సాక్షి, ముంబై: అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రం ’పద్మావతి’ . చారిత్రక నేపథ్యంతో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో పోటీపడటానికి ఇతర బాలీవుడ్ చిత్రాలేవీ ఇష్టపడటం లేదు. డిసెంబర్ 1 నాడే విద్యాబాలన్ తాజా సినిమా 'తుమ్హారి సూలు' విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 1న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రయూనిట్ గతంలో సంకేతాలు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ఈ చిత్ర దర్శక నిర్మాతలు తమ మనస్సు మార్చుకున్నారు. 'పద్మావతి'తో పోటీని నివారించేందుకు ఒక వారం ముందుగానే నవంబర్ 24న ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు.
ఇప్పుడు ఆ తేదీ కూడా మరింత ముందుకు జరిగింది. నవంబర్ 24న కాదు 17నే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు 'డీఎన్‌ఏ' వెబ్‌సైట్ ఓ కథనంలో పేర్కొంది. పద్మావతి సినిమాకు ఒక వారం ముందు విడుదలైనా.. వారం రోజుల తర్వాత థియేటర్లలో తమ సినిమా ఉండే పరిస్థితి ఉండదని, కాబట్టి కనీసం రెండు వారాలు ముందుకు జరిగితే.. ఎక్కువకాలం థియేటర్లలో ఉండే అవకాశముంటుందని దర్శకనిర్మాతలు.. 'తుమ్హారీ సూలు' సినిమా విడుదల తేదీని ముందుకు జరిపినట్టు తెలుస్తోంది. 'తుమ్హారి సూలు' కామెడీ ఎంటర్‌టైనర్. విద్యా బాలన్ ఈ సినిమాలో లేట్ రేడియో షో నిర్వహించే ఆర్జేగా నటించారు. మధ్యతరగతి గృహిణిగా, హస్కీ వాయిస్‌తో శ్రోతలకు మత్తెక్కించే రేడియో జాకీగా ఆమె నటన.. ట్రైలర్‌లో ఆకట్టుకుంది.
ఇక, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాలో దీపికా పదుకోన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఆమె భర్త, చిత్తోర్‌గఢ్ రాజ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్, విలన్ సుల్తాన్ అల్లావుద్దీ ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. భన్సాలీ మార్క్ గ్రాండ్ విజువలైజేషన్.. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఆనాటి రాచరిక వైభవానికి ప్రతిరూపంగా మలిచిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్‌లో ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్ భయానక రౌద్రరూపంతో ఆకట్టుకోగా.. అతనితో వీరోచితంగా పోరాడే పాత్రల్లో షాహిద్, దీపిక అభినయం కనబర్చారు.
Comments
Please login to add a commentAdd a comment