పెళ్లి ఆహ్వానంలో సరికొత్త ట్రెండ్‌.. కార్డులిచ్చే రోజులు పోయాయి.. | New Trend Wedding Invitations Through WhatsApp Social Media | Sakshi
Sakshi News home page

పెళ్లి ఆహ్వానంలో సరికొత్త ట్రెండ్‌.. ‘వాట్సాప్‌​‍’ ద్వారానే పిలుపు

Published Sun, Dec 11 2022 9:29 AM | Last Updated on Sun, Dec 11 2022 2:55 PM

New Trend Wedding Invitations Through WhatsApp Social Media - Sakshi

సాక్షి వరంగల్‌: మా ఇంట్లో పెళ్లికి రండి.. అంటూ ఆప్యాయమైన పెళ్లి పత్రిక పలకరింపు మారింది. ఒకప్పుడు మేళతాళాలతో బంధువుల ఇళ్లకు తిరుగుతూ.. బొట్టు పెట్టి మరీ పత్రిక చేతికిచ్చి ఆహ్వానించేవారు. ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టు పెట్టి.. పెళ్లి కార్డు తలుపునకు పెట్టేవారు. దూరంగా ఉన్న ఊళ్లకు ప్రింట్‌ చేయించిన కార్డులను ఇంటి.. నాయీబ్రాహ్మణుడు లేదా రజకులకు ఇచ్చి పంపిణీ చేయించేవారు.

ఈ ఆనవాయితీ కొన్ని పల్లెల్లో ఇప్పటికీ కొనసాగుతున్నా.. మారుతున్న కాలం.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నామమాత్రంగా 200 కార్డులు.. అంతకన్నా కొంచెం ఎక్కువ.. తక్కువగా ప్రింట్‌ చేయించడం.. సోషల్‌ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల గ్రూపు తయారు చేసి అందులో కార్డు పెట్టి పిలిచే విధానానికొచ్చింది. వాట్సాప్‌లో కార్డు పెడుతున్నారు. కొందరికి ఫోన్‌ చేసి పెళ్లికి రండి అని సెలవిస్తున్నారు. ప్రస్తుతమిది పెళ్లిళ్ల సీజన్‌. మన పెళ్లి పిలుపులు ప్రస్తుతం ఎలా మారాయో చూద్దాం..

పెళ్లికార్డు.. పిలుపు ఇలా..
నాటి పెళ్లి పత్రికల్లో సీతారాములు ఉండేవారు. సీతాదేవి వరమాలతో సిగ్గులొలికిస్తుంటే రాముడు కోదండ ధారుడై ఓరచూపులతో సీతను చూస్తుండేవాడు. క్రమంగా వాళ్ల స్థానంలోకి వధూవరులు వచ్చేశారు. పెళ్లి కార్డులు ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి కాకుండా.. ఫొటోసూ్టడియోల నుంచి ఫొటోల రూపంలోనే వచ్చేశాయి. తాజాగా ఇప్పటి పెళ్లి కార్డు ఈ మెయిల్, వాట్సాప్‌లలో వస్తోంది. ఫోన్‌లో పెళ్లి పత్రికను(పెళ్లి ఫైల్‌ అనాలి మరి..) ఓపెన్‌ చేయగానే బ్యాక్‌గ్రౌండ్‌ పాటతో వధూవరుల ఫొటోలు, వారి పేర్లు, వేదిక వివరాలతో చివరగా ‘డేట్‌ సేవ్‌ చేసుకోండి’ అని వీడియో ప్లే అవుతోంది. వాట్సాప్‌ గ్రూప్‌ కాల్‌ చేసి.. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా వచ్చి కార్డు ఇవ్వలేకపోతున్నాం.. అంటూ అందరితో ఒకేసారి మాట్లాడి.. పెళ్లికి తప్పకుండా హాజరుకావాలంటూ కోరడం ఇప్పుడు మామూలైంది. 

వాట్సాప్‌ గ్రూపులో పెళ్లి సందడి..
బ్రాహ్మణుడు లగ్న పత్రిక రాసింది మొదలు.. పెళ్లి సందడి షురువైనట్లే. మెహందీ, సంగీత్, మంగళ స్నానాలు, పెళ్లి తేదీ, సమయం, వేదిక మొదలు అన్నింటినీ తెలిపే విధంగా ఒక వాట్సాప్‌ గ్రూప్‌.. పెళ్లి జరుగుతున్న వారి ఇంటి పేరుతో క్రియేట్‌ చేస్తారు. అందులో దగ్గరి, దూరపు బంధువులు, స్నేహితుల ఫోన్‌ నంబర్లన్నీ చేర్చి.. వేడుకలు షురువైనప్పటి నుంచి ఆ ఫొటోలను అందులో అప్‌లోడ్‌ చేయడం.. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు సైతం పెళ్లి కుమార్తె లేదా కుమారుడితో దిగిన ఫొటోలు షేర్‌ చేయడం కొత్త ఆనవాయితీకి తెరలేపినట్లయింది. ఆ ఫొటోలు చూసిన గ్రూపులోని వారు సైతం మరీ గుర్తు చేసుకుని తాము కూడా పెళ్లికి వెళ్లాలనే ఆతృత వారిలో పెరిగేందుకు అవకాశం ఉంటుంది. 

ఇప్పుడు 200 కార్డులే..
కరోనా ముందు వరకు ఓ ఇంట్లో పెళ్లి జరిగితే దాదాపు వెయ్యి కార్డుల వరకు ఆహ్వాన పత్రికలు ఆర్డర్‌ ఇచ్చేవారు. ఇప్పుడు 200 వరకు ప్రింట్‌ చేయించుకుంటున్నారు. అవి కూడా లేటెస్ట్‌ డిజైన్లు కావాలని కోరుతున్నారు. ఎందుకంటే.. డిజైన్‌ చేసిన పెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు ప్రోమో వీడియోలను వాట్సాప్‌ ద్వారానే పంపిస్తున్నారు. దీంతో కార్డుల ప్రింటింగ్‌ తగ్గించారు.
– బోడకుంట్ల సంపత్, ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకుడు, వరంగల్‌ 

సైకిల్‌పై వెళ్లి ఇచ్చాం..
మా నాన్న వాళ్లు సైకిళ్లపై.. దూరమైతే బస్సుల్లో వెళ్లి పెళ్లి కార్డులు ఇచ్చి వచ్చేవాళ్లు. ఎడ్ల బండిపై కూడా వెళ్లి పంచేవాళ్లు. కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చిన సందర్భాలున్నాయి. అదే ఇప్పుడైతే గ్రామం వరకే పరిమితమైంది. కొందరికి పెళ్లి కార్డులు లేదంటే ఇంటింటికి వెళ్లి చెప్పి వస్తున్నాం. పెళ్లింటి వారే వాట్సాప్‌లలో కార్డులు పంపుతున్నారు.  
– పంతంగి రజనీకాంత్, రజక కులపెద్ద, ధర్మారావుపేట

ఒత్తిడిలో మరిచినా.. క్షణాల్లో చేరవేత..
పెళ్లి పనులన్నీ ఒక ఎత్తయితే.. కార్డుల పంపిణీ అనేది కత్తిమీద సాముతో కూడుకున్న పని. అయినా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి పెళ్లి పత్రికలు ఇవ్వడం.. పెళ్లి పనుల ఒత్తిడిలో పడి కొందరికి కార్డులు ఇవ్వడం కూడా మరిచిపోతుంటాం. అందుకే.. వాట్సాప్‌ ద్వారానే ప్రతి ఒక్కరికి పెళ్లి కార్డులు పంపించాం. వీడియో ప్రోమోలు కూడా సెండ్‌ చేశాం. సెకన్ల వ్యవధిలోనే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించగలిగాం. గతంలో పెళ్లి కార్డుల పంపిణీకి నెలరోజుల ముందు నుంచే బాగా కసరత్తు చేసేవాళ్లం. ఇప్పుడు కాస్త సులువైంది.
– గంగధార మురళి, తండ్రి

నెలరోజుల ముందు నుంచే..
గతంలో నెల రోజుల ముందే పెళ్లి కార్డులు మాకు ఇచ్చేవారు.. రజక, నాయీబ్రాహ్మణుల సహాయంతో తమ బంధువులు ఉండే ఊర్లకు పంపించి పెళ్లి కార్డులు ఇచ్చేలా చూశాం. వారికి తలా కొన్ని కార్డులు ఇచ్చి ఏ ఊరికి పోవాలో చెప్పేవాళ్లం. కొన్ని సందర్భాల్లో కార్డు తీసుకునేవారు ఇంటి వద్ద లేకపోతే పక్క ఇంటివారికి ఇచ్చి మళ్లీ వచ్చాక ఇవ్వమని చెప్పిన సందర్భాలున్నాయి. సొంత ఊరిలో కుల బంధువుల ఇంటికి వెళ్లి వారి దర్వాజకు బొట్టు పెట్టి, ఆ ఇంట్లో వారికి కూడా బొట్టు పెట్టి పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించాం. ఇప్పటికీ ఊళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కానీ నోటిమాటగా చెబుతున్నారు. కార్డులు ఇవ్వడం తగ్గించారు. ఏదో వాట్సాప్‌ అంట.. అందులో కార్డులు పంపిస్తుండ్రు.
– కె.లచ్చమ్మ, బంధనంపల్లి, రాయపర్తి మండలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement