Tumhari Sulu
-
జోరు.. హుషారు
సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు ఒప్పుకుంటూ జోరు మీద ఉన్నారు జ్యోతిక. ఒక సినిమా (‘కాట్రిన్ మొళి’) ఇవాళ రిలీజ్ అంటే.. రెండు రోజుల క్రితమే మరో సినిమాకు ముహూర్తం జరిపారు. ప్రస్తుతం సూర్య చేస్తున్న ‘ఎన్జీకే’ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ సంస్థే జ్యోతిక కొత్త చిత్రాన్ని నిర్మించనుంది. నూతన దర్శకుడు యస్. రాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ముహూర్తం ఇటీవలే జరిగింది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి స్టార్ట్ కానుందట. ఈ చిత్రం షూటింగ్ కోసం సుమారు 50 లక్షల వ్యయంతో ఓ స్కూల్ సెట్ రూపొందించారట. మరి ఈ సినిమాలో జ్యోతిక స్కూల్ టీచర్‌గా కనిపిస్తారా? లేక కీలక సన్నివేశాల కోసం ఆ స్కూల్ సెట్ ఉంటుందా? వేచి చూడాలి. లక్ష్మీతో పోటీ పడగలనా అనిపించింది జ్యోతిక ప్రధాన పాత్రలో రూపొందిన తమిళ చిత్రం ‘కాట్రిన్ మొళి’. విద్యా బాలన్ హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులూ’కి రీమేక్ ఇది. ఇందులో లక్ష్మీ మంచు జ్యోతిక బాస్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీతో కలసి నటించడం గురించి జ్యోతిక మాట్లాడుతూ – ‘‘మంచు లక్ష్మీతో పని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. లక్ష్మీ పవర్ఫుల్ లేడీ. తను నటించిన విధానం నాకు ముచ్చటేసింది. తను యాక్ట్ చేస్తున్నట్లే అనిపించదు. పాత్రలా ప్రవర్తిస్తుంది అంతే. కాన్ఫిడెంట్‌గా, తెలివిగా ఉండటం చూసి నేను తనతో పోటీపడగలనా? అనిపించింది. మేం ఇద్దరం అమ్మలం. సెట్లో మా పిల్లలు బాగా కలిసిపోయారు’’ అని పేర్కొన్నారు. -
ఇంటనే కాదు.. రచ్చ కూడా గెలిచిన మంచు లక్ష్మీ
టాలీవుడ్ డైనమిక్ లేడీగా పేరు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మీ. ప్రస్తుతం తమిళంలో ‘‘కాట్రిన్ మెళి’’ అనే సినిమా చేసింది. ‘‘తుమ్హారీ సులు’’ అనే బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ఇది. ప్రధాన పాత్రలో జ్యోతిక నటిస్తోంది. ఈ సినిమాలో మంచు లక్ష్మీది పూర్తిగా భిన్నమైన పాత్ర. మాటల్లో బోల్డ్ నెస్, క్యారెక్టర్ లో స్ట్రాంగ్ గా కనిపించే పాత్ర ఆమెది. నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఆమె జ్యోతిక మనసు దోచేసుకుంది. అందుకే ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ వ్యక్తిత్వాన్ని పొగుడుతూ జ్యోతిక చెప్పిన మాటలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మంచు లక్ష్మీ గురించి జ్యోతిక ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే చూద్దాం.. ‘మంచు లక్ష్మీతో వర్క్ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను. తను చాలా పవర్ ఫుల్ లేడి. తను నటించే విధానం చూసి నాకు చాలా ముచ్చటేసింది. నిజంగా తను యాక్ట్ చేస్తున్నట్టే కనిపించదు. జస్ట్ ఆ క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తుంది. నిజ జీవితంలో కూడా తను చాలా తెలివిగా, కాన్ఫిడెంట్ గా ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. తన నటన, ప్రవర్తన చూసినప్పుడు.. బాబోయ్.. నేను తనతో సరితూగగలనా అనిపించింది. మేం ఇద్దరం ఇప్పుడు అమ్మలం. సెట్స్ లో కూడా మా పిల్లలతో కలిసి బాగా కలిసిపోయింది’’. అంటూ జ్యోతిక చెప్పిన మాటలకు లక్ష్మీ కూడా ఆశ్చర్యపోయారు. ఇక హిందీలో మంచి విజయం సాధించడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ‘తుమ్హారీ సులు’.. విద్యాబాలన్ పోషించిన పాత్రను జ్యోతిక చేస్తోంది. రేడియో స్టేషన్ మేనేజర్‌గా అక్కడ నేహాధూపియా చేసిన పాత్రలో మంచు లక్ష్మీ కనిపించబోతోంది. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు అద్భుత స్పందన కూడా వస్తోంది. ఇక నవంబర్ 16న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకుడు. -
మరోసారి ట్రెండ్ అవుతోన్న ‘జిమ్మికి కమల్’
ఇటీవల సోషల్ మీడియాను ఊపేసిన ట్రెండ్ జిమ్మికి కమల్. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘వెలిపడింతే పుస్తకమ్’ సినిమాలోని ఈ పాటకు మలయాళీలతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా డ్యాన్స్ చేశారు. తాజాగా ఈ పాట ఓ తమిళ సినిమా కోసం రీమిక్స్ చేశారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘తుమ్హారీ సులు’ సినిమాను జ్యోతిక ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కాట్రిన్ మొళి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జిమ్మికి కమల్ పాటకు స్టెప్లు వేశారు జ్యోతిక. తాజాగా ఈ పాట వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో మరోసారి జిమ్మికి కమల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. జ్యోతిక తో పాటు మంచు లక్ష్మి, కుమరవేల్, సిద్ధు శ్యామ్, ఆర్జే శాండ్రా జిమ్మికి కమల్ పాటకు అదిరి పోయే స్టెప్స్ వేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న కాట్రిన్ మొళి సినిమా నవంబర్ 16న రిలీజ్ కానుంది. -
పట్టు పెట్టారు
పట్టు పట్టారు అని వింటుంటాం కానీ పట్టు పెట్టారు ఏంటీ అనుకుంటున్నారా? అవును.. జ్యోతిక పట్టు పెట్టారు. ఎవరికీ అంటే ‘కాట్రిన్ మొళి’ చిత్రబృందానికి. విద్యా బాలన్ బాలీవుడ్ చిత్రం ‘తుమ్హారీ సులూ’ తమిళ రీమేక్ ‘కాట్రిన్ మొళి’లో నటిస్తున్నారు జ్యోతిక. రాధామోహన్ దర్శకత్వంలో జి. ధనుంజయ్ నిర్మిస్తున్నారు. ఇందులో మంచు లక్ష్మీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. శింబు గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్‌ను జ్యోతిక ఇటీవలే కంప్లీట్ చేశారు. షూటింగ్ చివరి రోజున టీమ్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు జ్యోతిక. ఈ సినిమాకు పని చేసిన టీమ్ మెంబర్స్ అందరికీ పట్టు పంచె, పట్టు ధోతి, షర్ట్స్, పట్టు చీరలని పంచి పెట్టారు. సడెన్‌గా ఇలా గిఫ్ట్స్ ఇవ్వడంతో టీమ్ అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జ్యోతికను అభినందించకుండా ఉండలేకపోయారు. పవర్ఫుల్ ఝాన్సీ బాలా దర్శకత్వంలో జ్యోతిక ముఖ్య పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘నాచియార్’. ‘ఝాన్సీ’ టైటిల్‌తో తెలుగులోకి అనువాదం అయింది. కోనేరు కల్పన, డి. అభిరాం అజయ్ కుమార్ సంయుక్తంగా ఆగస్ట్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కోనేరు కల్పన మాట్లాడుతూ – ‘‘తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. బాలా దర్శకత్వం, జ్యోతిక నటన సినిమాకు హైలైట్స్. ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా స్వరకర్త. -
ఇస్తినమ్మ వాయనం...
‘తుమ్హారీ సులూ’ సినిమా తర్వాత ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో బసవతారకం రోల్ చేస్తున్నారు విద్యా బాలన్. ఆ మధ్య ఇందిరా గాంధీ బయోపిక్‌లోనూ యాక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ అప్డేట్ ఇంకా లేదు. ఆయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారమేంటంటే తమిళంలో జ్యోతిక కమ్‌బ్యాక్ చిత్రంగా చేసిన ‘36 వయదినిలే’ హిందీ రీమేక్‌లో నటించడానికి విద్యా ఆసక్తికరంగా ఉన్నారని టాక్. ‘36 వయదినిలే’ మలయాళ చిత్రం ‘హౌ ఓల్డ్ ఆర్ యు’కు రీమేక్. లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం, సబ్జెక్ట్ నచ్చడంతో ఈ సినిమాను ఓకే చేశారట విద్యా. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనంలా ఉంది విద్యా బాలన్, జ్యోతికల పరిస్థితి. ఒక పక్క విద్యా బాలన్ ‘తుమ్హారీ సులూ’ రీమేక్ లో జ్యోతిక యాక్ట్ చేస్తుంటే, విద్యా బాలన్ ఏమో జ్యోతిక సినిమా రీమేక్ చేయాలనుకోవడం విశేషం. -
అతిథిలా వచ్చాడు
రేడియో జాకీగా రేడియో స్టేషన్లో ఫుల్ బిజీగా యాంకరింగ్ చేస్తున్నారు జ్యోతిక. ఇంతలో అక్కడికి శింబు గెస్ట్‌గా వచ్చారు. వెంటనే వాతావరణం అంతా సందడి సందడిగా మారిపోయింది. ఇదంతా తమిళ చిత్రం ‘కాట్రిన్ మొళి’ కోసమే. జ్యోతిక ప్రధాన పాత్రలో హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులు’ రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నారు. దానికి సంబంధించిన సీన్స్‌ను రీసెంట్గా షూట్ చేశారు. ఈ చిత్రంలో జ్యోతిక బాస్ పాత్రలో మంచు లక్ష్మీ కనిపించనున్నారు. రాధామోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
స్టార్ట్ టు ఎండ్.. నాన్‌స్టాప్
సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచారు హీరోయిన్ జ్యోతిక. మణిరత్నం రూపొందిస్తున్న ‘చెక్క చివంద వానమ్’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. అలాగే విద్యా బాలన్ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘తుమ్హారీ సులూ’ రీమేక్‌లో కూడా కనిపించనున్నారు జ్యోతిక. ‘కాట్రిన్ మొళి’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. విశేషం ఏంటంటే.. స్టార్టింగ్ నుంచి సినిమా ఎండ్ వరకూ ఒక్కటే షెడ్యూల్లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమాలో రేడియో జాకీ పాత్రలో జ్యోతిక కనిపించనున్నారు. అక్టోబర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాను ధనుంజయన్, లలిత, విక్రమ్ కుమార్ నిర్మించనున్నారు. -
అప్పుడు మొళి... ఇప్పుడు కాట్రిన్ మొళి
హిందీ హిట్ మూవీ ‘తుమ్హారీ సులూ’ తమిళ రీమేక్‌లో జ్యోతిక నటించనున్న విషయం తెలిసిందే. రాధామోహన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు ‘కాట్రిన్ మొళి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పదేళ్ల క్రితం రాధామోహన్ డైరెక్షన్లో వచ్చిన ‘మొళి’ సినిమాలో ‘కాట్రిన్ మొళి’ అనే సాంగ్ నుంచి ఈ టైటిల్ తీసుకోవడం విశేషం. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సొంతంగా సంపాదించాలనుకునే పాత్రలో జ్యోతిక కనిపించనున్నారు. ఆమె భర్తగా విద్దార్థ్, బాస్ పాత్రలో మంచు లక్ష్మీ నటించనున్నారు. ‘మా చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’ అన్నాయి చిత్రవర్గాలు. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. -
స్టైలిష్ బాస్
ఏదైనా కంపెనీకు బాస్ అంటే ఎలా ఉండాలి? హైఫై లుక్స్, ట్రెండీ డ్రెస్‌లు వాటన్నింటికంటే ముఖ్యమైనది ఆ కంపెనీకి ప్లస్ అయ్యే వాటిని వెంటనే గుర్తించగలగటం. ప్రస్తుతం ఇలాంటి క్యారెక్టరైజేషన్‌తో కూడిన స్టైలిష్ బాస్ పాత్రనే పోషించనున్నారు లక్ష్మీ మంచు. హిందీలో హిట్ సాధించిన ‘తుమ్హారీ సులు’ తమిళంలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. విద్యా బాలన్ పాత్రను జ్యోతిక పోషించనున్నారు. కె.రాధా మెహన్ దర్శకత్వం వహిస్తున్నారు. తుమ్హారీ సులు సినిమాలో విద్యా బాలన్ బాస్‌గా నేహా ధూపియ పోషించిన పాత్రను తమిళ రీమేక్‌లో మంచు లక్ష్మీ పోషిస్తున్నారు. తన క్యారెక్టర్ గురించి లక్ష్మీ మాట్లాడుతూ–‘‘ఇటీవల అన్నీ డీ–గ్లామర్ రోల్స్ చేశాను. రేడియే చానల్ హెడ్ రోల్లో చాలా గ్లామరస్‌గా కనిపించనున్నాను. ఈ స్టైలిష్ బాస్ క్యారెక్టర్ చేస్తున్నందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. సూర్య జ్యోతిక ఈ రోల్‌కు నేను బాగా సూట్ అవుతానని ఫీలయ్యారని డైరెక్టర్ చెప్పారు’’ అని పేర్కొన్నారు. -
తుమ్హారీ జో...
‘పెళ్లయిన తర్వాత మహిళలు కేవలం గృహిణిగా ఇంటికి అంకితం అయిపోవటం కాదు, వాళ్లకూ ఉద్యోగం చేయాలనే ఆశలుంటాయి. వారి కాళ్ల మీద వారు నిలబడాలనే కోరికలుంటాయి. అవి కలలు లాగే మిగిలిపోవద్దు’ అనే కథాంశంతో విద్యాబాలన్ ముఖ్య పాత్రలో వచ్చిన హిందీ చిత్రం ‘తుమ్హారీ సులు’. రేడియో జాకీ కావాలనే సులోచన పాత్రలో విద్యాబాలన్ కనిపించారు. ఇప్పుడు ఇదే సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు దర్శకుడు రాధామోహన్. ఈ తమిళ రీమేక్‌లో సులోచన పాత్రలో జ్యోతికను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యారెక్టర్స్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు జ్యోతిక. సెకెండ్ ఇన్నింగ్స్‌ను కూడా రీమేక్ (మలయాళ మూవీ ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ రీమేక్ ‘36 వయదినిలే’) తో స్టార్ట్ చేసిన జ్యోతిక ఈ రీమేక్‌లోనూ కూడా నటించనున్నారని సమాచారం. 2007లో రాధామోహన్ దర్శకత్వం వహించిన ‘మొళి’లో జ్యోతిక నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇప్పుడు ‘తుమ్హారీ సులు’ కుదిరే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇదిలా ఉంటే.. లకలక అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో భయపెట్టిన జ్యోతిక పాత్రను హిందీ రీమేక్ ‘భూల్ భులేయా’లో విద్యాబాలన్ పోషించారు. ఇప్పుడు విద్యాబాలన్ సూపర్ హిట్ ‘తుమ్హారీ సులు’ సినిమాను తమిళంలో జ్యోతిక పోషిస్తుండటం విశేషం. -
బాలీవుడ్ రౌండప్ 2017
2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కథ బాగా ఉన్న దాదాపు పదిహేను చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. కమర్షియల్ సినిమాలు మూడు నాలుగే ఈ సంవత్సరం తల ఎత్తుకొని తిరిగాయి. యాభై ఏళ్లు పైబడిన ఒక వితంతువు తన కంటే వయసులో చిన్నవాడైన ఒక అబ్బాయితో ఫోన్లో చాటింగ్ చేస్తూ సంతృప్తి పడుతుంటుంది– ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునేంతలో ఆ అబ్బాయి తనకు అంగ స్తంభన సమస్య ఉన్నట్టుగా తెలుసుకుని ఆ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు ‘శుభ మంగల్ సావధాన్’ సినిమాలో. చదువు పెద్దగా లేని ఒక గృహిణి గౌరవప్రదమైన ఉద్యోగం చేసి తానేమిటో నిరూపించుకోవాలనుకుంటుంది ‘తుమ్హారి సులూ’లో విద్యాబాలన్ రూపంలో. భర్తను కోల్పోయిన ఒక యువ వయస్కురాలు ఒంటరితనం భరించలేక డేటింగ్ సైట్లో ఒక పురుషుని తోడు వెతుక్కుంటుంది ‘కరీబ్ కరీబ్ సింగిల్’ ప్రయాణంలో. దేశంలో ఎంత భ్రష్టత్వం ఉన్నా ఆ భ్రష్టత్వంతో తాను భాగం కాకుండా తన డ్యూటీ తాను కచ్చితంగా చేసుకోవడంలో ఎంతో సంతృప్తి పడతాడు ఒక కథానాయకుడు ‘న్యూటన్’లో. కాశీలో కొన ఊపిరి వదలాలని ఉందని ఒక ముసలి తండ్రి తన కుమారుణ్ణి కోరితే ఆయనతో కలిసి కాశీకి వెళ్లి తనను తాను ఏం తెలసుకున్నాడో ఆ కొడుకు అని చెప్పే కథ ‘ముక్తి భవన్’. పర్యావరణ విధ్వంసం చేసి ప్రకృతిని అంధురాలిగా చేస్తున్న మనిషి అత్యాసను ఒక అంధుడు ఎత్తి చూపే కథ ‘కడ్వీ హవా’. ముప్పై అంతస్తుల భవనంలో ఒక కుర్రవాడు తన ఫ్లాట్‌లో బందీ అయ్యి రోజుల తరబడి తిండీ తిప్పలు లేకుండా మనుగడ కోసం ఎలాంటి పోరాటం చేశాడో చెప్పే కథ ‘ట్రాప్డ్’. బిహార్‌లో బూతు పాటలు పాడుతూ వేదికల మీద అశ్లీల నృత్యాలు చేసే ఒక కళాకారిణి జీవన వేదన ‘అనార్కలీ ఆఫ్ ఆరా’ సినిమా. బాలీవుడ్ మారిపోయింది. బాలీవుడ్ చాలా మారిపోయింది అనడానికి 2017 ఒక ఉదాహరణ. పెద్ద పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్, మసాలా పాటలు, విదేశాల లొకేషన్స్... ఇవన్నీ ఒకవైపు ఉన్నా కంటెంట్‌ను నమ్ముకుని ఈ సంవత్సరం అక్కడి దర్శక నిర్మాతలు చిన్న సినిమాలు తీశారు. వాటిని విజయవంతం చేసి ప్రేక్షకులు తమకు టేస్ట్ ఉందని నిరూపించుకున్నారు. నిజంగా 2017 సంవత్సరం బాలీవుడ్ భిన్నత్వాన్ని ఉలిక్కిపడేలా నిరూపించిన సంవత్సరం. కొత్త కథలు, గుర్తుండిపోయేలా చేసే పాత్ర పోషణలు. ఆలోచన రేకెత్తించే క్లయిమాక్స్‌లు ఇవన్నీ ఈ సంవత్సరంలోని సినిమాలు చూపించాయి. పెద్ద సినిమాల పై పైచేయి సాధించిన చిన్న సినిమాలు ఇవి. 2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత సంవత్సరాలతో పోల్చితే జయపజయాలు ఎలా ఉన్నా మొత్తం ఆదాయాన్ని చూస్తే 5 నుంచి 10 శాతం తగ్గినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఈ తగ్గుదల 2 నుంచి 3 శాతమే ఉంటుంది. ఈ సంవత్సరం ముగ్గురు ఖాన్లు మరీ గొప్పగా మెరిసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. షారుక్ ఖాన్ ‘రయీస్’ పెద్ద కలెక్షన్లు రాబట్టింది కానీ సినిమాగా పెద్దగా ఎవరూ చెప్పుకోలేదు. షారూఖ్ నటించిన మరో సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సీజెల్’ విదేశాల్లో కలెక్షన్లు సాధించినా భారతదేశంలో ప్రేక్షకులను పారిపోయేలా చేసింది. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. అతని మరో భారీ సినిమా ‘టైగర్ జిందాహై’ సంవత్సరాంతానికి విడుదలయ్యి తన భవిష్యత్తును తేల్చుకోవాల్సి ఉంది. ‘దంగల్’ హిట్‌తో రిలాక్స్ అయిన ఆమిర్ ఖాన్ ఈ సంవత్సరం ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో ఒక చిన్నపాత్రతో సరిపెట్టుకున్నాడు. మరి హిట్స్ ఎవరు తమ బ్యాగ్‌లో వేసుకున్నట్టు? దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ రెండు మంచి హిట్స్ కొట్టాడు. ఒకటి ‘బదరీనాథ్ కి దుల్హనియా’. రెండు ‘జుడ్వా 2’. ఈ ‘జుడ్వా’ సిరీస్‌కు మూలం మన ‘హలో బ్రదర్’ సినిమా అన్నది విదితమే. అక్షయ్ కుమార్ కూడా రెండు హిట్లు కొట్టాడు. ఒకటి ‘జాలీ ఎల్ఎల్బి 2’, రెండు ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’. దేశంలో స్వచ్ఛభారత్ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక భర్త తన కొత్త పెళ్లికూతురికి ఇంట్లో టాయిలెట్ కట్టి ఇవ్వడానికి ఊరితో, వ్యవస్థతో ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందో చెప్పే ఈ కథను ప్రేక్షకులు ముక్కు మూసుకోకుండా యాక్సెప్ట్ చేసి కలెక్షన్ల చప్పట్లు కొట్టారు. చాలా రోజులుగా టైమ్ బాగాలేని హృతిక్ రోషన్‌కి ఈ సంవత్సరం ‘కాబిల్’ సినిమా వచ్చి ప్రాణం లేచి వచ్చింది. అంధుడుగా నటించిన హృతిక్ తన భార్యను చంపిన విలన్స్‌పై తెలివిగా ఎలా పగ తీర్చుకున్నాడో ఈ సినిమా ఆసక్తికరంగా చెప్పడమే కారణం. ఇక ఊహించని హిట్ అంటే ‘గోల్మాల్ అగైన్’ అనే చెప్పుకోవాలి. షారుక్‌తో ‘దిల్వాలే’ తీసి కొంచెం వెనుకంజ వేసిన రోహిత్ షెట్టి తన పాత టీమ్‌తో పాత ఫార్ములాతో ‘గోల్మాల్ ఎగైన్’ తీసి ఏకంగా 300 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. తెలుగులో దుమ్ము రేపుతున్న హారర్ ఫార్ములాను మొదటిసారి అతడు ఈ సిరీస్‌లో ఉపయోగించి సక్సెస్ కొట్టాడు. ఈ హిట్ అజేయ్ దేవగన్ అకౌంట్లో పడింది. ప్యారలల్ హీరోలుగా పెద్ద హీరోలతో సమానంగా సినిమాలు ఇస్తున్న నవాజుద్దీన్ సిద్దిఖీ, ఇర్ఫాన్ ఖాన్ సోలో హీరోలుగా చెరి రెండు సినిమాలు చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ‘హరామ్ ఖోర్’, ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్’ చేస్తే రెండూ యావరేజ్‌గా నడిచాయి. కానీ ఇర్ఫాన్ ఖాన్ చేసిన రెండు సినిమాలు ‘హిందీ మీడియమ్’, ‘కరీబ్ కరీబ్ సింగిల్’ మంచి కలెక్షన్లు తెచ్చి హిట్స్‌గా నిలిచాయి. అయితే ఇర్ఫాన్ కంటే నవాజుద్దీన్ ఎక్కువ రోల్స్ చేస్తున్నాడని చెప్పాలి. 2017లో స్త్రీ ప్రధాన సినిమాలు కూడా చాలా వచ్చాయి. వీటిలో తాప్సీ ‘నామ్ షబానా’, విద్యా బాలన్ ‘బేగం జాన్’, ‘తుమ్హారీ సులూ’, శ్రీదేవి ‘మామ్’, శ్రద్ధా కపూర్ ‘హసీనా పార్కర్’, కంగనా రనౌత్ ‘సిమ్రన్’లు ఉన్నాయి. వీటిలో ‘మామ్’, ‘తుమ్హారీ సులూ’ మంచి కలెక్షన్లు సంపాదించాయి. హిమాలయాలను చిన్న వయసులో అధిరోహించిన మన తెలుగమ్మాయి పూర్ణ జీవితం ఆధారంగా ‘పూర్ణ’ రాహుల్ బోస్ దర్శకత్వంలో వచ్చింది. అంచనాలు పెంచి నిరాశ పరిచిన సినిమాలు కూడా 2017లో ఉన్నాయి. విశాల్ భరద్వాజ్ ‘రంగూన్’, రామ్ గోపాల్ వర్మ ‘సర్కార్ 3’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా చేసిన ‘రాబ్తా’, రణ్‌బీర్ కపూర్ ‘జగ్గా జాసూస్’ ముఖ్యమైనవి. సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ను కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఇక కాంట్రవర్సీస్ విషయానికి వస్తే ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ తమ ఆంతరంగిక వ్యవహారం వల్ల కోర్టు కేసుల దాకా వెళ్లారు. సోను నిగమ్ అజాన్ విషయంలో కామెంట్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ‘ఇందు సర్కార్’ విడుదల ఏకంగా సెన్సార్ బోర్డ్ చైర్మన్ పెహ్లాజ్ నిహలానీ సీటుకే ఎసరు తెచ్చింది. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ రోజుల మీద వచ్చిన ఆ సినిమాను యధాతథంగా విడుదల చేయాలని బిజెపి ప్రభుత్వం భావిస్తే దానికి కట్స్ ఇవ్వడం వల్ల పెహ్లాజ్ ప్రభు ద్రోహిగా మారి పదవి పోగొట్టుకున్నాడని కథనం. ఏమైనా బాలీవుడ్లో ‘బాహుబలి 2’ కలెక్షన్లకు మించి వేరే పెద్ద సినిమాల న్యూస్ లేదు. ఉన్న న్యూస్ అంతా కంటెంట్ ఆధారంగా వచ్చిన చిన్న సినిమాలదే. రాబోయే సంవత్సరం పెద్ద సినిమాలు, భిన్నమైన చిన్న సినిమాలు హిందీలో మనల్ని అలరిస్తాయని భావిద్దాం. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. స్ట్రయిట్ సినిమాలతో సమానంగా ‘బాహుబలి 2’ హిందీ డబ్బింగ్ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ఈ సంవత్సరం చూసిన మరో విశేషం. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. -
బొద్దుగా ఉన్నా పర్వాలేదు!
గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్.. వందకు పైగా దేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు.. అగ్రదేశం అమెరికా అ«ధ్యక్షుడి సలహాదారు, ఆయన కూతురు, ఓ ఎంటర్ప్రెన్యూరైన ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా నగరంలో మూడురోజుల వేడుక సాగింది. వ్యాపార, వాణిజ్య రంగాల్లోకి మహిళలు రావాలి.. ఆదాయోత్పత్తుల్లో వారి వాటా పెరగాలని ఇవాంకాతో సహా సదస్సుకు హాజరైనవారంతా నొక్కి చెప్పారు. అందుకే ‘విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్’ (మహిళకు మొదటిస్థానం.. శ్రేయస్సు అందరికీ) అని నినదించారు. ‘తుమ్హారీ సులూ’.. విద్యాబాలన్ ప్రధాన పాత్రగా తీసిన బాలీవుడ్ చిత్రం. కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి, వంద దేశాల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలను పిలిచి.. మూడు రోజుల జీఈఎస్ సదస్సులో రోజుకు 53 సెషన్లలో తమ ఆలోచనలను మథించి, తీర్మానాలను రచించి రూపొందించిన నివేదికను రెండున్నర గంటల్లో చూపించిన సినిమా. ఇప్పుడు ఈ రెండూ హైదరాబాద్ వనితల్లో కొత్త స్ఫూర్తిని నింపాయి. సాక్షి, సిటీబ్యూరో: లావును జీరో సైజ్ కన్నా గొప్పగా.. దాన్నో ప్రైడ్‌గా భావించొచ్చు. ఇంటర్ ఫెయిలైయినా.. ఇష్టమైన ఉద్యోగం చేయొచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ లేకున్నా వ్యాపారంలో విజయం సాధించొచ్చు. లోకం పోకడ తెలియని గృహిణి.. ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటన్నింటికీ ‘ఆత్మవిశ్వాసం’ అనే అర్హత ఉంటే చాలు. జీఈఎస్ లాంటి వేదికలపై బిజినెస్ పాఠాలు చెప్పొచ్చని, ఇవాంకకు లేని గౌరవాన్ని సాధారణ గృహిణి సైతం సొంతం చేసుకోవచ్చ’ని డిజిటల్లో డిస్ప్లే చేసి మరీ చెప్పిన సినిమా తుమ్హారీ సులూ. ఆత్వ విశ్వాసమే అలైన అందం పెళ్లయి, బిడ్డ పుట్టి బాధ్యతలతో ఒంటి మీద శ్రద్ధ తగ్గో.. ఇతర కారణాల వల్లో లావైపోతే ఆత్మన్యూనతతో కుంగిపోవాల్సిన పనిలేదంటున్నారు సిటీలో వివిధ రంగాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న మహిళలు. ‘తుమ్హారీ సులూ’లోని విద్యాబాలన్‌లా లావుతోనూ (ఒబేసిటీ దుష్పరిణామాలు చూపించనంత వరకు) సగర్వంగా నడవచ్చు.. ఆరోగ్యంగా మెరవచ్చు. ఇది హౌజ్వైవ్స్కే కాదు.. జీరో సైజ్ కోసం పొట్ట మాడ్చుకునే అమ్మాయిలకూ ప్రేరణే. లావు వల్ల ఏ అనారోగ్యం రాకపోయినా.. పర్ఫెక్ట్ బాడీ షేప్స్ కోసం లైపోసెక్షన్, బేరియాట్రిక్ సర్జరీలకు పరిగెత్తే కెరీర్ ఓరియంటెడ్ విమెన్‌కి కూడా స్ఫూర్తే. ∙ఇంటర్ ఫెయిలై ఉన్న అమ్మాయి బ్యూటీ కోర్స్ చేద్దామనే తాపత్రయాన్ని ఇంట్లోవాళ్లు చంపేస్తే.. తనలోని కాంపిటీటివ్ స్పిరిట్‌ను చచ్చిపోనివ్వకుండా పదనుపెట్టుకునే ఓ అమ్మాయి కథ ‘తుమ్హారీ సులూ’. ఒక కొడుకు పుట్టాక కూడా ఆ స్పిరిట్‌ను అలా కంటిన్యూ చేస్తుంది. తను ఉంటున్న వీధిలోను, అబ్బాయి స్కూల్లో పేరెంట్స్‌కి కూడా పోటీగా నిలుస్తుంది విద్యాబాలన్. ప్రతి పోటీలోనూ దూసుకుపోయే ఓ మహిళా ఒక ఎంట్రప్రెన్యూర్ కథకు అద్భుతంగా చూపించారు. నిన్న,మొన్నటి దాకా లావుగా ఉన్నామని, ఆత్మన్యూనతతో బాధపడేవారికి ఓ చక్కటి సందేశాన్నిచ్చిందీ చిత్రం. పైగా ఓ అంతర్జాతీయ సదస్సులో ఆ చిత్రానికి ప్రశంసలు దక్కడందో సిటీ మహిళల ఆలోచనలో సైతం మార్పు మాచ్చింది. జిమ్ములకు వెళ్లి సన్నబడే బదులు ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుని తామేంటో నిరూపించుకునే పనిలో పడ్డారు. లావుగా ఉన్నామన్న భావనను ఆత్మవిశ్వాసంతో అధిగమించవచ్చని.. చేస్తున్న పని చిన్నదైనా ఆత్మగౌరవంతో సాగితే ఆ ప్రభావం పెద్దగా ఉంటుందంటున్నారు సిటీకి చెందిన ప్రముఖ డిజైనర్ గంగు శ్రీవాణి. ఈమెతో ఏకీభవించే సిటీ వనితలు చాలామందే ఉన్నారు. బొద్దుగా ఉండడం కూడా ఓ ట్రెండేనని చెబుతున్నారు. సెంటర్ ఆఫ్‌ది అట్రాక్షన్ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ హైదరాబాద్ మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమకు తాముగా ఎదుగాలనుకునే మహిళలకు ఓ దిక్సూచిగా నిలిచింది. లావు, సన్నం అనే తేడా లేకుండా ఆత్మవిశ్వాసమే తోడుగా ముందుకు కదలమంది. అయినా బొద్దుగా ఉండడం లేటెస్ట్ ట్రెండ్‌గా మారుతోంది. బొద్దుగా ఉన్నవాళ్లే ఏ పార్టీకి వెళ్లినా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారుతారు. – పద్మజ, ఎంటర్ప్రెన్యూర్ విద్యా.. కొత్త స్ఫూర్తినిచ్చారు.. ‘తుమ్హారీ సులూ’ సినిమాలో బొద్దుగా కనిపించిన విద్యాబాలన్ మాలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. లావు, ఫెయిల్, లోకం పోకడ తెలియకున్నా. ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించవచ్చన్న కథను ఎంతో చక్కగా చెప్పారు. – దేవిరెడ్డి శ్వేత బొద్దుగా ఉన్నా పర్వాలేదు.. ఎత్తుకి తగిన బరువు, అధిక బరువు, ఒబేసిటీ బరువుని ఇలా మూడు రకాలుగా విభజించవచ్చు. రకరకాల మార్పుల వల్ల బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా స్త్రీలు హార్మోనల్ మార్పులు, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల బరువు పెరుగుతుంటారు. డెలివరీ తర్వాత తల్లులు కొంత బరువు పెరుగుతారు. ఆ సమయంలో బరువు పెరగకుండా బలమైన ఆహారం ఏం తీసుకోవాలని అందరికీ తెలియదు. ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూవనంత వరకు అధిక బరువుతో ఏ ప్రమాదం లేదు. పని చేసుకోలేకపోవడం, చుట్టుపక్కల వారు, ఇంట్లోవారు మన శరీరం గురించి మాట్లాడుతున్నప్పుడు బరువు పట్ల ఆలోచించడం ప్రారంభిస్తారు. అలాగని లావుగా ఉన్న వారిలో తక్కువ ఆత్మవిశ్వాసం ఉంటుందని అనుకోవడానికి లేదు. కానీ ఒబేసిటీ ఉన్న స్త్రీలలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పగలను. అది వారి మానసిక, శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. – డాక్టర్ సునితా గ్రేస్ -
మేకింగ్ ఆఫ్ మూవీ - తుమ్హరీ సులు
-
మీ సులోచన
రోజూ చేసే పని నుంచి జీవితానికి ఒక కొత్త అర్థం వెతుక్కొనే హౌస్ వైఫ్... అదేనండీ... గృహిణి ఎక్కడ ఉండదు? సులోచన జీవితం కూడా అలాంటిదే. ఒక మిడిల్ క్లాస్ గృహిణి. పొద్దున్న లేస్తే ఇంటి పని వంట పని. భర్త అశోక్ తన కష్టాలు చెబితే అవి కూడా కష్టాలేనా అన్నట్లుగా సర్ది చెప్పే భార్య. ఒక చిన్న హోల్‌సేల్ బట్టలు కుట్టే ఫ్యాక్టరీలో పని చేస్తాడు భర్త. ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్నా... అక్కడికొచ్చిన కొత్తతరం వారసుడు భర్తను టార్చర్ చేస్తూ ఉంటాడు. ఉద్యోగం కూడా ఉండదేమో అన్నంత దిగులుతో ఉంటాడు ఆ భర్త. ఇంకో పక్క స్కూల్లో చదువుకుంటున్న పదకొండేళ్ల కొడుకు పియర్ ప్రెషర్ వల్ల బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పడతాడు. సులుకి ఉన్న ఇద్దరు అక్కయ్యలూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. దీని వల్ల వాళ్లకు సులు అంటే చిన్న చూపు. ఎప్పుడూ ‘ఏదో ఒకటి చెయ్యచ్చు కదా’ అని దెప్పి పొడుస్తూ ఉంటారు. సులుకి రేడియో వినడమంటే ఇష్టం. అందులో వచ్చే కాంపిటీషన్లలో ప్రెషర్ కుక్కర్ లాంటివి తరచూ గెలుస్తూ ఉంటుంది. అదే పరంపరలో మరో సారి ఒక రేడియో స్టేషన్లో ఇంకో ప్రెషర్ కుక్కర్‌ను గెలుచుకుంటుంది. ‘ఆల్రెడీ ఒకటి గెలిచాను, ఇంకేదైనా ఇప్పించండి’ అని అడుగుతుంది సులు. ‘కుదరదు’ అంటారు అక్కడి సిబ్బంది. అదే సంస్థలో రేడియో జాకీ కోసం ఒక కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. దానిలో పాల్గొని సులు రేడియో జాకీ అవుతుంది. ఇదే సులుకు మొదటి ఉద్యోగం. అంటే ఇంటి పని వంటి పని కాకుండా జీతం వచ్చే ఉద్యోగం. సులుకు గుర్తింపు తెచ్చే ఉద్యోగం. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న అక్కయ్యలకు చూపించుకునే ఉద్యోగం. అంతా బాగానే ఉంది కానీ ఒక పెద్ద తిరకాసు. నైట్ టైమ్ టాక్ షోకి రేడియో జాకీ ఉద్యోగం. ఎలాగయితేనేమి భర్తను కన్విన్స్ చేసి ఉద్యోగానికి వెళ్తుంది సులు. అంత రాత్రి వేళ ఫోనులో ముచ్చట్లు పెట్టుకునే వాళ్లెవరు? లోన్లీగా ఉండే మగ పురుగులు... మాట్లాడుతుంది సులు. అది చాలా ప్రేమగా మాట్లాడే సులు ‘తుంహారీ సులు’ అంటే ‘మీ సులు’ అని అర్థం. అంతే నైట్ కాలర్స్ రెచ్చి పోయి మాట్లాడుతారు. దానికి సులు చాలా తెలివిగా సమాధానాలు ఇస్తుంది. షో పెద్ద హిట్. ఆ రేడియో స్టేషన్‌కి ఎప్పుడూ రానంత హిట్. సులుకి ఉద్యోగం చాలా నచ్చింది. తనకు ఒక ఉనికి ప్రసాదించిన ఉద్యోగం మరి నచ్చదా? కానీ అక్కయ్యలకు, భర్తకు నచ్చదు. ఉద్యోగం మానెయ్యమని ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. కానీ సులు మానుకోదు. ఒక మహిళ అస్తిత్వాన్ని ప్రశ్నించే సమాజానికి అద్దం పట్టాడు డైరెక్టర్ సురేశ్ త్రివేణి. కథ చెప్పడంలో కామెడీని ఆధారంగా తీసుకున్నాడు. ‘ఒక పెళ్లి అయిన మహిళ అర్ధరాత్రి పరాయి మగాళ్లతో మాట్లాడడం... అన్నది, అదీ తాను మాట్లాడుతుంది అందరూ వింటారని... భర్త కొడుకు కూడా వింటారు’ అనే నేపథ్యంలో మహిళ అస్తిత్వాన్ని నిలబెడతాడు డైరెక్టర్. నిజానికి మహిళలు నేడు తమ జీవితాల్లో నిలబడి ఉన్న కూడలికి సులు పరిస్థితికి ఎక్కువ తేడా లేదు. ఎంచుకున్న నేపథ్యం విపరీతమైనది అయినా, అది కథ చెప్పడానికి పనికి వచ్చింది. ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేయడానికి వర్కవుట్ అయ్యింది. అంతకంటే గొప్ప విషయం ఈ సినిమా ద్వారా చెప్పింది మహిళలకు ఉన్న పరిధులు. ఇదంతా జరుగుతున్నప్పుడు సులు కొడుకు స్కూల్లో ఒక అశ్లీల వీడియో విషయంలో పట్టుపడతాడు. ఆ తరువాత ఒక రోజు ఇల్లు వదిలి పారిపోతాడు. దీంతో పిల్లవాడు చేసిన తప్పుకు... సులు పెంపకానికి లింకులేస్తుంది సమాజం. ఒక పక్క బిడ్డ కనబడడం లేదన్న బాధ, మరో పక్క ఉనికిని వదులుకోవాలా... అన్న సంఘర్షణ మధ్య నుంచి సులు ఎలా గెలుస్తుంది అన్నదే సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘మై కర్సక్తీ హై ’’ అన్నదే ఈ సినిమా థీమ్. అంటే ‘‘నేను చేయగలను’’ అని! సమాజానికి తెలియాల్సిన ఒక విలువైన విషయాన్ని ఏడుస్తూ... ఏడిపిస్తూ... చెప్పనక్కరలేదని, ఎక్కువ మందికి విషయం చేరాలంటే ఆర్ద్రత కలబోసినప్పటికీ హ్యూమర్ అవసరమని... అలా అని సెన్సిటివిటీని పోగొట్టకుండా అందంగా చెప్పవచ్చని డైరెక్టర్ నిరూపించాడు. మకిలి... అర్ధరాత్రి ఫోన్ చేస్తున్న మనుషుల్లో కన్నా మన చుట్టూనే ఎక్కువగా ఉంది అనిపించింది. ‘సులు’గా విద్యాబాలన్ అద్భుతంగా నటించారు. సినిమా కోసం కొంచెం లావయ్యారామె. నడకలో ఒక రకమైన స్వింగ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. నా బరువు నా ఇష్టం అనిపించేలా ఉంది ఆ నడక. ప్రతి చోటా క్యారెక్టర్ పడకుండా చూసుకున్నారు. భర్త అశోక్ పాత్రలో మానవ్కౌల్ ఇమిడిపోయారు. చూడదగ్గ సినిమా. ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది. -
తగ్గాల్సింది నేను కాదు... మారాల్సింది మీరే!
కొంచెం బొద్దుగా ఉండే కథానాయికలను ‘ఎప్పుడు సన్నబడతారు?’ అనడుగుతారు. ‘జీరో సైజ్’ హీరోయిన్లను ‘కొంచెం బరువు పెరిగితే బాగుంటుంది’ అంటారు. ఎలా ఉన్నా ఏదొకటి అంటారు. కొందరు హీరోయిన్లు ఇలాంటి కామెంట్స్‌ని లైట్ తీసుకుంటారు. నిన్న మొన్నటివరకూ విద్యాబాలన్ అలానే తీసుకున్నారు. కానీ, ఇక ఇలాంటి ప్రశ్నలడిగితే క్షమించేది లేదన్నట్లు ఘాటుగా స్పందించారు. సురేశ్ త్రివేణి దర్శకత్వంలో ఆమె నటించిన ‘తుమ్హారీ సులు’ నేడు విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న విద్యాబాలన్‌ని.. ‘ప్రస్తుతం మీరు లావుగా ఉన్నారు. ఎప్పుడు సన్నబడి గ్లామర్ రోల్స్ చేస్తారు?’ అని ఓ విలేకరి అడిగారు. ‘‘ఏం మాట్లాడుతున్నారు? గ్లామర్‌గా కనిపించాలంటే సన్నబడాలా? సన్నగా ఉంటేనే అవకాశాలొస్తాయా? అయినా, నేను ప్రస్తుతం బరువు తగ్గాల్సిన అవసరం లేదు. నాకు వస్తున్న పాత్రలకు నాజూకుగా ఉండాలని రూలేం లేదు. ఈ విషయంలో ముందు మీ మైండ్ సెట్ మారాలి. తగ్గాల్సింది నేను కాదు’’ అని ఘాటుగా స్పందించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడేం అడిగామని.. సన్నబడతారా? అన్నాం.. అంతేగా? అని సదరు విలేకరి సన్నిహితులతో వాపోయారట. -
సిగ్గుపడితే అంతే సంగతులు
... అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్. ముఖ్యంగా సినిమా తారలకు సిగ్గు ఉండకూడదని పేర్కొన్నారామె. అందుకే.. బిడియస్తులు ఇండస్ట్రీకి రాకూడదని, వస్తే అంతే సంగతులని విద్యా సెలవిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘ఒక్కసారి ముఖానికి మేకప్ వేసుకుంటే.. ఆ క్యారెక్టర్ తప్ప పర్సనల్ ఫీలింగ్స్‌ని పక్కన పెట్టేయాలి. రొమాంటిక్ సీన్ చేయాలంటే చేయాల్సిందే. నలుగురూ ఉన్నారు కదా అనుకుంటే ఫెయిలవుతాం. సెంటిమెంట్ సీన్లో ఏడవమంటే ఏడవాల్సిందే. సీన్ డిమాండ్ చేస్తే.. డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పాల్సిందే. ‘అయ్య బాబోయ్ నాకు సిగ్గండీ’ అంటే సినిమాకి న్యాయం జరగదు. సిగ్గు, మొహమాటం, భయం.. ఈ రంగంలో పనికిరావు. బిందాస్‌గా ఉండటం నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కాన్ఫిడెన్స్ గురించి చెప్పాలంటే.. ఒక్క సినిమా ఫీల్డ్‌లో మాత్రమే కాదు.. ఏ జాబ్ చేసినా అలానే ఉండాలి. అప్పుడే సక్సెస్ కాగలుగుతాం’’ అన్నారు విద్యాబాలన్. సురేశ్ త్రివేణి దర్శకత్వంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘తుమ్హారీ సులు’ ఈ నెల 17న విడుదల కానుంది. ఇందులో విద్యా పాత్ర పేరు సులు. రేడియో జాకీ క్యారెక్టర్ చేశారు. హౌస్‌వైఫ్‌గా ఉండే సులు అనుకోకుండా ఆర్జే జాబ్ ఒప్పుకుంటుంది. ఇది నైట్ డ్యూటీ. జాబ్‌లో చేరాక ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథతో సినిమా నడుస్తుంది. -
దీపికాతో గొడవ ఎందుకని!?
సులోచన మరో వారం ముందుకొచ్చేసింది. సులోచన అంటే విద్యాబాలనే! ఆమెకు దీపికాతో గొడవ ఏంటి? అంటే... దీపికాతో కాదు, దీపికా పదుకునే నటించిన సినిమాతో గొడవ ఎందుకని!? అసలే, దీపిక నగలు, ఆమె రాజసం చూస్తే భారీగా ఉన్నాయి. విద్యా ఏమో సింపుల్‌గా శారీ కట్టుకొస్తున్నారు. దీపిక భారీ హడావిడి ముందు సింపుల్ శారీ ఎక్కడ చిన్నబోతుందోనని విద్యాబాలన్ మరింత ముందుకొచ్చేశారని బీటౌన్ టాక్!! మేటర్ ఏంటంటే... సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రాజ్‌పుత్ రాణి పద్మావతిగా దీపిక నటించిన సినిమా ‘పద్మావతి’. షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ కూడా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్.జె. (రేడియో జాకీ) సులోచనగా విద్యాబాలన్ నటించిన ‘తుమ్హారీ సులు’ను కూడా ముందు డిసెంబర్ 1న విడుదల చేయాలనుకున్నారు. ‘పద్మావతి’తో పాటు అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్ల ‘101 నాట్ అవుట్’ కూడా అదే తేదీన విడుదల చేయాలనుకుంటున్నారని ‘తుమ్హారీ సులు’ టీమ్ కొంచెం జాగ్రత్త పడింది. డిసెంబర్ 1న కాకుండా నవంబర్ 24న వస్తామని చెప్పారు. ఇప్పుడు ‘పద్మావతి’ ట్రైలర్ విడుదలైన తర్వాత మళ్లీ మనసు మార్చుకున్నారు. మరో వారం ముందుకొచ్చారు. నవంబర్ 17న ‘తుమ్హారీ సులు’ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. దీపిక సినిమా వచ్చిన తర్వాత సులోచన ఎక్కడ కనిపించకుండా పోతుందోనని ఆ సినిమాకీ ఈ సినిమాకీ పది రోజులకు పైగా గ్యాప్ ఉండేలా చూసుకున్నారట. -
'పద్మావతి' దెబ్బకు ఆ సిన్మా ముందుకు జరిగింది!
సాక్షి, ముంబై: అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రం ’పద్మావతి’ . చారిత్రక నేపథ్యంతో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో పోటీపడటానికి ఇతర బాలీవుడ్ చిత్రాలేవీ ఇష్టపడటం లేదు. డిసెంబర్ 1 నాడే విద్యాబాలన్ తాజా సినిమా 'తుమ్హారి సూలు' విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 1న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రయూనిట్ గతంలో సంకేతాలు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ఈ చిత్ర దర్శక నిర్మాతలు తమ మనస్సు మార్చుకున్నారు. 'పద్మావతి'తో పోటీని నివారించేందుకు ఒక వారం ముందుగానే నవంబర్ 24న ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. ఇప్పుడు ఆ తేదీ కూడా మరింత ముందుకు జరిగింది. నవంబర్ 24న కాదు 17నే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు 'డీఎన్ఏ' వెబ్సైట్ ఓ కథనంలో పేర్కొంది. పద్మావతి సినిమాకు ఒక వారం ముందు విడుదలైనా.. వారం రోజుల తర్వాత థియేటర్లలో తమ సినిమా ఉండే పరిస్థితి ఉండదని, కాబట్టి కనీసం రెండు వారాలు ముందుకు జరిగితే.. ఎక్కువకాలం థియేటర్లలో ఉండే అవకాశముంటుందని దర్శకనిర్మాతలు.. 'తుమ్హారీ సూలు' సినిమా విడుదల తేదీని ముందుకు జరిపినట్టు తెలుస్తోంది. 'తుమ్హారి సూలు' కామెడీ ఎంటర్టైనర్. విద్యా బాలన్ ఈ సినిమాలో లేట్ రేడియో షో నిర్వహించే ఆర్జేగా నటించారు. మధ్యతరగతి గృహిణిగా, హస్కీ వాయిస్‌తో శ్రోతలకు మత్తెక్కించే రేడియో జాకీగా ఆమె నటన.. ట్రైలర్లో ఆకట్టుకుంది. ఇక, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాలో దీపికా పదుకోన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఆమె భర్త, చిత్తోర్‌గఢ్ రాజ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్, విలన్ సుల్తాన్ అల్లావుద్దీ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. భన్సాలీ మార్క్ గ్రాండ్ విజువలైజేషన్.. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఆనాటి రాచరిక వైభవానికి ప్రతిరూపంగా మలిచిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్లో ఖిల్జీగా రణ్వీర్ సింగ్ భయానక రౌద్రరూపంతో ఆకట్టుకోగా.. అతనితో వీరోచితంగా పోరాడే పాత్రల్లో షాహిద్, దీపిక అభినయం కనబర్చారు. -
ఈసారి కామెడీ జాకీ
‘‘చూపిస్తా... నేనెంత అల్లరి పిల్లనో త్వరలోనే మీకు చూపిస్తా. ఐయామ్ సో నాటీ’’ అంటున్నారు విద్యా బాలన్. ‘డర్టీ పిక్చర్’లో అందాలను ఆరబోసిన ఈ మలయాళ కుట్టి, ‘కహానీ’లో క్యారెక్టర్‌కి తగ్గట్టు నటిగా విశ్వరూపం చూపించారు. ఇప్పటివరకూ విద్యా బాలన్ చేసిన పాత్రలన్నీ అయితే హాటు.. లేదంటే నీటు! అసలు కామెడీ క్యారెక్టర్స్ చేయనే లేదు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ‘తుమ్హారీ సులూ’ ఆ లోటు భర్తీ చేస్తుందంటున్నారీ బ్యూటీ. ఇందులో లేట్ నైట్ ఆర్.జె. (రేడియో జాకీ) సులోచన పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. సులోచనని ముద్దుగా ‘సులూ’ అని పిలుస్తారన్న మాట. ఆల్రెడీ ‘లగే రహో మున్నాభాయ్’లో ఆర్.జె.గా నటించిన అనుభవం ఆమెకి ఉంది. అయితే... రెండూ విభిన్నమైన పాత్రలట. ‘‘ప్రస్తుతం నేను ‘బేగమ్ జాన్’, ‘తుమ్హారీ సులూ’ చిత్రాల్లో నటిస్తున్నా. రెండూ విభిన్నమైన సినిమాలు. ‘తుమ్హారీ...’లో నా క్యారెక్టర్ నాలోని నాటీ యాంగిల్ ప్రేక్షకులకు చూపిస్తుంది. అనుకోకుండా ఆర్.జె. అయిన సులోచనలో కోపం, బాధ, ప్రేమ.. అన్నీ ఉంటాయి. కానీ, కామెడీ హైలైట్ అవుతుంది’’ అన్నారామె.