మా బాపు... | special story to bapu | Sakshi
Sakshi News home page

మా బాపు...

Published Thu, Dec 14 2017 11:57 PM | Last Updated on Thu, Dec 14 2017 11:57 PM

special  story to  bapu - Sakshi

గ్రీటింగ్‌ కార్డు, వెడ్డింగ్‌ కార్డు, క్యాలెండర్, పుస్తకాలు, కాఫీ కప్పులు... సర్వం బాపు మయం...ఏ స్తోత్రం చదివినా బాపు బొమ్మే... ఏ పుస్తకం తీసినా బాపు కవర్‌పేజీయే...సినిమాలు తీసి, బొమ్మలు వేసిన బాపు కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారని వారి పిల్లలను అడిగితే...కుమార్తె భానుమతి, కుమారులు వేణుగోపాల్, వెంకటరమణ తమ అనుభవాలను పంచుకున్నారు.

నాన్న కోసం తాండ్ర తెస్తే, దాన్ని చాకుతో ముక్కలుగా కట్‌ చేసి అందరికీ పెట్టి, తాను చిన్న ముక్క మాత్రమే తినేవారు. సమోసాను కూడా కట్‌ చేసేవారు. ఏ వస్తువునూ డబ్బాలో దాచే అలవాటు లేదు. నాన్నకి బామ్మ చేసే స్వజ్జప్పాలంటే చాలా ఇష్టం. అందుకే బామ్మ వేడివేడిగా నాన్నకి, మామకి పెట్టమనేది
   

నాన్నగారికి ఫలానా పాట ఇష్టం... అంటూ నిర్దిష్టంగా లేదు. ప్రతి పాటలోను అందంగా ఉన్న అంశం గురించి మాట్లాడేవారు. అయితే అప్పుడప్పుడు ‘బంగారు పిచిక’ చిత్రంలోని ‘పో... పోపో... నిదురపో...’ పాటలోని పదాల గురించి, సన్నగా వినిపించే సంగీతం గురించి మాత్రం మాట్లాడుతుండేవారు.

‘నాన్న ఎప్పుడూ బొమ్మలు వేసుకుంటూ, చదువుకుంటూ ఉండేవారు. నాన్నని డిస్టర్బ్‌ చేయొద్దని అమ్మ చెబుతుండేది. చెన్నైలో షూటింగ్‌ ఉంటే మాత్రం, షూటింగ్‌ అయిపోయాక మాతోనే గడిపేవారు. రాజమండ్రి లాంటి ప్రదేశాల్లో  షూటింగ్‌ జరుగుతుంటే మా కుటుంబం, మామ (ముళ్లపూడి వెంకటరమణ) కుటుంబం అందరం కలిసి వెళ్లేవాళ్లం. ‘ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలి, విడిపోకూడదు’ అని చెప్పేవారు నాన్న. ఇప్పటికీ అత్త (ముళ్లపూడి వెంకటరమణ భార్య శ్రీదేవి) మా కోసం ఇక్కడే ఉండిపోయింది’ అంటారు బాపు కుమార్తె భానుమతి.
   
మామ (ముళ్లపూడి వెంకటరమణ), అమ్మ (భాగ్యవతి),  ఒకరి తరవాత ఒకరు వెంటవెంటనే పోవడంతో, నాన్న తట్టుకోలేకపోయారు. నాన్న చాలా ఎమోషనల్‌ పర్సన్‌. అమ్మ పోయినప్పుడు ఎవరైనా పలకరించడానికి వస్తే, ‘నన్ను కాసేపు వదిలేయండి’ అని లోపలకు వెళ్లిపోయి, ఒంటరిగా కూర్చున్నారు. దాంతో చాలామందికి నాన్న మీద కోపం కూడా వచ్చింది... అంటూ నాన్నగారు బాధ పడిన సంఘటనలు గుర్తుచేశారు చిన్న కుమారుడు వెంకటరమణ.
   
నాన్న మా ఎవ్వరి బొమ్మలు వెయ్యలేదు. ఒక్కోసారి మమ్మల్ని పిలిచి చెయ్యి ఇలా పెట్టు, కాలు అటు పెట్టు, కర్ర పట్టుకో అంటూ పోశ్చర్‌లు మాత్రం పెట్టించి, బొమ్మలు వేసేవారు. ఉత్తరం చదువుతూ కూర్చున్న అమ్మాయి బొమ్మ మొట్టమొదటిసారి వేసినప్పుడు అమ్మే మోడలింగ్‌. రెండోసారి అదే బొమ్మ నాన్న నన్ను కూర్చోబెట్టి వేశారు. బొమ్మ అంతా అయ్యాక నా పోజ్‌ మాత్రమే వేశారని అర్థమైంది. ఆడపిల్లలు బాగా చదువుకుని, బోల్డ్‌గా ఉండాలి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి అనేవారు. తెలుగు వచ్చినవాళ్లు వచ్చీరాని ఇంగ్లీషులో మాట్లాడితే నాన్నకి చాలా కోపం వచ్చేది’ అంటూ తండ్రి తాలూకు తీపి జ్ఞాపకాలను వివరించారు భానుమతి.
   
‘ఎవరైనా ఫలానా టైమ్‌కి ఇంటికి వస్తామంటే ఆ టైమ్‌కి రెడీ అయిపోయేవారు. వాళ్లు ఆ టైమ్‌కి రాకపోతే చాలా అసహనంగా ఉండేవారు. నాన్న చాలా సెన్సిటివ్‌. తనతో మాట్లాడేవారి గొంతులో కొంచెం తేడా వచ్చినా చాలా బాధపడేవారు’ అని తండ్రిని గుర్తు చేసుకున్నారు వేణుగోపాల్‌.‘‘ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా, మేమందరం హడావుడి పడేవాళ్లం. నాన్న, మామ మాత్రం తెల్లటి ఇస్త్రీ బట్టలు కట్టుకుని, కాసేపు అందరితో సరదాగా గడిపి, వెంటనే మేడమీదకు వెళ్లిపోయి, పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండేవారు’’ అంటూ బాపురమణలను స్మరించుకున్నారు చిన్నకుమారుడు వెంకటరమణ.
   
‘‘సినిమాలలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఇంట్లో ఎవ్వరికీ తెలియనిచ్చేవారు కాదు. నాన్న, మామ వారిలో వారు చర్చించుకునేవారు.’’ అంటూ తండ్రి పడిన అంతర్మనధనం గుర్తు చేసుకున్నారు వేణుగోపాల్‌.‘‘మాకు బంగారం కొనాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా అన్నీ అమ్మే చూసేది. లౌకిక విషయాల మీద వారికి ఆసక్తి ఉండేది కాదు. అలాగే చాలామంది, నాన్నగారికి ‘రాముడు సాక్షాత్కరించాడా’ అని అడుగుతుంటారు. ‘తాను వేసే బొమ్మలకు తనకు రాముడు కనిపించాడని’ నాన్న ఎన్నడూ నాటకీయంగా మాట్లాడేవారు కాదు. కాని ఆ రాముడు కనిపించకుండా ఇన్ని బొమ్మలు వేయగలరా అని మేం అనుకుంటాం’’ అంటూ తండ్రి వేసిన వేలకొలదీ రాముడి బొమ్మలను తలుచుకుంటూ చెప్పారు కుమార్తె భానుమతి.‘‘నాన్నకి కులాలు మతాలు అంటే అస్సలు ఇష్టం లేదు. మేం ఫలానా కులం వాళ్లం అనే ఆలోచనే నాన్నకి లేదు. అందరూ మనుషులే. అందరం సమానమే అనే భావనతో పెంచారు మమ్మల్ని’’ అన్నారు వేణుగోపాల్‌.
– డా. వైజయంతి

‘నాన్న చిత్రకారుడిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ, ఎండాకాలం సెలవుల్లో మధ్యాహ్నం సమయంలో పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని రామాయణం కొన్ని వందలసార్లు చెప్పారు. ఇంట్లోనే 16ఎం.ఎం ప్రొజెక్టర్‌తో గోడ మీద స్క్రీన్‌ ఏర్పాటుచేసి సినిమాలు వేసి చూపించేవారు.
– పెద్ద కుమారుడువేణుగోపాల్‌

మా చిన్నతనంలో పమేరియన్‌ కుక్కపిల్లను పెంచుకున్నాం. దానికి టిన్‌టిన్‌ అని కామిక్‌ పేరు పెట్టారు. అప్పుడప్పుడు ఆ కుక్క పిల్ల బొమ్మలు వేసేవారు. టిన్‌టిన్‌ చచ్చిపోయినప్పుడు, పిల్లలందరం బాగా ఏడవడం చూసి, ఇక ఎన్నడూ ఇంట్లో పెట్స్‌ని పెంచొద్దు అన్నారు. మేం ఏడిస్తే బహుశః ఆయనకి బాధ అనిపించి ఉంటుంది.
– చిన్న కుమారుడువెంకటరమణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement