Waka manjulareddi
-
మా కన్నయ్యకోసమే ఈ పెళ్లిళ్లు!
శ్రావణమాసం అంటే... ఈ స్నేహబృందానికి అత్యంత ఇష్టమైన మాసం. ఎందుకంటే... కృష్ణుడు పుట్టింది ఈ మాసంలోనే. అరవై ఆరేళ్ల స్వరాజ్యలక్ష్మి అయితే... ‘మా అబ్బాయి పుట్టిన రోజు’ అంటూ హడావుడి చేస్తారు. ఇక ధనుర్మాసం వస్తే... ‘మా వాడి పెళ్లి’ అంటూ ఇంటిని అలంకరిస్తారు. ముత్యాల పందిరి వేస్తారు... నలుగుపెట్టి స్నానం చేయిస్తారు. మధుపర్కాలు ధరింపచేసి తలంబ్రాలు పోయిస్తారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ దగ్గర ‘స్వరాజ్య లక్ష్మిగారిల్లు తెలుసా’ అని ఎవరినైనా అడిగితే ‘ఏటా కృష్ణుడికి పెళ్లి చేస్తుంటారు, ఆడవాళ్లంతా చేరి ధ్యానం చేస్తుంటారు... ఆవిడేనా?’ అన్నట్లు చూస్తారు. నిజమే! ఆమె పాతికేళ్లపాటు నిర్విఘ్నంగా ఏటా కృష్ణుడికి గోదాదేవితో పెళ్లి చేశారు. మురళీమోహనుడిని రాధాసమేతంగా ఇంట్లో అట్టే పెట్టేసుకున్నారు. రాధాకృష్ణులకు చమ్కీ వర్క్ చేసిన ముఖమల్ వస్త్రాలు తొడిగి, ముత్యపు పందిరి వేశారామె. ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు కాలనీలోని స్నేహితురాళ్లందరూ స్వరాజ్య లక్ష్మి ఇంట్లో కలుస్తారు. అప్పటికే రాధాకృష్ణులకు ప్రభాత సేవ, నైవేద్యం వంటి పనులన్నీ పూర్తయి ఉంటాయి. ‘కృష్ణయ్యా! నిన్ను చూడడానికి ఎవరెవరొచ్చారో చూడు’ అంటూ ధ్యానంలో కూర్చుంటారామె. ఆమెతోపాటు స్నేహితులందరూ ధ్యానం చేస్తారు. ధ్యానం పూర్తయిన తర్వాత కృష్ణతత్వాన్ని, భాగవతంలోని దశమస్కంధాన్ని పారాయణం చేస్తారు. కృష్ణుడిని కన్నబిడ్డగా భావించే మధుర భక్తురాలు స్వరాజ్యలక్ష్మి. ధ్యానమే మూలం! ఈ స్నేహబృందం... కృష్ణతత్వాన్ని, కృష్ణుడి లీలలను తలచుకోవడంతోపాటు మానవ సేవ చేయడమే ఆ మాధవుడికి చేసే పరిపూర్ణమైన సేవ అని నమ్ముతారు. ‘‘కృష్ణుడికి పెళ్లి చేసేది నా తృప్తి కోసం. అనాథలకు పెళ్లి మాత్రం కృష్ణుడికి ఇష్టమని చేస్తున్నాం. ఏ పని అయినా సరే మా సత్సంగంలో పాల్గొనే స్నేహితులందరం కలిసి చేస్తాం’’ అన్నారు స్వరాజ్యలక్ష్మి. ‘‘ఇప్పటికి పది జంటలకు పెళ్లి చేశాం. పెళ్లికి కావల్సిన అన్ని వస్తువులనూ మేమే సమకూరుస్తాం. వారు కాపురం పెట్టుకోవడానికి అవసరమైన వస్తువులన్నీ మేమే ఇస్తాం’’ అన్నారు అక్కడే ఉన్న ప్రమీల. ఏదైనా ఒక పని అనుకుంటే ఎవరూ వెనుకడుగు వేయరు. అందరూ తలో చెయ్యి వేయడానికి ముందుకు వస్తారు. అలా మంచి ఆలోచనలకు, మంచి కార్యాచరణకు ధ్యానమే కారణం అంటూ ‘‘ధ్యానంతో స్పందించే గుణం వస్తుంది. మనసు, ఆలోచనలు ధారాళంగా ముందుకు సాగుతాయి. ఆ ధ్యానమే నాకు ఇంతమంది స్నేహితులను ఇచ్చింది. వారి స్నేహమే నాతో ఇన్ని మంచి పనులు చేయిస్తోంది’’ అంటారు స్వరాజ్యలక్ష్మి. భక్తి నుంచి ధార్మికంలోకి... ఈ సత్సంగంలోని స్నేహబృందం చేపట్టిన పనులేవీ చిన్నవి కావు. అదే విషయాలను గుర్తు చేసుకుంటూ... ‘‘పదిహేనేళ్లుగా దాదాపుగా వందమందిమి ఇలాగే వారం వారం కలుస్తూన్నాం. మొదట్లో ఒకసారి అందరం కలిసి పదిమందికి ఉపయోగపడే ఏదైనా చిన్న పని చేద్దాం. అనాథ పిల్లల చదువు కోసం సత్సంగం తరఫున ఐదువేల రూపాయలిచ్చాం. అలా చిన్న చిన్నవి చేస్తూ వచ్చాం. ఒకసారి పేపర్లో బోడుప్పల్లో రాజేశ్ అనే కుర్రాడు అనాథలైన వృద్ధులకు ఆశ్రయం ఇస్తున్నట్లు చదివి మేము కొంతమందిమి వెళ్లి చూసి వచ్చాం. అతడు వృద్ధులకు చేసే సేవ చూస్తే ఎవరికైనా మనసు కరిగిపోతుంది. అలాంటి వ్యక్తికి మా వంతుగా ఏదైనా చేస్తే బావుంటుందనుకున్నాం. మొదట అంబులెన్స్ కొనిచ్చాం. బోరు వేయించాం. ఆ తర్వాత ఆశ్రమానికి స్థలం కొనిచ్చాం. ఆ స్థలం కొనడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అధినేత అంజిరెడ్డి గారి భార్య సహకరించారు’’ అన్నారు స్వర్ణ. స్వరాజ్య లక్ష్మి... అనాథాశ్రమంలో బోరు వేయించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... ‘‘బోరు కోసం అందరం కలిసి రెండు లక్షల రూపాయలు జమచేశాం. భూమి పూజ చేసి బోరు వేయడం మొదలైంది. ఏడు వందల అడుగులు వెళ్లినా నీటి జాడ లేదు. దాంతో నాకు భయం వేసింది. నా ఒక్కదాని డబ్బు కాదు. నా మాట మీద ఇంతమంది ముందుకు వచ్చారు. నీరు పడకపోతే నీటి ఇబ్బంది తీరక ఆశ్రమంలోని వాళ్ల కష్టం అలాగే ఉంటుంది. వాళ్లకేదో మేలు చేద్దాం అని డబ్బిచ్చిన ఇంతమందీ నిరాశ చెందుతారు. నాయనా కృష్ణయ్యా నీవే దిక్కు - అని భారం అంతా వాడి మీదనే వేశాను. ఎనిమిది వందలు దాటే సరికి జల పడింది’’ అన్నారామె సంబరంగా! పెళ్లికి ఇలా! అనాథ జంటల పెళ్లిని ఈ స్నేహబృందం అంతా తమ ఇంటి పెళ్లిలాగ నిర్వహిస్తారు. నలుగురు వెళ్లి పెళ్లి బట్టలు, మంగళ సూత్రం కొంటారు. మరికొందరు ఇంటికి అవసరమైన వస్తువులు తీసుకువస్తారు. దీంతోపాటు అందరి ఇళ్ల నుంచి వాడకుండా పక్కన పెట్టేసిన పాత్రలు, వేడుకలకు హాజరైనప్పుడు ఇచ్చిన స్టీలు డబ్బాల వంటి బహుమతులను జమ చేస్తారు. ఇలా కొత్త కాపురానికి అవసరమైన వస్తువులన్నీ చేరిపోతాయి. తాము ఒక మోస్తరుగా వాడిన చీరలు, కాలేజ్ పిల్లల జీన్స్ ప్యాంట్లు, చొక్కాలు అన్నీ కలిపి వధువుకి నలభై జతలు, వరుడికి పాతిక జతల వరకు చేరుస్తారు. ఇంతమంది మహిళలు నిండు మనసులతో కొత్త జీవితానికి ఆసరాగా నిలవడంతో ఆ వధూవరులు తమకెవరూ లేరనే బాధ నుంచి బయటపడి వీరి ఆత్మీయతకు ఆనందపడతారు. ‘‘ఇంతవరకు పది జంటలను కలిపాం. మరో పెళ్లికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వధూవరులే రావాల్సి ఉంది’’ అంటూ చమత్కరించారు భవాని. కృష్ణాష్టమిరోజు కృష్ణుడికి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో రాధను గోదాదేవిగా అలంకరించి రోజూ పాశురాలు చదువుతూ భోగి రోజు వివాహం చేస్తారు. అలా పాతికేళ్లపాటు వివాహమహోత్సవాన్ని నిర్వహించారామె. మాధవ సేవ ఎంత చేసినా మానవ సేవ చేస్తేనే మా కృష్ణయ్యకు సంతోషం... అంటారామె. ఇంకా తనకు ఇద్దరమ్మాయిలనిచ్చి కొడుకుగా వాడే నా ఇంట్లో ఉన్నాడు - అంటూ మురిసిపోతారు. - వాకా మంజులారెడ్డి అదిహృదయభాష ! ధ్యానం వల్ల పొందే అనుభూతిని వివరించడానికి మాటలుండవు. మనసుకి అర్థం కావాల్సిందే. ధ్యానంతో జ్ఞాపకశక్తి పెరుగు తుంది. కష్టాలను అధిగమించగలిగే మానసిక స్థిరత్వం వస్తుంది. - రాజ్యలక్ష్మి సత్సంగ నిర్వహకురాలు -
ఆమె జీవితం...ఓ పెద్దబాలశిక్ష!!
‘నాన్నా! ఈ ఫ్రాక్ నచ్చలేదు... నేను వేసుకోను’ అంటూ విసిరేసిన బాల్యం ఆమెది ఇంటి బయట కాలు పెట్టేది బాటా చెప్పులతోనే... పదవ తరగతికి వచ్చేసరికి జడగంటలు కట్టిన పొడవాటి జడ... ఆ జడను వయ్యారంగా తిప్పుకుంటూ నడిచే ఆత్మవిశ్వాసం ఆమె సొంతమైంది. ఆ జీవితం ఒక్కసారిగా దూరమైంది... దూరంగా జరిగిపోయింది. స్నేహితులిచ్చిన దుస్తులతో రోజులు వెళ్లదీయాల్సి వచ్చింది. చీరకు కుచ్చిళ్లు పోసేది చిరుగులను కప్పుకోవడానికే అన్నట్లు మారిపోయింది. రెండు రూపాయల పాకీజా చెప్పులతో రోడ్డు మీద మొదలైంది ఆమె ప్రయాణం. పాతికేళ్లకే వందేళ్ల జీవితానుభవాన్ని చూసింది. బాధ్యతల బరువు మోసిన ఆ అనుభవమే... ఇప్పుడు మూడు వందల మందికి ఉపాధినిస్తోంది!! విమల తండ్రి ఎల్ఐసి ఆఫీసర్... రక్షణ వ్యవస్థ మాజీ ఉద్యోగి. మిలటరీ క్రమశిక్షణలో పెరగడంతో ఇల్లు బందిఖానాగా అనిపించి బయటి ప్రపంచం అందమైన హరివిల్లులా కనిపించసాగిందామెకు. పదహారేళ్ల వయసులో ఇల్లు దాటి ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమవివాహంలో తియ్యదనం నాలుగేళ్లు కూడా లేకపోయింది. ఇరవై ఏళ్లకే ఇద్దరు అమ్మాయిలకు తల్లైంది. ఆ తర్వాత ఇద్దరు మగపిల్లలు. జీవితం తక్కెడలో సమతుల్యం లోపించింది. ప్రేమ పెళ్లిలో తీపికంటే వైవాహిక జీవితంలో బాధ్యతలే బరువని తెలిసి వచ్చిందామెకు. దురదృష్టం ఏమిటంటే... ఇవేవీ ఆమె భర్త కొండయ్యకు పట్టలేదు. నలుగురు పిల్లల ఆకలి తీర్చడం తల్లిగా తన ధర్మం అనుకున్నారామె. భర్త బాధ్యతరాహిత్యం, నలుగురు పిల్లల పోషణ బాధ్యత ఆమెను సేల్స్‌గర్ల్‌గా మార్చాయి. హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్‌లో సేల్స్‌గర్ల్‌గా చేరిన విమలానాయుడు అనేక కంపెనీలు మారి చివరికి సొంత ఏజెన్సీ ప్రారంభించారు. ‘‘1982లో పాతికమంది ప్రమోటర్స్‌తో ప్రారంభించి ఇప్పుడు మూడు వందల మందితో జాన్సన్స్ అండ్ జాన్సన్స్ వంటి బహుళజాతి కంపెనీలకు సేవలందిస్తున్నాం. ఈ ఏజెన్సీతోనే పిల్లలను చదివించి పెళ్లి చేశాను’’ అన్నారామె. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదివే రోజుల్లో పడిన తప్పటడుగు ఆమె జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పింది. ప్రమోటర్‌గా ఎండలో నడుస్తూ ఉంటే ఒకరోజు రోడ్డు మీద ఆమె అన్నయ్య ఎదురుపడ్డారు. అంతకాలం తర్వాత కనిపించిన చెల్లిని ఆత్మీయంగా పలకరించక పోగా... ‘నీ జీవితం రోడ్డుపాలే’ అనేసి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా జీవితం తలక్రిందులైన వైనాన్ని తలుచుకుంటూ ‘‘నాలాగ ఎవరూ జీవితంలో తప్పటడుగు వేయకూడదు. ప్రేమ, ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమించడానికి టీనేజ్ సరైన వయసు కాదని ఈ తరానికి తెలియాలి’’ అంటారామె. పిల్లల జీవితం తనలా కాకూడదని... తాను చేసిన పొరపాటే చేస్తుందేమోననే భయంతో పెద్దమ్మాయికి పదో తరగతి పూర్తవగానే పెళ్లిచేశారు విమల. రెండో అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి కొంత భరోసా వచ్చిందంటారామె. ‘‘మోసానికీ బలి కాదనే ధైర్యంతో కాలేజ్‌లో చేర్పించాను. ఇప్పుడు ఎంబిఎ గోల్డ్ మెడలిస్ట్. పెద్దబ్బాయి డిగ్రీ సగంలోనే మానేసి నాతోపాటు ఏజెన్సీ చూసుకుంటున్నాడు. రెండో అబ్బాయి ఎం.ఎ చేశాడు. ఉద్యోగం, పిల్లల బాధ్యతలన్నీ ఒక ఎత్తయితే నాకు రోజూ సాయంత్రం ఏడయ్యేసరికి ఆందోళనతో మనసంతా కకావికలమయ్యేది. తాగి ఫలానా చోట పడి ఉన్నాడని ఎక్కడి నుంచి కబురు వస్తుందో, ఎక్కడికెళ్లి ఆ మనిషిని ఇంటికి తీసుకురావాల్సి వస్తుందోనని గుండె దడదడలాడేది’’ అన్నారామె దుంఖాన్ని దిగమింగుకుంటూ. చిలకలగూడలో మహిళలకు ఇప్పుడు విమలానాయుడు ఓ పెద్దదిక్కు. వారి కష్టాలను పంచుకునే పెద్దక్క. మైత్రి బృందాలతో వారికి ఉపాధి మార్గాలను చూపిస్తున్నారామె. ప్రభుత్వ పథకాలను తమ వాకిళ్లకు తెచ్చుకుంటున్నారు. వీటన్నింటికీ సారా ఉద్యమంలో పాల్గొనడమే కారణం అంటారామె. తనకు చేతనైన సాయం! రంజాన్ మాసంలో గురువారాలు మసీదులో లుంగీలు, పండ్లు పంచుతూ కనిపిస్తారు విమల. చర్చ్‌లో మేరీమాతకు కిరీటం పెట్టి సంతోషిస్తారు. సాయిబాబాకి ఊయల ఊపుతూ ఆనందిస్తారు. తన ప్రమోటర్స్ పెళ్లికి మట్టెలు, తాళిబొట్టు ఇస్తారు. ‘‘అమ్మానాన్నల మనసు కష్టపెట్టిన పాపం నాది. నేను చేసిన తప్పులను పరిహరించమని అందరు దేవుళ్లనూ ఇలా వేడుకుంటున్నా’’ అంటారు. విమలానాయుడు జీవితం తెరిచిన పుస్తకం. అందులోని ప్రతి అక్షరం మరొకరికి హెచ్చరిక కావాలనేది ఆమె కోరిక. జీవితంలో ఎలాంటి పొరపాటు చేయకూడదో తనను చూసి తెలుసుకోమంటారు. జీవితానికి ఎదురు నిలబడి గెలవవచ్చు అనడానికి కూడా పాఠం తన జీవితమే- అంటారామె. - వాకా మంజులారెడ్డి, ఫొటోలు: జి. రాజేశ్ మద్యం మహమ్మారి చేసే వినాశం ఏంటో నేను అనుభవించాను. ఆ గుండెమంట నన్ను సారా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేలా చేసింది. మా స్థానిక మహిళలను సమీకరించి ఉద్యమం చేశాం. అందరికంటే పెద్ద బాధితురాలిని కాబట్టి సారా ఉద్యమంలో మా కాలనీ వాళ్లకు నేనే పెద్ద దిక్కయ్యాను. ఇప్పటికీ వాళ్లకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అవసరం వచ్చినా తమతో రమ్మని అడుగుతుంటారు. కుట్టుశిక్షణ తరగతులు, మగ్గం వర్క్‌లో శిక్షణ అలా ప్రారంభించినవే. - విమలానాయుడు -
మొగ్గ విరిసేవేళ...
నాలుగైదేళ్ల చిన్నారులకు అమ్మానాన్నలే అన్నీ ‘మా అమ్మకు అన్నీ తెలుసు, మా నాన్న హీరో, నాన్నను ఎవరూ ఏమీ చేయలేరు’... ఇదీ వాళ్ల ప్రపంచం. తల్లిదండ్రుల వెచ్చటి సంరక్షణలో నచ్చింది తినడం, హాయిగా ఆడుకోవడమే వారికి తెలుసు. సరిగ్గా అలాంటి సమయంలోనే అటు తల్లిదండ్రులను, ఇటు చిన్నారులను కూడా చదువు పేరుతో కాసేపు వేరు చేసేదే స్కూల్. ఈ దశలో తల్లిదండ్రులు తమ చిన్నారులను ఎటువంటి స్కూలుకు పంపాలి... అదే కాస్త పెద్ద పిల్లలైతే, వారు ప్రస్తుతం చదువుతున్న స్కూలు లేదా కాలేజీ మార్చాలా వద్దా అనే ఆలోచనలో మునిగిపోయి ఉన్న తల్లిదండ్రులకోసమే ఈ వారం లాలిపాఠం. రాబోయే విద్యాసంవత్సరానికి జనవరి నుంచే ప్రవేశాలు మొదలవుతుంటాయి కాబట్టి ఇంట్లో మూడేళ్ల పిల్లాడు ఉన్నాడంటే ఆ తల్లిదండ్రులకు ఇది కీలకదశగా అనిపిస్తుంటుంది. బంధువులు, స్నేహితులు ఎవరు కలిసినా ‘మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఆ స్కూలు బాగుందా’ అనే ప్రశ్నలే పలకరింపులవుతుంటాయి. నాలుగేళ్ల పాపాయికి కూడా ఇంట్లో తన గురించే చర్చ జరుగుతోందని తెలుస్తుంటుంది. తల్లిదండ్రుల మాటల్లో తన గురించి, స్కూలు అనే కొత్త పదంతో కలిపి చర్చ జరుగుతోందని తెలుసుకుంటారు. కానీ ‘స్కూలంటే ఏమిటి’ అనే సందేహం కూడా అదే సమయంలో వస్తుంది. ఈ వయసులో పిల్లలు తాము విన్న పదాలను, తెలిసిన పరిసరాలకు మేళవించి విశ్లేషిస్తుంటారు. ఇదే విషయాలను చెప్తూ పిల్లల్లో మానసికపరివర్తన ప్రధానంగా మూడు దశల్లో ఉంటుందన్నారు చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి. ఈ పరివర్తనలో భాగంగా విశ్లేషణ ధోరణితోపాటు ‘ఎందుకు, ఏమిటి, ఎలా’ అనే సందేహాలు కూడా కలుగుతుంటాయి. దాంతోపాటు ‘ఒకసారి ప్రయత్నించి చూద్దాం’ అనే ఆసక్తి కూడ కలుగుతుంది. మూడు నుంచి ఐదేళ్ల వయసులో... మంచికి - చెడుకి మధ్య తేడాతోపాటు తమకు రక్షణ ఎవరి దగ్గర ఉందనేది కూడా గ్రహిస్తారు. పిల్లలకు అమ్మకూచి, నాన్న కూచి అనే ముద్ర పడేది ఈ దశలోనే. తనకు ఎక్కువ ప్రేమను ఎవరు పంచుతున్నారు, తన ఇష్టానికి తగినట్లు ఎవరు చేస్తున్నారు... అని విశ్లేషించుకుంటారు. వారితో బాంధవ్యాన్ని పెంచుకుంటారు. సరిగ్గా ఇదే దశలో ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తల్లి గంటకు మించి కనిపించకపోతే పిల్లల్లో ఆందోళన (స్ట్రేంజర్ యాంగ్జయిటీ) మొదలవుతుంది. ఈ దశలో పిల్లలకు ఇంటికి దూరంగా కొన్ని గంటలు గడపాల్సి రావడం పెద్ద పరీక్ష. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రూపొందినదే ప్లేస్కూల్ విధానం. ప్లేస్కూల్ తల్లిదండ్రుల భూమికను నిర్వర్తించే ప్రదేశం కావాలి. ఈ వయసు పిల్లలు స్కూలుకు వెళ్లడానికి ఏడుస్తున్నారంటే అమ్మానాన్నలు కనిపించనందుకే. ఈ వయసులో స్కూలుకు వెళ్తారు, తోటి పిల్లలతో ఆడుకుంటారు, కొత్తవాళ్లతో మెలగడం నేర్చుకుంటారు... అంతవరకే ఆశించాలి తప్ప ఎంతో చదివేయాలని, పేజీలకు పేజీలు రాయాలని కోరుకోకూడదు. ఎనిమిది నుంచి పదేళ్లు... పిల్లలను ఆందోళనకు గురిచేసే మరో దశ సెకండరీ స్కూల్ సమయం. ‘ఇక ఆటలు తగ్గించుకోవాలి, క్రికెట్, డాన్సు ప్రాక్టీస్ మానేయాలి’, ‘మాథ్స్‌కి ట్యూషన్ పెట్టించాలి, లెక్కలు బాగా చెప్పే మాస్టారు గురించి వాకబు చేయండి’ అనే మాటలే వినబడుతుంటాయి ఇంట్లో. ఒక్కసారిగా మారిపోయిన ఇంటి వాతావరణం పిల్లల్ని బాధ్యతాయుతంగా మారుస్తుంది, అదేసమయంలో కొంతమంది పిల్లల్ని భయస్తులుగానూ మారుస్తుంది. ఆ భయానికి బానిసలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. స్కూలు మార్చడం తప్పనిసరా? ఆరవ తరగతికి స్కూలు మార్చడం నిజంగా అవసరమేనా, స్కూలు మారిస్తే వచ్చే ప్రయోజనాలేంటి, మార్చకపోతే వచ్చే నష్టాలేంటి... అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఉన్న స్కూల్లో ఇబ్బంది ఏంటి, ఇదే సమస్య మరో స్కూలులో ఉండవని నమ్మవచ్చా... ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మూడోదశ మొదలయ్యే సమయం... పిల్లల పరివర్తన మూడవ దశలో ఉన్నప్పుడు స్కూలు నుంచి కాలేజ్‌కి మారాల్సి ఉంటుంది. కాలేజ్‌ని అధ్యయనం చేయడంలో తల్లిదండ్రుల కోణం, పిల్లల కోణం పరస్పర భిన్నంగా ఉంటాయి. రెండు పార్టీల అభిప్రాయాలను కలబోసుకుని తుది నిర్ణయానికి రావాలి. కొంతమంది పిల్లలు ఇంటర్ మొదటి సంవత్సరంలో ‘కాలేజ్ మారుతాను’ అంటుంటారు. ఆ దశలో కాలేజ్ మార్చడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ‘కొత్త కాలేజ్ అంటే దూరపు కొండలు నునుపు’ వంటిదేనని సర్దిచెప్పాలి. ఆ వయసులో పిల్లలకు తల్లిదండ్రుల కౌన్సెలింగ్ సరిపోదు. నాలుగేళ్ల వయసులో తల్లి, తండ్రిని మించిన వాళ్లు లేరనుకునే ఈ పిల్లలే పదహారు ఏళ్లకు అమ్మానాన్నలకంటే ఎక్కువ తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నారనే భావనలోకి వస్తారు. అందుకే స్పెషలిస్టుతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. పిల్లల చదువులో కీలకమైన మూడు దశలు, పిల్లల పరివర్తన చెందే ప్రధానమైన మూడుదశలూ ఒకేసారి కావడం యాదృచ్చికమే. కెరీర్ విషయంలో ఎవరి ప్రాధాన్యాలు ఎలా ఉన్నా, స్థూలంగా అందరూ పాటించాల్సిన అంశాలివన్నీ. - వాకా మంజులారెడ్డి ముద్ర వేయకూడదు! లేబిలింగ్ ఎఫెక్ట్... ‘మా అబ్బాయికి కెమిస్ట్రీ సరిగా రాదు, అమ్మాయికి మాథ్స్ కష్టం’ అని తల్లిదండ్రులు తరచూ అంటుండడం వల్ల పిల్లలు ‘బాబోయ్ కెమిస్ట్రీ నా వల్ల కాదు, మాథ్స్‌లో నేను పాసవడమే గొప్ప’ అని తమకు తామే ప్రకటించుకుంటుంటారు. నిజానికి అది తల్లిదండ్రులు తగిలించే ట్యాగ్. ఫలానా సబ్జెక్ట్‌లో వీక్ అని తెలిసినప్పుడు ‘సోషల్ ఆన్సర్స్ ఒకసారి చదివితే వచ్చేస్తున్నాయి కదా, సైన్స్‌లో అలా రాకపోతే రెండు-మూడుసార్లు ప్రయత్నించాలి అంతే’ అనే ధోరణితో పిల్లలను గాడిలో పెట్టాలి. ఉదాహరణకు - ఒకసారి రన్నింగ్రేస్లో వెనుకబడితే మరో ప్రయత్నం చేసేటప్పుడు ‘నువ్వు రన్నింగ్‌లో వేస్ట్. వద్దులే’ అనడం వల్ల పిల్లల్లో తాము రన్నింగ్రేస్కి ప్రయత్నం చేయకపోవడమే మంచిదనే అభిప్రాయం బలపడుతుంది. ప్రాథమిక పాఠశాల ఎంపిక ఇలా! యుకేజీ పూర్తయ్యేసరికి ఇన్ని రాయిస్తాం అనే స్కూలుకు బదులు పిల్లల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతాం అనే స్కూలుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా... ఆలోచనశక్తిని పెంపొందించే వాతావరణం ఉన్న స్కూలుకి మార్కులేయాలి. పిల్లలు ‘తానేంటి’ అని తమకు తాముగా తెలుసుకునే అవకాశం ఉన్న స్కూలు కావాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా ఉండాలి. ఇంటి తర్వాత ఎక్కువ సమయం గడపాల్సిన ప్రదేశం కాబట్టి పిల్లలు ‘భయం లేకుండా మెలగగలగాలి’. ఈ నాలుగు మూలస్తంభాలుగా ఉన్న పాఠశాలలో విద్యాభ్యాసం మొదలైతే పిల్లల్లో వికాసం బాగుంటుంది. హైస్కూలు స్థాయికి వస్తే పిల్లల్ని గ్రూప్ యాక్టివిటీలో పాల్గొనేటట్లు చూసే పాఠశాల అయితే మంచిది. - డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మానసికపరివర్తన చెందే ప్రధాన దశలు 1. మూడు నుంచి ఐదేళ్లు 2. ఎనిమిది నుంచి పదేళ్లు 3. 14 - 18 ఏళ్లు -
పువ్వులా వికసించనివ్వాలిపక్షిలా ఎగరనివ్వాలి
పూలు వాటికవే వికసిస్తాయి. మనం వెళ్లి మొక్కల ఎదురుగా కూర్చుని ‘కమాన్ బేబీ... గ్రోఅప్ గ్రోఅప్’ అనే పనే లేదు. పక్షులు వాటంతటవే ఎగురుతాయి. మనం వెళ్లి వాటి రెక్కల్లో ప్రొపెల్లర్లు అమర్చి టపటపమని పైకి ఎగరేయనవసరం లేదు. పిల్లలు కూడా పూలు, పక్షుల వంటివారే. నెమ్మదిగా, క్రమబద్ధంగా ఎదుగుతారు. రెక్కలు వచ్చినప్పుడు వాళ్లే ఎగురుతారు. ఈలోపు - మనం తొందరపడకూడదు. వారిని తొందరపెట్టకూడదు. తొందర పడితే, తొందర పెడితే ఏమౌతుందన్నదే... ఈవారం ‘లాలిపాఠం’... పిల్లలంటే... అమ్మానాన్నల ప్రేమకు ప్రతిరూపాలు. కడుపులో బిడ్డ పూర్తిగా ఒక రూపాన్ని సంతరించుకోక ముందే తల్లి కళ్లలో ఒక ఆకారం రూపుదిద్దుకుంటుంది. ఆ రూపం తల్లిని మురిపిస్తుంది. కడుపులో బిడ్డ కదలికలు మొదలై చిట్టిచేతులతో తల్లిని తాకుతుంటే తల్లి గిలిగింతలకు లోనవుతుంది. ఆ బుజ్జి చేతులు పెద్దయ్యాక ఏం చేయాలనే కలలు కూడా అప్పుడే మొదలవుతాయి. ఇక బిడ్డను చూసుకున్న తర్వాత తన ప్రేమను, కలలను రంగరించి బిడ్డకు ఉగ్గుపడుతుంది. బిడ్డకు ఒక్కో నెల నిండుతుంటే తల్లిదండ్రులు రోజుకోసారి బిడ్డ ఎదుగుదలను బేరీజు వేసుకుంటూ గడుపుతుంటారు. ఆ మమకారంలో... నిన్న పాకడం మొదలు పెట్టిన పాపాయి రేపటికి నడవాలన్నంత ఆతృత ఉంటుంది. బిడ్డను చేతుల్లోనే పెంచాలన్నంత తపన ఉంటుంది ఆ ప్రేమలో. పిల్లల్ని ప్రేమతో పెంచడమే కాదు పరిణతితో పెంచడం చాలా అవసరం అంటారు చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి. పిల్లల మీద నుంచి దృష్టి మరలనివ్వకుండా పెంచడం తప్పుకాదు, పైగా చాలా అవసరం కూడా. అయితే అది ఏ వయసు వరకు... అనే స్పృహ తల్లిదండ్రులకు ఉండాలంటారాయన. పక్షులు గుడ్లు పొదిగి పిల్లల్ని పెడతాయి. పిల్లలకు రెక్కలు వచ్చే వరకు తల్లి పక్షి తన రెక్కల మాటున కాపాడుతుంది. ఆహారాన్ని నోటితో తెచ్చి పిల్లల నోట్లో పెడుతుంది. రెక్కలు వచ్చిన తర్వాత ఆహార సేకరణ నేర్పిస్తుంది. ఆహారాన్ని సేకరించడంలో నైపుణ్యం వచ్చిన తర్వాత పిల్లల్ని గూటిలో ఉండనివ్వవు పెద్ద పక్షులు. ఇది ప్రకృతి సిద్ధంగా పిల్లల్ని పెంచడంలో పాటించాల్సిన సూత్రం. ‘పువ్వు దానంతట అదే వికసించాలి, ముందుగా వికసింపచేయాలని ప్రయత్నించరాదు, అలాగే స్వతహాగా వికసిస్తున్న పువ్వుకు చేతులు అడ్డుపెట్టి నిరోధించరాదు’ అని చెబుతూ పిల్లల పెంపకంలో కొన్ని ప్రాథమిక సూత్రాలను వివరించారు. పిల్లల్ని రక్షణవలయంలో పెంచాల్సిన దశ, పిల్లలకు ప్రవర్తన నియమాలు నేర్పించాల్సిన దశ, సూచనలిచ్చి వారి పనులు వారి చేతనే చేయించాల్సిన దశ, పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయాలు, వారు చేస్తుంటే దూరం నుంచి పర్యవేక్షించాల్సిన పరిస్థితులు, తమ నిర్ణయాలను తామే తీసుకునేటట్లు ఎప్పుడు ప్రోత్సహించాలి... వంటి వివరాలను తెలియచేశారు. ఆరేళ్ల వరకు... చంటిబిడ్డగా ఉన్నప్పుడు క్షణక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఊహ తెలియడం మొదలైనప్పటి నుంచి కొద్దికొద్దిగా దూరం అలవాటు చేయాలి. పాపాయిని బొమ్మల ముందు కూర్చోబెట్టి ఐదు - పది నిమిషాల సేపు తల్లి కనిపించకుండా ఆడుకోనివ్వాలి. ఈ సమయంలో బిడ్డ కదలికను గమనిస్తూ ఉండాలి. సొంతంగా తన ప్రపంచంలో తానుగా కొంతసమయం గడపడం అలవాటు చేయాలి. ఆరేళ్ల వరకు పిల్లల మీద తల్లిదండ్రుల నియంత్రణ, రక్షణ 80 శాతం ఉండాలి. ఆరు నుంచి పదేళ్ల వరకు... ఈ వయసులో పేరెంట్స్ నేర్పాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే... ముందు వెనుకలు చూసుకోకుండా కొత్తవాళ్ల దగ్గరకు వెళ్లడాన్ని నివారించాలి. తెలియనివారితో వెళ్లడం, వాళ్లు ఇచ్చినవి తినడం వంటి విషయాల్లో జాగ్రత్త చెప్పాలి. అలాగే ఈ వయసులో... ఎక్కడ ఆడుకోవచ్చు, ఎక్కడ ఆడుకోకూడదు వంటివి చెప్పడంతోబాటు వాహనాలను చూసుకోకుండా రోడ్డు మీద పరుగులు తీస్తే ఎదురయ్యే ప్రమాదాలు ఎలా ఉంటాయో చెప్పాలి. చెప్పినట్లు వినకుండా దూకుడుగా వెళ్తుంటే నియంత్రించాలి. ప్రవర్తన నియమాలు నేర్పించడానికి కూడా సరైన వయసు ఇదే. పదేళ్లు దాటితే... పదేళ్లు నిండిన పిల్లల పెంపకంలో నిశితంగా ఉంటూ నియంత్రణ తగ్గించాలి. 10-13 ఏళ్ల వయసు పిల్లల మీద తల్లిదండ్రుల నియంత్రణ 40 శాతానికి మించకూడదు. ఈ వయసులో తమ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉంటోందని పిల్లలు నమ్మాలి. టీనేజ్‌లో... టీనేజ్ పిల్లలతో వ్యవహరించేటప్పుడు మరీ సున్నితంగా ఉండాలి. ఈ దశలో పిల్లలు చైల్డ్‌హుడ్ దశ దాటారనే విషయాన్ని జీర్ణించుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండరు. పిల్లల్లో మాత్రం తాము చిన్న పిల్లలం కాదనే అభిప్రాయంతోపాటు తాము పెద్దయ్యాం అనుకుంటుంటారు. ఈ వయసు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారు చెప్పిన విషయాన్ని విని ఆశ్చర్యం ప్రకటించాలి, అది నిజమా అన్నట్లు ఆసక్తి కనబరచాలి. పిల్లల ఉత్సాహాన్ని గమనించి బయటి పనులు చెప్పి చక్కబెట్టుకుని రమ్మని ప్రోత్సహించాలి. వ్యక్తిత్వం వికసించే వయసులో... టీనేజ్ పూర్తయి 20 ఏళ్లు వచ్చేసరికి పిల్లలకు తమ హక్కులేంటో తెలుసుకోగలుగుతారు. తల్లిదండ్రులు ఏకధాటిగా ఎంత చెప్పినా అది వాళ్ల మెదడును చేరదు. చెప్పడం మానేసి చర్చించడం మొదలుపెట్టాలి. పిల్లలను మాట్లాడనివ్వాలి, అభిప్రాయాలను వ్యక్తం చేయనివ్వాలి. ఈ వయసు పిల్లలకు తల్లిదండ్రులు తమ అనుభవాలను చెప్పాలి. ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అనే నియమావళిని వివరించాలి. ఇలాంటి సందర్భంలో ‘మేము ఇలా చేశాం, ఇలాంటి ఫలితాన్ని సాధించాం’ అని చెప్పి వదిలేస్తే చాలు. పిల్లలు తామున్న పరిస్థితికి అన్వయించుకుని విశ్లేషించుకుంటారు. వారిలో ఈ ఆలోచన సాగుతున్నట్లు పైకి తెలియనివ్వరు, కానీ ప్రతి విషయాన్నీ బేరీజు వేసుకుని తామెలా చేయాలనే అవగాహనకు వస్తుంటారు. మార్గదర్శనంగా మాత్రమే..! ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. పిల్లలు ఈ వయసులో తాత్కాలికంగానే ఆలోచిస్తారు, దీర్ఘకాల ప్రయోజనాలను ఆశించి నిర్ణయం తీసుకోవడం చాలా తక్కువ. వాళ్ల నిర్ణయం లోపభూయిష్టంగా ఉన్నట్లు అనిపించినా కూడా దానిని ఒక్కమాటలో కొట్టిపారేయడం మంచిది కాదు. అందులో సహేతుకమైన సందేహాలను లేవనెత్తి పరిష్కారం వాళ్లనే చెప్పమనాలి, అవసరమైతే సవరణలను సూచించాలి. తల్లిదండ్రుల పాత్ర కీలకంగా మారేది ఇప్పుడే. అయితే ఆ రోల్ పిల్లలను నియంత్రించేదిగా ఉండకూడదు, దిక్సూచిగా, మార్గదర్శనంగా మాత్రమే ఉండాలి. - వాకా మంజులారెడ్డి ఊహకు వాస్తవానికి తేడా... ఆరేళ్లలోపు పిల్లలకు వాస్తవానికి, ఊహాజనితానికి మధ్య తేడా తెలియదు. కథల్లో విన్న పులి, నక్క నిజంగానే మాట్లాడతాయి అనుకుంటారు. కార్టూన్ చానెల్స్ చూస్తూ ఆ పాత్రలు చేసిన పనులు నిజంగా జరుగుతాయనుకుంటారు. పిల్లలకు ఈ తేడా తెలిసేటట్లు చెప్పడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ. ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు తల్లిదండ్రుల నియంత్రణ అరవై శాతానికి పరిమితం కావాలి. ఏ బొమ్మలతో ఆడుకోవాలి, ఏ దుస్తులు ధరించాలనే నిర్ణయాలను వాళ్లకే వదిలేయాలి. ఇవి చిన్న విషయాలే, కానీ పిల్లల్లో... ‘తమ ఇష్టాన్ని అమ్మానాన్నలు కాదనరు’ అనే నమ్మకం కలిగించడం చాలా అవసరం. - డా. కల్యాణ్‌చక్రవర్తి చైల్డ్ సైకియాట్రిస్ట్