2017లో బాలీవుడ్‌లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కథ బాగా ఉన్న దాదాపు పదిహేను చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. కమర్షియల్ సినిమాలు మూడు నాలుగే ఈ సంవత్సరం తల ఎత్తుకొని తిరిగాయి.
యాభై ఏళ్లు పైబడిన ఒక వితంతువు తన కంటే వయసులో చిన్నవాడైన ఒక అబ్బాయితో ఫోన్‌లో చాటింగ్ చేస్తూ సంతృప్తి పడుతుంటుంది– ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునేంతలో ఆ అబ్బాయి తనకు అంగ స్తంభన సమస్య ఉన్నట్టుగా తెలుసుకుని ఆ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు ‘శుభ మంగల్ సావధాన్’ సినిమాలో. చదువు పెద్దగా లేని ఒక గృహిణి గౌరవప్రదమైన ఉద్యోగం చేసి తానేమిటో నిరూపించుకోవాలనుకుంటుంది ‘తుమ్హారి సులూ’లో విద్యాబాలన్ రూపంలో. భర్తను కోల్పోయిన ఒక యువ వయస్కురాలు ఒంటరితనం భరించలేక డేటింగ్ సైట్‌లో ఒక పురుషుని తోడు వెతుక్కుంటుంది ‘కరీబ్ కరీబ్ సింగిల్’ ప్రయాణంలో.
దేశంలో ఎంత భ్రష్టత్వం ఉన్నా ఆ భ్రష్టత్వంతో తాను భాగం కాకుండా తన డ్యూటీ తాను కచ్చితంగా చేసుకోవడంలో ఎంతో సంతృప్తి పడతాడు ఒక కథానాయకుడు ‘న్యూటన్’లో. కాశీలో కొన ఊపిరి వదలాలని ఉందని ఒక ముసలి తండ్రి తన కుమారుణ్ణి కోరితే ఆయనతో కలిసి కాశీకి వెళ్లి తనను తాను ఏం తెలసుకున్నాడో ఆ కొడుకు అని చెప్పే కథ ‘ముక్తి భవన్’. పర్యావరణ విధ్వంసం చేసి ప్రకృతిని అంధురాలిగా చేస్తున్న మనిషి అత్యాసను ఒక అంధుడు ఎత్తి చూపే కథ ‘కడ్వీ హవా’. ముప్పై అంతస్తుల భవనంలో ఒక కుర్రవాడు తన ఫ్లాట్‌లో బందీ అయ్యి రోజుల తరబడి తిండీ తిప్పలు లేకుండా మనుగడ కోసం ఎలాంటి పోరాటం చేశాడో చెప్పే కథ ‘ట్రాప్డ్’. బిహార్‌లో బూతు పాటలు పాడుతూ వేదికల మీద అశ్లీల నృత్యాలు చేసే ఒక కళాకారిణి జీవన వేదన ‘అనార్కలీ ఆఫ్ ఆరా’ సినిమా.
బాలీవుడ్ మారిపోయింది. బాలీవుడ్ చాలా మారిపోయింది అనడానికి 2017 ఒక ఉదాహరణ. పెద్ద పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్, మసాలా పాటలు, విదేశాల లొకేషన్స్... ఇవన్నీ ఒకవైపు ఉన్నా కంటెంట్‌ను నమ్ముకుని ఈ సంవత్సరం అక్కడి దర్శక నిర్మాతలు చిన్న సినిమాలు తీశారు. వాటిని విజయవంతం చేసి ప్రేక్షకులు తమకు టేస్ట్ ఉందని నిరూపించుకున్నారు.
నిజంగా 2017 సంవత్సరం బాలీవుడ్ భిన్నత్వాన్ని ఉలిక్కిపడేలా నిరూపించిన సంవత్సరం. కొత్త కథలు, గుర్తుండిపోయేలా చేసే పాత్ర పోషణలు. ఆలోచన రేకెత్తించే క్లయిమాక్స్‌లు ఇవన్నీ ఈ సంవత్సరంలోని సినిమాలు చూపించాయి. పెద్ద సినిమాల పై పైచేయి సాధించిన చిన్న సినిమాలు ఇవి.
2017లో బాలీవుడ్‌లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత సంవత్సరాలతో పోల్చితే జయపజయాలు ఎలా ఉన్నా మొత్తం ఆదాయాన్ని చూస్తే 5 నుంచి 10 శాతం తగ్గినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఈ తగ్గుదల 2 నుంచి 3 శాతమే ఉంటుంది. ఈ సంవత్సరం ముగ్గురు ఖాన్‌లు మరీ గొప్పగా మెరిసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. షారుక్ ఖాన్ ‘రయీస్’ పెద్ద కలెక్షన్లు రాబట్టింది కానీ సినిమాగా పెద్దగా ఎవరూ చెప్పుకోలేదు. షారూఖ్ నటించిన మరో సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సీజెల్’ విదేశాల్లో కలెక్షన్లు సాధించినా భారతదేశంలో ప్రేక్షకులను పారిపోయేలా చేసింది. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. అతని మరో భారీ సినిమా ‘టైగర్ జిందాహై’ సంవత్సరాంతానికి విడుదలయ్యి తన భవిష్యత్తును తేల్చుకోవాల్సి ఉంది. ‘దంగల్’ హిట్‌తో రిలాక్స్ అయిన ఆమిర్ ఖాన్ ఈ సంవత్సరం ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో ఒక చిన్నపాత్రతో సరిపెట్టుకున్నాడు. మరి హిట్స్ ఎవరు తమ బ్యాగ్‌లో వేసుకున్నట్టు?
దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ రెండు మంచి హిట్స్ కొట్టాడు. ఒకటి ‘బదరీనాథ్ కి దుల్హనియా’. రెండు ‘జుడ్వా 2’. ఈ ‘జుడ్వా’ సిరీస్‌కు మూలం మన ‘హలో బ్రదర్’ సినిమా అన్నది విదితమే. అక్షయ్ కుమార్ కూడా రెండు హిట్లు కొట్టాడు. ఒకటి ‘జాలీ ఎల్‌ఎల్‌బి 2’, రెండు ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’. దేశంలో స్వచ్ఛభారత్ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక భర్త తన కొత్త పెళ్లికూతురికి ఇంట్లో టాయిలెట్ కట్టి ఇవ్వడానికి ఊరితో, వ్యవస్థతో ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందో చెప్పే ఈ కథను ప్రేక్షకులు ముక్కు మూసుకోకుండా యాక్సెప్ట్ చేసి కలెక్షన్ల చప్పట్లు కొట్టారు. చాలా రోజులుగా టైమ్ బాగాలేని హృతిక్ రోషన్‌కి ఈ సంవత్సరం ‘కాబిల్’ సినిమా వచ్చి ప్రాణం లేచి వచ్చింది.
అంధుడుగా నటించిన హృతిక్ తన భార్యను చంపిన విలన్స్‌పై తెలివిగా ఎలా పగ తీర్చుకున్నాడో ఈ సినిమా ఆసక్తికరంగా చెప్పడమే కారణం. ఇక ఊహించని హిట్ అంటే ‘గోల్‌మాల్ అగైన్’ అనే చెప్పుకోవాలి. షారుక్‌తో ‘దిల్‌వాలే’ తీసి కొంచెం వెనుకంజ వేసిన రోహిత్ షెట్టి తన పాత టీమ్‌తో పాత ఫార్ములాతో ‘గోల్‌మాల్ ఎగైన్’ తీసి ఏకంగా 300 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. తెలుగులో దుమ్ము రేపుతున్న హారర్ ఫార్ములాను మొదటిసారి అతడు ఈ సిరీస్‌లో ఉపయోగించి సక్సెస్ కొట్టాడు. ఈ హిట్ అజేయ్ దేవగన్ అకౌంట్‌లో పడింది. ప్యారలల్ హీరోలుగా పెద్ద హీరోలతో సమానంగా సినిమాలు ఇస్తున్న నవాజుద్దీన్ సిద్దిఖీ, ఇర్ఫాన్ ఖాన్ సోలో హీరోలుగా చెరి రెండు సినిమాలు చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ‘హరామ్ ఖోర్’, ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్’ చేస్తే రెండూ యావరేజ్‌గా నడిచాయి. కానీ ఇర్ఫాన్ ఖాన్ చేసిన రెండు సినిమాలు ‘హిందీ మీడియమ్’, ‘కరీబ్ కరీబ్ సింగిల్’ మంచి కలెక్షన్లు తెచ్చి హిట్స్‌గా నిలిచాయి. అయితే ఇర్ఫాన్ కంటే నవాజుద్దీన్ ఎక్కువ రోల్స్ చేస్తున్నాడని చెప్పాలి.
2017లో స్త్రీ ప్రధాన సినిమాలు కూడా చాలా వచ్చాయి. వీటిలో తాప్సీ ‘నామ్ షబానా’, విద్యా బాలన్ ‘బేగం జాన్’, ‘తుమ్హారీ సులూ’, శ్రీదేవి ‘మామ్’, శ్రద్ధా కపూర్ ‘హసీనా పార్కర్’, కంగనా రనౌత్ ‘సిమ్రన్’లు ఉన్నాయి. వీటిలో ‘మామ్’, ‘తుమ్హారీ సులూ’ మంచి కలెక్షన్లు సంపాదించాయి. హిమాలయాలను చిన్న వయసులో అధిరోహించిన మన తెలుగమ్మాయి పూర్ణ జీవితం ఆధారంగా ‘పూర్ణ’ రాహుల్ బోస్ దర్శకత్వంలో వచ్చింది.
అంచనాలు పెంచి నిరాశ పరిచిన సినిమాలు కూడా 2017లో ఉన్నాయి. విశాల్ భరద్వాజ్ ‘రంగూన్’, రామ్ గోపాల్ వర్మ ‘సర్కార్ 3’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా చేసిన ‘రాబ్తా’, రణ్‌బీర్ కపూర్ ‘జగ్గా జాసూస్’ ముఖ్యమైనవి. సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ను కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి.
ఇక కాంట్రవర్సీస్ విషయానికి వస్తే ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ తమ ఆంతరంగిక వ్యవహారం వల్ల కోర్టు కేసుల దాకా వెళ్లారు. సోను నిగమ్ అజాన్ విషయంలో కామెంట్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ‘ఇందు సర్కార్’ విడుదల ఏకంగా సెన్సార్ బోర్డ్ చైర్మన్ పెహ్లాజ్ నిహలానీ సీటుకే ఎసరు తెచ్చింది. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ రోజుల మీద వచ్చిన ఆ సినిమాను యధాతథంగా విడుదల చేయాలని బిజెపి ప్రభుత్వం భావిస్తే దానికి కట్స్ ఇవ్వడం వల్ల పెహ్లాజ్ ప్రభు ద్రోహిగా మారి పదవి పోగొట్టుకున్నాడని కథనం.
ఏమైనా బాలీవుడ్‌లో ‘బాహుబలి 2’ కలెక్షన్లకు మించి వేరే పెద్ద సినిమాల న్యూస్ లేదు. ఉన్న న్యూస్ అంతా కంటెంట్ ఆధారంగా వచ్చిన చిన్న సినిమాలదే. రాబోయే సంవత్సరం పెద్ద సినిమాలు, భిన్నమైన చిన్న సినిమాలు హిందీలో మనల్ని అలరిస్తాయని భావిద్దాం.
సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. స్ట్రయిట్ సినిమాలతో సమానంగా ‘బాహుబలి 2’ హిందీ డబ్బింగ్ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ఈ సంవత్సరం చూసిన మరో విశేషం.
ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది.
ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.
బాలీవుడ్ రౌండప్ 2017
Published Thu, Dec 21 2017 1:08 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment