బాపుకు కన్నీటి వీడ్కోలు | Bapu enriched 'Thiruppavai' series with his master strokes | Sakshi
Sakshi News home page

బాపుకు కన్నీటి వీడ్కోలు

Published Wed, Sep 3 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

బాపుకు కన్నీటి వీడ్కోలు

బాపుకు కన్నీటి వీడ్కోలు

తమిళ సినిమా : స్థానిక అడయార్, ఆర్యపురంలోని గ్రీన్‌వేస్ ప్రాంతం విషాదవదనంతో మూగబోయింది. ఒక ప్రాంతం కాదు ఒక రాష్ట్రం కాదు, పలు రాష్ట్రాలకు చెందిన వారి మనసుకు కలిగే ఈ మౌన బాధ అంతా ఒకే ఒక్క వ్యక్తి కోసం అంటే ఆయనెంత ఘనుడో అర్థం చేసుకోవచ్చు. బాపు అనే రెండక్షరాల పేరు గల ఆయనెంత ధన్య జీవి. సినీ వినీలాకాశంలో బాపు ఒక వ్యక్తి కాదు శక్తి అని ప్రముఖలే కీర్తించారు. బాపు దర్శకుడిగా ఎంత ఖ్యాతి చెందారో, చిత్ర కళాకారుడిగా అంత విఖ్యాతి గాంచారు. తెలుగు జాతి మనసుల్లో బాపు పేరు మరపుండదు. మరుపులేదు ఆయన బొమ్మకు చెరుపు ఉండదు. బాపు కళాత్మకంలో విశ్వవ్యాప్తం. బాపు అనే పదం చారిత్రాత్మకం. ఇదే జగమెరిగిన సత్యం. బాపు భౌతిక కాయానికి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంట సమయంలో స్థానిక బీసెంట్ నగర్‌లో గల శ్మశాన వాటికలో సంప్రదాయ బద్దంగా జరిగాయి. అంతకు ముందు ఆయన ఇంటి వద్ద వేదపండితులు శాస్త్రోక్తంగా పెద్ద కుమారుడు వేణుగోపాల్ చేత కర్మకాండ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
 కడ వరకు
 ఇంటి వాకిలి వరకు భార్య, కాటి వరకు పిల్లలు కడవరకు ఎవరో అంటారు. ఇది నగ్న సత్యం. ప్రాణంపోయిన కట్టెను కాటికి మోసుకుపోవడానికి నా అన్నవాళ్లను నలుగురిని సంపాదించుకోవాలంటారు. ఈ విషయంలో బాపు నిజంగా అదృష్టవంతులే. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ కళాకారులు ఎంతో మంది బాపు అంత్యక్రియల సమయంలో దగ్గరున్నారు. వందలాది మంది బాధాతప్త మనసులతో బాపు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర మంత్రి వర్యులు రఘునాధ్ రెడ్డి, మండలి బుద్ద ప్రసాద్, ప్రముఖ హిందీ నటుడు అనిల్‌కపూర్, ఆయన సోదరుడు నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనికపూర్, గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు బాపు అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించడం విశేషం. గవర్నర్ రోశయ్య, నటుడు మోహన్ బాబు, గాయకుడు నాగూర్ బాబు మొదలగు పలువురు బాపు భౌతిక కాయానికి నివాళులర్పించారు.
 
 బాపుతో 38 ఏళ్ల అనుబంధం
 బాపు మృతి మంగళవారం సంతాపం వ్యక్తం చేసిన వారిలో సంగీత దర్శకులు మాదవపెద్ది సురేష్. తన అనుభవాలను పంచుకున్నారు. బాపుతో నాకు 38 ఏళ్ల అనుబంధం ఉంది. మనవూరి పాండవులు చిత్రానికి కె.వి.మహాదేవన్ సంగీతం అందించారు. అప్పుడు ఆయన వద్ద కీబోర్డు ప్లేయర్‌గా పని చేశాను. అప్పటి నుంచే బాపుతో నా అనుబంధం మొదలయ్యింది.
 
 బాపు ఒక ఎన్‌సైక్లోపీడియా
 బాపు ఒక ఎన్‌సైక్లోపీడియా అని నటుడు రామినీడు కీర్తించారు. ఆయన సాక్షి చిత్రం నుంచి అన్ని చిత్రాలు చూశాను.  బాపు చివరి చిత్రం శ్రీరామరాజ్యంలో నటించే అవకాశం రావడం  నా అదృష్టం అన్నారు రామినీడు.
 
 బాపుకు ఏకలవ్య శిష్యుడిని
 బాపుకు నేను ఏకలవ్య శిష్యుడినని ప్రముఖ దర్శకుడు వంశీ అన్నారు. 1979లోనే ఆయన పరిచయ భాగ్యం కలిగింది. దర్శకుడిగా నేనీ స్థాయిలో ఉన్నానంటే ఆయన చలవే.  
 
 స్నేహానికి నిర్వచనం బాపు, రమణ
 ప్రేమకు, స్నేహానికి సరైన నిర్వచనం ఉండదు. అలాంటిది స్నేహానికి అసలు, సిసలు నిర్వచనం బాపు, రమణలని ప్రముఖ గీత రచయిత భువనచంద్ర వ్యాఖ్యానించారు. లక్షా 50 వేలకు పైగా చిత్ర లేఖనాలు గీసిన చిత్ర కళాకారుడు బాపు. ఊహల్లో ఉన్న భగవంతుడిని మన కళ్లముందు ప్రత్యక్షపరచిన ఘనత బాపుదే.
 
 బాపు ఒక లెజెండ్
 బాపు గురించి చెప్పే వయసు నాకు లేదు, అంత స్థాయికి కాదు. అందరు అంటున్నట్టుగా బాపు ఒక లెజెండ్. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. శ్రీరామరాజ్యంలో బాల హనుమంతుడిగా బాపు  నన్ను తీర్చిదిద్దారు. ఆ చిత్రం నా కెరీర్‌లో ఒక మైలు రాయి. బాపు దర్శకత్వం వహించిన సుందరకాండలో నటించాను. శ్రీ వెంకటేశ్వర వైభవం సీరియల్‌లో అయితే ఏకంగా వామననుడిగా, శ్రీకృష్ణుడిగా, విష్ణుమూర్తి మూడు అవతారాల్లో నన్ను చూపించారు అని అన్నారు బాల నటుడు పవన్ శ్రీరామ్. బాపు గారి చివరి చిత్రం శ్రీరామరాజ్యంలో లవుడుగా నటించే భాగ్యం నాకు దక్కిందని గౌరవ్ అన్నాడు.
 
 తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంతాపం
 హైదరాబాద్‌కు చెందిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి ఎంప్లాయిస్ ఫెడరేషన్ బాపు మృతికి సంతాపాన్ని వ్యక్తం చేసింది. తెలుగు గీతకు, రాతకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రఖ్యాత సినీ దర్శకులు బాపు మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆ ఫెడరేషన్ సభ్యులు అన్నారు.  తెలుగు చలన చిత్ర దర్శకులసంఘం (హైదరాబాద్) బాపు మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.
 
 బాపు అంటే పిచ్చి అభిమానం
 బాపు అన్న ఆయన రాత శైలి అంటే పిచ్చి అభిమానం. ఆ పిచ్చితోనే చెన్నైకి వచ్చేశాను అంటున్నారు ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్, చిత్రకారుడు అంకయ్య. నా గురువు గంగాధర్ వద్ద పని చేస్తున్న సమయంలోనే బాపు పరిచయ భాగ్యం కలిగింది. చాలా మందికి తెలియని విషయం బాపు గొప్ప పబ్లిసిటీ డిజైనర్ అన్నది. తొలి రోజుల్లో మూగమనసులు, తేనెమనసులు, ఆత్మగౌరవం, సుమంగళి, ఆదుర్తి సుబ్బారావుగారి చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు బాపు.
 
 చెన్నై తెలుగు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామారావు బాపుకు నివాళులర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహాత్ముడు బాపు అని కీర్తించారు.
 
 అందానికి అందం అద్దిన శిల్పి
 తెలుగు అక్షరానికి ఒయ్యారాలు నేర్పి, గీతల బొమ్మలు అందచందాలను తీర్చిదిద్ది చలన చిత్రానికి కళాత్మక దృష్టిని ప్రసాధించిన చిత్ర, విచిత్ర శిల్పి బాపు. ఆరు పదుల కాలం వెదజల్లిన తెలుగుదనంతో మరో నూరేళ్ళ కాలం ఆ వెలుగు పంటలు పండించనున్న ప్రతిభాశాలి. ఆయన కిదే నా నివాళి - డాక్టర్ కాసల నాగభూషణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement