మా కన్నయ్యకోసమే ఈ పెళ్లిళ్లు! | This is to our kannayya weddings! | Sakshi
Sakshi News home page

మా కన్నయ్యకోసమే ఈ పెళ్లిళ్లు!

Published Sun, Aug 17 2014 10:43 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మా కన్నయ్యకోసమే ఈ పెళ్లిళ్లు! - Sakshi

మా కన్నయ్యకోసమే ఈ పెళ్లిళ్లు!

శ్రావణమాసం అంటే...
 ఈ స్నేహబృందానికి అత్యంత ఇష్టమైన మాసం.
 ఎందుకంటే... కృష్ణుడు పుట్టింది ఈ మాసంలోనే. అరవై ఆరేళ్ల స్వరాజ్యలక్ష్మి అయితే...
 ‘మా అబ్బాయి పుట్టిన రోజు’ అంటూ హడావుడి చేస్తారు.
 ఇక ధనుర్మాసం వస్తే...
 ‘మా వాడి పెళ్లి’ అంటూ ఇంటిని అలంకరిస్తారు. ముత్యాల పందిరి వేస్తారు... నలుగుపెట్టి స్నానం చేయిస్తారు. మధుపర్కాలు
 ధరింపచేసి తలంబ్రాలు పోయిస్తారు.

 
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ దగ్గర ‘స్వరాజ్య లక్ష్మిగారిల్లు తెలుసా’ అని ఎవరినైనా అడిగితే ‘ఏటా కృష్ణుడికి పెళ్లి చేస్తుంటారు, ఆడవాళ్లంతా చేరి ధ్యానం చేస్తుంటారు... ఆవిడేనా?’ అన్నట్లు చూస్తారు. నిజమే! ఆమె పాతికేళ్లపాటు నిర్విఘ్నంగా ఏటా కృష్ణుడికి గోదాదేవితో పెళ్లి చేశారు. మురళీమోహనుడిని రాధాసమేతంగా ఇంట్లో అట్టే పెట్టేసుకున్నారు. రాధాకృష్ణులకు చమ్కీ వర్క్ చేసిన ముఖమల్ వస్త్రాలు తొడిగి, ముత్యపు పందిరి వేశారామె.
 
ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు కాలనీలోని స్నేహితురాళ్లందరూ స్వరాజ్య లక్ష్మి ఇంట్లో కలుస్తారు. అప్పటికే రాధాకృష్ణులకు ప్రభాత సేవ, నైవేద్యం వంటి పనులన్నీ పూర్తయి ఉంటాయి. ‘కృష్ణయ్యా! నిన్ను చూడడానికి ఎవరెవరొచ్చారో చూడు’ అంటూ ధ్యానంలో కూర్చుంటారామె. ఆమెతోపాటు స్నేహితులందరూ ధ్యానం చేస్తారు. ధ్యానం పూర్తయిన తర్వాత కృష్ణతత్వాన్ని, భాగవతంలోని దశమస్కంధాన్ని పారాయణం చేస్తారు. కృష్ణుడిని కన్నబిడ్డగా భావించే మధుర భక్తురాలు స్వరాజ్యలక్ష్మి.
 
ధ్యానమే మూలం!
 
ఈ స్నేహబృందం... కృష్ణతత్వాన్ని, కృష్ణుడి లీలలను తలచుకోవడంతోపాటు మానవ సేవ చేయడమే ఆ మాధవుడికి చేసే పరిపూర్ణమైన సేవ అని నమ్ముతారు. ‘‘కృష్ణుడికి పెళ్లి చేసేది నా తృప్తి కోసం. అనాథలకు పెళ్లి మాత్రం కృష్ణుడికి ఇష్టమని చేస్తున్నాం. ఏ పని అయినా సరే మా సత్సంగంలో పాల్గొనే స్నేహితులందరం కలిసి చేస్తాం’’ అన్నారు స్వరాజ్యలక్ష్మి. ‘‘ఇప్పటికి పది జంటలకు పెళ్లి చేశాం.

పెళ్లికి కావల్సిన అన్ని వస్తువులనూ మేమే సమకూరుస్తాం. వారు కాపురం పెట్టుకోవడానికి అవసరమైన వస్తువులన్నీ మేమే ఇస్తాం’’ అన్నారు అక్కడే ఉన్న ప్రమీల. ఏదైనా ఒక పని అనుకుంటే ఎవరూ వెనుకడుగు వేయరు. అందరూ తలో చెయ్యి వేయడానికి ముందుకు వస్తారు. అలా మంచి ఆలోచనలకు, మంచి కార్యాచరణకు ధ్యానమే కారణం అంటూ ‘‘ధ్యానంతో స్పందించే గుణం వస్తుంది. మనసు, ఆలోచనలు ధారాళంగా ముందుకు సాగుతాయి. ఆ ధ్యానమే నాకు ఇంతమంది స్నేహితులను ఇచ్చింది. వారి స్నేహమే నాతో ఇన్ని మంచి పనులు చేయిస్తోంది’’ అంటారు స్వరాజ్యలక్ష్మి.
 
భక్తి నుంచి ధార్మికంలోకి...
 
