కళాత్మకం : సరికొత్తగా శుభలేఖలు! | Verity Wedding Cards Invitations New Trends In Hyderabad | Sakshi
Sakshi News home page

కార్డు కళాత్మకం !

Published Mon, Aug 27 2018 8:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Verity Wedding Cards Invitations New Trends In Hyderabad - Sakshi

కప్‌ కార్డు..పాస్‌పోర్టు ఇన్విటేషన్‌

సాక్షి, సిటీబ్యూరో  :వివాహ వేడుక రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. కార్డుల దగ్గరి నుంచి కల్యాణం వరకు నూతన ట్రెండ్స్‌పుట్టుకొస్తున్నాయి. ప్రతి అడుగులోనూ నూతనత్వం కనిపిస్తోంది. ఇప్పుడు శ్రావణ మాసం.. పెళ్లిళ్ల సీజన్‌. ఒక్కటి కాబోతున్న జంటలు.. సరికొత్తగా ఆలోచిస్తూ వినూత్నంగా ఆహ్వానం పలుకుతున్నాయి. పాస్‌పోర్టు, ఏటీఎం, కాఫీ కప్‌ తరహా ఇన్విటేషన్స్‌తో ఆకట్టకుంటున్నాయి. ఇప్పుడిదినగరంలో నడుస్తున్న ట్రెండ్‌.

‘తామెల్లరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి... మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్ములను ఆనందింపజేయగలరని ప్రార్థన’.. ఇదంతా ఒకనాటి పెళ్లి పత్రికల సంగతి. ఇప్పుడింత చదివే ఓపిక ఎవ్వరికీ లేదు. అందుకే సింపుల్, సూపర్బ్‌గా ఉండాలని విభిన్నంగా ఆలోచిస్తోంది యువత. ఒకప్పుడు శుభలేఖలు వేయించడం పెద్దల పని. కానీ ఇప్పుడు వధూవరులే తమకు నచ్చిన డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు. అవి సృజనాత్మకతంగా ఉండాలని యోచిస్తున్నారు. 

కొత్తకొత్తగా...  
భారీ స్థాయిలో శ్లోకాలు, పద్యాలు, పెద్దల వివరాలు... ఇవన్నీ పాతచింతకాయ పచ్చడి జాబితాలోకి చేరిపోయాయి. కేవలం పది లైన్లలో మొత్తం సమాచారం వచ్చేయాలి. శుభలేఖ డిజైన్‌ చూడగానే ఇట్టే ఆకట్టుకోవాలి. కాబోయే జీవిత భాగస్వామి కోసం తాను కంటున్న కలలు, తమ మదిలో భాగస్వామికి ఇచ్చిన స్థానం, ప్రేమ వీటన్నింటినీ వ్యక్తపరుస్తూ.. భలే చూడముచ్చగా ఉంటున్నాయి శుభలేఖలు. ఇక ఫలానా తేదీన, ఫలానా సమయానికి వివాహ సుముహూర్తం అనే మాటకు కాలం చెల్లింది. ‘మీ వాచీ ఫలానా సమయాన్ని సూచించే సరికి, మనమంతా ఒక్కటిగా కలిసి, మన బంధంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించా’లంటూ సరికొత్త స్వాగతాలు పలుకుతున్నాయి.  

బాక్స్‌.. భలే  
కొంతమంది యువతీ యువకులు మరో అడుగు ముందుకేశారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డ్, పాన్‌ కార్డ్, సెల్‌ఫోన్, కాఫీ కప్పు, మ్యాచ్‌ బాక్స్, పుస్తకం తరహాలో శుభలేఖల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా బాక్స్‌ కార్డ్స్, కష్టమైజ్డ్‌ కార్డుల ట్రెండ్‌ నడుస్తోంది. ఒకప్పుడు పెళ్లి విందు గురించో, చేసిన ఏర్పాట్ల గురించో బంధువులు ముచ్చటించుకునేవారు. కానీ ఇప్పుడు వెరైటీ శుభలేఖలతో పెళ్లి ముచ్చట్లు, చర్చలు మొదలవుతున్నాయి.

ఖర్చు తక్కువే...
సాధారణ శుభలేఖలకు అయ్యే ఖర్చులోనే ట్రెండీ ఇన్విటేషన్స్‌ అందిస్తున్నాం. ధరలు ఎక్కువేమీ లేవు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ తమ దగ్గరికి వచ్చి... ఆ విధంగా కావాలని అడుగుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా కార్డులు తయారు చేసిస్తున్నాం.  – టి.ప్రదీప్, గౌలిగూడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement