సుందరకాండకు సుందర అనువాదం...
Finding The Mother
అనువాదం
రామాయణమే ఒక సుందర కావ్యం. అందులోని సుందరకాండ ఇంకా సుందరమైన భాగం. రామాయణంలోని ఒక విశిష్టమైన కాండంగా, పారాయణ కాండంగా, గాయత్రీ మంత్రాన్ని నిగూఢంగా నిక్షిప్తం చేసుకున్న కాండంగా, శ్రీరాముని సుందర నామాన్ని పలుమార్లు గానం చేసే కాండంగా, అన్నింటి కంటే ముఖ్యం మారుతి లీలలను వర్ణించే కాండంగా సుందరకాండకు పండితులూ పామరులు ప్రాముఖ్యం ఇస్తారు. వాల్మీకి మహర్షి అన్ని కాండాలకూ వాటి కథాంశాన్నో, కథాస్థలినో తెలిపే పేరు పెట్టినా ఒక్క ఈ కాండానికి మాత్రం ‘సుందరకాండ’ అని పెట్టి పాఠకులకు ప్రహేళిక వదిలాడు. సుందరకాండలో సుందరమైనది ఏది? ఎవరు? శ్రీరాముడు అని కొందరు, మహాశక్తికి ప్రతిరూపమైన సీత యొక్క సౌందర్యమూర్తి అని కొందరు, సుందరుడనే అసలు పేరు కలిగిన హనుమంతుడని కొందరు... ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు... ఏ వ్యాఖ్యానం ఎలా ఉన్నా తల్లి సీతమ్మను వెతకడానికి బయలుదేరిన హనుమంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వైనం వల్ల కూడా ఇది ఆబాల గోపాలానికి ఇష్టమైన కాండం. అంతే కాదు దీనిని పారాయణం చేయడం వల్ల కష్టాలు తొలుగుతాయనే నమ్మకం వల్ల కూడా ఇది కోట్లాది మంది భక్తుల నాల్కల మీద అనునిత్యం తారాడుతుంటుంది.
ఇట్టి సుందరకాండను మూల రచన నుంచి ఇంగ్లిష్‌లో అనువాదం చేయాలంటే కేవలం భాష, భక్తి మాత్రమే చాలవు. ఆ సుందరకావ్యం పట్ల నిమగ్నం కాగల మస్తిష్కం కూడా కావాలి. అందులోని సూక్ష్మపార్శ్వాలను అర్థం చెడకుండా అన్యభాషలోకి పరావర్తనం చేయగల పద సంపద, మేధస్సు కావాలి. ‘మహతి’ అనే కలం పేరు పెట్టుకున్న నెల్లూరు వాసి మైడవోలు వెంకట శేష సత్యనారాయణ ఆ పనిని సమర్థంగా చేశారని అతి సుందరతతో మెప్పించారని ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. ప్రపంచ పాఠకులకు ఇది తెలుగు రచయిత కానుక. తెలుగు చదవలేని తెలుగు నూతన తరానికి కూడా కానుకే. ఈ గ్రంథానికి పెద్దలు ఐ.వి.చలపతిరావు రాసిన ముందుమాట తప్పక పరిశీలించదగ్గది.