తెలుగువారిని మామూలుగానే ఉంచినవాడు... | bapu birthday special | Sakshi
Sakshi News home page

తెలుగువారిని మామూలుగానే ఉంచినవాడు...

Published Sun, Dec 8 2013 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

తెలుగువారిని  మామూలుగానే ఉంచినవాడు...

తెలుగువారిని మామూలుగానే ఉంచినవాడు...

 ఎత్తిన జెండా దించకోయ్ అని పిలుపిస్తాడొకడు. పితృస్వామ్య దురహంకారాన్ని తెగ్గొయ్యమనే నినాదమొకటి ప్రతిధ్వనిస్తుందొక మూల. అగ్రవర్ణ దాష్టికాన్ని బదబదాలు చేయమని సంపాదకీయం రాస్తుందొక కలం. మతోన్మాద మస్తిష్కాలను ఆక్యుపంక్చర్ చేసైనా సరే స్వస్థత పరచాలని ప్రార్థిస్తాడొక కవి. అభ్యుదయ నీరెండలో అలా కలిసి నడుద్దాం రాబ్రదర్ అని ఆహ్వానిస్తాడొక ప్రగతిశీలి. వీరుల బలిదానాలకు అశ్రువొక్కటి జారవిడవమని మూర్ఛనలు పోతాడో స్టూడెంట్. పరస్పర అంగీకా రంతోనైనా సరే ఫలానా పాడు పని ఎలా చేస్తాడని ఎర్లీ మార్నింగ్ షోలో బల్లగుద్దుతుందొక అగ్నినేత్రి. పంచకర్మలు చేస్తే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదని పాట రాస్తాడొక వాగ్గేయకారుడు. దిష్టిబొమ్మను తగులబెడితే తప్ప చల్లబడదో దగ్ధ హృదయం.
 
 ఇంతేనా?
 ఎవరైనా దూరం నుంచి తెలుగువారిని చూస్తే అంతేనా? నిద్రపోయేటప్పుడు కూడా పిడికిళ్లు బిగించే నిద్రపోతారా వీరంతా అని అనుకోవడమేనా? వీరి కళావస్తువులంటే ఎర్రగా, ఉగ్రంగా, ప్రగతిశీలంగా, సామాజిక స్పృహతో రగిలిపోవలసిందేనా? రాళ్లెత్తిన కూలీలూ... పల్లకీ మోసిన బోయీలూ... దరిద్రంలో పేదవారి కారాగారం... దరీ అంతూ లేని భ్రష్టాచారం... అంతేనా?
 కాదు అని చెప్పారు బాపూ.
 
 తెలుగువాళ్లు కూడా మామూలు మనుషులే అని తేల్చారు బాపూ.
 వాళ్లూ మామూలు బట్టలే కట్టుకుంటారనీ, వాళ్లూ డాబా మీద వడియాలు
 ఆర బెట్టుకుంటారని, వారూ కుంపట్ల మీదే కూరలు చేసుకుంటారని, వారి భార్యలూ అందరి భార్యల్లానే భర్తలను అదిలిస్తారనీ, వారి భర్తలూ అందరి భర్తల్లానే బెదురుకుంటారనీ, వారికీ ఉద్యోగాలు చేతనవుననీ, వారికీ సద్యోగాల మీద సరదా ఉందనీ, వారూ టైపిస్ట్‌ల మీద సాంతం వాలి అడగని డౌట్లు క్లియర్ చేస్తారని, వారూ అక్కర కోసం వచ్చిన స్నేహితుడికి అటక మీద దాగి జెల్ల కొడ్తారని, వారూ పక్కింటి పడతిని పవిత్రంగా పై నుంచి కింద దాకా చూస్తారనీ, వారూ ఇరుగింటి పిన్నిగారిని మర్యాదగా ఆమె వెళ్లాకే తిట్టుకుంటారని, వారూ ఎవరికైనా పేరు వస్తే కింద వేసి నలుపుతారని, వారూ మరెవరైనా కింద పడితే అచ్చొచ్చోలు అభినయిస్తారనీ....
 వారి ఇళ్లల్లోనూ చూడచక్కని ఆడపిల్లలు ఉంటారని, వాళ్ల ముంగిళ్లలోనూ చూడముచ్చటి పాపాయిలు ఆడుకుంటారని, వారి దేవుడి గదుల్లో రాముడు సీత పక్కన చిద్విలాసంగా నిలుచుంటాడని, వాళ్ల నాన్నగారు పడక్కుర్చీలో హుందాగా కాఫీ తాగుతారని, వాళ్ల అమ్మ అమ్మలాగే కరుణగా ఉంటుందనీ, వాళ్ల వాకిలి ముగ్గులతో అందంగా మెరుస్తుందనీ, వాళ్లు కూడా వెన్నెలను చూసి మురుసుకుంటారనీ, వాళ్లూ  పువ్వులను చూసి పరిమళిస్తారనీ, వాళ్లూ నవ్వు వస్తే నవ్వుకుంటారనీ..... వారికీ సరసం తెలుసుననీ, వారికి విరసం కొత్తగాదనీ...
 పట్టీలు... గోరింటాకు పాదాలు... నడుము కింద చరిచే పొడుగు జడలూ... పుస్తకాలను పట్టుకున్న గాజుల చేతులు... ఫ్రెంచ్ మీసాలు... పంచె కట్టులూ... నవ్వే పెదాలు... వెలిగే నయనాలు... పళ్లు ఊడిన తాతలూ బోసి నవ్వుల బామ్మలూ... ఒక పెంకుటిల్లు... కొన్ని కొబ్బరి చెట్లు... నూతి చెప్టా... పాత సైకిలు... బూర ఊదే పాపడు...
 
 తెలుగువాళ్లూ అందరిలాగే మామూలుగానే బతికారనీ... ఉన్నందుకు సంతోషంగా లేనందుకు ఆనందంగా జీవించారనీ... వారూ ఎప్పుడైనా పోరాటాలు చేస్తారనీ... అంతమాత్రాన పోరాటాలే వారి జీవితం కాదనీ...
 బాపూ తన బొమ్మలతో కార్టూన్లతో వేలాది రీతులలో లక్షలాది రేఖలతో చరిత్రలో నిక్షిప్తం చేశారు.
 అందుకు కృతజ్ఞతలు...
 అందుకే శుభాకాంక్షలు...                డిసెంబర్ 15 బాపు బర్త్ డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement