బొద్దుగా ఉన్నా పర్వాలేదు! | being chubby is not a disability! | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 3 2017 9:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

being chubby is not a disability! - Sakshi

గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌.. వందకు పైగా దేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు.. అగ్రదేశం అమెరికా అ«ధ్యక్షుడి సలహాదారు, ఆయన కూతురు, ఓ ఎంటర్‌ప్రెన్యూరైన ఇవాంకా ట్రంప్‌ ముఖ్య అతిథిగా నగరంలో మూడురోజుల వేడుక సాగింది. వ్యాపార, వాణిజ్య రంగాల్లోకి మహిళలు రావాలి.. ఆదాయోత్పత్తుల్లో వారి వాటా పెరగాలని ఇవాంకాతో సహా సదస్సుకు హాజరైనవారంతా నొక్కి చెప్పారు. అందుకే ‘విమెన్‌ ఫస్ట్‌.. ప్రాస్పరిటీ ఫర్‌ ఆల్‌’ (మహిళకు  మొదటిస్థానం.. శ్రేయస్సు అందరికీ) అని నినదించారు. ‘తుమ్హారీ సులూ’.. విద్యాబాలన్‌ ప్రధాన పాత్రగా తీసిన బాలీవుడ్‌ చిత్రం. కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి, వంద దేశాల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలను పిలిచి.. మూడు రోజుల జీఈఎస్‌ సదస్సులో రోజుకు 53 సెషన్లలో తమ ఆలోచనలను మథించి, తీర్మానాలను రచించి రూపొందించిన నివేదికను రెండున్నర గంటల్లో చూపించిన సినిమా. ఇప్పుడు ఈ రెండూ హైదరాబాద్‌ వనితల్లో కొత్త స్ఫూర్తిని నింపాయి.    


సాక్షి, సిటీబ్యూరో: లావును జీరో సైజ్‌ కన్నా గొప్పగా.. దాన్నో ప్రైడ్‌గా భావించొచ్చు. ఇంటర్‌ ఫెయిలైయినా.. ఇష్టమైన ఉద్యోగం చేయొచ్చు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ లేకున్నా వ్యాపారంలో విజయం సాధించొచ్చు. లోకం పోకడ తెలియని గృహిణి.. ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటన్నింటికీ ‘ఆత్మవిశ్వాసం’ అనే అర్హత ఉంటే చాలు. జీఈఎస్‌ లాంటి వేదికలపై బిజినెస్‌ పాఠాలు చెప్పొచ్చని, ఇవాంకకు లేని గౌరవాన్ని సాధారణ గృహిణి సైతం సొంతం చేసుకోవచ్చ’ని డిజిటల్‌లో డిస్‌ప్లే చేసి మరీ చెప్పిన సినిమా తుమ్హారీ సులూ.   

ఆత్వ విశ్వాసమే అలైన అందం 
పెళ్లయి, బిడ్డ పుట్టి బాధ్యతలతో ఒంటి మీద శ్రద్ధ తగ్గో.. ఇతర కారణాల వల్లో లావైపోతే ఆత్మన్యూనతతో కుంగిపోవాల్సిన పనిలేదంటున్నారు సిటీలో వివిధ రంగాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న మహిళలు. ‘తుమ్హారీ సులూ’లోని విద్యాబాలన్‌లా లావుతోనూ (ఒబేసిటీ దుష్పరిణామాలు చూపించనంత వరకు) సగర్వంగా నడవచ్చు.. ఆరోగ్యంగా మెరవచ్చు. ఇది హౌజ్‌వైవ్స్‌కే కాదు.. జీరో సైజ్‌ కోసం పొట్ట మాడ్చుకునే అమ్మాయిలకూ ప్రేరణే. లావు వల్ల ఏ అనారోగ్యం రాకపోయినా.. పర్‌ఫెక్ట్‌ బాడీ షేప్స్‌ కోసం లైపోసెక్షన్, బేరియాట్రిక్‌ సర్జరీలకు పరిగెత్తే కెరీర్‌ ఓరియంటెడ్‌ విమెన్‌కి కూడా స్ఫూర్తే. 

∙ఇంటర్‌ ఫెయిలై ఉన్న అమ్మాయి బ్యూటీ కోర్స్‌ చేద్దామనే తాపత్రయాన్ని ఇంట్లోవాళ్లు చంపేస్తే.. తనలోని కాంపిటీటివ్‌ స్పిరిట్‌ను  చచ్చిపోనివ్వకుండా పదనుపెట్టుకునే ఓ అమ్మాయి కథ ‘తుమ్హారీ సులూ’. ఒక కొడుకు పుట్టాక కూడా ఆ స్పిరిట్‌ను అలా కంటిన్యూ చేస్తుంది. తను ఉంటున్న వీధిలోను, అబ్బాయి స్కూల్లో పేరెంట్స్‌కి కూడా పోటీగా నిలుస్తుంది విద్యాబాలన్‌. ప్రతి పోటీలోనూ దూసుకుపోయే ఓ మహిళా  ఒక ఎంట్రప్రెన్యూర్‌ కథకు అద్భుతంగా చూపించారు. నిన్న,మొన్నటి దాకా లావుగా ఉన్నామని, ఆత్మన్యూనతతో బాధపడేవారికి ఓ చక్కటి సందేశాన్నిచ్చిందీ చిత్రం. పైగా ఓ అంతర్జాతీయ సదస్సులో ఆ చిత్రానికి ప్రశంసలు దక్కడందో సిటీ మహిళల ఆలోచనలో సైతం మార్పు మాచ్చింది. జిమ్ములకు వెళ్లి సన్నబడే బదులు ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుని తామేంటో నిరూపించుకునే పనిలో పడ్డారు. లావుగా ఉన్నామన్న భావనను ఆత్మవిశ్వాసంతో అధిగమించవచ్చని.. చేస్తున్న పని చిన్నదైనా ఆత్మగౌరవంతో సాగితే ఆ ప్రభావం పెద్దగా ఉంటుందంటున్నారు సిటీకి చెందిన ప్రముఖ డిజైనర్‌ గంగు శ్రీవాణి. ఈమెతో ఏకీభవించే సిటీ వనితలు చాలామందే ఉన్నారు.  బొద్దుగా ఉండడం కూడా ఓ ట్రెండేనని చెబుతున్నారు.

సెంటర్‌ ఆఫ్‌ది అట్రాక్షన్‌  
గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌ హైదరాబాద్‌ మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమకు తాముగా ఎదుగాలనుకునే మహిళలకు ఓ దిక్సూచిగా నిలిచింది. లావు, సన్నం అనే తేడా లేకుండా ఆత్మవిశ్వాసమే తోడుగా ముందుకు కదలమంది. అయినా బొద్దుగా ఉండడం లేటెస్ట్‌ ట్రెండ్‌గా మారుతోంది. బొద్దుగా ఉన్నవాళ్లే ఏ పార్టీకి వెళ్లినా సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా మారుతారు.     – పద్మజ, ఎంటర్‌ప్రెన్యూర్‌ 
 
విద్యా.. కొత్త స్ఫూర్తినిచ్చారు..  
‘తుమ్హారీ సులూ’ సినిమాలో బొద్దుగా కనిపించిన విద్యాబాలన్‌ మాలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. లావు, ఫెయిల్, లోకం పోకడ తెలియకున్నా. ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించవచ్చన్న కథను ఎంతో చక్కగా చెప్పారు.  
– దేవిరెడ్డి శ్వేత 

బొద్దుగా ఉన్నా పర్వాలేదు.. 
ఎత్తుకి తగిన బరువు, అధిక బరువు, ఒబేసిటీ బరువుని ఇలా మూడు రకాలుగా విభజించవచ్చు. రకరకాల మార్పుల వల్ల బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా స్త్రీలు హార్మోనల్‌ మార్పులు, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల బరువు పెరుగుతుంటారు. డెలివరీ తర్వాత తల్లులు కొంత బరువు పెరుగుతారు. ఆ సమయంలో బరువు పెరగకుండా బలమైన ఆహారం ఏం తీసుకోవాలని అందరికీ తెలియదు. ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూవనంత వరకు అధిక బరువుతో ఏ ప్రమాదం లేదు. పని చేసుకోలేకపోవడం, చుట్టుపక్కల వారు, ఇంట్లోవారు మన శరీరం గురించి మాట్లాడుతున్నప్పుడు బరువు పట్ల ఆలోచించడం ప్రారంభిస్తారు. అలాగని లావుగా ఉన్న వారిలో తక్కువ ఆత్మవిశ్వాసం ఉంటుందని అనుకోవడానికి లేదు. కానీ ఒబేసిటీ ఉన్న స్త్రీలలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని  చెప్పగలను. అది వారి మానసిక, శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది.     
– డాక్టర్‌ సునితా గ్రేస్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement