
వుడయార్ శిల్పశాలలో బాపు విగ్రహాలు
కొత్తపేట: విఖ్యాత చిత్రకారుడు, ప్రముఖ సినీ దర్శకుడు స్వర్గీయ బాపు కాంస్య విగ్రహాలు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని వుడయార్ శిల్పశాలలో రూపుదిద్దుకోనున్నా యి. చెన్నై తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నై నగరంలోని ఓ ప్రధాన కూడలిలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజమండ్రి, నరసాపురంలలో గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసేందుకు మూడు విగ్రహాలను తయారు చేయనున్నట్టు ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శనివారం విలేకరులకు చెప్పారు. ఏడున్నర అడుగుల ఎత్తు విగ్రహాలను రూపొందించనున్నానని, ప్రస్తుతం నమూనా విగ్రహాలను తయారు చేస్తున్నానని తెలిపారు. త్వరలో కాంస్య విగ్రహాల నిర్మాణం పూర్తి చేస్తానన్నారు. బాపుతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన కాంస్య విగ్రహాలు తయారు చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.