Sundara Kanda
-
శ్రీరామ నవమి పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి?
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ రామనామ వైభవాన్ని ఈశ్వరుడు చెప్పాడు. చైత్రశుద్ధ నవమి, గురువారం, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో పగలు పన్నెండుగంటల సమయంలో యజ్ఞఫలంగా శ్రీరామచంద్రుడు దశరథుని భార్య కౌసల్యకు జన్మించాడు. శ్రీరాముడిగా ఆయన అవతరించి నేటికి ఒక కోటీ ఎనబైయొక్క లక్షల ఏడువేలసంవత్సరాలు గడిచాయి. ఆ నాటి నుంచి శ్రీ రామ నవమిని దేశ విదేశాల్లోని భక్తులందరూ పవిత్రమైన పర్వంగా జరుపుకుంటున్నారు. సచ్చీలత, సమర్ధత, బుద్ధి కుశలత, శరణు జొచ్చినవారికి అభయమివ్వడం, పెద్దలను, మిత్రులను గౌరవించటం, అసత్య మాడకుండటం, ఏకపత్నీ వ్రతం మొదలైనవి శ్రీరాముని గుణాలలో పేర్కొన తగినవి. శేషతల్ప సుఖ నిద్రితుడు, సర్వ చరాచర పాలకుడు, శుద్ధబ్రహ్మ పరాత్పరుడు, సమస్త లోకనాథుడు అయిన శ్రీమహావిష్ణువు ధర్మమార్గానికి గ్లాని సంభవించినప్పుడు, దుర్మార్గుల ఆగడాలు మితిమీరినప్పుడు, మంచివారికిరక్షణ కరువైనప్పుడు అవతారాలు ఎత్తి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన చేస్తాడని భగవద్గీతలో స్వయంగా శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. ముఖ్యంగా మనకు తెలిసిన దశావతారాలలో వామన, శ్రీరామ, పరశురామ, శ్రీ కృష్ణ అవతారాలు మాత్రం మానవ రూప అవతారాలు. ఎత్తినది మానవావతారమైనా మాధ వుడిగా అతని కీర్తి సర్వ జగత్తులోనూ వ్యాపించింది. యుగాలు గడిచినా శ్రీరామచంద్రుడు ప్రజల మనస్సుల్లో మర్యాదా పురుషోత్తమునిగా నేటికీ నిలిచి ఉన్నాడు. ఆదికవి వాల్మీకి మహాముని ముఖపద్మం నుండి వచ్చిన రామకథా మకరందాన్ని గ్రహించిన వారు జన్మ దుఃఖాన్ని, వ్యాధుల వల్ల వచ్చే బాధలను, ముసలితనంలో కలిగే బాధలను మరణ భయాన్ని పొందరు. శ్రీరామకథా పఠనం వల్ల అంతంలో విష్ణులోక ప్రాప్తి తథ్యమని మన పూర్వులు చెప్పారు. ఈ మహీతలంలో (భూమి) పర్వతాల, నదులూ ఎంత కాలం వరకు నిలిచి ఉంటాయో అంతకాలం దాకా శ్రీరామాయణం కూడా లోకాల న్నింటిలోనూ ప్రచారంలో ఉండగలదు. ఎందుకంటే రామాయణం లో హృదయాన్ని ద్రవింపచేసే చక్కని కథ ద్వారా మానవాళికి మార్గదర్శనం చేసే సుభాషిత రత్నాలు ఎన్నో చెప్పారు. మానవజాతి మనుగడ ఉన్నన్నాళ్ళూ ఈ కథ నిలిచి ఉంటుంది. పాతబడడమంటూ ఏ నాటికీ జరగదు. ఈ గ్రంథం మానవ జీవితాన్ని సుఖప్రదం చేసుకునేందుకు ఇతోధికంగా ఉపకరిస్తుంది. అంతటి మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షికి ధన్యవాదాలు తెలుపవలసిన దినం శ్రీరామ నవమి పర్వదినం. ఈ పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకోవాలి? ఈ రోజున ఉపవాసవ్రతమాచరించాలి. వీలు కాని పక్షంలో ఏకభుక్తం చేయవచ్చు. ఉదయాన్నే స్నానాదికాలు పూర్తి చేసి ‘నవమ్యా అంగభూతేన ఏకభుక్తేన రాఘవ, ఇక్ష్వాకు వంశ తిలక ప్రీతి