నా వివాహం.. సారీ కొద్దిమందికే ఆహ్వానం | Limited Persons Allowed To Marriages Due To Corona Time | Sakshi
Sakshi News home page

కరోనా దెబ్బకు కళ తప్పిన పెళ్లిళ్లు 

Published Wed, May 26 2021 9:20 AM | Last Updated on Wed, May 26 2021 10:52 AM

Limited Persons Allowed To Marriages Due To Corona Time - Sakshi

సిరిసిల్ల కల్చరల్‌: జీవితంలో ఒకేసారి జరిగే వేడుక పెళ్లి. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ అతిథులుగా ఆహ్వానించి జరుపుకునే సంబురం. అలాంటి అపురూప కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలనుకున్న తల్లిదండ్రుల ఆశలపై కరోనా నీళ్లు చల్లుతోంది. ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న వధూవరుల కల తీరడం లేదు. కేవలం కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. వైరస్‌ ప్రభావంతో శుభలేఖల రూపురేఖలతోపాటు పెళ్లి తంతులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

గతంలో పెళ్లంటే అదొక వైభవం. ఈ వేడుకను సామాజిక హోదాకు చిహ్నంగా భావించేవారు. కానీ కరోనా కారణంగా రెండేళ్లుగా ఫంక్షన్‌హాళ్లకు బదులుగా ఇంటి ముందే ముత్యాల పందిరి వేస్తున్నారు. భారీ సంఖ్యలో బంధువులకు బదులు 30, 40 మందితో కానిచ్చేస్తున్నారు. పోలీసులైతే ఏకంగా 20 మందికే పరిమితం చేసుకోవాలని నిబంధన విధించారు. నిశ్చితార్థం రోజు వధూవరులు పరస్పరం ఇచ్చుపుచ్చుకునే కానుకల్లో మాస్క్‌లు, శానిటైజర్లు చేరిపోయాయి.

పెళ్లికి రాలేమండి..  
కోవిడ్‌ కారణంగా పెళ్లికి ఇంటికొక్కరిని కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు. ఒకవేళ ఆహ్వానించేందుకు వెళ్లినా బంధువులు సరే అంటున్నారు కానీ కరోనాను తల్చుకొని జంకుతున్నారు. కొందరైతే శుభలేఖలు ఇచ్చే సమయంలోనే మేం రాలేమండీ.. రోజులు బాగుంటే చూద్దాం లెండి.. ఏమీ అనుకోవద్దు.. రాకపోయినా వచి్చనట్టే భావించండి.. అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. శుభలేఖల్లో మాస్కు ధరించి హాజరు కావాలని కొందరు ముద్రిస్తుండగా, మరికొందరు ఇంటి వద్దే ఉండి ఆశీస్సులు అందించాలని కోరుతున్నారు.

ఈ నెల తొలివారం నుంచి ముహూర్తాలు..
మే తొలివారం నుంచే ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి వందల సంఖ్యలో వివాహాలు నిశ్చయమయ్యాయి. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. పెళ్లికి గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. దీంతో ఫంక్షన్‌హాళ్లు బుక్‌ చేసుకోవాలనుకున్నవారు వెనక్కి తగ్గారు. ఇదివరకే బుక్‌ చేసుకున్నవారు అడ్వాన్స్‌లు వాపస్‌ ఇవ్వాలని ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులపై ఒత్తిడి చేస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో కుటుంబసభ్యులు, స్వల్ప సంఖ్యలో బంధువుల సమక్షంలో ఇంటిముందే పెళ్లి జరిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement