జ్యోతిక
‘పెళ్లయిన తర్వాత మహిళలు కేవలం గృహిణిగా ఇంటికి అంకితం అయిపోవటం కాదు, వాళ్లకూ ఉద్యోగం చేయాలనే ఆశలుంటాయి. వారి కాళ్ల మీద వారు నిలబడాలనే కోరికలుంటాయి. అవి కలలు లాగే మిగిలిపోవద్దు’ అనే కథాంశంతో విద్యాబాలన్ ముఖ్య పాత్రలో వచ్చిన హిందీ చిత్రం ‘తుమ్హారీ సులు’. రేడియో జాకీ కావాలనే సులోచన పాత్రలో విద్యాబాలన్ కనిపించారు. ఇప్పుడు ఇదే సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు దర్శకుడు రాధామోహన్. ఈ తమిళ రీమేక్‌లో సులోచన పాత్రలో జ్యోతికను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యారెక్టర్స్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు జ్యోతిక.
సెకెండ్ ఇన్నింగ్స్‌ను కూడా రీమేక్ (మలయాళ మూవీ ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ రీమేక్ ‘36 వయదినిలే’) తో స్టార్ట్ చేసిన జ్యోతిక ఈ రీమేక్‌లోనూ కూడా నటించనున్నారని సమాచారం. 2007లో రాధామోహన్ దర్శకత్వం వహించిన ‘మొళి’లో జ్యోతిక నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ఇప్పుడు ‘తుమ్హారీ సులు’ కుదిరే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇదిలా ఉంటే.. లకలక అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో భయపెట్టిన జ్యోతిక పాత్రను హిందీ రీమేక్ ‘భూల్ భులేయా’లో విద్యాబాలన్ పోషించారు. ఇప్పుడు విద్యాబాలన్ సూపర్ హిట్ ‘తుమ్హారీ సులు’ సినిమాను తమిళంలో జ్యోతిక పోషిస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment