జ్యోతిక, విద్యాబాలన్
సినిమా కథను పూర్తి స్థాయిలో మోసేవారే హీరోలయితే ప్రస్తుతం జ్యోతిక, విద్యాబాలన్ సూపర్ హీరోలయ్యారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సిద్ధమయ్యారు ఈ హీరోయిన్లు. జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పొన్ మగళ్ వందాళ్’. విద్యాబాలన్ లీడ్ రోల్‌లో గణితశాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన హిందీ సినిమా ‘శకుంతలా దేవి’. ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదల కావాలి. లాక్‌డౌన్ కారణంగా విడుదల కాకపోవడంతో నేరుగా డిజిటల్ (అమేజాన్ ప్రైమ్‌లో) రిలీజ్ చేస్తున్నారు.
డిజిటల్‌లో రిలీజ్ అవుతున్న తొలి తమిళ సినిమా ‘పొన్ మగళ్ వందాళ్’ అయితే హిందీలో డిజిటల్ రిలీజ్ అవుతున్న తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శకుంతలా దేవి’. ఈ సినిమాలు ఓటీటీలో విడుదలవ్వడంతో థియేటర్‌ను ఓటీటీ దెబ్బ తీస్తుందా? అనే ప్రశ్నకు ఈ ఇద్దరూ ఈ వి«ధంగా సమాధానమిచ్చారు. విద్యాబాలన్ మాట్లడుతూ – ‘‘సినిమాలను ఓటీటీలలో విడుదల చేస్తున్నందుకు సినిమా థియేటర్స్‌వాళ్లు అసహనానికి గురవుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సినిమాను థియేటర్‌లో విడుదల చేసే అవకాశం లేదు. దాంతో మరోదారి లేక ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని థియేటర్స్ యజమానులు అర్థం చేసుకుంటే బావుంటుంది. మళ్లీ థియేటర్స్ ప్రారంభమయ్యాక అంతా ఎప్పటిలానే ఉంటుంది.
సినిమాలు థియేటర్‌కే వస్తాయి. కానీ ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఓటీటీ లాంటివి ఉండటం మంచి పరిణామం’’ అన్నారు. జ్యోతిక మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో సినిమా విడుదల చేయడమనేది కేవలం తాత్కాలికమైనది. పరిస్థితుల దృష్ట్యా అలా చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులకు లేదా దర్శకులకు థియేటర్లలో ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లు మించిన గొప్ప ఆనందం మరొకటి ఉండదు. దానికి సరితూగే ఆనందం మరెందులోనూ లేదు. మరికొన్ని రోజుల్లో అంతా సవ్యంగా ఉన్నప్పుడు థియేటర్సే మన ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రధాన ఎంపిక అవుతాయి. కష్టసమయాల్లో ఓటీటీలాంటి ప్లాట్‌ఫామ్స్ ఉండటం బావుంది. ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం’’ అన్నారు. ‘పొన్ మగళ్ వందాళ్’ మే 29నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ‘శకుంతలా దేవి’ తేదీని ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment