తల్లిదండ్రులతో మహ్మదీ బేగం (వృత్తంలో). చిత్రంలో ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్
సాక్షి, హైదరాబాద్: ఫోన్.. ఫేస్‌బుక్.. వాట్సాప్‌లో తలాక్ చెప్పడం మనకు తెలిసిందే.. అయితే 21 ఏళ్ల క్రితమే అరబ్ షేక్‌తో పాత బస్తీకి చెందిన 15 ఏళ్ల బాలికకు ఫోన్‌లోనే పెళ్లయ్యింది. అరబ్ షేక్‌తో పెళ్లి చేస్తే కూతురు జీవితం బాగుపడుతుందని తల్లిదండ్రులు భావిస్తే.. విధి మరొకటి తలచింది. ఈ 21 ఏళ్లు నరకం అనుభవించిన ఆమె విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చొరవతో బుధవారం హైదరాబాద్ చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ తలాబ్‌కట్టలో సైకిల్ రిపేరింగ్ షాప్ నడిపిస్తున్న మహ్మద్ అక్బర్ కూతురు మహ్మదీ బేగం. 1996లో మస్కట్ దేశం నుంచి పాతబస్తీకి వచ్చిన ఓ వృద్ధుడైన అరబ్ షేక్ ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడికి మహ్మద్ అక్బర్‌తో పరిచయమైంది. తనకూ కూతుళ్లు ఉన్నారని, పేదరికం వల్ల వారి పెళ్లిళ్లు ఎలా చేయాలో తెలియడం లేదని తన గోడు అరబ్ షేక్‌కు చెప్పుకున్నాడు. అక్బర్ మాటలు విన్న అరబ్ షేక్ మస్కట్‌లో తన బావమరిది మహ్మద్ యూనస్ ఉన్నాడని, అతనికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే.. మీ ఆర్థిక పరిస్థితులు కూడా బాగుపడుతాయని చెప్పాడు. అమ్మాయి నిఖా(పెళ్లి) సందర్భంగా ఇచ్చే మెహార్ రూ.లక్షగా ఖరారు చేశారు. అబ్బాయి ఇక్కడికి రావాలంటే వీసా కోసం జాప్యం జరుగుతుందని, ఫోన్‌లోనే పెళ్లి చేయిద్దామని సలహా ఇచ్చాడు. 1996 సెప్టెంబర్ 1న వివాహం జరిపించారు.
హైదరాబాద్‌కు వచ్చిందిలా..
తమ కుమార్తె పాక్‌లో నరకం అనుభవిస్తోందని, ఆమెను నగరానికి తీసుకురావడానికి పలు ముస్లిం స్వచ్ఛంద సంస్థలతో తల్లిదండ్రులు సంప్రదించారు. ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్‌ను కలసి బేగం విషయం వివరించారు. అంజదుల్లాఖాన్ 2017 జనవరిలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. విదేశాంగ శాఖ పాక్‌లోని భారత రాయబార కార్యాలయానికి వివరాలు పంపింది. దీంతో భారత రాయబార కార్యాలయ సిబ్బంది, స్థానిక పోలీసుల సహాయంతో భారత రాయబార కార్యాలయానికి తీసుకొచ్చారు. పలు స్వచ్ఛంద సంస్థలు, అంజదుల్లాఖాన్ సహాయంతో గత నెల 28న ఆమె నగరానికి చేరుకుంది.
మస్కట్‌కు ప్రయాణం
పెళ్లయిన పది రోజులకు అరబ్ షేక్ సేవకురాలి వీసాపై మహ్మదీ బేగం మస్కట్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత బేగం పరిస్థితి దారుణంగా తయారైంది. ఫోన్‌లో పెళ్లి చేసుకున్న భర్తకు అప్పటికే ఇద్దరు భార్యలున్నారు. అక్కడి పరిస్థితులను తల్లిదండ్రులకు వివరించి.. హైదరాబాద్ వచ్చేస్తానని కన్నీరుమున్నీరైంది. అరబ్ షేక్ నుంచి తీసుకున్న డబ్బులు అప్పులకు చెల్లించామని, తమ వద్ద చిల్లిగవ్వ లేదని, ఏదోలా సర్దుకుని ఉండాలని తల్లిదండ్రులు చెప్పారు. గత్యంతరం లేక బేగం అక్కడే ఉండిపోయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఆర్థిక పరిస్థితులు బాగా లేక నా కుమార్తె పెళ్లిని మస్కట్‌లో ఉంటున్న యూనస్‌తో చేశాను. ఇక్కడకు వచ్చిన అరబ్ షేక్ యూనస్ తన బావమరిది అని చెప్పాడు కానీ.. అతడు పాక్ దేశస్తుడని చెప్పలేదు. నా కూతురు మస్కట్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతుందని భావించాను. ఇంత నరకం అనుభవిస్తుందని అనుకోలేదు. నా వల్ల చాలా పొరపాటు జరిగింది. నా కూతురు అనారోగ్యంతో ఉంది. నా దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వమే ఆదుకుని, నా బిడ్డకు వైద్యం చేయించాలి.
– మహ్మదీ బేగం తండ్రి అక్బర్
మస్కట్ నుంచి పాకిస్తాన్‌కు..
చట్టవిరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న వారు స్వదేశం వెళ్లిపోవాలని, లేని పక్షంలో జైలులో పెడతామని మస్కట్ ప్రభుత్వం ఇటీవల కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మహ్మదీ బేగం భర్త యూనస్ అసలు దేశం పాకిస్తాన్. హైదరాబాద్ వచ్చిన అరబ్ షేక్ పాక్ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి సోదరుడే బేగం భర్త. అతడు మస్కట్‌లో చట్టవిరుద్ధంగా ఉండటంతో.. ఇద్దరు భార్యలు, మహ్మదీ బేగంతో పాటు 2012 జూన్‌లో పాక్ చేరుకున్నాడు. బేగం భారతదేశానికి చెందినది కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం తెలియకుండా ఆమెను గ్యారేజ్‌లో బంధించాడు. పెళ్లి చేయించి తీసుకెళ్లిన అరబ్ షేక్ కూడా చనిపోవడంతో బేగంకు తల్లిదండ్రులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఓ రోజు యూనస్ ఇంటికి వచ్చిన బంధువులు.. లోపల నుంచి ఏడుపులు వినిపించడంతో గ్యారేజ్‌లో ఎవరున్నారని ప్రశ్నించారు. జరిగినదంతా వారికి అతడు వివరించాడు. బేగం దీన పరిస్థితిని చూసి చలించిపోయిన వారు.. హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడించారు.
Comments
Please login to add a commentAdd a comment