యువకుడిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
ఖమ్మం, పాల్వంచ : వారం రోజుల్లో భాజా భజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. సంబరాలు చూడకుండానే పెళ్లి కాబోయే వరుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. పెళ్లి కార్డులు పంచేందుకు మోటర్ సైకిల్‌పై వెళుతుండగా మార్గమధ్యలో ఆర్టీసీ బస్సు రూపంలో యువకుడిని మృత్యువు వెంటాడింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి, మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన జనార్ధన్ కొడుకు ప్రవీణ్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం మొండికుంటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మార్చి 3న జరగనుంది. మార్చి 4న కేసముద్రంలో రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు.
తన పెళ్లి కార్డులు పంచేందుకు ప్రవీణ్ మోటర్‌సైకిల్‌పై పాల్వంచలో ఉన్న అక్క స్వప్నకు ఇచ్చేందుకు బయలుదేరాడు. పాల్వంచ ఎన్‌ఎండీసీ గేటు సమీపంలో భద్రాచలం నుంచి మిర్యాలగూడెం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ప్రవీణ్ తలకు తీవ్రగాయాలయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ఎం.రమేష్ సందర్శించి మృతదేహాన్ని పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఏరియా ఆసుప్రలో ప్రవీణ్ తల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సోమవారం పెళ్లి కుమారుడిని చేయాలని అనుకున్నామని ఇంతలోనే మృతి చెందాడని రోదించారు. మృతుడి తండ్రి ఇల్లెందు ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ప్రవీణ్ సీఏ చదివి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. వివాహం అనంతరం ఉద్యోగం చూసుకుంటానని చెప్పాడని తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు.
డైవర్షన్ సరిగా లేకనే ప్రమాదం..
కొత్తగూడెం నుంచి పాల్వంచ వరకు నిర్వహిస్తున్న హైవే రోడ్డు పనులు నిలిచి పోవడంతో పాటు డైవర్షన్ బోర్డు సక్రమంగా ఏర్పాటు చేయక పోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. హైవే రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు పనులు చేసే సిబ్బంది వేతనాలు రావడం లేదని పనులను కొన్ని రోజులుగా నిలిపి వేశారు. అంతేగాక రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో వాహనాలకు సిగ్నల్ ఇచ్చేందుకు డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారు. డైవర్షన్ బోర్డు లేని కారణంగా ఆర్టీసీ బస్సు ఎడమ వైపు వెళ్లాల్సి ఉండగా నేరుగా రావడంతో ఎదురుగా వస్తున్న మోటర్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ప్రవీణ్ దుర్మరణం చెందాడని స్థానికులు వాపోతున్నారు. పనుల్లో సరైన రక్షణ చర్యలు తీసుకోక పోవడంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పటికే అనేక మంది తమ ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఉన్నారు. డైవర్షన్ రోడ్డు వేసిన తర్వాతే మరో రోడ్డు వేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్ తమకు అనుకూలంగా రోడ్డు వేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment