తేలు కుట్టినా ఏమీ కాదంటా..!
కోడుమూరు: సాధారణంగా విష పురుగులైన తేళ్లను చూస్తే ఎవరైనా ఆమడదూరం పరుగెడతారు. కానీ ఈరోజు (మూడో శ్రావణ సోమవారం) కోడుమూరు వాసులు ఏమాత్రమూ భయం లేకుండా తేళ్లను పట్టుకున్నారు. వాటిని చేతులపై, తలపై, నాలుకపై ఉంచుకొని నృత్యాలు చేశారు. ఈరోజు తేలు కుట్టినా ఏమీ కాదని, ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే విషప్రభావం తగ్గిపోతుందని వారు తెలిపారు. అదే మిగతా రోజుల్లో అయితే సమస్య వస్తుందని చెప్పారు.
శ్రావణమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని కోడుమూరు సమీపంలోని కొండపై వేడుకను వైభవంగా నిర్వహించారు. గ్రామస్తుల ఇష్టదైవమైన కొండలరాయుడి సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుకకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. తేళ్లను పట్టుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ప్రతి ఏటా శ్రావణమాసం మూడో సోమవారం ఈ వేడుక ఆనవాయితీగా జరుగుతోంది. ఈసారి కూడా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.