English translation
-
ఆంగ్లంలోకి ఎత్తిపోయాలి!
అవార్డు వచ్చిందే అత్యుత్తమ రచన కాకపోవచ్చు. అత్యుత్తమ రచనలన్నింటికీ అవార్డులు రాకపోవచ్చు. కానీ అవార్డు వచ్చింది సాధారణంగా మంచి పుస్తకమే అయివుండొచ్చు. ఒకవేళ ఈ వాక్యాలతో ఏమైనా విభేదించే అవకాశం ఉన్నా, అవార్డు వచ్చిన పుస్తకం ఎంతోకొంత ఆసక్తి కలిగింపజేస్తుందనే విషయంలో మాత్రం ఏ విభేదం లేదు. అవార్డు ఎంత పెద్దదైతే, అంత ఆసక్తి. ఆ భారీతనం వరుస సంవత్సరాలుగా ఇస్తుండటం వల్ల వచ్చిన ప్రతిష్ఠరూపంలో ఉండొచ్చు, లేదా పారితోషికం రూపంలో ఉండొచ్చు. ఏమైనా ప్రస్తుతం, ‘భారతదేశపు అత్యంత విలువైన సాహిత్య బహుమానం’గా ‘జేసీబీ ప్రైజు’ను పేర్కొంటున్నారు. అక్షరాలా ఈ పురస్కార విలువ పాతిక లక్షల రూపాయలు. గొప్ప భారతీయ రచనలను ఉత్సవం చేయాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ‘ద జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్’ ప్రత్యేకతలు ఏమంటే, ఇంగ్లిష్ రచనలకే బహుమానం ఇస్తున్నప్పటికీ, ఇంగ్లిష్ అనువాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం; ఇంకా ఆసక్తికరమైనది, ఒకవేళ అనువాద రచన బహుమానం గెలుచుకుంటే, అనువాదకులకు అదనంగా మరో పది లక్షలు ఇవ్వడం. ‘‘గతంలో ఒక కొత్త ఉర్దూ నవల విడుదలయ్యిందంటే– విద్యార్థులు, అధ్యాపకులు దాని గురించి చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు, దానికొక అవార్డు వచ్చి కొంత పాపులర్ అయితే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. అదొక ధోరణిలా మారిపోయింది. విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు జ్ఞానాన్ని సృష్టించేవి. ఇప్పుడవి కేవలం పంపిణీ చేస్తున్నాయి,’’ అంటారు ఉర్దూ నవలా రచయిత ఖాలిద్ జావేద్. 2022లో ‘ద ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్’ నవలకుగానూ ఆయన ‘జేసీబీ ప్రై జ్’ను స్వీకరించారు. ‘నేమత్ ఖానా’ పేరుతో వచ్చిన ఈ ఉర్దూ మూల నవలను బరన్ ఫారూఖీ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఖాలిద్ ఆవేదన ఉర్దూ సాహిత్య రంగం గురించినదే అయినప్పటికీ అది దేశంలోని అన్ని భాషలకూ వర్తిస్తుంది. అందుకే అవార్డులు, పురస్కారాలు అనేవి సాహిత్యంలో ఎంతోకొంత ఊపును సృష్టించగలుగుతాయి. వాటి పరిమితులను మినహాయిస్తే, అదొక సానుకూలాంశం. అందువల్లే వంటిల్లు నేపథ్యంలో జరిగే అధికార క్రీడనూ... కత్తులు, మంట వంటి ప్రమాదకర ఆయుధాలను కలిగివుండే చోటునూ చిత్రించిన ఖాలిద్ ఉర్దూ నవల విస్తృత పాఠకలోకంలో చర్చనీయాంశంగా మారగలిగింది.నిర్మాణ పనుల్లో; తవ్వకం, ఎత్తిపోత, కూల్చివేతల్లాంటి పనుల్లో వాడే ‘జేసీబీ’ గురించి మనకు తెలుసు. ఈ జేసీబీ అనేదే ఆ యంత్రానికి ఒక పేరులా స్థిరపడిపోయిందిగానీ అది ఒక సంస్థ పేరు. ఇంగ్లండ్ వ్యాపారవేత్త జోసెఫ్ సిరిల్ బామ్ఫోర్డ్ (జేసీబీ) తన పేరుతోనే నెలకొల్పిన కంపెనీ ఈ జేసీబీ. 2018 నుంచి ఈ సంస్థ భారతీయ రచనలకు బహుమానాలు ఇస్తోంది. మార్చ్ నెలలో ఎంట్రీలను ఆహ్వానిస్తారు. ఏప్రిల్ 30 ఈ యేటి ఎంట్రీలు పంపడానికి ఆఖరి తేది. వారి వెబ్సైట్లో అన్ని వివరాలూ లభిస్తాయి. కథలు, కవిత్వ సంపుటాలు కాకుండా ‘యూనిఫైడ్ వర్క్’ మాత్రమే దీనికి పంపాలి. సాధారణంగా సెప్టెంబర్‌లో లాంగ్ లిస్ట్ విడుదలవుతుంది. అంటే వచ్చిన రచనల్లో తొలి వడపోతలో మిగిలిన పదింటిని ప్రకటిస్తారు. అక్టోబర్‌లో షార్ట్ లిస్ట్ వస్తుంది. అప్పటికి ఐదు నవలలు తుది పోటీలో ఉంటాయి. నవంబర్‌లో విజేతను ప్రకటిస్తారు. దీనికిగానూ ప్రతి యేటా ఒక స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు అవుతుంది. ఇప్పటికి మూడు సంవత్సరాలు ముగ్గురు మలయాళ రచయితలు ఈ బహుమానం గెలుచుకోవడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమలాగే, మలయాళ సాహిత్యం కూడా వర్ధిల్లుతోందని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. కాదు, మలయాళ సాహిత్యం వర్ధిల్లుతున్నందుకే మలయాళ చిత్రసీమ వర్ధిల్లుతున్నదని అనాలేమో! తన ‘జాస్మిన్ డేస్’ నవలకుగానూ బెన్యామిన్ 2018లో ‘జేసీబీ’ తొలి బహుమానాన్ని గెలుచుకున్నారు. దీన్ని షెహనాజ్ హబీబ్ ఆంగ్లంలోకి అనువదించారు. 2020 సంవత్సరానికి ‘ముస్టాష్’ నవలకుగానూ ప్రైజ్ గెలుచుకున్న ఎస్.హరీశ్ ఇటీవలి మలయాళ కళాఖండం అనదగిన సినిమా ‘నన్ పగల్ నేరత్తు మయక్కమ్’(పగటి వేళ మైకం)కు రచయిత కావడం విశేషం. హరీశ్ తన నవలను ‘మీస’ పేరుతో తన మాతృభాషలోనే రాశారు. అది ఆయన తొలి నవల కూడా. 2021లో మరో మలయాళ నవల ‘ఢిల్లీ: ఎ సాలిలాక్వీ’ని కూడా ఈ ప్రైజ్ వరించింది. రచయిత ఎం.ముకుందన్ . 2019లో ‘ద ఫార్ ఫీల్డ్’ నవలకుగానూ మాధురీ విజయ్ గెలుచుకున్నారు. ఈమె కర్ణాటకకు చెందినవారు. కానీ ఆంగ్లంలో రాస్తారు. పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయిగానీ ఈ ఐదేళ్లలో ఏ ఒక్క తెలుగు పుస్తకం షార్ట్‌లిస్టు అటుండనీ, లాంగ్‌లిస్టులోకి కూడా రాలేదు. అసలు ఏ ఒక్కటైనా పోటీకి పంపారా అన్నదీ అనుమానమే. అంతకంటేముందు అసలు ఏ పుస్తకాలైనా ఇంగ్లిష్‌లోకి వెళ్తున్నాయా? పోనీ, వెళ్లాల్సినంతగా వెళ్తున్నాయా? అసలు మొత్తంగానే తెలుగు నవల భారతీయ పాఠకుల మనస్సులు గెలుచుకునేంత కళాత్మకంగా ఉంటోందా? ఉంటే, దాన్ని ఇంగ్లిష్‌లోకి చేర్చడంలో ఉన్న అడ్డంకులేమిటి? ఈ బహుమానం అనే కాదు, మన విలువను కట్టడానికి మరొకటైనా పరమ ప్రమాణం కాకపోవచ్చు. కానీ ఆ ‘గేమ్’లో మనం అసలంటూ ఎందుకు లేము? దక్షిణాది వరకే పరిమితం అయితే– కన్నడ, తమిళం, మలయాళం అనగానే కొందరు రచయితల పేర్లయినా జాతీయ స్థాయిలో తెలుస్తాయి. అలా తెలిసే తెలుగు రచయితలు ఎవరున్నారు, ఎందరున్నారు? ఇలాంటివి జరగాలంటే ఎలాంటి సంస్థలు, వ్యవస్థలు చొరవ చూపాలి? ఇవన్నీ మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. సావధానంగా జవాబులు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు! -
Nandini Krishnan: అనువాద వారధి
సొంతగా రచనలు చేయగలిగేవారు అనువాదాలు చేయరు. భాష బాగా వచ్చినంత మాత్రాన అనువాదం చేయలేరు. దానికి నైపుణ్యం, కొంత నిస్వార్థం కావాలి. తమిళ రచయిత్రి నందిని కృష్ణన్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఇంగ్లిష్ అనువాదం ఏప్రిల్ 24న మార్కెట్లోకి రానుంది. నవలలోని పాతకాలపు తమిళాన్ని నేటి యువతకు అందేలా అనువాదం చేయడం సులువు కాదు. తమిళంలోని ఉత్తమ నవలలను సవాలుగా తీసుకుని నందిని ఇంగ్లిష్‌లో అనువాదం చేస్తోంది. ఆమెకు వస్తున్న గుర్తింపు ఆ రంగంలో రాణించాలనుకునే స్త్రీలు గమనించదగ్గది. దాదాపు 2500 పేజీలు ఉండే ఐదు భాగాల భారీ ప్రఖ్యాత తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను ఇంగ్లిష్‌లో అనువాదం చేయబూనడం సాహసం. కాని ఈ క్లాసిక్‌ను అనువాదం చేయడానికి చాలా మంది ట్రై చేస్తూనే వచ్చారు. ముగ్గురు నలుగురు సఫలీకృతులయ్యారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్‌కు తగ్గట్టుగా అనువాదం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నందిని కృష్ణన్ వంతు. ఆమె చేసిన ఈ నవల అనువాదం మొదటి భాగం పూర్తయ్యింది. ఏప్రిల్ 24న విడుదల కానుంది. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ దీనిని ప్రచురిస్తుంటే ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాల సినిమాగా తీస్తున్న దర్శకుడు మణిరత్నం ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకుడిగా ఉన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్ నవల 75 ఏళ్ల క్రితం నాటిదని గుర్తు లేనంతగా అనునిత్యం తమిళ సాహిత్యంలో కలగలిసిపోయింది. కల్కి రాసిన ఈ నవలలోని భాషను, పై అర్థాన్ని, లోపలి అర్థాన్ని అర్థం చేసుకుని అనువాదం చేయడం చాలా జటిలం. అయినా చేశాను. పాఠకులు సులభంగా చదువుకోవడానికి, చేత బట్టుకోవడానికి వీలుగా ఇంగ్లిష్‌లో ఐదు కంటే ఎక్కువ భాగాలుగా విభజించి పుస్తకాలుగా తేనున్నాము’ అని తెలిపింది నందిని కృష్ణన్. ఎవరీ నందిని కృష్ణన్? నందిని కృష్ణన్ చెన్నైలో స్థిరపడిన నాటకకర్త, రచయిత్రి, స్టేజ్ యాక్టర్ కూడా. లండన్‌లో, ఢిల్లీలో జర్నలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత చెన్నై నుంచి వెబ్, ప్రింట్ మీడియాలలో పని చేయడం మొదలుపెట్టింది. హాస్యం రాస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వైవాహిక వ్యవస్థపై విమర్శను పెడుతూ వివాహమైన స్త్రీలను, పురుషులను ఇంటర్వ్యూ చేసి ‘హిచ్డ్: ది మోడర్న్ అండ్ అరేంజ్డ్ మేరేజ్’ పుస్తకం తెచ్చింది. ట్రాన్స్ మెన్ జీవితాల ఆధారంగా ‘ఇన్విజిబుల్ మెన్‘ పుస్తకం రాసింది. పెరుమాళ్ మురుగన్ నవలలను ఇంగ్లిష్‌లో అనువాదం చేయడం ద్వారా అనువాద రంగంలో ప్రవేశించింది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్‘ అనువాదం చేస్తోంది. నందిని కృష్ణన్ ఇంట్లో ఎప్పుడూ వీధి కుక్కలు ఉంటాయి. వాటిని సాకుతుంటుంది. పిల్లులను కూడా. ‘కుక్కలు, పిల్లలు, వేల కొద్ది పుస్తకాలు అంతే మా ఇల్లు’ అని చెబుతుంది. కత్తి మీద సాము ‘అనువాదం చేయడం కత్తి మీద సాము’ అంటుంది నందిని. ‘సొంత రచనైతే అలా ఒక సమాధి స్థితికి వెళ్లి రాసుకుంటూ పోతాము. అనువాదం అలా కాదు. అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు చదివితే అది కేవలం అనువాదం అనిపించకూడదు. అదే సమయంలో ఒరిజినల్ నవల తాలూకు పరిమళం దానిలో ఉండాలి. అనువాదం పూర్తి చేశాక ఎవరిదో కన్నబిడ్డను మనం సాకాం... ఇక దీనితో రుణం చెల్లిపోయింది అన్న బాధ తప్పదు’ అంటుంది నందిని. ‘అనువాదకులు స్వయంగా రచయితలు కాకపోవడం వల్ల కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వాళ్లు ప్రతి మాటా కచ్చితంగా అనువాదం చేస్తూ కృతకంగా మారుస్తారు. అనువాదకులు స్వయంగా రచయితలైనా కూడా కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వారు తమ సృజనశక్తిని కూడా కలుపుతారు. అది తప్పు. వేరొకరు గీసిన బొమ్మను నకలు చేసేటప్పుడు మనం పికాసో అంతటివాళ్లమైనా ఆ బొమ్మలో మన గొప్పదనం చూపకూడదు. అనువాదం అయినా అంతే’ అంటుంది నందిని కృష్ణన్. మంచి అనువాద రుసుము ‘అనువాదంలో రాణించాలంటే మంచి డబ్బు కూడా మనకు ఆఫర్ చేయాలి. తగిన డబ్బు లేకుండా అనువాదం చేయడం అనవసరం’ అంటుంది నందిని. ‘కొంతమంది కల్లబొల్లి మాటలు చెప్పి అనువాదం చేయించుకోవాలనుకుంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను రోజుకు ఆరేడు గంటలు అనువాదం చేస్తాను. ఒక పదానికి బదులు ఎన్ని పదాలు వాడొచ్చో అవసరమైతే లిస్ట్ రాసుకుంటాను. ఒరిజినల్ని చదువుతూ, అనువాదాన్ని చదువుకుంటూ పని ముగిస్తాను. పెరుమాళ్ మురుగన్ లాంటి రచయితలు పల్లెల్లో మరీ కొన్ని వర్గాలు మాత్రమే వాడే మాటల్ని ఉపయోగించి రాస్తారు. వాటికి ఇంగ్లిష్ మాటలు ఉండవు. డిక్షనరీలు కూడా ఉండవు. అందుకే అవసరమైతే ఒరిజినల్ రచయితనే సంప్రదిస్తూ డౌట్లు క్లియర్ చేసుకుంటూ అనువాదం ముగించాలి’ అంటుంది నందిని. నందిని లాంటి అనువాదకులు తెలుగులో కూడా ఉంటే మన క్లాసిక్స్ కూడా ప్రపంచ పాఠకులకు తప్పక చేరుతాయి. అనువాదకులకు గుర్తింపునూ తెచ్చిపెడతాయి. -
సుందరకాండకు సుందర అనువాదం...
Finding The Mother అనువాదం రామాయణమే ఒక సుందర కావ్యం. అందులోని సుందరకాండ ఇంకా సుందరమైన భాగం. రామాయణంలోని ఒక విశిష్టమైన కాండంగా, పారాయణ కాండంగా, గాయత్రీ మంత్రాన్ని నిగూఢంగా నిక్షిప్తం చేసుకున్న కాండంగా, శ్రీరాముని సుందర నామాన్ని పలుమార్లు గానం చేసే కాండంగా, అన్నింటి కంటే ముఖ్యం మారుతి లీలలను వర్ణించే కాండంగా సుందరకాండకు పండితులూ పామరులు ప్రాముఖ్యం ఇస్తారు. వాల్మీకి మహర్షి అన్ని కాండాలకూ వాటి కథాంశాన్నో, కథాస్థలినో తెలిపే పేరు పెట్టినా ఒక్క ఈ కాండానికి మాత్రం ‘సుందరకాండ’ అని పెట్టి పాఠకులకు ప్రహేళిక వదిలాడు. సుందరకాండలో సుందరమైనది ఏది? ఎవరు? శ్రీరాముడు అని కొందరు, మహాశక్తికి ప్రతిరూపమైన సీత యొక్క సౌందర్యమూర్తి అని కొందరు, సుందరుడనే అసలు పేరు కలిగిన హనుమంతుడని కొందరు... ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు... ఏ వ్యాఖ్యానం ఎలా ఉన్నా తల్లి సీతమ్మను వెతకడానికి బయలుదేరిన హనుమంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వైనం వల్ల కూడా ఇది ఆబాల గోపాలానికి ఇష్టమైన కాండం. అంతే కాదు దీనిని పారాయణం చేయడం వల్ల కష్టాలు తొలుగుతాయనే నమ్మకం వల్ల కూడా ఇది కోట్లాది మంది భక్తుల నాల్కల మీద అనునిత్యం తారాడుతుంటుంది. ఇట్టి సుందరకాండను మూల రచన నుంచి ఇంగ్లిష్‌లో అనువాదం చేయాలంటే కేవలం భాష, భక్తి మాత్రమే చాలవు. ఆ సుందరకావ్యం పట్ల నిమగ్నం కాగల మస్తిష్కం కూడా కావాలి. అందులోని సూక్ష్మపార్శ్వాలను అర్థం చెడకుండా అన్యభాషలోకి పరావర్తనం చేయగల పద సంపద, మేధస్సు కావాలి. ‘మహతి’ అనే కలం పేరు పెట్టుకున్న నెల్లూరు వాసి మైడవోలు వెంకట శేష సత్యనారాయణ ఆ పనిని సమర్థంగా చేశారని అతి సుందరతతో మెప్పించారని ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. ప్రపంచ పాఠకులకు ఇది తెలుగు రచయిత కానుక. తెలుగు చదవలేని తెలుగు నూతన తరానికి కూడా కానుకే. ఈ గ్రంథానికి పెద్దలు ఐ.వి.చలపతిరావు రాసిన ముందుమాట తప్పక పరిశీలించదగ్గది.