ఈ సత్సంగంలోని స్నేహబృందం చేపట్టిన పనులేవీ చిన్నవి కావు. అదే విషయాలను గుర్తు చేసుకుంటూ... ‘‘పదిహేనేళ్లుగా దాదాపుగా వందమందిమి ఇలాగే వారం వారం కలుస్తూన్నాం. మొదట్లో ఒకసారి అందరం కలిసి పదిమందికి ఉపయోగపడే ఏదైనా చిన్న పని చేద్దాం. అనాథ పిల్లల చదువు కోసం సత్సంగం తరఫున ఐదువేల రూపాయలిచ్చాం. అలా చిన్న చిన్నవి చేస్తూ వచ్చాం.

ఒకసారి పేపర్‌లో బోడుప్పల్‌లో రాజేశ్ అనే కుర్రాడు అనాథలైన వృద్ధులకు ఆశ్రయం ఇస్తున్నట్లు చదివి మేము కొంతమందిమి వెళ్లి చూసి వచ్చాం. అతడు వృద్ధులకు చేసే సేవ చూస్తే ఎవరికైనా మనసు కరిగిపోతుంది. అలాంటి వ్యక్తికి మా వంతుగా ఏదైనా చేస్తే బావుంటుందనుకున్నాం. మొదట అంబులెన్స్ కొనిచ్చాం. బోరు వేయించాం. ఆ తర్వాత ఆశ్రమానికి స్థలం కొనిచ్చాం. ఆ స్థలం కొనడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అధినేత అంజిరెడ్డి గారి భార్య సహకరించారు’’ అన్నారు స్వర్ణ.
 
స్వరాజ్య లక్ష్మి... అనాథాశ్రమంలో బోరు వేయించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... ‘‘బోరు కోసం అందరం కలిసి రెండు లక్షల రూపాయలు జమచేశాం. భూమి పూజ చేసి బోరు వేయడం మొదలైంది. ఏడు వందల అడుగులు వెళ్లినా నీటి జాడ లేదు. దాంతో నాకు భయం వేసింది. నా ఒక్కదాని డబ్బు కాదు. నా మాట మీద ఇంతమంది ముందుకు వచ్చారు. నీరు పడకపోతే నీటి ఇబ్బంది తీరక ఆశ్రమంలోని వాళ్ల కష్టం అలాగే ఉంటుంది. వాళ్లకేదో మేలు చేద్దాం అని డబ్బిచ్చిన ఇంతమందీ నిరాశ చెందుతారు. నాయనా కృష్ణయ్యా నీవే దిక్కు - అని భారం అంతా వాడి మీదనే వేశాను. ఎనిమిది వందలు దాటే సరికి జల పడింది’’ అన్నారామె సంబరంగా!
 
పెళ్లికి ఇలా!
 
అనాథ జంటల పెళ్లిని ఈ స్నేహబృందం అంతా తమ ఇంటి పెళ్లిలాగ నిర్వహిస్తారు. నలుగురు వెళ్లి పెళ్లి బట్టలు, మంగళ సూత్రం కొంటారు. మరికొందరు ఇంటికి అవసరమైన వస్తువులు తీసుకువస్తారు. దీంతోపాటు అందరి ఇళ్ల నుంచి వాడకుండా పక్కన పెట్టేసిన పాత్రలు, వేడుకలకు హాజరైనప్పుడు ఇచ్చిన స్టీలు డబ్బాల వంటి బహుమతులను జమ చేస్తారు. ఇలా కొత్త కాపురానికి అవసరమైన వస్తువులన్నీ చేరిపోతాయి. తాము ఒక మోస్తరుగా వాడిన చీరలు, కాలేజ్ పిల్లల జీన్స్ ప్యాంట్లు, చొక్కాలు అన్నీ కలిపి వధువుకి నలభై జతలు, వరుడికి పాతిక జతల వరకు చేరుస్తారు.

ఇంతమంది మహిళలు నిండు మనసులతో కొత్త జీవితానికి ఆసరాగా నిలవడంతో ఆ వధూవరులు తమకెవరూ లేరనే బాధ నుంచి బయటపడి వీరి ఆత్మీయతకు ఆనందపడతారు. ‘‘ఇంతవరకు పది జంటలను కలిపాం. మరో పెళ్లికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వధూవరులే రావాల్సి ఉంది’’ అంటూ చమత్కరించారు భవాని. కృష్ణాష్టమిరోజు కృష్ణుడికి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు.

ధనుర్మాసంలో రాధను గోదాదేవిగా అలంకరించి రోజూ పాశురాలు చదువుతూ భోగి రోజు వివాహం చేస్తారు. అలా పాతికేళ్లపాటు వివాహమహోత్సవాన్ని నిర్వహించారామె. మాధవ సేవ ఎంత చేసినా మానవ సేవ చేస్తేనే మా కృష్ణయ్యకు సంతోషం... అంటారామె. ఇంకా తనకు ఇద్దరమ్మాయిలనిచ్చి కొడుకుగా వాడే నా ఇంట్లో ఉన్నాడు - అంటూ మురిసిపోతారు.

 - వాకా మంజులారెడ్డి

అదిహృదయభాష !
ధ్యానం వల్ల పొందే అనుభూతిని వివరించడానికి మాటలుండవు. మనసుకి అర్థం కావాల్సిందే. ధ్యానంతో జ్ఞాపకశక్తి పెరుగు తుంది. కష్టాలను అధిగమించగలిగే మానసిక స్థిరత్వం వస్తుంది.
 - రాజ్యలక్ష్మి సత్సంగ
 నిర్వహకురాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement