అశ్రునయనాలతో బాపుకు వీడ్కోలు
చెన్నై బిసెంట్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
రోశయ్య, సినీ తదితర ప్రముఖుల నివాళి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపుకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలి కారు. అనారోగ్యంతో ఆదివారం తుది శ్వాస విడిచిన బాపు అంత్యక్రియలు మంగళవారం చెన్నై బిసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో జరిగాయి. చెన్నై అడయార్‌లోని స్వగృహంలో బాపు పార్ధివదేహాన్ని మూడు రోజులుగా తెలుగు చలన చిత్రరంగ ప్రముఖులు, బాపు అభిమానులు పెద్ద సం ఖ్యలో దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య వచ్చి బాపుకి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు వారి హృదయాలలో చెరగని ముద్ర వేసిన మహానుభా వుడు బాపు అని ఆయన కొనియాడారు. తెలుగుజాతి ఒక ప్రజ్ఞాశాలిని కోల్పోయిందని చెప్పారు. బాపు మళ్లీ జన్మించాలని, తెలుగుజాతికి వెలుగు లు తేవాలని ఆకాంక్షించారు. బాపు ప్రతి భారతీ యుడి మదిలో కొలువై ఉన్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. బాపు మరణం మనకు దుర్దినమని అన్నారు. భారతదేశంలోనే బాపు వంటి దర్శకులు మరెవ్వరూ లేరని, ఆయన ప్రతిభకు మరెవ్వరూ సాటిరారని నటుడు మోహన్‌బాబు అన్నారు. భారత దేశ జాతీయ పతాకానికి ఎంతటి గంభీరత ఉందో అంతటి గంభీరతను మూర్తీభవించుకున్న వ్యక్తి బాపు అని సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. బాపు కళాతృష్ణ కలిగిన ఒక మహర్షి అని చెప్పారు. స్నేహానికి ప్రతీకలైన బాపు రమణల్లోని ఐదు అక్షరాలు పంచాక్షరీ మంత్రంతో సమానమని అన్నారు. బాపు, రమణ చిత్రాలు తెలుగు సంస్కృతికి ప్రతిబింబాలని గాయకుడు మనో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఆ రాష్ట్ర సమాచార, ప్రసార మంత్రి పల్లె రఘునాథరెడ్డి వచ్చి బాపు భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాపు రమణల ప్రతిభను భావి తరాలకు తెలియజేసేలా ఏపీ ప్రభుత్వం వారి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుందని అన్నారు. బాపు, రమణల ప్రతిభను పాఠ్యాంశాలుగా చేరుస్తామన్నారు. కొత్త రాజధానిలో నిర్మించే కళాక్షేత్రానికి బాపు, రమణల పేరు పెడతామన్నారు. తెలుగు తెరకు బాపు అందించిన సేవలను జాతి ఎన్నటికీ మరువదని చెప్పారు. పలువురు సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ హీరో అనిల్‌కపూర్, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
పార్ధివదేహాన్ని మోసిన బాలు
బంధువులు, అభిమానులతోపాటు ఎస్పీ బాలు కూడా బాపు భౌతికకాయాన్ని ఇంట్లోంచి మోసుకుంటూ వచ్చి అంబులెన్సులో ఎక్కించారు. శ్మశానవాటికలో ఉద్విగ్న వాతావరణం మధ్య బాపు కుమారులు వేణుగోపాల్, వెంకటరమణ అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు.