రోజూ చేసే పని నుంచి జీవితానికి ఒక కొత్త అర్థం వెతుక్కొనే హౌస్ వైఫ్... అదేనండీ... గృహిణి ఎక్కడ ఉండదు? సులోచన జీవితం కూడా అలాంటిదే. ఒక మిడిల్ క్లాస్ గృహిణి. పొద్దున్న లేస్తే ఇంటి పని వంట పని. భర్త అశోక్ తన కష్టాలు చెబితే అవి కూడా కష్టాలేనా అన్నట్లుగా సర్ది చెప్పే భార్య. ఒక చిన్న హోల్‌సేల్ బట్టలు కుట్టే ఫ్యాక్టరీలో పని చేస్తాడు భర్త. ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్నా... అక్కడికొచ్చిన కొత్తతరం వారసుడు భర్తను టార్చర్ చేస్తూ ఉంటాడు. ఉద్యోగం కూడా ఉండదేమో అన్నంత దిగులుతో ఉంటాడు ఆ భర్త. ఇంకో పక్క స్కూల్‌లో చదువుకుంటున్న పదకొండేళ్ల కొడుకు పియర్ ప్రెషర్ వల్ల బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పడతాడు.
సులుకి ఉన్న ఇద్దరు అక్కయ్యలూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. దీని వల్ల వాళ్లకు సులు అంటే చిన్న చూపు. ఎప్పుడూ ‘ఏదో ఒకటి చెయ్యచ్చు కదా’ అని దెప్పి పొడుస్తూ ఉంటారు.
సులుకి రేడియో వినడమంటే ఇష్టం. అందులో వచ్చే కాంపిటీషన్లలో ప్రెషర్ కుక్కర్ లాంటివి తరచూ గెలుస్తూ ఉంటుంది. అదే పరంపరలో మరో సారి ఒక రేడియో స్టేషన్‌లో ఇంకో ప్రెషర్ కుక్కర్‌ను గెలుచుకుంటుంది. ‘ఆల్రెడీ ఒకటి గెలిచాను, ఇంకేదైనా ఇప్పించండి’ అని అడుగుతుంది సులు. ‘కుదరదు’ అంటారు అక్కడి సిబ్బంది. అదే సంస్థలో రేడియో జాకీ కోసం ఒక కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. దానిలో పాల్గొని సులు రేడియో జాకీ అవుతుంది.
ఇదే సులుకు మొదటి ఉద్యోగం. అంటే ఇంటి పని వంటి పని కాకుండా జీతం వచ్చే ఉద్యోగం. సులుకు గుర్తింపు తెచ్చే ఉద్యోగం. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న అక్కయ్యలకు చూపించుకునే ఉద్యోగం. అంతా బాగానే ఉంది కానీ ఒక పెద్ద తిరకాసు. నైట్ టైమ్ టాక్ షోకి రేడియో జాకీ ఉద్యోగం. ఎలాగయితేనేమి భర్తను కన్విన్స్ చేసి ఉద్యోగానికి వెళ్తుంది సులు. అంత రాత్రి వేళ ఫోనులో ముచ్చట్లు పెట్టుకునే వాళ్లెవరు? లోన్లీగా ఉండే మగ పురుగులు... మాట్లాడుతుంది సులు. అది చాలా ప్రేమగా మాట్లాడే సులు ‘తుంహారీ సులు’ అంటే ‘మీ సులు’ అని అర్థం. అంతే నైట్ కాలర్స్ రెచ్చి పోయి మాట్లాడుతారు. దానికి సులు చాలా తెలివిగా సమాధానాలు ఇస్తుంది. షో పెద్ద హిట్. ఆ రేడియో స్టేషన్‌కి ఎప్పుడూ రానంత హిట్.
సులుకి ఉద్యోగం చాలా నచ్చింది. తనకు ఒక ఉనికి ప్రసాదించిన ఉద్యోగం మరి నచ్చదా? కానీ అక్కయ్యలకు, భర్తకు నచ్చదు. ఉద్యోగం మానెయ్యమని ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. కానీ సులు మానుకోదు. ఒక మహిళ అస్తిత్వాన్ని ప్రశ్నించే సమాజానికి అద్దం పట్టాడు డైరెక్టర్ సురేశ్ త్రివేణి. కథ చెప్పడంలో కామెడీని ఆధారంగా తీసుకున్నాడు. ‘ఒక పెళ్లి అయిన మహిళ అర్ధరాత్రి పరాయి మగాళ్లతో మాట్లాడడం... అన్నది, అదీ తాను మాట్లాడుతుంది అందరూ వింటారని... భర్త కొడుకు కూడా వింటారు’ అనే నేపథ్యంలో మహిళ అస్తిత్వాన్ని నిలబెడతాడు డైరెక్టర్. నిజానికి మహిళలు నేడు తమ జీవితాల్లో నిలబడి ఉన్న కూడలికి సులు పరిస్థితికి ఎక్కువ తేడా లేదు.
ఎంచుకున్న నేపథ్యం విపరీతమైనది అయినా, అది కథ చెప్పడానికి పనికి వచ్చింది. ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేయడానికి వర్కవుట్ అయ్యింది. అంతకంటే గొప్ప విషయం ఈ సినిమా ద్వారా చెప్పింది మహిళలకు ఉన్న పరిధులు. ఇదంతా జరుగుతున్నప్పుడు సులు కొడుకు స్కూల్లో ఒక అశ్లీల వీడియో విషయంలో పట్టుపడతాడు. ఆ తరువాత ఒక రోజు ఇల్లు వదిలి పారిపోతాడు. దీంతో పిల్లవాడు చేసిన తప్పుకు... సులు పెంపకానికి లింకులేస్తుంది సమాజం. ఒక పక్క బిడ్డ కనబడడం లేదన్న బాధ, మరో పక్క ఉనికిని వదులుకోవాలా... అన్న సంఘర్షణ మధ్య నుంచి సులు ఎలా గెలుస్తుంది అన్నదే సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘మై కర్‌సక్తీ హై ’’ అన్నదే ఈ సినిమా థీమ్. అంటే ‘‘నేను చేయగలను’’ అని!
సమాజానికి తెలియాల్సిన ఒక విలువైన విషయాన్ని ఏడుస్తూ... ఏడిపిస్తూ... చెప్పనక్కరలేదని, ఎక్కువ మందికి విషయం చేరాలంటే ఆర్ద్రత కలబోసినప్పటికీ హ్యూమర్ అవసరమని... అలా అని సెన్సిటివిటీని పోగొట్టకుండా అందంగా చెప్పవచ్చని డైరెక్టర్ నిరూపించాడు. మకిలి... అర్ధరాత్రి ఫోన్ చేస్తున్న మనుషుల్లో కన్నా మన చుట్టూనే ఎక్కువగా ఉంది అనిపించింది. ‘సులు’గా విద్యాబాలన్ అద్భుతంగా నటించారు. సినిమా కోసం కొంచెం లావయ్యారామె. నడకలో ఒక రకమైన స్వింగ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. నా బరువు నా ఇష్టం అనిపించేలా ఉంది ఆ నడక. ప్రతి చోటా క్యారెక్టర్ పడకుండా చూసుకున్నారు. భర్త అశోక్ పాత్రలో మానవ్‌కౌల్ ఇమిడిపోయారు. చూడదగ్గ సినిమా. ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది.
మీ సులోచన
Published Sat, Nov 25 2017 12:34 AM | Last Updated on Sat, Nov 25 2017 1:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment