Know About Whatsapp Importance And How It Created Its Own Brand In Messaging Platform - Sakshi
Sakshi News home page

Whatsapp: వాట్సాప్‌ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు!

Published Tue, Oct 25 2022 1:53 PM | Last Updated on Tue, Oct 25 2022 3:20 PM

Do You Know Whatsapp Importance How It Creates Own Platform - Sakshi

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాట్సాప్‌ను ప్రజలు వినియోగిస్తున్నారు. అన్ని దేశాల్లో కలిపి దాదాపు 244 కోట్లు మంది ఇప్పటివరకు వాట్సాప్‌ సేవలను వాడుతున్నారు. నవంబర్‌ 2009లో ప్రాథమికంగా వాట్సాప్‌ను యాపిల్‌ యూజర్ల కోసం తీసుకొచ్చారు. 2010లో అండ్రాయిడ్‌ ఫోన్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్‌ దశ తిరిగింది. కేవలం నాలుగేళ్లలోనూ 200 మిలియన్‌ యూజర్ల మార్కును చేరుకుంది.

వాట్సాప్‌ పెరుగుతున్న తీరును చూసిన ఫేస్‌ బుక్‌.. వెంటనే బేరం పెట్టింది. ఏకంగా 19 బిలియన్‌ డాలర్లను వెచ్చించి 2014లో సొంతం చేసుకుంది. ఈ మొత్తం వాట్సాప్‌ విలువ కంటే 12 రెట్లు ఎక్కువ. భారత్‌ వ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల యూజర్లు ఉన్నారు. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ మెసెజ్‌లు పంపుకోవచ్చు. ప్రతీ రోజు దాదాపు పది వేల కోట్ల మెసెజ్‌లను వాట్సాప్‌ చేరవేస్తుంది.
(చదవండి: దేశవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలకు అంతరాయం.. అయోమయంలో యూజర్లు!)

వాట్సాప్‌ వచ్చిన తర్వాత దెబ్బ పడిన మొదటి సర్వీస్‌ SMS. అప్పటి వరకు ఒక్కో SMSకు కొంత మొత్తాన్ని చార్జ్‌ చేసిన మొబైల్‌ నెట్‌వర్క్‌లు వాట్సాప్‌ దెబ్బకు భారీగా నష్టపోయాయి. ఇక భారతీయులయితే వాట్సాప్‌ను ఎంతగా అభిమానించారంటే.. ఏం చేసినా వాట్సాప్‌లో పంచుకున్నారు. మెసెజ్‌ షేరింగ్‌, ఫోటో షేరింగ్‌, స్టేటస్‌.. ఇలా ప్రతీ అంశానికి వాట్సాప్‌పై ఆధారపడతారు.కొన్నాళ్లుగా కాలింగ్‌కు కూడా వాట్సాప్‌ ప్రత్యామ్నాయంగా మారింది. నేరుగా కాల్‌ చేస్తే రికార్డు అవుతుందనో.. లేక సౌకర్యంగా ఉంటుందనో వాట్సాప్‌ కాలింగ్‌నే నమ్ముకున్నారు చాలా మంది.

ఇక విదేశాల్లో, లేదా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారికి వాట్సాప్‌ కాలింగ్‌ ఎంతో సులభం. దీని వల్ల భారత్‌ లాంటి దేశాల్లో ISD ఇంటర్నేషనల్‌ కాలింగ్‌కు ఎంతో దెబ్బ పడింది. మొబైల్‌ నెట్‌వర్క్‌లు కన్నుమూసి తెరిచేలోపు వాట్సాప్‌ ఇంటర్నేషనల్‌ కాల్‌ ఎంతో ముందుకు వెళ్లింది. ఒకప్పుడు STD, ISD చేయాలంటే బూత్‌లకు వెళ్లేవాళ్లు. అపాయింట్‌మెంట్లు తీసుకునేవాళ్లు. వీటన్నింటికి వాట్సాప్‌ బెస్ట్‌సొల్యూషన్‌గా మారింది.

ఇక వాట్సాప్‌ గ్రూపుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్‌. ప్రతీ వాట్సాప్‌ యూజర్‌ కనీసం 10 గ్రూపుల్లో  చేరడం, తమకు నచ్చిన అంశాలను బేస్‌ చేసుకుని గ్రూప్‌లు క్రియేట్‌ చేయడం వీపరీతంగా పెరిగింది. దీనికి తోడు మీడియాకు వాట్సాప్‌ ప్రధాన అస్త్రంగా మారింది. ప్రతీ వార్తను వాట్సాప్‌లో షేర్‌ చేసుకోవడం అనవాయితీగా మారింది. ఏకంగా వాట్సాప్‌ బేస్డ్‌గా మీడియా అంటే వార్తా ఛానళ్లు, పబ్లికేషన్లు నడుస్తుండడం ఆశ్చర్యం. గతంలో గోడ పత్రికలన్నీ ఇప్పుడు వాట్సాప్‌ పత్రికలుగా మారిపోయాయి. 
(చదవండి: WhatsApp Down కలకలం: స్పందించిన మెటా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement