
పుష్కరాలకు, పెళ్లిళ్లకు డిష్యూం డిష్యూం
12 ఏళ్లకు పుష్కరాలు.... 16 ఏళ్లకు పరువాలు ... అని ఓ సినీ గేయ రచయిత ఆ రెండింటికి లింక్ పెట్టి ఓ పాట రాశారు.
* గోదావరి పుష్కరాలతో వచ్చే ఏడాది పెళ్లిళ్లు ఉండవు
* అందుకే శ్రావణ మాసంలో పెళ్లిళ్ల జోరు
* 5 రోజుల్లో 2 లక్షల పెళ్లిళ్లు
* గోదావరి పరివాహక ప్రాంతంలో ఇక కళ్యాణ శ్రావణం
12 ఏళ్లకు పుష్కరాలు.... 16 ఏళ్లకు పరువాలు ... అని ఓ సినీ గేయ రచయిత ఆ రెండింటికి లింక్ పెట్టి ఓ పాట రాశారు. అయితే పుష్కరాల్లో పెళ్లి చేస్తే మాత్రం ఆశుభమని పెద్దలు అంటారు. వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం,తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ పుష్కరాల నేపథ్యంలో తమ పిల్లలకు ఇప్పుడు పెళ్లి చేయకుంటే 2016 జులై వరకు ఆగాల్సిందే. దాంతో ఆయా జిల్లాల ప్రజలు తమ పిల్లలకు వెంటనే పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుంటున్నారు.
ఇంకేం ఉత్తమమైన మాసాల్లో ఒక్కటైన శ్రావణ మాసం రానే వచ్చింది. ఈ మాసంలో 12 నుంచి 14 వరకు ఆ తర్వాత ఇదే నెలలో 19వ తేదీ మంచి ముహుర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ మాసంలో అరకొర ముహుర్తాలున్నాయి. అంతవరకు ఎందుకులే శ్రేష్టమైన మాసం శ్రావణంలో కానిచ్చేద్దామని పెద్దలు తమ పిల్లల పెళ్లికి ముహుర్తాలు పెట్టించేస్తున్నారు.
దాంతో శ్రావణమాసంలోని ఈ అయిదు రోజులలో మొత్తం 2 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇరు రాష్ట్రాలలోని తిరుపతి, చిన్న తిరుపతి, అన్నవరం, విజయవాడ శ్రీకనకదుర్గ, శ్రీకాళహస్తి, యాదగిరిగుట్ట, వేములవాడిలోని శ్రీరాజరాజేశ్వరీ దేవాలయాలలో తమ పిల్లల వివాహానికి వారి తల్లిదండ్రులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే నగరాలు, పట్టణాలలోని కల్యాణమండపాలు, క్యాటరింగ్, లైటింగ్.... అన్ని ఇప్పటికే బుక్ అయి పోయాయి. ఈ విషయాన్ని గమనించిన క్యాటరింగ్ సంస్థలు, లైటింగ్ వాళ్ల నుంచి అందరు రేట్లు పెంచేశారు.
దాంతో ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. అయినా తప్పుదు కదా లేకుంటే 2016 జూలై తర్వాతే అని తల్లిదండ్రులు ఓ భయం పట్టుకుంది. దాంతో తమ పిల్లల పెళ్లి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడం అంటున్నారు తల్లిదండ్రులు. అయితే ఆ తర్వాత ఏడాదే అంటే 2016లో కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి.