మహా మనీషి బాపు.. | bapu is a Great person.. | Sakshi
Sakshi News home page

మహా మనీషి బాపు..

Published Mon, Sep 1 2014 1:15 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

bapu is a Great person..

సినీ, సాహిత్య రంగాల్లోనేగాక యావత్ తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తి బాపు. తెలుగు భాషలో బాపు బొమ్మకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రపంచంలోని తెలుగు జాతి కంతటికీ తెలుసు. ఆలోచనల్లో ఎంతో గొప్పగా ఉండే బాపు నిజజీవితంలో మాత్రం చాలా సామాన్యంగా ఉండేవారు. స్నేహానికి పర్యాయపదంగా జీవించారు. సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, డిజైనర్‌గా బాపు చేసిన సేవలు అసామాన్యం. బాపు బొమ్మ, బాపు అక్షరాలు, బాపు సినిమాలు, బాపు కార్టూన్‌లు దేనికదే ఓ మహా కావ్యం. తెలుగువాడిగా పుట్టి ప్రపంచవ్యాప్తంగా తన గీత(బొమ్మ) ద్వారా పరిచయమైన బాపు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుజాతి, భారతదేశం ఓ మహానుభావుడిని, ఓ మహా మనీషిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
 
 -వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
 
 బాపు మరణం తెలుగువారందరికీ మహా విషాదం. బాపు మృతితో తెలుగు నేల చిన్నబోయింది. తెలుగుదనం మసకబారింది. ఒక శకం ముగిసినట్లయింది. నా రెండో సినిమాగా ‘మనవూరి పాండవులు’ బాపు దర్శకత్వంలో నటించడం వల్లనే ఒక నటుడిగా నన్ను నేను తీర్చిదిద్దుకోగలిగాను.
 
 - చిరంజీవి, నటుడు, రాజ్యసభ సభ్యుడు
 
 స్నేహం అనే పదంలో ఒక అక్షరం బాపు, మరో అక్షరం రమణ. స్నేహానికి అర్థం బాపు- రమణ. తెలుగు సాహితీలోకానికి వారు చేసిన సేవ అజరామరం. తెలుగు భాష ఉన్నంత కాలం బాపు పేరు ఉంటుంది. సాహితీ లోకంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నిరాడంబరతను ఆభరణంగా ధరించిన బాపు మృతి చెందిన రోజు అత్యంత విషాదకరం. బాపు మృతి సాహితీవేత్తలకు, వ్యక్తిగతంగా నాకు తీరని ఆవేదన.
 కె.వి.రమణాచారి (తెలంగాణ ప్రభుత్వ సలహాదారు)
 
 
 ఆత్మీయుడిని కోల్పోయాం..
 బాపు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఓ గొప్ప ఆత్మీయుడిని కోల్పోయాను. అందాల రాముడు, సీతా కళ్యాణం, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప చిత్రాల్లో బాపు నాతో రాయించిన గీతాలు ఎంతో ప్రజాదరణ పొందాయి

- సి.నారాయణరెడ్డి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత


 బాపు మృతి తీరని లోటు. బాపు తీసిన చిత్రాల్లో 90 శాతం సినిమాలకు ఆయనతో కలిసి పనిచేశాను. నా తొలి పాట బాపు జన్మదినమైన డిసెంబర్ 15న రికార్డయింది. ఇది జీవితంలో మరచిపోలేని ఘట్టం. బాపు దగ్గరకు రానిచ్చే అతి కొద్ది మందిలో నేనూ ఒకడిని. జూలైలో ఆయన వద్దకు వెళ్లాను. ఆ సమయంలో ఆయనకు ఇష్టమైన కొన్ని పాటలను పాడి వినిపించాను. అదే నేను చివరిసారిగా బాపుని కలిసింది. జనాబ్ మెహదీ హసన్ అన్నా, ఆయన ఘజల్స్ అన్నా బాపుకి అమితమైన ఇష్టం.
 - ఎస్పీ బాల సుబ్రమణ్యం, గాయకుడు


 తెలుగు జాతి, సినీ పరిశ్రమ ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయాయి. బాపు తెలుగువాడిగా పుట్టడం తెలుగుజాతి చేసుకున్న అదృష్టం. ఆయన మరణంతో కన్నీరు పెట్టని తెలుగు వారుండరు.
 - పరుచూరి వెంకటేశ్వరరావు, సినీరచయిత


 ‘రాజాధిరాజు’ సినిమాకోసం బాపుతో కలసి పనిచేశా. గొప్ప కళాహృదయమున్న ఆయనతో కలసి పనిచేయడం మరపురాని అనుభూతిని మిగిల్చింది. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
 - విజయచందర్, వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం కన్వీనర్


 తెలుగు చిత్రానికి, చలన చిత్రానికి అపరబ్రహ్మగా బాపు ప్రాణప్రతిష్ట చేశారు. తన చిరకాల మిత్రుడు రమణను కలుసుకునేందుకే మనందరినీ వదిలివెళ్లారు. ప్రపంచం మెచ్చిన చలనచిత్రాలతో బాపు దర్శక దిగ్గజంగా చిరస్థాయిగా నిలిచిపోతారు.
 - పరకాల ప్రభాకర్, ఏపీ కమ్యూనికేషన్స్ సలహాదారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement