wedding cards
-
పెళ్లి ఇష్టం లేక వరుడి ఆత్మహత్య?
హసన్‌పర్తి/వర్ధన్నపేట: రెండు రోజుల క్రితం అదృశ్యమైన వరుడు కృష్ణ తేజ శవమై లభించాడు. వర్ధన్నపేట సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో పోలీసులు.. వరుడి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నగరంలోని గోకుల నగర్‌కు చెందిన భూక్యా కృష్ణ తేజ(29) వివాహం ఈనెల 16న నర్సంపేటకు చెందిన ఓ యువతితో జరగనుంది. బంధువులు, మిత్రులకు పెళ్లి పత్రికల పంపిణీ చేయడం ప్రారంభించారు. పెళ్లి ఇష్టం లేకనే? కృష్ణతేజకు పెళ్లి ఇష్టం లేకనే ఎస్సారెస్పీ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10న పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కృష్ణ తేజ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై బంధువులు, మిత్రుల ఇళ్లల్లో గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. అయితే పలివేల్పులలోని ఎస్సారెస్పీ కాల్వ కట్టపై ఓ బైక్ పార్క్ చేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై రాజ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని బైక్‌ను పరిశీలించారు. అందులో పెళ్లి పత్రికలు లభ్యంకాగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు కృష్ణతేజ తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడ్డాడా? లేక పెళ్లి ఇష్టం లేక పారిపోయాడా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం వర్ధన్నపేట మండలంలోని శ్రీ రామోజీ కుమ్మరిగూడెం శివారులోని ఎస్సీరెస్పీ కాల్వలో కృష్ణాతేజ మృతదేహం లభ్యమైంది. -
ఆయనకు ఇద్దరితో పెళ్లి.. ఒకే ముహూర్తానికి.. వైరల్‌గా శుభలేఖ
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి ఒకే ముహూర్తానికి ఇద్దరు వధువుల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. కుర్నపల్లి గ్రామపంచాయతీకి చెందిన కోయ గిరిజనుడు, వ్యవసాయ కూలీ మడివి సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. ఈ క్రమంలో స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించగా.. విషయం తెలుసుకున్న సునీత నిలదీసింది. ఇరువురికీ సర్దిచెప్పేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో సత్తిబాబు ఇద్దరితోనూ ఎర్రబోరులో ఏడాది క్రితం కాపురాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సునీత, స్వప్నకు ఒక్కో సంతానం ఉన్నారు. కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వివాహ విషయాన్ని నలుగురికి తెలిసేలా విందు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, పెద్దలు సూచించారు. దీంతో సత్తిబాబు గురువారం ఉదయం 7.04 గంటలకు ఇద్దరితో కల్యాణ ముహూర్తమని శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకు పంచాడు. దీంతో ఈ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
పెళ్లి ఆహ్వానంలో సరికొత్త ట్రెండ్.. కార్డులిచ్చే రోజులు పోయాయి..
సాక్షి వరంగల్: మా ఇంట్లో పెళ్లికి రండి.. అంటూ ఆప్యాయమైన పెళ్లి పత్రిక పలకరింపు మారింది. ఒకప్పుడు మేళతాళాలతో బంధువుల ఇళ్లకు తిరుగుతూ.. బొట్టు పెట్టి మరీ పత్రిక చేతికిచ్చి ఆహ్వానించేవారు. ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టు పెట్టి.. పెళ్లి కార్డు తలుపునకు పెట్టేవారు. దూరంగా ఉన్న ఊళ్లకు ప్రింట్ చేయించిన కార్డులను ఇంటి.. నాయీబ్రాహ్మణుడు లేదా రజకులకు ఇచ్చి పంపిణీ చేయించేవారు. ఈ ఆనవాయితీ కొన్ని పల్లెల్లో ఇప్పటికీ కొనసాగుతున్నా.. మారుతున్న కాలం.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నామమాత్రంగా 200 కార్డులు.. అంతకన్నా కొంచెం ఎక్కువ.. తక్కువగా ప్రింట్ చేయించడం.. సోషల్ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల గ్రూపు తయారు చేసి అందులో కార్డు పెట్టి పిలిచే విధానానికొచ్చింది. వాట్సాప్‌లో కార్డు పెడుతున్నారు. కొందరికి ఫోన్ చేసి పెళ్లికి రండి అని సెలవిస్తున్నారు. ప్రస్తుతమిది పెళ్లిళ్ల సీజన్. మన పెళ్లి పిలుపులు ప్రస్తుతం ఎలా మారాయో చూద్దాం.. పెళ్లికార్డు.. పిలుపు ఇలా.. నాటి పెళ్లి పత్రికల్లో సీతారాములు ఉండేవారు. సీతాదేవి వరమాలతో సిగ్గులొలికిస్తుంటే రాముడు కోదండ ధారుడై ఓరచూపులతో సీతను చూస్తుండేవాడు. క్రమంగా వాళ్ల స్థానంలోకి వధూవరులు వచ్చేశారు. పెళ్లి కార్డులు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కాకుండా.. ఫొటోసూ్టడియోల నుంచి ఫొటోల రూపంలోనే వచ్చేశాయి. తాజాగా ఇప్పటి పెళ్లి కార్డు ఈ మెయిల్, వాట్సాప్‌లలో వస్తోంది. ఫోన్లో పెళ్లి పత్రికను(పెళ్లి ఫైల్ అనాలి మరి..) ఓపెన్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ పాటతో వధూవరుల ఫొటోలు, వారి పేర్లు, వేదిక వివరాలతో చివరగా ‘డేట్ సేవ్ చేసుకోండి’ అని వీడియో ప్లే అవుతోంది. వాట్సాప్ గ్రూప్ కాల్ చేసి.. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా వచ్చి కార్డు ఇవ్వలేకపోతున్నాం.. అంటూ అందరితో ఒకేసారి మాట్లాడి.. పెళ్లికి తప్పకుండా హాజరుకావాలంటూ కోరడం ఇప్పుడు మామూలైంది. వాట్సాప్ గ్రూపులో పెళ్లి సందడి.. బ్రాహ్మణుడు లగ్న పత్రిక రాసింది మొదలు.. పెళ్లి సందడి షురువైనట్లే. మెహందీ, సంగీత్, మంగళ స్నానాలు, పెళ్లి తేదీ, సమయం, వేదిక మొదలు అన్నింటినీ తెలిపే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్.. పెళ్లి జరుగుతున్న వారి ఇంటి పేరుతో క్రియేట్ చేస్తారు. అందులో దగ్గరి, దూరపు బంధువులు, స్నేహితుల ఫోన్ నంబర్లన్నీ చేర్చి.. వేడుకలు షురువైనప్పటి నుంచి ఆ ఫొటోలను అందులో అప్లోడ్ చేయడం.. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు సైతం పెళ్లి కుమార్తె లేదా కుమారుడితో దిగిన ఫొటోలు షేర్ చేయడం కొత్త ఆనవాయితీకి తెరలేపినట్లయింది. ఆ ఫొటోలు చూసిన గ్రూపులోని వారు సైతం మరీ గుర్తు చేసుకుని తాము కూడా పెళ్లికి వెళ్లాలనే ఆతృత వారిలో పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 200 కార్డులే.. కరోనా ముందు వరకు ఓ ఇంట్లో పెళ్లి జరిగితే దాదాపు వెయ్యి కార్డుల వరకు ఆహ్వాన పత్రికలు ఆర్డర్ ఇచ్చేవారు. ఇప్పుడు 200 వరకు ప్రింట్ చేయించుకుంటున్నారు. అవి కూడా లేటెస్ట్ డిజైన్లు కావాలని కోరుతున్నారు. ఎందుకంటే.. డిజైన్ చేసిన పెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు ప్రోమో వీడియోలను వాట్సాప్ ద్వారానే పంపిస్తున్నారు. దీంతో కార్డుల ప్రింటింగ్ తగ్గించారు. – బోడకుంట్ల సంపత్, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు, వరంగల్ సైకిల్‌పై వెళ్లి ఇచ్చాం.. మా నాన్న వాళ్లు సైకిళ్లపై.. దూరమైతే బస్సుల్లో వెళ్లి పెళ్లి కార్డులు ఇచ్చి వచ్చేవాళ్లు. ఎడ్ల బండిపై కూడా వెళ్లి పంచేవాళ్లు. కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చిన సందర్భాలున్నాయి. అదే ఇప్పుడైతే గ్రామం వరకే పరిమితమైంది. కొందరికి పెళ్లి కార్డులు లేదంటే ఇంటింటికి వెళ్లి చెప్పి వస్తున్నాం. పెళ్లింటి వారే వాట్సాప్‌లలో కార్డులు పంపుతున్నారు. – పంతంగి రజనీకాంత్, రజక కులపెద్ద, ధర్మారావుపేట ఒత్తిడిలో మరిచినా.. క్షణాల్లో చేరవేత.. పెళ్లి పనులన్నీ ఒక ఎత్తయితే.. కార్డుల పంపిణీ అనేది కత్తిమీద సాముతో కూడుకున్న పని. అయినా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి పెళ్లి పత్రికలు ఇవ్వడం.. పెళ్లి పనుల ఒత్తిడిలో పడి కొందరికి కార్డులు ఇవ్వడం కూడా మరిచిపోతుంటాం. అందుకే.. వాట్సాప్ ద్వారానే ప్రతి ఒక్కరికి పెళ్లి కార్డులు పంపించాం. వీడియో ప్రోమోలు కూడా సెండ్ చేశాం. సెకన్ల వ్యవధిలోనే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించగలిగాం. గతంలో పెళ్లి కార్డుల పంపిణీకి నెలరోజుల ముందు నుంచే బాగా కసరత్తు చేసేవాళ్లం. ఇప్పుడు కాస్త సులువైంది. – గంగధార మురళి, తండ్రి నెలరోజుల ముందు నుంచే.. గతంలో నెల రోజుల ముందే పెళ్లి కార్డులు మాకు ఇచ్చేవారు.. రజక, నాయీబ్రాహ్మణుల సహాయంతో తమ బంధువులు ఉండే ఊర్లకు పంపించి పెళ్లి కార్డులు ఇచ్చేలా చూశాం. వారికి తలా కొన్ని కార్డులు ఇచ్చి ఏ ఊరికి పోవాలో చెప్పేవాళ్లం. కొన్ని సందర్భాల్లో కార్డు తీసుకునేవారు ఇంటి వద్ద లేకపోతే పక్క ఇంటివారికి ఇచ్చి మళ్లీ వచ్చాక ఇవ్వమని చెప్పిన సందర్భాలున్నాయి. సొంత ఊరిలో కుల బంధువుల ఇంటికి వెళ్లి వారి దర్వాజకు బొట్టు పెట్టి, ఆ ఇంట్లో వారికి కూడా బొట్టు పెట్టి పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించాం. ఇప్పటికీ ఊళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కానీ నోటిమాటగా చెబుతున్నారు. కార్డులు ఇవ్వడం తగ్గించారు. ఏదో వాట్సాప్ అంట.. అందులో కార్డులు పంపిస్తుండ్రు. – కె.లచ్చమ్మ, బంధనంపల్లి, రాయపర్తి మండలం -
కూతురి శుభలేఖ సెలక్ట్ చేసేందుకు పోటీపడుతున్న అలీ దంపతులు (ఫొటోలు)
-
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే కాబోయే వరుడు..?
గుత్తి రూరల్: యల్లనూరు మండలం శింగవరం గ్రామానికి చెందిన శివశంకర్ ప్రసాద్‌రెడ్డి మూర్ఛ వ్యాధితో మృతి చెందాడు. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన ఓ యువతితో ఈ నెల 13వ తేదీన వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో గుత్తిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు పంచేందుకు వచ్చాడు. పత్రికలు ఇచ్చి అందరినీ ఆహ్వానించిన అనంతరం స్వగ్రామం బయల్దేరాడు. అయితే ఎంగిలిబండ శివారుకు చేరుకోగానే మూర్ఛ రావడంతో శివశంకర్ రోడ్డు పక్కకు వాహనం ఆపేసి కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు, వాహనదారులు అతడు కోలుకునేందుకు సపర్యలు చేయగా.. శివశంకర్ ఆలోపే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం ఏర్పడింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగుతోంది. -
నా వివాహం.. సారీ కొద్దిమందికే ఆహ్వానం
సిరిసిల్ల కల్చరల్: జీవితంలో ఒకేసారి జరిగే వేడుక పెళ్లి. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ అతిథులుగా ఆహ్వానించి జరుపుకునే సంబురం. అలాంటి అపురూప కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలనుకున్న తల్లిదండ్రుల ఆశలపై కరోనా నీళ్లు చల్లుతోంది. ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న వధూవరుల కల తీరడం లేదు. కేవలం కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. వైరస్ ప్రభావంతో శుభలేఖల రూపురేఖలతోపాటు పెళ్లి తంతులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో పెళ్లంటే అదొక వైభవం. ఈ వేడుకను సామాజిక హోదాకు చిహ్నంగా భావించేవారు. కానీ కరోనా కారణంగా రెండేళ్లుగా ఫంక్షన్‌హాళ్లకు బదులుగా ఇంటి ముందే ముత్యాల పందిరి వేస్తున్నారు. భారీ సంఖ్యలో బంధువులకు బదులు 30, 40 మందితో కానిచ్చేస్తున్నారు. పోలీసులైతే ఏకంగా 20 మందికే పరిమితం చేసుకోవాలని నిబంధన విధించారు. నిశ్చితార్థం రోజు వధూవరులు పరస్పరం ఇచ్చుపుచ్చుకునే కానుకల్లో మాస్క్‌లు, శానిటైజర్లు చేరిపోయాయి. పెళ్లికి రాలేమండి.. కోవిడ్ కారణంగా పెళ్లికి ఇంటికొక్కరిని కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు. ఒకవేళ ఆహ్వానించేందుకు వెళ్లినా బంధువులు సరే అంటున్నారు కానీ కరోనాను తల్చుకొని జంకుతున్నారు. కొందరైతే శుభలేఖలు ఇచ్చే సమయంలోనే మేం రాలేమండీ.. రోజులు బాగుంటే చూద్దాం లెండి.. ఏమీ అనుకోవద్దు.. రాకపోయినా వచి్చనట్టే భావించండి.. అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. శుభలేఖల్లో మాస్కు ధరించి హాజరు కావాలని కొందరు ముద్రిస్తుండగా, మరికొందరు ఇంటి వద్దే ఉండి ఆశీస్సులు అందించాలని కోరుతున్నారు. ఈ నెల తొలివారం నుంచి ముహూర్తాలు.. మే తొలివారం నుంచే ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి వందల సంఖ్యలో వివాహాలు నిశ్చయమయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. పెళ్లికి గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. దీంతో ఫంక్షన్‌హాళ్లు బుక్ చేసుకోవాలనుకున్నవారు వెనక్కి తగ్గారు. ఇదివరకే బుక్ చేసుకున్నవారు అడ్వాన్స్‌లు వాపస్ ఇవ్వాలని ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులపై ఒత్తిడి చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో కుటుంబసభ్యులు, స్వల్ప సంఖ్యలో బంధువుల సమక్షంలో ఇంటిముందే పెళ్లి జరిపిస్తున్నారు. -
శుభలేఖలు పంచేందుకు వెళ్తూ..
సాక్షి, బీబీనగర్ (భువనగిరి) : శుభలేఖలు పంచేందుకు వెళ్తున్న తల్లికుమారుడికి మార్గమధ్యలో అనుకోని ప్రమాదం ఎదురైంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి జారి కిందపడడంతో తల్లి తీవ్ర గాయాలపాలై దుర్మరణం పాలైంది. ఈ విషాదకర ఘటన మంగళవారం బీబీనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామ పరిధిలోని పెద్దతండాకు చెందిన పానుగోతు పూర్ణ(45) తన కూతురు వివాహానికి సంబందించిన పెళ్లి కార్డులను బంధువులకు పంచేందుకు మంగళవారం తన కుమారుడు రమేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై బీబీనగర్ వచ్చింది. కాగా బైక్‌పై వెళ్తున్న క్రమంలో వెనుక కూర్చున్న పూర్ణ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో తలకు, కడుపునకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వెరైటీ పెళ్లి శుభలేఖలు
వివాహ వేడుక రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. కార్డుల దగ్గరి నుంచి కల్యాణం వరకు నూతన ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రతి అడుగులోనూ నూతనత్వం కనిపిస్తోంది. ఇప్పుడు శ్రావణ మాసం.. పెళ్లిళ్ల సీజన్. ఒక్కటి కాబోతున్న జంటలు.. సరికొత్తగా ఆలోచిస్తూ వినూత్నంగా ఆహ్వానం పలుకుతున్నాయి. పాస్‌పోర్టు, ఏటీఎం, కాఫీ కప్ తరహా ఇన్విటేషన్స్‌తో ఆకట్టకుంటున్నాయి. ఇప్పుడిది నగరంలో నడుస్తున్న ట్రెండ్. సాక్షి, హైదరాబాద్ : ‘తామెల్లరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి... మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్ములను ఆనందింపజేయగలరని ప్రార్థన’.. ఇదంతా ఒకనాటి పెళ్లి పత్రికల సంగతి. ఇప్పుడింత చదివే ఓపిక ఎవ్వరికీ లేదు. అందుకే సింపుల్, సూపర్బ్‌గా ఉండాలని విభిన్నంగా ఆలోచిస్తోంది యువత. ఒకప్పుడు శుభలేఖలు వేయించడం పెద్దల పని. కానీ ఇప్పుడు వధూవరులే తమకు నచ్చిన డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు. అవి సృజనాత్మకతంగా ఉండాలని యోచిస్తున్నారు. కొత్తకొత్తగా.. భారీ స్థాయిలో శ్లోకాలు, పద్యాలు, పెద్దల వివరాలు... ఇవన్నీ పాతచింతకాయ పచ్చడి జాబితాలోకి చేరిపోయాయి. కేవలం పది లైన్లలో మొత్తం సమాచారం వచ్చేయాలి. శుభలేఖ డిజైన్ చూడగానే ఇట్టే ఆకట్టుకోవాలి. కాబోయే జీవిత భాగస్వామి కోసం తాను కంటున్న కలలు, తమ మదిలో భాగస్వామికి ఇచ్చిన స్థానం, ప్రేమ వీటన్నింటినీ వ్యక్తపరుస్తూ.. భలే చూడముచ్చగా ఉంటున్నాయి శుభలేఖలు. ఇక ఫలానా తేదీన, ఫలానా సమయానికి వివాహ సుముహూర్తం అనే మాటకు కాలం చెల్లింది. ‘మీ వాచీ ఫలానా సమయాన్ని సూచించే సరికి, మనమంతా ఒక్కటిగా కలిసి, మన బంధంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించా’లంటూ సరికొత్త స్వాగతాలు పలుకుతున్నాయి. బాక్స్.. భలే కొంతమంది యువతీ యువకులు మరో అడుగు ముందుకేశారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన పాస్‌పోర్టు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్‌ఫోన్, కాఫీ కప్పు, మ్యాచ్ బాక్స్, పుస్తకం తరహాలో శుభలేఖల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా బాక్స్ కార్డ్స్, కష్టమైజ్డ్ కార్డుల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు పెళ్లి విందు గురించో, చేసిన ఏర్పాట్ల గురించో బంధువులు ముచ్చటించుకునేవారు. కానీ ఇప్పుడు వెరైటీ శుభలేఖలతో పెళ్లి ముచ్చట్లు, చర్చలు మొదలవుతున్నాయి. ఖర్చు తక్కువే.. సాధారణ శుభలేఖలకు అయ్యే ఖర్చులోనే ట్రెండీ ఇన్విటేషన్స్ అందిస్తున్నాం. ధరలు ఎక్కువేమీ లేవు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ తమ దగ్గరికి వచ్చి... ఆ విధంగా కావాలని అడుగుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా కార్డులు తయారు చేసిస్తున్నాం. – టి.ప్రదీప్, గౌలిగూడ -
కళాత్మకం : సరికొత్తగా శుభలేఖలు!
సాక్షి, సిటీబ్యూరో :వివాహ వేడుక రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. కార్డుల దగ్గరి నుంచి కల్యాణం వరకు నూతన ట్రెండ్స్పుట్టుకొస్తున్నాయి. ప్రతి అడుగులోనూ నూతనత్వం కనిపిస్తోంది. ఇప్పుడు శ్రావణ మాసం.. పెళ్లిళ్ల సీజన్. ఒక్కటి కాబోతున్న జంటలు.. సరికొత్తగా ఆలోచిస్తూ వినూత్నంగా ఆహ్వానం పలుకుతున్నాయి. పాస్‌పోర్టు, ఏటీఎం, కాఫీ కప్ తరహా ఇన్విటేషన్స్‌తో ఆకట్టకుంటున్నాయి. ఇప్పుడిదినగరంలో నడుస్తున్న ట్రెండ్. ‘తామెల్లరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి... మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్ములను ఆనందింపజేయగలరని ప్రార్థన’.. ఇదంతా ఒకనాటి పెళ్లి పత్రికల సంగతి. ఇప్పుడింత చదివే ఓపిక ఎవ్వరికీ లేదు. అందుకే సింపుల్, సూపర్బ్‌గా ఉండాలని విభిన్నంగా ఆలోచిస్తోంది యువత. ఒకప్పుడు శుభలేఖలు వేయించడం పెద్దల పని. కానీ ఇప్పుడు వధూవరులే తమకు నచ్చిన డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు. అవి సృజనాత్మకతంగా ఉండాలని యోచిస్తున్నారు. కొత్తకొత్తగా... భారీ స్థాయిలో శ్లోకాలు, పద్యాలు, పెద్దల వివరాలు... ఇవన్నీ పాతచింతకాయ పచ్చడి జాబితాలోకి చేరిపోయాయి. కేవలం పది లైన్లలో మొత్తం సమాచారం వచ్చేయాలి. శుభలేఖ డిజైన్ చూడగానే ఇట్టే ఆకట్టుకోవాలి. కాబోయే జీవిత భాగస్వామి కోసం తాను కంటున్న కలలు, తమ మదిలో భాగస్వామికి ఇచ్చిన స్థానం, ప్రేమ వీటన్నింటినీ వ్యక్తపరుస్తూ.. భలే చూడముచ్చగా ఉంటున్నాయి శుభలేఖలు. ఇక ఫలానా తేదీన, ఫలానా సమయానికి వివాహ సుముహూర్తం అనే మాటకు కాలం చెల్లింది. ‘మీ వాచీ ఫలానా సమయాన్ని సూచించే సరికి, మనమంతా ఒక్కటిగా కలిసి, మన బంధంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించా’లంటూ సరికొత్త స్వాగతాలు పలుకుతున్నాయి. బాక్స్.. భలే కొంతమంది యువతీ యువకులు మరో అడుగు ముందుకేశారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన పాస్‌పోర్టు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్‌ఫోన్, కాఫీ కప్పు, మ్యాచ్ బాక్స్, పుస్తకం తరహాలో శుభలేఖల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా బాక్స్ కార్డ్స్, కష్టమైజ్డ్ కార్డుల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు పెళ్లి విందు గురించో, చేసిన ఏర్పాట్ల గురించో బంధువులు ముచ్చటించుకునేవారు. కానీ ఇప్పుడు వెరైటీ శుభలేఖలతో పెళ్లి ముచ్చట్లు, చర్చలు మొదలవుతున్నాయి. ఖర్చు తక్కువే... సాధారణ శుభలేఖలకు అయ్యే ఖర్చులోనే ట్రెండీ ఇన్విటేషన్స్ అందిస్తున్నాం. ధరలు ఎక్కువేమీ లేవు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ తమ దగ్గరికి వచ్చి... ఆ విధంగా కావాలని అడుగుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా కార్డులు తయారు చేసిస్తున్నాం. – టి.ప్రదీప్, గౌలిగూడ -
పెళ్లికి రండి.. మొక్క తీసుకోండి
గుంటూరు, కొండపల్లి(ఇబ్రహీంపట్నం): అతడో సామాజిక సేవకుడు. పలు సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం ఆశయ స్ఫూర్తి పేరుతో ఫౌండేషన్ నిర్వహిస్తున్నాడు. ప్రకృతిపై మమకారంతో వినూత్నంగా అతడు తన పెళ్లికార్డులతో పాటు మొక్కలు పంపిణీ చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. కొండపల్లిలో ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ కార్యదర్శి అస్గర్ హుస్సేన్ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన తన వివాహం సందర్భంగా శుభలేఖలతో పాటు మొక్కలు పంచేందుకు నిర్ణయించారు. ఆదివారం పెళ్లి కార్డులతో పాటు 200 పండ్లు, పూలు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఇంట్లో ఐదు అడుగుల స్థలంలో కనీసం ఒక మొక్క నాటాలనేది ఆశయస్పూర్తి ఫౌండేషన్ లక్ష్యమన్నారు. -
పెళ్లి కార్డులు పంచేందుకు వెళుతూ..
ఖమ్మం, పాల్వంచ : వారం రోజుల్లో భాజా భజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. సంబరాలు చూడకుండానే పెళ్లి కాబోయే వరుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. పెళ్లి కార్డులు పంచేందుకు మోటర్ సైకిల్‌పై వెళుతుండగా మార్గమధ్యలో ఆర్టీసీ బస్సు రూపంలో యువకుడిని మృత్యువు వెంటాడింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి, మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన జనార్ధన్ కొడుకు ప్రవీణ్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం మొండికుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో మార్చి 3న జరగనుంది. మార్చి 4న కేసముద్రంలో రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. తన పెళ్లి కార్డులు పంచేందుకు ప్రవీణ్ మోటర్‌సైకిల్‌పై పాల్వంచలో ఉన్న అక్క స్వప్నకు ఇచ్చేందుకు బయలుదేరాడు. పాల్వంచ ఎన్ఎండీసీ గేటు సమీపంలో భద్రాచలం నుంచి మిర్యాలగూడెం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ప్రవీణ్ తలకు తీవ్రగాయాలయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ ఎం.రమేష్ సందర్శించి మృతదేహాన్ని పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఏరియా ఆసుప్రలో ప్రవీణ్ తల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సోమవారం పెళ్లి కుమారుడిని చేయాలని అనుకున్నామని ఇంతలోనే మృతి చెందాడని రోదించారు. మృతుడి తండ్రి ఇల్లెందు ఎస్బీఐలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ప్రవీణ్ సీఏ చదివి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. వివాహం అనంతరం ఉద్యోగం చూసుకుంటానని చెప్పాడని తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు. డైవర్షన్ సరిగా లేకనే ప్రమాదం.. కొత్తగూడెం నుంచి పాల్వంచ వరకు నిర్వహిస్తున్న హైవే రోడ్డు పనులు నిలిచి పోవడంతో పాటు డైవర్షన్ బోర్డు సక్రమంగా ఏర్పాటు చేయక పోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. హైవే రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు పనులు చేసే సిబ్బంది వేతనాలు రావడం లేదని పనులను కొన్ని రోజులుగా నిలిపి వేశారు. అంతేగాక రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో వాహనాలకు సిగ్నల్ ఇచ్చేందుకు డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారు. డైవర్షన్ బోర్డు లేని కారణంగా ఆర్టీసీ బస్సు ఎడమ వైపు వెళ్లాల్సి ఉండగా నేరుగా రావడంతో ఎదురుగా వస్తున్న మోటర్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ప్రవీణ్ దుర్మరణం చెందాడని స్థానికులు వాపోతున్నారు. పనుల్లో సరైన రక్షణ చర్యలు తీసుకోక పోవడంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పటికే అనేక మంది తమ ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఉన్నారు. డైవర్షన్ రోడ్డు వేసిన తర్వాతే మరో రోడ్డు వేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్ తమకు అనుకూలంగా రోడ్డు వేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
కార్డులు పంచేందుకు వెళ్తూ పెళ్లి కొడుకు మృతి
నర్సింహులపేట: వారం రోజుల్లో పెళ్లి.. అంతా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.. పెళ్లికి అతిధులను ఆహ్యానించేందుకు స్వయంగా పెళ్లి కొడుకే బందువుల ఇంటికి వెళ్లాడు.. అంతలోనే ఆ పెళ్లింట పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కార్డులు పంచేందుకు బంధువుల ఇంటికి వెళ్తున్న పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దముప్పారం సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన సతీష్(24) వివాహం ఈనెల 27వ తేదీన జరగాల్సి ఉంది. శుభ లేఖలు పంచేందుకు సతీష్, స్నేహితుడు సురేష్(24)తో కలిసి బైక్‌పై వరంగల్ జిల్లా నర్సింహులపేటకు వచ్చాడు. పెద్దముప్పారం సమీపంలో వారి వాహనాన్ని తొర్రూర్ డిపోనకు చెందిన బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. -
రాములోరి ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు
పట్టాభిషేకం తేదీలో మార్పు నిర్లక్ష్యంపై ఈఓ జ్యోతి సీరియస్ భద్రాచలం : భద్రాచలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయట పడింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు దొర్లాయి. శ్రీరామ మహా పట్టాభిషేక వైశిష్ట్యమును తెలియపరుస్తూ ఆహ్వానపత్రికలోని ఓ పేజీలో ముద్రించారు. అందులోనే పట్టాభిషేకం ఎప్పుడు నిర్వహించేది తెలుపుతూ తేదీని ముద్రించారు. వాస్తవంగా పట్టాభిషేకం ఈ నెల 16న జరగనుండగా, ఆహ్వాన పత్రికలో మాత్రం చైత్ర శుద్ధ దశమి ఆదివారం అనగా 29-03-2015న జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాదిగా ముద్రించిన ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంపిణీ మొదలైంది. రాష్ట్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులకు వీటిని దేవస్థానం అధికారులు అందజేశారు. జిల్లాలో ఉన్న వివిధ ఆధ్వాత్మిక సంస్థల నిర్వాహకులకు ఈ పుస్తకాలు వెళ్లాయి. అదే విధంగా వీటిని మీడియాకు కూడా అందజేశారు. పట్టాభిషేకం నిర్వహణ తేదీ త ప్పుగా ముద్రితమైందనే విషయాన్ని మీడియా ప్రతినిధులు దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే తప్పిదాన్ని వారు గుర్తించారు. జరిగిన తప్పిదంపై దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆహ్వాన పత్రిక తయారీలో భాగస్వామ్యులైన వారి నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని భావిస్తున్న ఆమె సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో దేవస్థానంలో తరచు తప్పిదాలు జరుగుతున్నప్పటకీ, వాటిని ఎత్తి చూపేవారిపై ఆలయ పెద్దలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాజాగా జరిగిన ఈ పరిణామాలపై వారు ఏ రీతిగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. -
‘తపాలా’ ఇక ఫటాఫట్!
* కొన్ని గంటల్లోనే గమ్యం చేరనున్న ఉత్తరాలు * ఆన్లైన్ ద్వారా సమాచారం బట్వాడా * కోరిన డిజైన్‌లో కార్డులపై ముద్రణ, వెంటనే డెలివరీ * ఉద్యోగ సమాచారం మొదలు వెడ్డింగ్ కార్డుల వరకు ఇదే పద్ధతి * వాణిజ్యపరంగా పుంజుకొని లాభాలు ఆర్జించేందుకు సన్నద్ధం * బృహత్తర పథకానికి రూపకల్పన దిశగా అడుగులు సాక్షి, హైదరాబాద్: శుభాకాంక్షలు, క్షేమ సమాచారం, ఉద్యోగ వివరాలు, శుభకార్యాలకు ఆహ్వానాల పేరిట మనం పంపే ఉత్తరాలు, లేఖలు ఏవైనా పోస్టు డబ్బాలో వేస్తే కొన్ని రోజుల తర్వాతగానీ గమ్యం చేరని పరిస్థితిని కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. కానీ అవే ఉత్తరాలు కొన్ని గంటల వ్యవధిలోనే కావాల్సిన చోటికి చేరితే ! అది కూడా మనం కోరిన డిజైన్‌లో లేఖల, కార్డులు తయారైతే!! ఆ విధానం భలేగా ఉంటుంది కదూ. ఇప్పుడు తపాలాశాఖ అలాంటి ప్రయత్నంలోనే ఉంది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దీన్ని సాధ్యం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. సెల్‌ఫోన్ విప్లవం, ఇంటర్నెట్ మాయాజాలం వల్ల దాదాపు మనుగడ ప్రశ్నార్థకమైన తరుణంలో వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లేందుకు తపాలా శాఖ ప్రయత్నిస్తోంది. సరుకు రవాణా, కొరియర్ సర్వీసు, బ్యాంకింగ్ సేవలు, పుస్తకాలు, మందుల బట్వాడా... ఇలా రకరకాల పేరుతో వాణిజ్యపరంగా పుంజుకుని తొలిసారి లాభాలు ఆర్జించేందుకు సిద్ధమైంది. ఇదీ విధానం... కార్డులు, ఇన్లాండ్ లెటర్లు, కవర్లు, వెడ్డింగ్ ఇన్విటేషన్లపై చిరునామాలు రాసి పోస్టు డబ్బాలో వేసే పద్ధతి ప్రస్తుతం కొనసాగుతోంది. కొత్త విధానం దీనికి భిన్నం. వాటిల్లో ఉంచే సమాచారాన్ని నేరుగా తపాలా కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆ సమాచారంలోని అక్షరాలు ఏ డిజైన్‌లో ఉండాలి, ఆ ఉత్తరం/వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు నమూనా ఎలా ఉండాలో సిబ్బందికి చెప్పాలి. దాన్ని ఆన్లైన్ ద్వారా ఆయా చిరునామాలకు సంబంధించిన పోస్టాఫీసులకు పంపుతారు. ఆ సమాచారాన్ని అప్పటికప్పుడు కార్డులపై ముద్రించి గమ్యస్థానానికి చేర్చటం కొత్త పద్ధతి. దీనికి సంబంధించి ప్రింటింగ్ యంత్రాలు ఎలా ఉండాలనే దిశలో ఆలోచనలు సాగుతున్నాయి. వీలైనంత వరకు ఖర్చు తగ్గించేలా రూపకల్పన చేయబోతున్నారు. ఫలితంగా అదే రోజు సమాచారం గమ్యం చేరుతున్నందున దీనికి మంచి స్పందన ఉంటుం దని తపాలాశాఖ భావిస్తోంది. క్రమంగా ఉత్తరప్రత్యుత్తరాలు కూడా మళ్లీ తెరపైకి వస్తాయని అంచనా వేస్తోంది. మరికొన్ని నెలల్లో ఈ ప్రయత్నానికి రూపం వస్తుందని తపాలాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
పెళ్లింట విషాదం
కూతురు పెళ్లికి శుభలేఖలు పంచడానికి వెళుతూ తండ్రి దుర్మరణం కాబోయే అల్లుడి ఇంటికి కూతవేటు దూరంలోనే ఘటన నక్కపల్లి: కుమార్తె వివాహాన్ని ఎంతోఘనంగా చేయాలని భావించాడు. సొంత బావమరిదికే ఇచ్చి ఈనెల 25న పెళ్లికి ముహూర్తం పెట్టారు. బంధువులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళుతుండగా విధి వక్రించింది. మండలంలోని ఉద్దండపురం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ తండ్రి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం పాల్తేరుకు చెందిన దేవవరపు రమణ(40) కుమార్తె పెళ్లి శుభలేఖలతో మోటారు సైకిల్‌పై వెళుతూ ఉద్దండపురం సమీపంలో ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రమణకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి పెళ్లి చేశాడు. చిన్న కుమార్తెకు పెళ్లి నిశ్చయించారు. మరోవారం రోజుల్లో కన్యాదానం చేసి ఒక అయ్యచేతిలో పె ట్టాల్సిన తండ్రి మృతదేహం వద్ద కుమార్తె దేవి తోపాటు భార్యమంగలు బోరున విలపిస్తున్నా రు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతూ..
పెద్దమండ్యం: చెల్లెలు వివాహానికి శుభలేఖలు ఇచ్చేందుకు బయలుదేరిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన బుధవారం పెద్దమండ్యం-గాలివీడు రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు .. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం పందికుంట తాండాకు చెందిన కృష్ణానాయక్‌కు కుమారుడు రమేశ్‌నాయక్ (27), కూతురు కవిత ఉన్నారు. కవిత కు అదే తాండాకు చెందిన రాజానాయక్‌తో శనివారం వివాహం జరుగనుంది. దీనికి సంబంధించి బంధువులకు శుభలేఖలు ఇచ్చేందుకు కలిచెర్లకు ద్విచక్రవాహనంలో రమేశ్‌నాయక్ బయలుదేరా డు. పెద్దమండ్యం-గాలివీడు రహదారిపై నమాజుకట్ట మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న స్కూల్‌వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. వాహనా న్ని నడుపుతున్న రమేశ్‌నాయక్ తీవ్రం గా గాయపడ్డారు. అటుగా వస్తున్న వారు తీవ్రంగా గాయపడిన రమేశ్‌నాయక్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్రగాయాలు కావడంతో రమేశ్‌నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చొని ఉన్న పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన అబ్దుల్ (12)కు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన అబ్దుల్‌ను చికిత్స నిమిత్తం స్థానికులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రమాద స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మనోహర్ తెలిపారు. రోదించిన కుటుంబసభ్యులు చెల్లెలు వివాహానికి శుభలేఖలు ఇ చ్చేందుకు వెళుతూ రమేష్‌నాయక్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క కొడుకైన రమేశ్ మృతితో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
నీట మునిగి యువకుడి దుర్మరణం
ఆ ఇంట్లో సరిగ్గా వారం రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది.. ఇందు కోసం ఇల్లు ముస్తాబైంది. శుభకార్యానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ దాదాపు పూర్తి అయ్యాయి. బంధువులు, స్నేహితుల రాకతో ఆ ఇల్లు కళకళలాడుతోంది. అయితే పెళ్లికుమారుడికి వరుసకు చిన్నాన్న చనిపోవడంతో కర్మ స్నానానికి వెళ్లిన వరుడు చెరువులో మునిగి దుర్మరణం చెందాడు. ఈ సంఘటనతో మండలంలోని మాటిండ్ల గ్రామంలో విషాదం నెలకొంది. - చిన్నకోడూరు మండలంలోని మాటిండ్ల గ్రా మానికి చెందిన పెరుమాండ్ల ఎల్లయ్య, మహంకాళవ్వలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బాబు (20) వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆస రాగా ఉంటున్నాడు. ఇదిలా ఉండ గా.. ఇదే గ్రామానికి చెందిన అమ్మాయి తో బాబుకు ఇటీవల నిశ్చితార్థమైంది. ఈ నెల 18న వివాహం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించి శుభలేఖలు కూ డా బంధుమిత్రులకు పంచారు. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సాహం ఉరకలెత్తుతున్న క్రమంలో పది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన వరుడి చిన్నాన్న అనారోగ్యంతో మరణించాడు. బుధవారం పది రోజుల కర్మ సందర్భంగా కుటుంబ సభ్యులు గ్రామ చెరువు వద్దకు వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరిగా చెరువులో స్నానాలు చేసి ఇంటికి వెళ్లాల్సి ఉండగా స్నానానికి చెరువులో ఈత కొడుతున్న బాబు నీటి ప్రవాహ ఒత్తిడికి మునిగిపోయాడు. అయితే విషయానిన గమనించి న ఒడ్డున ఉన్న వారు బాబును రక్షించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అయితే బాబు ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తూ నీట మునిగి మృతి చెందాడు. దీంతో మంగళవాయిద్యాలు మొగాల్సిన ఇంట్లో చావు భాజా మోగింది. బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆనంద్‌గౌడ్ తెలిపారు.