శ్రావణం...శుభ ముహూర్తాల సమ్మేళనం. అందుకే అందరూ శ్రావణం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండగా..నోములు, వ్రతాలతో పాటు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్యాణమండపాల వద్ద సందడి కనిపిస్తోంది.
పెళ్లి... ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన వేడుక. అందుకే కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతి ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఇటు నూతన వధూవరులతో పాటు అటు వారి కుటుంబ సభ్యులు, బంధువులూ భావిస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది పెళ్లి ముహూర్తం. వివాహం నిశ్చయమైనా ఆషాఢమాసం, అధిక శ్రావణంతో శుభ ముహూర్తాలు లేక నిరీక్షిస్తున్న వేలాది జంటలు ఈ శ్రావణంలో ఒక్కటి కాబోతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా పెళ్లికి సన్నాయి మేళాలు మోగనున్నాయి. ఈ నెల 17న శ్రావణం ప్రారంభం కానుండగా, మరుసటి రోజు నుంచే ముహూర్తాలూ ఉన్నాయి.
18 నుంచి వివాహ ముహూర్తాలు
సాధారణంగా శ్రావణ మాసంలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతాయి. బుధవారం(16న) అమావాస్య వచ్చింది. తర్వాత నిజ శ్రావణమాసం. ఈ నెల 18వ తేదీ నుంచి దాదాపు వరుసగా 10 రోజుల పాటు వివాహ ముహూర్తాలున్నాయి. ఇవి డిసెంబర్ వరకూ కొనసాగనున్నాయి. ముహూర్త బలం వల్ల ఒకేరోజు ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతుండటంతో కల్యాణమండపాలకు డిమాండ్ బాగా పెరిగింది.
ఫంక్షన్ హాళ్లకు డిమాండ్
శ్రావణంలో చాలా ముహూర్తాలు ఉన్నప్పటికీ కొన్నింటిని దివ్యమైనవిగా పేర్కొంటారు. ఆ ముహూర్తంలోనే పిల్లల పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకే ఆయా తేదీల్లో కల్యాణ మండపాలతో పాటు అన్నీంటికీ డిమాండే. పెళ్లితో కొత్తగా ఒక్కటి కానున్న జంటలు, వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అన్ని హంగులూ ఉన్న కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల కోసం పరుగులు పెడుతున్నారు.
శ్రావణమాసం మొదలు డిసెంబర్ వరకూ జిల్లాలో వెయ్యికిపైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. శ్రావణంలో పెళ్లిళ్లలతో పాటు పండుగలూ ప్రతి ఇంటా సంతోషాలు నింపుతాయి. ఈనెల 21న వచ్చే నాగుల చవితి, గరుడ పంచమి రాకతో ప్రధాన పండుగలు ఆరంభం కానున్నాయి.
22న మంగళగౌరీ వ్రతాలు 25న వరలక్ష్మీవ్రతం, 31న రాఖీ పౌర్ణిమ, ఈనెల చివరలో 31 నుంచి మూడు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధనా ఉత్సవాలు, సెప్టెంబర్ 6న శ్రీ కృష్ణాష్టమి పర్వదినాలు వరుసగా వస్తాయి. 14న పొలాల అమావాస్యతో నిజ శ్రావణంలో వచ్చే పండుగలు ముగిసి భాద్రపదంలో ప్రవేశిస్తాయి. అలాగే ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకూ నోములు, వ్రతాలు ఆచరించుకునేందుకు మహిళలు సిద్ధమయ్యారు.
ఎందరికో ఉపాధి
పెళ్లంటే రెండు జీవితాల కలయిక మాత్రమే కాదు. ఎందరికో ఉపాధి కూడా. పెళ్లి పత్రికల ముద్రణ, ప్లెక్సీల ఏర్పాటు, కల్యాణ మండపం, అద్దె గదులు తీసుకోవడం, ఫ్లవర్ డెకరేషన్, పెళ్లి భోజనాలు, ఫొటోలతో పాటు వీడియోలు తీయడం, పెళ్లి కూతురు అలంకరణ, ఫంక్షన్ హాలు శుభ్ర పరచడం, పురోహితులు, భజంత్రీలు, రవాణా ఇలా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే బంగారు, నిత్యవసర సరుకులు, వస్త్ర వ్యాపారులకు కూడా పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారం బాగా జరుగుతుంది.
పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది
ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ శుభ ముహూర్తాలు తక్కువే. జూలైలో ఆషాఢమాసం వచ్చింది. అందుచేత పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. గురువారం నుంచి శ్రావణమాసం వస్తోంది. కాబట్టి ఈ నెల 18, 20, 21, 23, 27, 31 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. సెప్టెంబర్ నెలలో కూడా 1, 3, 10వ తేదీల్లో శుభ ముహూర్తాలున్నాయి. డిసెంబర్ ఆఖరు వరకూ పెళ్లిళ్ల సీజనే.
Comments
Please login to add a commentAdd a comment