చిత్రకారుడు కాదు... చరిత్రకారుడు | Historian, not a painter ... | Sakshi
Sakshi News home page

చిత్రకారుడు కాదు... చరిత్రకారుడు

Published Fri, Sep 12 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

చిత్రకారుడు కాదు... చరిత్రకారుడు

చిత్రకారుడు కాదు... చరిత్రకారుడు

  •      బాపు పేరిట ఆర్ట్ గ్యాలరీ
  •      డా.వరప్రసాద్ రెడ్డి ప్రకటన
  • నాంపల్లి: బాపు కేవలం చిత్రకారుడు మాత్రమే కాదని...చరిత్రకారుడని పారిశ్రామికవేత్త పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి శ్లాఘించారు. గురువారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో బాపు సంస్మరణ సభ నిర్వహించారు.

    ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ బాపు పేరిట ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి నిర్ణయించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా సాహితీవేత్తలందరం కలిసి ఆర్ట్ గ్యాలరీని నిర్మిస్తామని వెల్లడించారు. కొంటె చిత్రాలు, చలన చిత్రాలను రాబోయే తరాలకు అందించినప్పుడే ఆయనకు నిజమైన అశ్రునివాళి అవుతుందన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి మోహన్ కందా మాట్లాడుతూ తెలుగు భాషకు బాపు కొత్త రూపం తెచ్చారని కీర్తించారు.

    ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి తన వంతుసాయం అందిస్తానన్నారు. సినీ నటుడు రావి కొండలరావు మాట్లాడుతూ బాపుతో సాన్నిహిత్యం లభించినందుకు తన జీవితం ధన్యమైందని చెప్పారు. ఇప్పటి వరకు దేవతామూర్తుల చిత్రాలను కార్టూన్లుగా వేసిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరని తెలిపారు. సాహితీవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ చిత్రకారుడిగా బాపు లెజెండ్ అన్నారు. డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ బాపు నిర్యాణ సభను చలోక్తులు, చమత్కారాలతో జరుపుకోవడం విశేషమన్నారు.

    నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ బాపును తలచుకొని నవ్వుకుంటుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత శ్రీ రమణ, సన్‌షైన్ ఆస్పత్రి (సికింద్రాబాద్) ఎం.డి.డాక్టర్ గురువారెడ్డి, కార్డియాలజిస్ట్ మన్నెం గోపీచంద్, కార్టూనిస్ట్‌లు సుధామ, ఎస్వీ రామారావు, రచయిత ఎంబీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement