
అగ్నిసాక్షి బంధం.. నీటి ఒడిలో బలోపేతం
మూడు ముళ్లు, ఏడడుగులతో అగ్ని సాక్షిగా ఒక్కటైన దంపతులు.. నీటి సాక్షిగా ఆ బంధాన్ని మరింత బలపరుచుకుని
నరసాపురం అర్బన్:మూడు ముళ్లు, ఏడడుగులతో అగ్ని సాక్షిగా ఒక్కటైన దంపతులు.. నీటి సాక్షిగా ఆ బంధాన్ని మరింత బలపరుచుకుని పరవశించిపోతున్నారు. పుష్కర గోదావరి ఒడిలో సరిగంగ స్నానాలు చేస్తూ సరికొత్త పులకింతలను ఆస్వాదిస్తున్నారు. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పండుగ తమ పెళ్లయిన అనతికాలంలోనే రావడంతో.. ఉప్పొంగే అలలపై నావల్లా.. ఆనందంపై తేలియాడుతున్నారు. గోదారిలో ‘లాహిరిలాహిరి’ విహారాన్ని ముగించలేక ముగించి ఒడ్డెక్కుతున్న వారిని ‘సాక్షి’ పలకరించింది. మెరిసే కళ్లతో తమ అనుభూతిని వివరించిన వారు మళ్లీ మళ్లీ వచ్చే పుష్కరాలకు కూడా ఇలా స్నానాలు చేస్తామని చెప్పారు.
ఆనందం చెప్పలేనిది...
మాకు ఏడాది క్రితమే పెళ్లైంది. గోదావరి పుష్కరాల్లో స్నానం చేయాలని చెన్నై నుంచి వచ్చాం. మాకు నిజానికి పుష్కరాలు ఇంత బాగా జరుగుతాయని తెలియదు. వాటి పవిత్రతపైన కూడా అంతగా అవగాహన లేదు. కానీ, ఈ రోజు మేమిద్దరం నదిలో స్నానం చేయడం చెప్పలేని ఆనందాన్నిచ్చింది.
-జయరాజ్, స్వర్ణ, చెన్నై
ఎంతో తియ్యని అనుభూతి
మాకు ఇటీవలే వివాహం అయింది. నరసాపురం సముద్ర సంగమ ప్రాంతంలో స్నానం చేయడం ఎంతో తియ్యని అనుభూతి. అంతా కొత్తగా ఉంది. మళ్లీ పుష్కరాలకు మాలో ఎంతో మార్పు వస్తుంది. అప్పుడు పిల్లలతో కలిసి ఇప్పటి అనుభవాలను పంచుకుంటాం. -నాని, విజయ, నరసాపురం
ఇదో తీపి జ్ఞాపకం
పెళ్లైన ఏడాదిలోనే 12 ఏళ్లకు వచ్చే మహా సంబరం రావడం, ఆ పండుగలో మేం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందుకే ఎన్నో పనులున్నప్పటికీ అన్నింటినీ వాయిదా వేసుకుని పుష్కరాల తొలిరోజునే స్నానం చేశాం. ఈ జ్ఞాపకం మళ్లీ పుష్కరాల వరకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
-పవన్, స్వాతి, భీమవరం
మళ్లీ పుష్కరం ఎప్పుడొస్తుందా అని ఉంది
మాకు రెండేళ్ల క్రితమే పెళ్లైంది. పుష్కరాల్లో స్నానం చేయడం కొత్తగా ఉంది. అంతకు మించి ఏదో వింత అనుభూతి కూడా దక్కింది. మళ్లీ పుష్కరాలు తొందరగా వచ్చేయాలని, కాలం తొందరగా గడచిపోవాలని అనిపిస్తోంది.
-నరసింహులు, శ్యామలకుమారి, జిన్నూరు