'బాపు నా గురువు'
తనను నటుడిగా మలచిన ఘనత ప్రముఖ దర్శకుడు బాపుదేనని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అన్నారు. 1980లో ఆయన దర్శకత్వంలో వహించిన 'వంశవృక్షం' చిత్రం ద్వారా తాను తెరంగ్రేటం చేసిన సంగతి అనిల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చిత్రాలలో ఏ విధంగా నటించాలి అనేది బాపు నుంచి తాను నేర్చుకున్నానని చెప్పారు. అందుకే బాపు తనకు గురువని ... ఓ విధంగా చెప్పాలంటే బాపు నాకు మెంటర్ అని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రఖ్యాత దర్శకులతో నటించానని... అయితే బాపు దర్శకత్వంలో నటించడం తన అదృష్టమన్నారు. బాపు విభిన్న శైలిలో చిత్రాలను తెరకెక్కిస్తారని అనిల్ ఈ సందర్బంగా ప్రశంసించారు. వంశవృక్షంలోనే కాకుండా బాపు హిందీలో తీసిన 'వోహ్ సాత్ దిన్' చిత్రంలో కూడా నటించానన్నారు. ఆయన దర్శకత్వం ప్రత్యేక శైలిలో ఉంటుందని గుర్తు చేశారు. బాపు మరణంతో దేశం మంచి దర్శకుడ్ని కోల్పోయిందని అన్నారు.