పూలు వాటికవే వికసిస్తాయి.
మనం వెళ్లి మొక్కల ఎదురుగా కూర్చుని
‘కమాన్ బేబీ... గ్రోఅప్ గ్రోఅప్’ అనే పనే లేదు.
పక్షులు వాటంతటవే ఎగురుతాయి.
మనం వెళ్లి వాటి రెక్కల్లో ప్రొపెల్లర్లు అమర్చి
టపటపమని పైకి ఎగరేయనవసరం లేదు.
పిల్లలు కూడా పూలు, పక్షుల వంటివారే.
నెమ్మదిగా, క్రమబద్ధంగా ఎదుగుతారు.
రెక్కలు వచ్చినప్పుడు వాళ్లే ఎగురుతారు.
ఈలోపు - మనం తొందరపడకూడదు.
వారిని తొందరపెట్టకూడదు.
తొందర పడితే, తొందర పెడితే ఏమౌతుందన్నదే...
ఈవారం ‘లాలిపాఠం’...
పిల్లలంటే... అమ్మానాన్నల ప్రేమకు ప్రతిరూపాలు. కడుపులో బిడ్డ పూర్తిగా ఒక రూపాన్ని సంతరించుకోక ముందే తల్లి కళ్లలో ఒక ఆకారం రూపుదిద్దుకుంటుంది. ఆ రూపం తల్లిని మురిపిస్తుంది. కడుపులో బిడ్డ కదలికలు మొదలై చిట్టిచేతులతో తల్లిని తాకుతుంటే తల్లి గిలిగింతలకు లోనవుతుంది. ఆ బుజ్జి చేతులు పెద్దయ్యాక ఏం చేయాలనే కలలు కూడా అప్పుడే మొదలవుతాయి. ఇక బిడ్డను చూసుకున్న తర్వాత తన ప్రేమను, కలలను రంగరించి బిడ్డకు ఉగ్గుపడుతుంది. బిడ్డకు ఒక్కో నెల నిండుతుంటే తల్లిదండ్రులు రోజుకోసారి బిడ్డ ఎదుగుదలను బేరీజు వేసుకుంటూ గడుపుతుంటారు. ఆ మమకారంలో... నిన్న పాకడం మొదలు పెట్టిన పాపాయి రేపటికి నడవాలన్నంత ఆతృత ఉంటుంది.
బిడ్డను చేతుల్లోనే పెంచాలన్నంత తపన ఉంటుంది ఆ ప్రేమలో. పిల్లల్ని ప్రేమతో పెంచడమే కాదు పరిణతితో పెంచడం చాలా అవసరం అంటారు చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి. పిల్లల మీద నుంచి దృష్టి మరలనివ్వకుండా పెంచడం తప్పుకాదు, పైగా చాలా అవసరం కూడా. అయితే అది ఏ వయసు వరకు... అనే స్పృహ తల్లిదండ్రులకు ఉండాలంటారాయన. పక్షులు గుడ్లు పొదిగి పిల్లల్ని పెడతాయి. పిల్లలకు రెక్కలు వచ్చే వరకు తల్లి పక్షి తన రెక్కల మాటున కాపాడుతుంది. ఆహారాన్ని నోటితో తెచ్చి పిల్లల నోట్లో పెడుతుంది. రెక్కలు వచ్చిన తర్వాత ఆహార సేకరణ నేర్పిస్తుంది. ఆహారాన్ని సేకరించడంలో నైపుణ్యం వచ్చిన తర్వాత పిల్లల్ని గూటిలో ఉండనివ్వవు పెద్ద పక్షులు.
ఇది ప్రకృతి సిద్ధంగా పిల్లల్ని పెంచడంలో పాటించాల్సిన సూత్రం. ‘పువ్వు దానంతట అదే వికసించాలి, ముందుగా వికసింపచేయాలని ప్రయత్నించరాదు, అలాగే స్వతహాగా వికసిస్తున్న పువ్వుకు చేతులు అడ్డుపెట్టి నిరోధించరాదు’ అని చెబుతూ పిల్లల పెంపకంలో కొన్ని ప్రాథమిక సూత్రాలను వివరించారు. పిల్లల్ని రక్షణవలయంలో పెంచాల్సిన దశ, పిల్లలకు ప్రవర్తన నియమాలు నేర్పించాల్సిన దశ, సూచనలిచ్చి వారి పనులు వారి చేతనే చేయించాల్సిన దశ, పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయాలు, వారు చేస్తుంటే దూరం నుంచి పర్యవేక్షించాల్సిన పరిస్థితులు, తమ నిర్ణయాలను తామే తీసుకునేటట్లు ఎప్పుడు ప్రోత్సహించాలి... వంటి వివరాలను తెలియచేశారు.
ఆరేళ్ల వరకు...
చంటిబిడ్డగా ఉన్నప్పుడు క్షణక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఊహ తెలియడం మొదలైనప్పటి నుంచి కొద్దికొద్దిగా దూరం అలవాటు చేయాలి. పాపాయిని బొమ్మల ముందు కూర్చోబెట్టి ఐదు - పది నిమిషాల సేపు తల్లి కనిపించకుండా ఆడుకోనివ్వాలి. ఈ సమయంలో బిడ్డ కదలికను గమనిస్తూ ఉండాలి. సొంతంగా తన ప్రపంచంలో తానుగా కొంతసమయం గడపడం అలవాటు చేయాలి. ఆరేళ్ల వరకు పిల్లల మీద తల్లిదండ్రుల నియంత్రణ, రక్షణ 80 శాతం ఉండాలి.
ఆరు నుంచి పదేళ్ల వరకు...
ఈ వయసులో పేరెంట్స్ నేర్పాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే... ముందు వెనుకలు చూసుకోకుండా కొత్తవాళ్ల దగ్గరకు వెళ్లడాన్ని నివారించాలి. తెలియనివారితో వెళ్లడం, వాళ్లు ఇచ్చినవి తినడం వంటి విషయాల్లో జాగ్రత్త చెప్పాలి. అలాగే ఈ వయసులో... ఎక్కడ ఆడుకోవచ్చు, ఎక్కడ ఆడుకోకూడదు వంటివి చెప్పడంతోబాటు వాహనాలను చూసుకోకుండా రోడ్డు మీద పరుగులు తీస్తే ఎదురయ్యే ప్రమాదాలు ఎలా ఉంటాయో చెప్పాలి. చెప్పినట్లు వినకుండా దూకుడుగా వెళ్తుంటే నియంత్రించాలి. ప్రవర్తన నియమాలు నేర్పించడానికి కూడా సరైన వయసు ఇదే.
పదేళ్లు దాటితే...
పదేళ్లు నిండిన పిల్లల పెంపకంలో నిశితంగా ఉంటూ నియంత్రణ తగ్గించాలి. 10-13 ఏళ్ల వయసు పిల్లల మీద తల్లిదండ్రుల నియంత్రణ 40 శాతానికి మించకూడదు. ఈ వయసులో తమ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉంటోందని పిల్లలు నమ్మాలి.
టీనేజ్‌లో...
టీనేజ్ పిల్లలతో వ్యవహరించేటప్పుడు మరీ సున్నితంగా ఉండాలి. ఈ దశలో పిల్లలు చైల్డ్‌హుడ్ దశ దాటారనే విషయాన్ని జీర్ణించుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండరు. పిల్లల్లో మాత్రం తాము చిన్న పిల్లలం కాదనే అభిప్రాయంతోపాటు తాము పెద్దయ్యాం అనుకుంటుంటారు. ఈ వయసు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారు చెప్పిన విషయాన్ని విని ఆశ్చర్యం ప్రకటించాలి, అది నిజమా అన్నట్లు ఆసక్తి కనబరచాలి. పిల్లల ఉత్సాహాన్ని గమనించి బయటి పనులు చెప్పి చక్కబెట్టుకుని రమ్మని ప్రోత్సహించాలి.
వ్యక్తిత్వం వికసించే వయసులో...
టీనేజ్ పూర్తయి 20 ఏళ్లు వచ్చేసరికి పిల్లలకు తమ హక్కులేంటో తెలుసుకోగలుగుతారు. తల్లిదండ్రులు ఏకధాటిగా ఎంత చెప్పినా అది వాళ్ల మెదడును చేరదు. చెప్పడం మానేసి చర్చించడం మొదలుపెట్టాలి. పిల్లలను మాట్లాడనివ్వాలి, అభిప్రాయాలను వ్యక్తం చేయనివ్వాలి. ఈ వయసు పిల్లలకు తల్లిదండ్రులు తమ అనుభవాలను చెప్పాలి. ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అనే నియమావళిని వివరించాలి. ఇలాంటి సందర్భంలో ‘మేము ఇలా చేశాం, ఇలాంటి ఫలితాన్ని సాధించాం’ అని చెప్పి వదిలేస్తే చాలు. పిల్లలు తామున్న పరిస్థితికి అన్వయించుకుని విశ్లేషించుకుంటారు. వారిలో ఈ ఆలోచన సాగుతున్నట్లు పైకి తెలియనివ్వరు, కానీ ప్రతి విషయాన్నీ బేరీజు వేసుకుని తామెలా చేయాలనే అవగాహనకు వస్తుంటారు.
మార్గదర్శనంగా మాత్రమే..!
ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. పిల్లలు ఈ వయసులో తాత్కాలికంగానే ఆలోచిస్తారు, దీర్ఘకాల ప్రయోజనాలను ఆశించి నిర్ణయం తీసుకోవడం చాలా తక్కువ. వాళ్ల నిర్ణయం లోపభూయిష్టంగా ఉన్నట్లు అనిపించినా కూడా దానిని ఒక్కమాటలో కొట్టిపారేయడం మంచిది కాదు. అందులో సహేతుకమైన సందేహాలను లేవనెత్తి పరిష్కారం వాళ్లనే చెప్పమనాలి, అవసరమైతే సవరణలను సూచించాలి. తల్లిదండ్రుల పాత్ర కీలకంగా మారేది ఇప్పుడే. అయితే ఆ రోల్ పిల్లలను నియంత్రించేదిగా ఉండకూడదు, దిక్సూచిగా, మార్గదర్శనంగా మాత్రమే ఉండాలి.
- వాకా మంజులారెడ్డి
ఊహకు వాస్తవానికి తేడా...
ఆరేళ్లలోపు పిల్లలకు వాస్తవానికి, ఊహాజనితానికి మధ్య తేడా తెలియదు. కథల్లో విన్న పులి, నక్క నిజంగానే మాట్లాడతాయి అనుకుంటారు. కార్టూన్ చానెల్స్ చూస్తూ ఆ పాత్రలు చేసిన పనులు నిజంగా జరుగుతాయనుకుంటారు. పిల్లలకు ఈ తేడా తెలిసేటట్లు చెప్పడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ. ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు తల్లిదండ్రుల నియంత్రణ అరవై శాతానికి పరిమితం కావాలి. ఏ బొమ్మలతో ఆడుకోవాలి, ఏ దుస్తులు ధరించాలనే నిర్ణయాలను వాళ్లకే వదిలేయాలి. ఇవి చిన్న విషయాలే, కానీ పిల్లల్లో... ‘తమ ఇష్టాన్ని అమ్మానాన్నలు కాదనరు’ అనే నమ్మకం కలిగించడం చాలా అవసరం.
- డా. కల్యాణ్‌చక్రవర్తి
చైల్డ్ సైకియాట్రిస్ట్