‘తపాలా’ ఇక ఫటాఫట్! | Postal letters to be arrived in early time | Sakshi
Sakshi News home page

‘తపాలా’ ఇక ఫటాఫట్!

Published Sun, Jul 19 2015 1:48 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

‘తపాలా’ ఇక ఫటాఫట్! - Sakshi

‘తపాలా’ ఇక ఫటాఫట్!

* కొన్ని గంటల్లోనే గమ్యం చేరనున్న ఉత్తరాలు
* ఆన్‌లైన్ ద్వారా సమాచారం బట్వాడా
* కోరిన డిజైన్‌లో కార్డులపై ముద్రణ, వెంటనే డెలివరీ
* ఉద్యోగ సమాచారం మొదలు వెడ్డింగ్ కార్డుల వరకు ఇదే పద్ధతి
* వాణిజ్యపరంగా పుంజుకొని లాభాలు ఆర్జించేందుకు సన్నద్ధం
* బృహత్తర పథకానికి రూపకల్పన దిశగా అడుగులు

 
సాక్షి, హైదరాబాద్: శుభాకాంక్షలు, క్షేమ సమాచారం, ఉద్యోగ వివరాలు, శుభకార్యాలకు ఆహ్వానాల పేరిట మనం పంపే ఉత్తరాలు, లేఖలు ఏవైనా పోస్టు డబ్బాలో వేస్తే కొన్ని రోజుల తర్వాతగానీ గమ్యం చేరని పరిస్థితిని కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. కానీ అవే ఉత్తరాలు కొన్ని గంటల వ్యవధిలోనే కావాల్సిన చోటికి చేరితే ! అది కూడా మనం కోరిన డిజైన్‌లో లేఖల, కార్డులు తయారైతే!! ఆ విధానం భలేగా ఉంటుంది కదూ. ఇప్పుడు తపాలాశాఖ అలాంటి ప్రయత్నంలోనే ఉంది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దీన్ని సాధ్యం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. సెల్‌ఫోన్ విప్లవం, ఇంటర్నెట్ మాయాజాలం వల్ల దాదాపు మనుగడ ప్రశ్నార్థకమైన తరుణంలో వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లేందుకు తపాలా శాఖ ప్రయత్నిస్తోంది. సరుకు రవాణా, కొరియర్ సర్వీసు, బ్యాంకింగ్ సేవలు, పుస్తకాలు, మందుల బట్వాడా... ఇలా రకరకాల పేరుతో వాణిజ్యపరంగా పుంజుకుని తొలిసారి లాభాలు ఆర్జించేందుకు సిద్ధమైంది.
 
 ఇదీ విధానం...
 కార్డులు, ఇన్‌లాండ్ లెటర్లు, కవర్లు, వెడ్డింగ్ ఇన్విటేషన్లపై చిరునామాలు రాసి పోస్టు డబ్బాలో వేసే పద్ధతి ప్రస్తుతం కొనసాగుతోంది. కొత్త విధానం దీనికి భిన్నం. వాటిల్లో ఉంచే సమాచారాన్ని నేరుగా తపాలా కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆ సమాచారంలోని అక్షరాలు ఏ డిజైన్‌లో ఉండాలి, ఆ ఉత్తరం/వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు నమూనా ఎలా ఉండాలో సిబ్బందికి చెప్పాలి. దాన్ని ఆన్‌లైన్ ద్వారా ఆయా చిరునామాలకు సంబంధించిన పోస్టాఫీసులకు పంపుతారు. ఆ సమాచారాన్ని అప్పటికప్పుడు కార్డులపై ముద్రించి గమ్యస్థానానికి చేర్చటం కొత్త పద్ధతి. దీనికి సంబంధించి ప్రింటింగ్ యంత్రాలు ఎలా ఉండాలనే దిశలో ఆలోచనలు సాగుతున్నాయి. వీలైనంత వరకు ఖర్చు తగ్గించేలా రూపకల్పన చేయబోతున్నారు. ఫలితంగా అదే రోజు సమాచారం గమ్యం చేరుతున్నందున దీనికి మంచి స్పందన ఉంటుం దని తపాలాశాఖ భావిస్తోంది. క్రమంగా ఉత్తరప్రత్యుత్తరాలు కూడా మళ్లీ తెరపైకి వస్తాయని అంచనా వేస్తోంది. మరికొన్ని నెలల్లో ఈ ప్రయత్నానికి రూపం వస్తుందని తపాలాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement