సాక్షి, హైదరాబాద్: హఠాత్తుగా వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది.. తన పేరు నిధి పాండేగా పరిచయం చేసుకుంది.. కొన్నాళ్లు చాటింగ్ తర్వాత చీటింగ్‌కు తెరలేపింది.. తనకు రూ.100 అవసరమంటూ ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకుంది.. ఆపై అసలు కథ ప్రారంభించి రూ.1.18 లక్షలు కాజేసింది.. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో బాధితుడు అసలు వివరాలు బయటకు చెప్పడం లేదని భావిస్తున్నారు. హిమయత్‌నగర్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల వాట్సాప్‌లో ఓ సందేశం వచ్చింది. తన పేరు నిధి పాండేగా ఓ యువతి పరిచయం చేసుకుంది. కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తనకు అత్యవసరంగా రూ.100 కావాలని కోరింది. వాటిని బదిలీ చేయమంటూ తన బ్యాంకు ఖాతా వివరాలు అందించింది. దీంతో బాధితులు ఆమొత్తం నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆమెకు బదిలీ చేశాడు.
ఇది జరిగిన మరుసటి రోజు అర్ధరాత్రి తన నెట్ బ్యాంకింగ్ ఖాతాలోకి వెంకటేష్ అనే వ్యక్తి బెనిఫిషియర్‌గా యాడ్ అయ్యాడని, ఆపై కొన్ని గంటల వ్యవధిలోనే తనఖాతాలో ఉండాల్సిన రూ. 1.18 లక్షలు అతడి ఖాతాలోకి బదిలీ అయ్యాయని సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్పాడు. తన సెల్‌ఫోన్‌కు ఎలాంటి వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) రాలేదని, నగదు బదిలీకి సంబంధించిన సందేశం మాత్రం వచ్చిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే పోలీసులు మాత్రం అలా నగదు బదిలీ చేసుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. బాధితుడు నిధితో తాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడినని చెప్పడంతో ఇరువురూ స్నేహంగా మారి ఉంటారని, ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లు చాటింగ్ తర్వాత ఇతడు తన నెట్ బ్యాకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తదితరాలు ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు. వీటిని వినియోగించుకున్న నిధి బెనిఫిషియర్‌ను యాడ్ చేయడంతో పాటు సెల్‌ఫోన్ నెంబర్ కూడా మార్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితుడికి రావాల్సిన ఓటీపీ ఆ నెంబర్‌కు వెళ్లి ఉంటుందని చెబుతున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా ఆరా తీస్తున్నారు.
పోలీసు కస్టడీలో ఆ నలుగురు..
అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి సిటీలో తిష్టవేసిన పాకిస్థానీ మహ్మద్ ఇక్రమ్‌తో పాటు అతడికి నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందించిన కరీంనగర్‌కు చెందిన లెక్చరర్ మక్సూద్, దళారులు కిర్మాణి, ఖాజాలను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నలుగురినీ గత వారం అరెస్టు చేసిన విషయం విదితమే. తదుపరి విచారణలో భాగంగా మరిన్ని వివరాలు, ఆధారాలు సేకరించాల్సి ఉండటంతో కోర్టు అనుమతితో వీరిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణలో భాగంగా మహ్మద్ ఇక్రమ్ నివసించిన చాదర్‌ఘాట్, మలక్‌పేట్, గోల్నాక ప్రాంతాలకు అతడికి తీసుకువెళ్లి విచారించారు. నకిలీ సర్టిఫికేట్లతో ఇతడు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేశాడు? తదితరవివరాలను ఇన్‌స్పెక్టర్ రమేష్ నేతృత్వంలోని బృందం లోతుగా ఆరా తీస్తోంది. మరోపక్క కేంద్ర, రాష్ట్ర, నగర నిఘా విభాగాలూ రంగంలోకి దిగాయి. నేపాల్ మీదుగా అక్రమ
మార్గంలో వచ్చిన ఇక్రమ్ వ్యవహారంలో మరో కోణమేదైనా ఉందా? అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment