటింగ్ సమయంలో వర్షాకాలం. ఆ వాతావరణం పడక నాకు విపరీతంంగా జ్వరం వచ్చింది. దాంతో పాటు దగ్గు కూడా! మరునాడు షూటింగ్‌కు రాలేనని అందరూ అనుకున్నారు. ఆ రోజు షూటింగ్ పూర్తి చేసి, నేను రూమ్‌కు వచ్చి దుప్పటి ముసుగుపెట్టి పడుకున్నాను. కొంతసేపటికి మా తలుపు ఎవరో తట్టారు. నా అసిస్టెంట్ తీస్తే, బాపు గారు ఉన్నారు. ‘లోపలికి రావచ్చా..’ అని అడిగారు. ‘రండి సార్’ అన్నాను. ఆయన అసిస్టెంట్ అనుకుంటా.. ఓ క్యారేజీ తీసుకొచ్చాడు. నా రూమ్‌లో కూర్చుని బాపు గారూ భోజనం చేస్తారేమో అనుకున్నాను. ఆయన క్యారేజ్ ఓపెన్ చేసి, ప్లేటులో అన్నం వడ్డించి, ఆవకాయ పచ్చడి వేసి కలపడం మొదలుపెట్టారు. నాకు ఆవకాయ అన్నం అంటే మహా ఇష్టం. మేమిద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్లం అని చెప్పాను కదా! అందుకని నా ఆహారపుటలవాట్లు బాపుగారికి బాగా తెలుసు. ఆయన అన్నం కలుపుతుంటే ‘ఎవరి కోసం..’ అనడిగాను. ‘నీ కోసమే’ అన్నారు. ‘నా కోసమే అయితే సరిగ్గా కలపండి’ అన్నాను నవ్వుతూ. అన్నం కలిపి, నాకు తినిపించారు. ‘బాగా కలిపారు’ అని తిన్నాను. మరునాడు జ్వరం హుష్‌కాకి. షూటింగ్‌కు వెళ్లిపోయాను.
ఆ చిత్రం షూటింగ్ నాకు మిగిల్చిన అనుభూతి అంతా ఇంతా కాదు. సినిమా విడుదలై, మేము ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా బాపు గారితో సినిమా చేశాననే సంతృప్తి మిగిలింది. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ గొప్ప వ్యక్తికి దూరం అయ్యామనే ఫీలింగ్ కలిగింది. బాపు గారు మొబైల్ ఫోన్ వాడరు. ల్యాండ్ లైన్ మాత్రమే. ఇ-మెయిల్స్‌కు కూడా దూరం. అందుకే, నా ఫీలింగ్స్ అన్నీ ఎనిమిది పేజీ ఉత్తరంలా రాశా. అది ‘లవ్ లెటర్’ అనుకోండి.. వేరే ఏదైనా అనుకోండి. ‘సుందరకాండ’ సమయంలో మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు, గడిపిన క్షణాలు.. తద్వారా నేను పొందిన అనుభూతిని ఆ ఉత్తరంలో రాశాను. ఆ ఉత్తరంతో పాటు ‘కోనియాక్’ బాటిల్ పంపించాను. ఆయనకు ఆ మద్యం ఇష్టం. చెన్నయ్‌లో నా ఫ్రెండ్ ద్వారా ఆ లెటర్, బాటిల్ పంపించాను.
ఆ ఉత్తరం చదివి, బాపు గారు నాకు ఫోన్ చేస్తారని ఎదురు చూసేదాన్ని. అటు నుంచి స్పందన రాకపోవడంతో నా అంతట నేనే ఫోన్ చేశాను. బాపు గారు తీశారు. ‘ఉత్తరం చదివారా’ అనడిగాను. దానికాయన... ‘నువ్వు ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పేస్తావ్. ‘సుందరకాండ’ పోయింది కదా! తిడుతూ రాశావేమోనని, ఆ ఉత్తరం చదవలేదు. దేవుడి దగ్గర పెట్టేశా’ అన్నారు. హాయిగా నవ్వేశాను. ‘ముందా ఉత్తరంలో ఏముందో చూడండి. మీ మీద ఉన్న అభిమానానికి అక్షరరూపమిచ్చా’ అన్నాను.
ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో బాపు గారిని కలిశాను. ‘నువ్వు రాసిన ఉత్తరం ఇంకా నా దగ్గరే ఉంది’ అని చెప్పారు. ఐదారేళ్ల తర్వాత ఆ ఉత్తరం గురించి ఆయన ప్రస్తావించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.
ప్రతి ఏడాదీ నా పుట్టినరోజు నాడు తప్పకుండా బాపు గారికి ఫోన్ చేస్తాను. ‘ఇవాళ నా బర్త్‌డే. మీకు గుర్తుండదని నాకు తెలుసు. అందుకే, నేనే ఫోన్ చేశాను. నన్ను ఆశీర్వదించండి’ అని అడిగి మరీ, ఆయన ఆశీస్సులు పొందేదాన్ని. ఇక ఆ అదృష్టం నాకు లేదు. అయితే, ఆయన ఎక్కడ ఉన్నా దీవిస్తారనే నమ్మకం ఉంది. బాపు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా...