1911 జూలై 29 న ఆంగ్లేయులపై మనం సాకర్‌లో విజయం సాధించాం. అందుకు గుర్తుగా ఏటా ఈ రోజున ‘మోహన్ బగాన్’ డే జరుపుకుంటున్నాం. కలకత్తాలోని ‘మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్’ తరఫున మన భారత జట్టు.. ఆంగ్లేయ క్రీడాకారుల జట్టు అయిన ‘ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్’తో తలపడి ‘ఐ.ఎఫ్.ఎ. షీల్డ్’ పైనల్ మ్యాచ్‌లో నెగ్గింది. బెంగాల్ విభజనతో దేశం ఆగ్రహావేశాలతో ఉన్న సమయంలో బ్రిటిషర్‌లపై మనం సాధించిన ఆ ఘన విజయం.. ‘మా జన్మభూమిలో మాదే పైచేయి’ అనే బలమైన సంకేతాన్ని బ్రిటన్‌కు పంపినట్లయింది.
కలకత్తాలో మ్యాచ్ జరిగింది. బెంగాల్‌తో పాటు దేశం మొత్తం ఉత్సవం జరుపుకుంది. ‘బ్రిటిష్ వాళ్లను భారత్ ఓడించింది..’ అనే విజయగర్వం ప్రతి ఒక్కరిలోనూ తొణికిసలాడింది. మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్ 1889లో ప్రారంభం అయింది. క్లబ్బుకి ఆ పేరే పెట్టడానికి కారణం ఉంది. కలకత్తాలో కీర్తి మిత్రా అనే క్రీడాభిమాని బంగ్లా పేరు మోహన్ బగాన్. ఆ బంగ్లాలో, ఆనాటి బెంగాల్ ప్రముఖుల సమక్షంలో క్లబ్ ఆరంభం అవడంతో క్లబ్‌కి కూడా మోహన్‌బగాన్ అనే నామకరణం చేశారు.
1911లో ‘వస్తారా మాతో పోటీకి’ అని ఇంగ్లిష్ వాళ్లే మొదట మోహన్ బగాన్ క్లబ్బుకు సవాల్ విసిరారు. ఆ సవాల్‌ని మనవాళ్లు స్వీకరించారు. ప్రతిష్ఠాత్మక ఐ.ఎఫ్.ఎ. షీల్డ్ టోర్నమెంట్‌లో విజయం సాధించారు. విశేషం ఏంటంటే.. బ్రిటిష్ జట్టు బూట్లతో బరిలోకి దిగితే, బగాన్ జట్టు వట్టికాళ్లతో దిగింది. ఇప్పటి మన క్రికెటర్లు మ్యాచ్ గెలిస్తే ఒంటిపై చొక్కాలు తీసేస్తారు కదా, అప్పటి బగాన్ విజేతలు ఆనందం పట్టలేక చొక్కాలు చింపుకుని చిందులేశారు.
గాంధీ–ముసోలినీ మీట్
గాంధీజీ శాంతిప్రియులు. అహింసావాది. ఇటలీ నియంత ముసోలినీ అందుకు పూర్తిగా విరుద్ధం. బ్రిటిష్ వాళ్లంటే మనకు కంపరం కదా, బ్రిటిష్ వాళ్లకే కంపరం కలిగించిన ఫాసిస్టు పాలకుడు ముసోలిని. అలాంటి వ్యక్తిని కలవడానికి గాంధీజీ బయల్దేరి వెళ్లడం.. బ్రిటన్‌కి పెద్ద షాక్. గాంధీజీకీ అసలు ముసోలిని కలిసే ఉద్దేశమే లేదు. 1931లో రౌండ్ టేబుల్ సమావేశానికని లండన్ వెళ్లి, సమావేశం అయ్యాక ఇండియా తిరిగి వచ్చేందుకు ఇటలీ షిప్ ఎక్కారు గాంధీజీ. షిప్ రోమ్‌లో ఆగినప్పుడు పోప్‌ని కలిసేందుకు గాంధీజీ ప్రయత్నించారు కానీ కుదరలేదు.
అయితే గాంధీజీని ముసోలిని కలవాలని అనుకుంటున్నారన్న కబురు వచ్చింది. ఆరోజు డిసెంబర్ 12, 1931. గాంధీజీ పక్కనే ఆయన కార్యదర్శి మహదేవ్ దేశాయ్, అంతరంగికురాలు మీరాబెన్ ఉన్నారు. ముగ్గురూ కలిసి ముసోలినీ కలిశారు. గాంధీజీ, ముసోలినీ కొద్దిసేపు భారత రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత గాంధీజీ ఇండియా వచ్చాక బ్రిటన్ పత్రికలన్నీ రగడ చేశాయి.
నియంత ముసోలినిని ప్రశంసించిన గాంధీజీ అని పత్రికలన్నీ చిలవలు పలవలు చేసి ఉన్నవీ లేనివి రాశాయి. నేడు ముసోలిని జయంతి. 1883 జూలై 29న ఆయన జన్మించారు. ఇటలీ అంతర్యుద్ధంలో దేశాన్ని అధోగతిపాలు చేసినందుకు కమ్యూనిస్టులు అతడిని 1945 ఏప్రిల్ 28న కాల్చిచంపారు. ముసోలినీ మార్క్సిస్టు. తనని తను ‘అధారిటేరియన్ కమ్యూనిస్టు’ అని చెప్పుకునేవారు.
(చదవండి: మహాత్ముడి మాటే మహాదేవి బాట)
Comments
Please login to add a commentAdd a comment