మీరాబెన్ భారతీయురాలు కారు. ఆమె పేరు కూడా మీరాబెన్ కాదు. ఆమె అసలు పేరు మెడిలియన్ స్లేడ్. బ్రిటన్ దేశస్థురాలు. బ్రిటిష్ సైన్యాధిపతి సర్. ఎడ్మిరల్ స్లేడ్ కుమార్తె. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీతో కలిసి పనిచేయడానికి తన దేశాన్ని, ఇంటిని వదిలి వచ్చిన మానవతావాది. ఆమె పేరు మార్చింది గాంధీజీనే! శ్రీకృష్ణపరమాత్ముని భక్తురాలైన మీరాబాయ్ పేరునే ఆయన ఆమెకు పెట్టారు. మీరాబాయ్ క్రమంగా మీరాబెన్ అయ్యారు. ఆమె 1925 నవంబరు 7న భారతదేశంలో అడుగు పెట్టారు.
ఆరోజు మహదేవ్ దేశాయ్, వల్లభాయ్ పటేల్, స్వామీ ఆనంద్ ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత మీరాబెన్ 34 ఏళ్లు పాటు భారతదేశంలోనే ఉండిపోయారు. హిందీ నేర్చుకున్నారు. 1931లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ, ఇతర ప్రముఖులతో పాటు మీరాబెన్ కూడా హాజరయ్యారు. లండన్ నుండి వచ్చాక, ఇండియాలో తిరిగి ప్రారంభమైన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా 1932–33లో జైలు జీవితం గడిపారు. అనంతర కాలంలో మీరాబెన్ గాంధీతో పాటు 1942 నుండి 1944 వరకూ పుణేలోని ఆగాఖాన్ ప్యాలెస్‌లో నిర్భంధంలో ఉన్నారు.
ఆ జైల్లోనే ఆమె మహాదేవ్ దేశాయ్, కస్తూరీబాయ్ మరణాలు చూసి చలించిపోయారు. అంతేకాదు. ఆ రోజుల్లో జరిగిన ప్రతి సన్నివేశాన్నీ కళ్లారా చూసిన ప్రత్యక్షసాక్షి మీరాయే. చివరికి గాంధీజీ అంతిమ యాత్రలో కూడా మీరా సాక్షీభూతురాలై నిలిచారు. ఆగాఖాన్ ప్యాలెస్ నుండి విడుదలయిన తర్వాత గాంధీజీ అనుమతితో మీరాబెన్ రూర్కీలో కిసాన్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమ నిర్మాణానికి గ్రామీణులు పెద్ద ఎత్తున స్థలాన్ని సమకూర్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఋషికేశ్‌లో పశులోక్ ఆశ్రమాన్ని స్థాపించి, ఆ ప్రాంతానికి బాపూ గ్రామ్ అనే పేరుని పెట్టారు. అలాగే 1952లో భిలాంగనలో గోపాల్ ఆశ్రమం కూడా స్థాపించారు.
ఆ ఆశ్రమంలోనే గడుపుతూ పాల సరఫరా, వ్యవసాయంలో పరిశోధనలు చేస్తుండేవారు. అలాగే ఒకొక్కసారి కశ్మీర్ వెళ్లి కొంతకాలం గడిపి వచ్చేవారు. ఆ రోజుల్లోనే ‘సమ్‌థింగ్ రాంగ్ ఇన్ ది హిమాలయ’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. మనదేశానికి ఇంత సేవచేసిన మీరాబెన్ 1959లో తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయారు. 1960లో ఆస్ట్రేలియాలో, తర్వాత 22 ఏళ్ల పాటు వియన్నాలో గడిపారు. 1982లో మరణించారు. భారత ప్రభుత్వం 1981లో మీరాబెన్‌ను భారతీయ పౌరురాలుగా పరిగణించి, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది.
(చదవండి: మహోజ్వల భారతి: నూరేళ్ల రావి చెట్టు)
Comments
Please login to add a commentAdd a comment