భవభవ ప్రియ’ అని సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత విధి విధానంగా పూజ చేసి గంధం పుష్పాక్షితలు కలిపిన నీటితో అర్ఘ్యమీయాలి. వడపప్పు పానకం ప్రసాదంగా స్వీకరించాలి. చైత్రశుద్ధ నవ రాత్రులు ఈ తొమ్మిది రోజులు రామాయణ గ్రంథ పఠనం చేయడం ముక్తికి సోపానం. లేదా సుందరాకాండ పారాయణ చేసినా అంతే ఫలితం ఉంటుంది. సుందరకాండ పారాయణం సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం * * * * * * * * సుందరాకాండ మంత్రం కూడా సుందరమైనదే. మహిమాన్వితమైనదే. శ్రీరామాయణ పారాయణం వేద పారాయణంతో సమానం. శ్రీరామచంద్రుడు పురుషోత్తముడే. ఆపదామపహర్తారం, దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం * * * * * * * * ఆపదలను పోగొట్టి సంపదలను కలిగించే లోకాభి రాముడైన శ్రీరామునికి పదే పదే నమస్కారం. ప్రస్తుతం కరోనా ఉధృతి వేళ ఆలయాలకు స్వయంగా వెళ్లలేని వారు శ్రీరామ కల్యాణ వేడుకలను ప్రసార మాధ్యమాలలో తిలకించడమూ ఫలదాయకమే. – గుమ్మా ప్రసాదరావు -
కష్టం వస్తే కన్నీరు కారుస్తారు.. మరి కేన్సర్ వస్తే
హీరోకు కష్టం వస్తే ప్రేక్షకులు కన్నీరు కారుస్తారు. హీరోకు కేన్సర్ వస్తే భరించగలరా? తెలుగు సినిమాకే కాదు భారతీయ సినిమాకు కూడా ‘కేన్సర్’ ఒక హిట్ ఫార్ములాగా నిలిచింది. ‘కేన్సర్’ అని తెలిశాక జీవితాన్ని చూసే పద్ధతి, చేసే త్యాగం, పోరాడే తెగువ, నిలుపుకునే ఆశ... ఇవన్నీ సినిమా కథలుగా మారి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి. నేడు ‘వరల్డ్ కేన్సర్ డే’ సందర్భంగా ఆ సినిమాల తలపులు... జ్ఞాపకాలు... పూర్వం తెలుగు ప్రేక్షకులకు గుండెపోటు మాత్రమే తెలుసు. అది కూడా గుమ్మడి వల్ల. ఆయనే గుండె పట్టుకుని చనిపోతూ ఉండేవారు సినిమాలో. కేన్సర్ చాలా ఆధునిక జబ్బు. దానికి కొత్తల్లో తగిన చికిత్స లేకపోవడం విషాదం. ప్రాణరక్షణకు గ్యారంటీ ఉందని చెప్పలేని స్థితి. మృత్యువు దాపున ఉన్నట్టే అన్న భావన ఉంటుంది. ఇది తెలుగు సినిమా కథకు డ్రామా తీసుకురాగలదని సినిమా దర్శకులు కనిపెట్టారు. పూర్వం టి.బి వంటి వ్యాధుల మీద సినిమాలు ఉన్నా కేన్సర్‌లో ఉండే తక్షణ ప్రాణ భయం సినిమా కథల్లో మలుపులకు కారణమైంది. ప్రేమాభిషేకం పాత ‘దేవదాసు’లో దేవదాసు తాగి తాగి చనిపోతాడు. పార్వతిని వదులుకోవాల్సి రావడమే కారణం. ‘ప్రేమాభిషేకం’లో హీరోయిన్ను వదలుకోవడానికి పాతకాలం కాదు. ఆధునిక కాలం. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు. కాని కేన్సర్ కథను మలుపు తిప్పింది. తనకు కేన్సర్ వచ్చిందన్న కారణంతో అక్కినేని తాను ప్రేమించిన శ్రీదేవిని దూరం పెడతాడు. ఆమెను మర్చిపోవడానికి తాగుతాడు. బంగారం లాంటి భవిష్యత్తు ఒక జబ్బు వల్ల బుగ్గిపాలు అవుతుంది. డాక్టర్లు కాపాడలేని ఈ రోగం ఒక ప్రేమికుడి త్యాగానికి కారణమవుతుంది. దర్శకుడు దాసరి అల్లిన ఈ కథ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. సామాన్య ప్రేక్షకుడికి కేన్సర్ అనే వ్యాధి ఉన్నట్టు తెలియచేసింది. ‘ప్రేమాభిషేకం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులోని పాటలు, మాటలు జనం నేటికీ మర్చిపోలేదు. ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము’ అని పాట. మనం ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్త గా ఉండాల్సిందే. మనకు అనారోగ్యం వస్తే అయ్యో అని లోకం ఆగదు. మన జీవితమే స్తంభిస్తుంది. గీతాంజలి హీరో హీరోయిన్లలో ఒకరికి కేన్సర్ వస్తేనే ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇక ఇద్దరికీ కేన్సర్ వస్తే చూస్తారా? ఫ్లాప్ చేస్తారు. కాని దర్శకుడు మణిరత్నం ఈ కథను చెప్పి హిట్ కొట్టాడు. గిరిజకు, నాగార్జునకు కేన్సర్ వచ్చిందని చెప్పి వారు కొద్దిరోజుల్లో చనిపోతారని చెప్పి ఏడుపులు పెడబొబ్బలు లేకుండా కథ నడిపించాడు. మృత్యువు ఎవరికైనా రావాల్సిందే... వీరికి తొందరగా రానుంది... ఈలోపు అన్నింటినీ కోల్పోవడం కంటే జీవితంలో ఉండే ప్రేమను, తోడును ఆనందించ వచ్చు కదా అని కథను చెప్పాడు. ‘గీతాంజలి’ మొదటగా స్లోగా ఎత్తుకున్నా మెల్లగా క్లాసిక్ రేంజ్‌కు వెళ్లింది. ఇళయరాజా పాటలు, వేటూరి సాహిత్యం... ‘రాలేటి పువ్వులా రాగాలలో’... అని ఒక అందమైన ప్రేమకథను చెప్పింది. గిరిజ ఈ ఒక్క సినిమా కోసమే పుట్టిందని ప్రేక్షకులు అనుకున్నారు. మళ్లీ ఆమె నటించలేదు. సుందరకాండ దర్శకుడు కె.భాగ్యరాజ్ కొత్త కొత్త కథలు కనిపెట్టడంలో మేధావి. ఒక స్టూడెంట్‌కు కేన్సర్ వస్తే తాను సుమంగళిగా చనిపోవాలని తన లెక్చరర్నే ప్రేమించి తాళి కట్టించుకోవాలని అనుకుంటుంది. అయితే ఇదంతా చివరలో తెలుస్తుంది. మొదట అంతా ఆ స్టూడెంట్ ఆ లెక్చరర్ వెంట పడితే అమాయకుడు, మంచివాడు అయిన ఆ లెక్చరర్ ఎలా తిప్పలు పడ్డాడో నవ్వులతో చెబుతాడు దర్శకుడు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా వెంకటేశ్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంతే పెద్ద హిట్ అయ్యింది. ‘సుందరాకాండకు సందడే సండది’ అని కలెక్షన్ల సందడి సృష్టించింది. ఈ సినిమాలో కూడా స్టూడెంట్ పాత్ర వేసిన అపర్ణ ఆ తర్వాత ఇతర చిత్రాల్లో చేసిన ఒకటి రెండు పాత్రల కంటే ఈ ఒక్క పాత్రతోనే అందరికీ గుర్తుండిపోయింది. కేన్సర్‌కు లేడీస్ సెంటిమెంట్‌కు ముడిపెట్టడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని అనుకోవాలి. ‘నీ మజిలీ మూడునాళ్లే ఈ జీవయాత్రలో... ఒక పూటలోనే రాలు పూలు ఎన్నో’ అని తాత్త్వికంగా వేటూరి రాసిన పాట మనల్ని గాంభీర్యంలో పడేస్తుంది. మృత్యువు సమీపిస్తేనే జీవితం రుచి తెలుస్తుంది. అది గమనికలో పెట్టుకుని అందరినీ ప్రేమించమని తాత్త్వికులు చెబుతుంటారు. మాతృదేవోభవ కన్నీరు... కన్నీరు.. కన్నీరు.. కారిన ప్రతి కన్నీటిబొట్టు కాసులను కురిపించడం అంటే ఏమిటో ఈ సినిమా చెప్పింది. ఇందులో నలుగురు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో తండ్రి నాజర్ అనుకోకుండా చనిపోతాడు. కుటుంబం కష్టాల్లో పడింది అనుకుంటే తల్లికి కేన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఏం కావాలి? ఆ తల్లి ఆ పిల్లలకు ఒక నీడ కోసం సాగించే అన్వేషణ గుండెల్ని పిండేస్తుంది. నటి మాధవి చేసిన మంచి పాత్రల్లో ఇది ఒకటి. ఈ సినిమా చూసినవారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కొద్దో గొప్పో సాయం చేయాలని ఏ దిక్కూ లేని పిల్లలను ఎలాగోలా ఆదుకోవాలని అనుకుంటారు. అంత ప్రభావం చూపుతుందీ సినిమా. ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినైపోతాను గగనానికి’ అని వేటూరి రాశారు. అందరం ఏదో ఒకనాడు గాలిగా మారాల్సిందే. కాని ఈ గాలిని పీల్చి బతికే రోజుల్లో కాసిన్నైనా మంచి పరిమళాలు వెదజల్లగలిగితే ధన్యత. చక్రం.. జానీ.. హిందీ ‘ఆనంద్’ స్ఫూర్తితో ‘చక్రం’ తీశారు డైరెక్టర్ కృష్ణవంశీ. కాని అప్పటికే మాస్ సినిమా ఇమేజ్ వచ్చిన ప్రభాస్ కేన్సర్‌తో బాధపడటం ప్రేక్షకులు అంతగా మెచ్చలేకపోయారు. మృత్యువు అనే ఒక పెద్ద వాస్తవానికి తల వొంచితే రోజువారి చిన్న చిన్న స్పర్థలు, పట్టుదలలు, పంతాలు నిలువవనీ వాటికి అతి తక్కువ విలువ ఇస్తామని ఈ సినిమా చెబుతుంది. ‘జగమంత కుటుంబం నాదీ... ఏకాకి జీవితం నాది’ పాట ఈ సినిమా నుంచి వచ్చి నిలిచింది. ‘జానీ’ సినిమా కూడా కేన్సర్ కథాంశం ఉన్నా జనం మెప్పు పొందలేకపోయింది. భార్య కేన్సర్ బారిన పడితే హీరో ఆమె చికిత్సకు కావాల్సిన డబ్బు కోసం ఫైట్స్ చేస్తుంటాడు. ఈ ‘యాక్షన్–సెంటిమెంట్’ సరైన తాలుమేలుతో లేదు. ఆ తర్వాత వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో తల్లికి కేన్సర్ వస్తే పిల్లలు బాధ్యతను ఎరగడం చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ప్రతిరోజూ పండగే... ఇటీవల కేన్సర్‌ను మెయిన్ పాయింట్‌గా చేసుకుని హిట్ కొట్టిన సినిమా ‘ప్రతిరోజూ పండగనే’. ఇంటి పెద్దకు కేన్సర్ వస్తే పిల్లలు ‘ముసలాడు ఎప్పుడు పోతాడా’ అన్నంత మెటీరియలిస్టులుగా మారడంలోని బండతనాన్ని, అమానవీయతను నవ్వులలో పెట్టి ప్రశ్నించడం వల్ల ఈ సినిమా నిలిచింది. సత్యరాజ్ ఈ పాత్రను పండించడం, తండ్రి గొప్పదనాన్ని మర్చిపోయిన కొడుకుగా రావు రమేశ్ సెటైర్లు సినిమాకు ప్లస్ అయ్యాయి. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచంలో పడి ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కేన్సర్‌ను దాదాపుగా జయించే దారిలో మనిషి ఉన్నాడు. కనుక కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచం వల్ల ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. మొత్తం సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. – సాక్షి ఫ్యామిలీ -
సుందరకాండకు సుందర అనువాదం...
Finding The Mother అనువాదం రామాయణమే ఒక సుందర కావ్యం. అందులోని సుందరకాండ ఇంకా సుందరమైన భాగం. రామాయణంలోని ఒక విశిష్టమైన కాండంగా, పారాయణ కాండంగా, గాయత్రీ మంత్రాన్ని నిగూఢంగా నిక్షిప్తం చేసుకున్న కాండంగా, శ్రీరాముని సుందర నామాన్ని పలుమార్లు గానం చేసే కాండంగా, అన్నింటి కంటే ముఖ్యం మారుతి లీలలను వర్ణించే కాండంగా సుందరకాండకు పండితులూ పామరులు ప్రాముఖ్యం ఇస్తారు. వాల్మీకి మహర్షి అన్ని కాండాలకూ వాటి కథాంశాన్నో, కథాస్థలినో తెలిపే పేరు పెట్టినా ఒక్క ఈ కాండానికి మాత్రం ‘సుందరకాండ’ అని పెట్టి పాఠకులకు ప్రహేళిక వదిలాడు. సుందరకాండలో సుందరమైనది ఏది? ఎవరు? శ్రీరాముడు అని కొందరు, మహాశక్తికి ప్రతిరూపమైన సీత యొక్క సౌందర్యమూర్తి అని కొందరు, సుందరుడనే అసలు పేరు కలిగిన హనుమంతుడని కొందరు... ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు... ఏ వ్యాఖ్యానం ఎలా ఉన్నా తల్లి సీతమ్మను వెతకడానికి బయలుదేరిన హనుమంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వైనం వల్ల కూడా ఇది ఆబాల గోపాలానికి ఇష్టమైన కాండం. అంతే కాదు దీనిని పారాయణం చేయడం వల్ల కష్టాలు తొలుగుతాయనే నమ్మకం వల్ల కూడా ఇది కోట్లాది మంది భక్తుల నాల్కల మీద అనునిత్యం తారాడుతుంటుంది. ఇట్టి సుందరకాండను మూల రచన నుంచి ఇంగ్లిష్‌లో అనువాదం చేయాలంటే కేవలం భాష, భక్తి మాత్రమే చాలవు. ఆ సుందరకావ్యం పట్ల నిమగ్నం కాగల మస్తిష్కం కూడా కావాలి. అందులోని సూక్ష్మపార్శ్వాలను అర్థం చెడకుండా అన్యభాషలోకి పరావర్తనం చేయగల పద సంపద, మేధస్సు కావాలి. ‘మహతి’ అనే కలం పేరు పెట్టుకున్న నెల్లూరు వాసి మైడవోలు వెంకట శేష సత్యనారాయణ ఆ పనిని సమర్థంగా చేశారని అతి సుందరతతో మెప్పించారని ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. ప్రపంచ పాఠకులకు ఇది తెలుగు రచయిత కానుక. తెలుగు చదవలేని తెలుగు నూతన తరానికి కూడా కానుకే. ఈ గ్రంథానికి పెద్దలు ఐ.వి.చలపతిరావు రాసిన ముందుమాట తప్పక పరిశీలించదగ్గది. -
బాపుగారికి ఓసారి లవ్‌లెటర్ రాశా!
బాపు గారిని నేను మొట్టమొదటిసారి కలిసింది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో. మా అమ్మా నాన్నలతో నేను చెన్నై వెళుతున్నాను. బాపుగారు కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. ఆయనను చూడగానే, దగ్గరికెళ్లి పలకరించాను. కట్ చేస్తే.. పది రోజుల తర్వాత బాపుగారి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ‘‘బాపుగారు ‘సుందరకాండ’ సినిమా తీయనున్నారు. మిమ్మల్నే హీరోయిన్గా అనుకుంటున్నారు’’ అన్నది ఆ ఫోన్ సారాంశం. ఒక రకమైన ఉద్వేగంతో బాపుగారిని కలిశాను. ఆ సినిమాకు నన్ను ఎంపిక చేశారు. షూటింగ్ మొదలుపెట్టాక అతి తక్కువ సమయంలోనే బాపు గారికి దగ్గరయ్యాను. మేమిద్దరం మంచి స్నేహితుల్లా మెలిగేవాళ్లం. ఆ చిత్రం షూటింగ్ బొబ్బిలిలో జరిగినప్పుడు, మా అందరికీ ఓ హోటల్లో బస ఏర్పాటు చేశారు. బాపు గారు మాత్రం మరో హోటల్లో బస చేశారు. ఆ హోటల్ విషయంలో ఆయనకేదో సెంటిమెంట్ ఉందట. బాపుగారు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే అంటూ, నాకు కూడా ఆ హోటల్లో ఓ గది బుక్ చేయమన్నాను. కానీ, ఆ హోటల్ అంత బాగుండదని చెప్పారు. అయినా ఫరవాలేదంటూ.. నేనూ ఆ హోటల్‌కు మారిపోయాను. బాపుగారి ఎదురు గదిలో దిగాను. అప్పుడాయన నా దగ్గరకు వచ్చి ‘నా కోసం నువ్వీ హోటల్‌కు వచ్చావ్ కదా!’ అంటూ, ‘ఒక్క అరగంట వెయిట్ చెయ్’ అని నా గది మొత్తం శుభ్రం చేయించారు. కొత్త దుప్పట్లు, దిండు గలీబులు వేయించారు. బాత్రూమ్ శుభ్రం చేయించారు. కొత్త బక్కెట్, మగ్ తెప్పించారు. రూమ్ స్ప్రేతో ఆ గదంతా ఘుమఘుమలాడేలా చేశారు. అక్కడ దోమలు ఎక్కువగా ఉండటంతో నా మంచానికి దోమ తెర ఫిక్స్ చేయించారు. ఇదంతా బాపు గారి గొప్పతనానికి నిదర్శనం. బాపు గారు నన్ను ‘చామ్’ అని పిలిచేవారు. ఆ పిలుపు నాకు కొత్తగా ఉండేది. ‘మీరేమో చాలా ట్రెడిషనల్... కానీ, నన్ను వెస్ట్రన్ స్టయిల్లో పిలుస్తున్నారు. కారణం ఏంటి?’ అని అడిగితే... నవ్వేసి ఊరుకునేవారు. ఆయన అలా పిలవడం నాకు చాలా హాయిగా ఉండేది. సుందరకాండ’ షూటింగ్ సమయంలో వర్షాకాలం. ఆ వాతావరణం పడక నాకు విపరీతంంగా జ్వరం వచ్చింది. దాంతో పాటు దగ్గు కూడా! మరునాడు షూటింగ్‌కు రాలేనని అందరూ అనుకున్నారు. ఆ రోజు షూటింగ్ పూర్తి చేసి, నేను రూమ్‌కు వచ్చి దుప్పటి ముసుగుపెట్టి పడుకున్నాను. కొంతసేపటికి మా తలుపు ఎవరో తట్టారు. నా అసిస్టెంట్ తీస్తే, బాపు గారు ఉన్నారు. ‘లోపలికి రావచ్చా..’ అని అడిగారు. ‘రండి సార్’ అన్నాను. ఆయన అసిస్టెంట్ అనుకుంటా.. ఓ క్యారేజీ తీసుకొచ్చాడు. నా రూమ్‌లో కూర్చుని బాపు గారూ భోజనం చేస్తారేమో అనుకున్నాను. ఆయన క్యారేజ్ ఓపెన్ చేసి, ప్లేటులో అన్నం వడ్డించి, ఆవకాయ పచ్చడి వేసి కలపడం మొదలుపెట్టారు. నాకు ఆవకాయ అన్నం అంటే మహా ఇష్టం. మేమిద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్లం అని చెప్పాను కదా! అందుకని నా ఆహారపుటలవాట్లు బాపుగారికి బాగా తెలుసు. ఆయన అన్నం కలుపుతుంటే ‘ఎవరి కోసం..’ అనడిగాను. ‘నీ కోసమే’ అన్నారు. ‘నా కోసమే అయితే సరిగ్గా కలపండి’ అన్నాను నవ్వుతూ. అన్నం కలిపి, నాకు తినిపించారు. ‘బాగా కలిపారు’ అని తిన్నాను. మరునాడు జ్వరం హుష్‌కాకి. షూటింగ్‌కు వెళ్లిపోయాను. ఆ చిత్రం షూటింగ్ నాకు మిగిల్చిన అనుభూతి అంతా ఇంతా కాదు. సినిమా విడుదలై, మేము ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా బాపు గారితో సినిమా చేశాననే సంతృప్తి మిగిలింది. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ గొప్ప వ్యక్తికి దూరం అయ్యామనే ఫీలింగ్ కలిగింది. బాపు గారు మొబైల్ ఫోన్ వాడరు. ల్యాండ్ లైన్ మాత్రమే. ఇ-మెయిల్స్‌కు కూడా దూరం. అందుకే, నా ఫీలింగ్స్ అన్నీ ఎనిమిది పేజీ ఉత్తరంలా రాశా. అది ‘లవ్ లెటర్’ అనుకోండి.. వేరే ఏదైనా అనుకోండి. ‘సుందరకాండ’ సమయంలో మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు, గడిపిన క్షణాలు.. తద్వారా నేను పొందిన అనుభూతిని ఆ ఉత్తరంలో రాశాను. ఆ ఉత్తరంతో పాటు ‘కోనియాక్’ బాటిల్ పంపించాను. ఆయనకు ఆ మద్యం ఇష్టం. చెన్నయ్‌లో నా ఫ్రెండ్ ద్వారా ఆ లెటర్, బాటిల్ పంపించాను. ఆ ఉత్తరం చదివి, బాపు గారు నాకు ఫోన్ చేస్తారని ఎదురు చూసేదాన్ని. అటు నుంచి స్పందన రాకపోవడంతో నా అంతట నేనే ఫోన్ చేశాను. బాపు గారు తీశారు. ‘ఉత్తరం చదివారా’ అనడిగాను. దానికాయన... ‘నువ్వు ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పేస్తావ్. ‘సుందరకాండ’ పోయింది కదా! తిడుతూ రాశావేమోనని, ఆ ఉత్తరం చదవలేదు. దేవుడి దగ్గర పెట్టేశా’ అన్నారు. హాయిగా నవ్వేశాను. ‘ముందా ఉత్తరంలో ఏముందో చూడండి. మీ మీద ఉన్న అభిమానానికి అక్షరరూపమిచ్చా’ అన్నాను. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో బాపు గారిని కలిశాను. ‘నువ్వు రాసిన ఉత్తరం ఇంకా నా దగ్గరే ఉంది’ అని చెప్పారు. ఐదారేళ్ల తర్వాత ఆ ఉత్తరం గురించి ఆయన ప్రస్తావించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రతి ఏడాదీ నా పుట్టినరోజు నాడు తప్పకుండా బాపు గారికి ఫోన్ చేస్తాను. ‘ఇవాళ నా బర్త్‌డే. మీకు గుర్తుండదని నాకు తెలుసు. అందుకే, నేనే ఫోన్ చేశాను. నన్ను ఆశీర్వదించండి’ అని అడిగి మరీ, ఆయన ఆశీస్సులు పొందేదాన్ని. ఇక ఆ అదృష్టం నాకు లేదు. అయితే, ఆయన ఎక్కడ ఉన్నా దీవిస్తారనే నమ్మకం ఉంది. బాపు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా...