contract marriage
-
ఫోన్లో పెళ్లి.. 21 ఏళ్ల నరకం..
సాక్షి, హైదరాబాద్: ఫోన్.. ఫేస్బుక్.. వాట్సాప్‌లో తలాక్ చెప్పడం మనకు తెలిసిందే.. అయితే 21 ఏళ్ల క్రితమే అరబ్ షేక్‌తో పాత బస్తీకి చెందిన 15 ఏళ్ల బాలికకు ఫోన్లోనే పెళ్లయ్యింది. అరబ్ షేక్‌తో పెళ్లి చేస్తే కూతురు జీవితం బాగుపడుతుందని తల్లిదండ్రులు భావిస్తే.. విధి మరొకటి తలచింది. ఈ 21 ఏళ్లు నరకం అనుభవించిన ఆమె విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చొరవతో బుధవారం హైదరాబాద్ చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ తలాబ్‌కట్టలో సైకిల్ రిపేరింగ్ షాప్ నడిపిస్తున్న మహ్మద్ అక్బర్ కూతురు మహ్మదీ బేగం. 1996లో మస్కట్ దేశం నుంచి పాతబస్తీకి వచ్చిన ఓ వృద్ధుడైన అరబ్ షేక్ ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడికి మహ్మద్ అక్బర్‌తో పరిచయమైంది. తనకూ కూతుళ్లు ఉన్నారని, పేదరికం వల్ల వారి పెళ్లిళ్లు ఎలా చేయాలో తెలియడం లేదని తన గోడు అరబ్ షేక్‌కు చెప్పుకున్నాడు. అక్బర్ మాటలు విన్న అరబ్ షేక్ మస్కట్‌లో తన బావమరిది మహ్మద్ యూనస్ ఉన్నాడని, అతనికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే.. మీ ఆర్థిక పరిస్థితులు కూడా బాగుపడుతాయని చెప్పాడు. అమ్మాయి నిఖా(పెళ్లి) సందర్భంగా ఇచ్చే మెహార్ రూ.లక్షగా ఖరారు చేశారు. అబ్బాయి ఇక్కడికి రావాలంటే వీసా కోసం జాప్యం జరుగుతుందని, ఫోన్లోనే పెళ్లి చేయిద్దామని సలహా ఇచ్చాడు. 1996 సెప్టెంబర్ 1న వివాహం జరిపించారు. హైదరాబాద్‌కు వచ్చిందిలా.. తమ కుమార్తె పాక్‌లో నరకం అనుభవిస్తోందని, ఆమెను నగరానికి తీసుకురావడానికి పలు ముస్లిం స్వచ్ఛంద సంస్థలతో తల్లిదండ్రులు సంప్రదించారు. ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్‌ను కలసి బేగం విషయం వివరించారు. అంజదుల్లాఖాన్ 2017 జనవరిలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. విదేశాంగ శాఖ పాక్‌లోని భారత రాయబార కార్యాలయానికి వివరాలు పంపింది. దీంతో భారత రాయబార కార్యాలయ సిబ్బంది, స్థానిక పోలీసుల సహాయంతో భారత రాయబార కార్యాలయానికి తీసుకొచ్చారు. పలు స్వచ్ఛంద సంస్థలు, అంజదుల్లాఖాన్ సహాయంతో గత నెల 28న ఆమె నగరానికి చేరుకుంది. మస్కట్‌కు ప్రయాణం పెళ్లయిన పది రోజులకు అరబ్ షేక్ సేవకురాలి వీసాపై మహ్మదీ బేగం మస్కట్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత బేగం పరిస్థితి దారుణంగా తయారైంది. ఫోన్లో పెళ్లి చేసుకున్న భర్తకు అప్పటికే ఇద్దరు భార్యలున్నారు. అక్కడి పరిస్థితులను తల్లిదండ్రులకు వివరించి.. హైదరాబాద్ వచ్చేస్తానని కన్నీరుమున్నీరైంది. అరబ్ షేక్ నుంచి తీసుకున్న డబ్బులు అప్పులకు చెల్లించామని, తమ వద్ద చిల్లిగవ్వ లేదని, ఏదోలా సర్దుకుని ఉండాలని తల్లిదండ్రులు చెప్పారు. గత్యంతరం లేక బేగం అక్కడే ఉండిపోయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ప్రభుత్వమే ఆదుకోవాలి ఆర్థిక పరిస్థితులు బాగా లేక నా కుమార్తె పెళ్లిని మస్కట్‌లో ఉంటున్న యూనస్‌తో చేశాను. ఇక్కడకు వచ్చిన అరబ్ షేక్ యూనస్ తన బావమరిది అని చెప్పాడు కానీ.. అతడు పాక్ దేశస్తుడని చెప్పలేదు. నా కూతురు మస్కట్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతుందని భావించాను. ఇంత నరకం అనుభవిస్తుందని అనుకోలేదు. నా వల్ల చాలా పొరపాటు జరిగింది. నా కూతురు అనారోగ్యంతో ఉంది. నా దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వమే ఆదుకుని, నా బిడ్డకు వైద్యం చేయించాలి. – మహ్మదీ బేగం తండ్రి అక్బర్ మస్కట్ నుంచి పాకిస్తాన్‌కు.. చట్టవిరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న వారు స్వదేశం వెళ్లిపోవాలని, లేని పక్షంలో జైలులో పెడతామని మస్కట్ ప్రభుత్వం ఇటీవల కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మహ్మదీ బేగం భర్త యూనస్ అసలు దేశం పాకిస్తాన్. హైదరాబాద్ వచ్చిన అరబ్ షేక్ పాక్ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి సోదరుడే బేగం భర్త. అతడు మస్కట్‌లో చట్టవిరుద్ధంగా ఉండటంతో.. ఇద్దరు భార్యలు, మహ్మదీ బేగంతో పాటు 2012 జూన్‌లో పాక్ చేరుకున్నాడు. బేగం భారతదేశానికి చెందినది కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం తెలియకుండా ఆమెను గ్యారేజ్‌లో బంధించాడు. పెళ్లి చేయించి తీసుకెళ్లిన అరబ్ షేక్ కూడా చనిపోవడంతో బేగంకు తల్లిదండ్రులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఓ రోజు యూనస్ ఇంటికి వచ్చిన బంధువులు.. లోపల నుంచి ఏడుపులు వినిపించడంతో గ్యారేజ్‌లో ఎవరున్నారని ప్రశ్నించారు. జరిగినదంతా వారికి అతడు వివరించాడు. బేగం దీన పరిస్థితిని చూసి చలించిపోయిన వారు.. హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడించారు. -
కాంట్రాక్ట్ మ్యారేజ్ గుట్టురట్టు
హైదరాబాద్: మెడికల్ వీసా పై నగరానికి వచ్చి ఇక్కడి పేద ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడానికి యత్నించిన సోమాలియా వాసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సోమాలియా దేశం నుంచి వచ్చిన అలీ మహ్మద్ (56) అనే వ్యక్తి కాంట్రాక్ట్ వివాహం కోసం ప్రయత్నిస్తున్నాడనే సమాచారంతో రంగంలోకిదిగిన పోలీసులు అతనితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ మ్యారేజ్ చేస్తామని అతని నుంచి రూ. 1 లక్ష తీసుకొని దాంతో ఓ పేదింటి మహిళ(27)ను పెళ్లికి ఒప్పించి అతని వెంట పంపడానికి ప్రయత్నించిన బ్రోకర్ ఇస్మాయిల్, అన్వరి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
పాతబస్తీలో కాంట్రాక్టు మ్యారేజి అడ్డగింత
హైదరాబాద్ పాతబస్తీలో మరో కాంట్రాక్టు పెళ్లి ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు. 17 ఏళ్ల బాలికను వివాహమాడేందుకు సిద్ధమైన ఒమన్ దేశానికి చెందిన వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. కమీజ్ (70) అనే ఒమన్ దేశస్థుడు నగరంలోని ఓ యువతిని కాంట్రాక్ట్ పెళ్లి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని శుక్రవారం నగరానికి వచ్చాడు. అయితే స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులలకు సమాచారం అందించడంతో వాళ్లు ఆ పెళ్లిని అడ్డుకుని కమీజ్ను అరెస్ట్ చేశారు. -
కాంట్రాక్ట్ పెళ్లిని అడ్డుకున్న పోలీసులు
చాంద్రాయణగుట్ట: పాతబస్తీకి చెందిన యువతికి సోమాలియా దేశస్థుడితో జరుపుతున్న కాంట్రాక్ట్ వివాహాన్ని ఫలక్‌నుమా పోలీసులు శనివారం అడ్డుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలు.. ఫలక్‌నుమా నవాబు సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన వాహబ్, స్థానికంగా ఉండే షబానాబేగం, షాయిన్ సుల్తానాలతో కాంట్రాక్ట్ వివాహాలు జరిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక యువతిని (23)ని సోమాలియాకు చెందిన సయ్యద్ ఇబ్రహీం (28)తో 15 రోజుల కోసం కాంట్రాక్ట్ వివాహం జరిపించేందుకు * 80 వేలు వసూలు చేశాడు. శనివారం వివాహం జరిపించేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కాగా ఈ నెల 6వ తేదీనా దక్షిణ మండలం పోలీసులు షేక్‌లతో వివాహాలు జరిపించే ఖాజీలపై సస్పెక్ట్ షీట్లు తెరిచారన్న విషయం తెలుసుకున్న ఖాజీ ఖుద్రతుల్లాబేగ్ బెదిరిపోయి విషయాన్ని ఫలక్‌నుమా పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివాహాన్ని అడ్డుకున్నారు. సయ్యద్ ఇబ్రహీం, దళారీ వాహబ్, షబానాబేగం, షాయిన్సుల్తానాలను రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ యువతికి ఐదేళ్ల క్రితం ఐదు రోజుల కోసం ఓ బ్రోకర్ అరబ్‌షేక్‌తో కాంట్రాక్ట్ వివాహం జరిపించాడు. -
పాతబస్తీలో కాంట్రాక్ట్ మ్యారేజీ గుట్టురట్టు
-
15 రోజులకు..రూ. 80 వేలతో కాంట్రాక్టు పెళ్లి!
రాష్ట్ర రాజధాని నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో జరగబోతున్న ఓ కాంట్రాక్టు పెళ్లిని పోలీసులు అడ్డుకున్నారు. సోమాలియా దేశస్థుడు సయ్యద్‌తో పాటు పెళ్లికి సర్వం సిద్ధం చేసిన ఖాజీని కూడా అరెస్టు చేశారు. రూ. 80 వేలు చెల్లించి, 15 రోజుల పాటు కాంట్రాక్టు పెళ్లి చేసుకునేలా ఒప్పందం కుదిరింది. దీనిపై పక్కా సమాచారం ముందే అందడంతో సౌత్ జోన్ పోలీసులు సయ్యద్‌ను, ఖాజీని అరెస్టు చేశారు. దాంతో ఓ అమాయకురాలు కాంట్రాక్టు పెళ్లి బారిన పడకుండా ఎలాగోలా బయటపడింది. కాంట్రాక్టు పెళ్లిళ్లను అరికడదామని డీసీపీ సత్యనారాయణ కోరారు. ఫలక్‌నుమా ప్రాంతంలో జరగబోతున్న ఈ పెళ్లిని సరిగ్గా 2 నిమిషాల ముందు పోలీసులు అడ్డుకున్నారు. పెళ్లితోపాటు తలాక్ పత్రాలను కూడా సిద్ధం చేశారు. పెళ్లి అయిన వెంటనే తలాక్ పత్రాల మీద కూడా సంతకాలు చేయించుకునేలా అన్నీ మాట్లాడుకున్నారు. ఒక బ్రోకర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న 80 వేలలో రూ. 60వేలు మాత్రమే కుటుంబానికి ఇస్తారని, మిగిలిన మొత్తం బ్రోకర్‌కు వెళ్తుందని అంటున్నారు. ఇటీవలి కాలంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కాంట్రాక్టు పెళ్లిళ్ల పేరుతో అమాయకులైన అమ్మాయిలను దారుణంగా అమ్మేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లతో పాటు ముంబై లాంటి మహానగరాల నుంచి కూడా డబ్బున్నవాళ్లు ఇక్కడికొచ్చి, కంటికి నదురుగా కనపడిన అమ్మాయిలను కాంట్రాక్టు పెళ్లి చేసుకుంటున్నారు. నెల, రెండు నెలల చొప్పున ఈ కాంట్రాక్టులు ఉంటున్నాయి. ఆ తర్వాత వాళ్ల మానాన వాళ్లు వెళ్లిపోతారు. పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఇలా కాంట్రాక్టు పెళ్లిళ్ల పేరుతో బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు పోలీసులు తెలిపారు.