అరవింద స్వామి, అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రల్లో అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పింక్’. 2016లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో అమితాబ్ పాత్రలో అజిత్ నటించనున్నారు. ‘చదురంగవేట్టై’ ఫేమ్ వినోద్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నటి విద్యాబాలన్‌లను అతిథి పాత్రల్లో నటింపజేసేందుకు బోనీకపూర్ చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అజిత్ తాజా చిత్రం ‘విశ్వాసం’ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘పింక్’ సినిమా రీమేక్‌కి కొబ్బరికాయ కొట్టనున్నారు. అమితాబ్, విద్యా ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? కూసింత ఓపిక పడితే తెలుస్తుంది.
అమ్మ విద్యాబాలన్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో 3 సినిమాలు తెరకెక్కనున్నాయి. తమిళ ప్రజలు ‘అమ్మ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే జయలలితను ఎవరు ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఇప్పటికే షూటింగ్ మొదలెట్టేశారు. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. సీనియర్ దర్శకులు భారతీ రాజా కూడా ఈ విప్లవ నాయకురాలు పై ఓ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అమ్మ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటి విద్యాబాలన్ నటించనున్నార ట. ఈ సినిమా కోసం ఆమె బరువు పెరగనున్నారని భోగట్టా. ఇక జయలలిత రాజకీయ జీవితంలో ముఖ్యులైన ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేశారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా జయలలిత జయంతి రోజున (ఫిబ్రవరి 24) ప్రారంభం కానుందట.
Comments
Please login to add a commentAdd a comment