
కోనసీమలో బాపు కళావేదిక
►బాపు చిత్రాలతో మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు
►చిత్రకళాపరిషత్ అధ్యక్షుడు ‘కొరసాల’
అమలాపురం టౌన్ : ప్రసిద్ధ చిత్రకారుడు బాపు గీసిన అపురూప చిత్రాలను చిరస్మరణీయంగా నిలిపేందుకు కోనసీమ చిత్ర కళాపరిషత్ సన్నాహాలు చేపట్టింది. చిత్ర కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరసాల సీతారామస్వామి పాతికేళ్లుగా అమలాపురంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పదివేల వినాయక చిత్రాలను విభిన్న రూపాల్లో గీసిన ప్రముఖ చిత్రకారుడు సీతారామస్వామికి బొమ్మల బ్రహ్మ బాపుతో 45 ఏళ్ల అనుబంధం ఉంది.
కోనసీమ చిత్ర కళా పరిషత్ ఏటా జనవరిలో నిర్వహించే జాతీయ ఉత్సవాలకు వచ్చే జనవరితో 25 ఏళ్లు నిండుతున్నాయి. 2015 జనవరి మూడో వారంలో చిత్ర కళాపరిషత్ రజతోత్సవాలు నిర్వహిస్తారు.
దీనికి చిత్రలేఖనంలో తన గురుతుల్యుడైన బాపును సీతారామస్వామి ముఖ్యఅతిథిగా ఆహ్వానించగా అందుకు ఆయన అంగీకారం కూడా తెలిపారు. అయితే ఇంతలో బాపు అంతిమశ్వాస విడవడంతో రజతోత్సవాల నిర్వహణకు తీరని లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాపుతో తనకున్న అనుబంధం సాక్షిగా ఆయన గీసిన పలు కళాఖండాలను కోనసీమలో సజీవంగా పదిలపరచాలని సీతారామస్వామి నిర్ణయించారు. అమలాపురంలో తన నివాసం లోని సృష్టి కళానిలయంలో గురువారం జరిగిన బాపు సంతాప సభలో సీతారామస్వామి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
బాపు పేరిట శాశ్వత గురుతులు
సీతారామస్వామి ఇంటి ఆవరణలో సంతాపసభ నిర్వహించిన స్థలంలోనే బాపు కళా వేదిక ఏర్పాటు చేయనున్నారు. అలాగే తన ఆర్ట్ గ్యాలరీలోని ఓ గదిలో బాపు చిత్రాలతో ప్రదర్శనశాల కూడా నెలకొల్పుతున్నారు. 2015 జనవరిలో అమలాపురం చిత్ర కళాపరిషత్ రజతోత్సవాలు జరిగే వేదికకు బాపు కళాపీఠం అని పేరుపెడుతున్నట్టు ప్రకటించారు. అలాగే బాపు పేరిట ఓ ప్రముఖ చిత్రకారుడికి జీవన సాఫల్య పురస్కారం అందిస్తామని ప్రకటించారు. ఇదే సందర్భంలో కోనసీమలో 25 వేల మంది విద్యార్థులకు 25 చోట్ల బాపు పేరిట చిత్రలేఖన పోటీలు జరుగుతాయన్నారు. వీరిలో 100 మంది ఉత్తమ చిత్రకారులకు బాపు స్మారక అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. పోటీలు నిర్వహించే 25 కేంద్రాల్లో కూడా బాపు బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తామన్నారు.
సీతారామస్వామి తొలి గురువు బాపు:
కోనసీమ చిత్రకళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరసాల తన తొలిగురువుగా బాపును పేర్కొంటారు. వారిద్దరికీ 45 ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్‌లో సీతారామస్వామి చిత్రకళా ప్రదర్శనలను బాపు తిలకించిన సందర్భాలూ ఉన్నాయి. బాపుపై తన ఎనలేని అభిమానానికి గుర్తుగా 43 ఏళ్ల కిందటే తన కుమారుడికి సీతారామస్వామి బాపు అని పేరుపెట్టారు. అంతేకాదు.. తన మనుమడికి సైతం ధృవబాపు అని పేరు పెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సీతారామస్వామి కుమారుడు బాపు గతంలో హైదరాబాద్‌లో నివసించేవారు. అప్పట్లో వారింటికి బాపు అనేకసార్లు వచ్చేవారని, ఎన్నో ఆత్మీయ సందర్భాలు తమ మధ్య ఉన్నాయని సీతారామస్వామి ‘సాక్షి’కి వివరించారు.