Lalipatham
-
పెద్దలు పాటిస్తే...పిల్లలూ ఆచరిస్తారు
సంక్రాంతిని తెచ్చేది సూర్యుడే అయినా... సూర్యుడికి నచ్చేది మాత్రం భోగి పండుగే! ఉదయాన్నే వేసే భోగి మంటల్లో... సాయంత్రం పోసే భోగి పళ్ల్లలో... సూర్యఛాయలు దర్శనమిస్తాయి కాబట్టేపిల్లల్ని భోగిమంటల దగ్గర కూర్చోబెడతారు. సూర్యుని రంగు, రూపం, పేరు ఉన్న భోగిపండ్లను పిల్లల తలపై పోస్తారు. ఇవాళ భోగి. మంటలు వేయడానికి కుదిరినా, కుదరకున్నా భోగిపండ్లను పోయడం మాత్రం మరువకండి. పండగలు కళ తప్పకూడదంటే పిల్లల్ని మన సంప్రదాయాలకు దగ్గరగా పెంచాలని చెప్పడమే ఈవారం ‘లాలిపాఠం’. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి అందరూ సంక్రాంతి కోసం ఎదురు చూస్తుంటే పిల్లలు భోగి పండుగకోసమే ఎదురు చూస్తారు. టపటపా తల మీద పడుతూ, కొత్త దుస్తులను తాకుతూ నేల మీదకు జారే భోగిపళ్ల వేడుకను మనోనేత్రం ముందు ఊహించుకుంటారు. అయితే ఇవన్నీ మునుపటి దృశ్యాలు. కాలం మారుతోంది... మారుతోంది ఏమిటి? చాలా మారింది. పాశ్చాత్య ప్రభావంతో కొత్త చదువులతోపాటు కొత్త వేడుకలు కూడా అలవాటయ్యాయి. క్రమంగా మన సంప్రదాయ పండుగలకు కళ తగ్గుతోంది. మన పండుగల కళ తగ్గకూడదంటే వాటిని పిల్లల చేత ఆచరింప చేయాలి. తీపి జ్ఞాపకాలు! భోగిపండుగ రోజు భోగిపళ్లు పోయించుకోవడం పిల్లలకో తీపి జ్ఞాపకం. తోటి పిల్లలు రావడం, బంధువులు, ఇరుగుపొరుగు వచ్చి రేగుపళ్లను తల మీద పోస్తూ దిష్టి తొలగిపోయి సుఖంగా ఉండాలని దీవిస్తుంటే... ఇవేవీ తెలియని చిన్న పిల్లలు కూడా వచ్చిన వాళ్లందరూ తమ సంతోషాన్ని కోరుతున్నారని గ్రహించి ఆనందంలో మునిగిపోతారు. సంక్రాంతి రోజు పితృదేవతలకు తర్పణాలు వదలడంలో కాలం చేసిన తాతయ్యలు, జేజవ్వలను తలుచుకుంటారు. వాళ్లతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. తాతయ్యల, జేజవ్వల ఫొటోలను ప్రేమతో అలంకరిస్తారు. కనుమ రోజు పశువులకు మేత వేయిస్తే ప్రతి ప్రాణినీ ప్రేమించడం నేర్చుకుంటారు. నగరాల్లో పశువులు కనిపించడం కష్టమే, కానీ గోవులున్న ఆలయాలు ఉన్నాయి. ఒకసారి క్యాలెండర్‌ను తిరగేస్తే... రథసప్తమి, ఉగాది, వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి, మంగళగౌరీ వ్రతం, విజయదశమి, అట్లతద్దె, దీపావళి... మనం సంతోషంగా చేసుకోవాలే కానీ ఎన్ని రకాల వేడుకలో! ఉదాహరణకు దీపావళి వెళ్లిన తర్వాత సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్లడం, ఆమె అభిమానంతో వండిన పదార్థాలతో భోజనం చేయడం, ఆమెకు బహుమతి ఇవ్వడం వంటివన్నీ భగినీ హస్త భోజనం వేడుకలో భాగం. ఇది అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని పెంచే పండుగ. పదేళ్ల పాపాయి చేత తమ్ముడికి లేదా అన్నయ్యకు ఇష్టమైన తీపిని తల్లి దగ్గరుండి చేయించడంలో ఉన్న ముచ్చటే వేరు. ఆ తీపి తిన్న తర్వాత కొడుకు చేత కూతురికి చిన్న బహుమతి ఇప్పిస్తే ఆ జ్ఞాపకం ఇంటిల్లిపాదికీ పదిలం. ఈ ముచ్చట్లన్నీ పిల్లల చేత చేయించాలి, వాళ్లకివన్నీ అనుభవంలోకి రావాలి. పండుగలెందుకంటే... పండుగలన్నీ మనుషుల మధ్య సామాజిక బాంధవ్యాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. తమ దగ్గరున్న దాన్ని ఎదుటివారికి ఇవ్వడాన్ని నేర్పిస్తాయి, ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాయి. ఇతరులతో కలిసి జీవించడాన్ని నేర్పిస్తాయి. అయితే పండుగలంటే మన దర్పాన్ని, డబ్బును, హోదాని ప్రదర్శించే వేదికలు కాదని, ఆడంబరాలు కాదని తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లలకు పండుగల పరమార్థాన్ని నేర్పించాలి. అమ్మాయి చేత ఇంటి ముందు రంగవల్లికలు పెట్టించి, అందులో గొబ్బెమ్మలు పెట్టడం తల్లి దగ్గరుండి చేయిస్తే, అబ్బాయికి గాలి పటాలు ఎలా ఎగురవేయాలో నేర్పించడం తండ్రి బాధ్యత. పళ్లెం నిండా బియ్యం పోసుకుని వేకువన వచ్చిన హరిదాసుకు వేయడానికి ‘నేనంటే నేను’ అని వాదులాడుకోవడం పిల్లల హక్కు. అయితే రోజుకొకరి చొప్పున ముప్పై రోజులను చెరి పదిహేను రోజులకు పంచడం అమ్మానాన్నల పెద్దరికం. గంగిరెద్దు, బుడబుక్కల వాళ్లు, కొమ్ము బూర ఊదే వాళ్లను చూసి జీవన వైవిధ్యాలను తెలుసుకుంటారు. వీళ్లందరికీ పంట పండించిన రైతు ధాన్యం ఇవ్వడం చూసి పరస్పర ఆధారితాలైన రకరకాల వృత్తులను తెలుసుకుంటారు. ఆ అడుగు మన ఇంటినుంచే పడాలి! ప్రతి పండుగకూ ఒక మూలం ఉంటుంది, ఆ మూలంలో ఒక కథ ఉంటుంది. ఆ కథ తెలియని తల్లిదండ్రుల తరం ఇది. దీనికి కారణం గత తరం తల్లిదండ్రుల పొరపాటే. ఈ తరం అమ్మానాన్నల బాల్యంలో ఆ కథలకు స్థానం లేకపోయినా ఆ కథలన్నీ పుస్తకాల్లో జీవించే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే గండి పడిన సంప్రదాయ వారధిని కదంబపూతతో నింపే అవకాశం ఈ తరం చిన్నపిల్లల అమ్మానాన్నల చేతిలో ఉంది. మన సంప్రదాయం కనుమరుగవుతోందని గగ్గోలు పెడితే ప్రయోజనం ఉండదు. సంప్రదాయాన్ని పరిరక్షించడం అనే పెద్ద పదానికి తొలి అడుగు ఇంటినుంచే పడాలి. ఆరోగ్య హేతువులైన మన సంప్రదాయాలను పిల్లల చేత ఆచరింప చేయాలి. అవన్నీ పిల్లలకు జ్ఞాపకాలుగా ఉండిపోవాలి. పెద్దయిన తర్వాత వాళ్లు తమ పిల్లలకు చెప్పుకోవడానికి మధురస్మృతులుగా మారాలి. నేర్పించకపోతే ఏమవుతుంది... ఈ ప్రశ్న చిన్నదే కానీ సమాధానం చిన్నది కాదు. ‘ట్వింకిల్ట్వింకిల్ లిటిల్ స్టార్’ తరానికి చేత వెన్నముద్ద తెలియడం లేదు, చెంగల్వ పూదండను చూడడం లేదు. చిట్టిచిలకమ్మ వాళ్లకి కనిపించదు, వినాయకుడికి సమర్పించే పత్రిలో ఏమేమి ఉంటాయో తెలిసే అవకాశమే ఉండదు. ఆ పత్రిలోని ఔషధగుణాల మీద పాశ్చాత్యులు పేటెంట్ తీసుకుంటే... అప్పుడు ఇంటర్నెట్లో మారేడు దళాన్ని భారతీయులు పూజల్లో ఉపయోగించేవారని చదువుకుని ‘ఇది భారత్ గొప్పదనం’ అని తృప్తి పడడం వారి వంతవుతుంది. మన ఔషధాల ఔన్నత్యాన్ని మనం తెలుసుకోలేకపోయామని బాధపడడం అందరి వంతు అవుతుంది. మన తర్వాతి తరానికి ఈ దుస్థితి పట్టకుండా ఉండాలంటే పెద్దలం మనం పాటిద్దాం. తర్వాత మన పిల్లలు వాటిని ఆచరిస్తారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి భోగి పండుగ రోజు... భోగిమంటలు వేసి అభ్యంగన స్నానం చేస్తారు. దీనిని విధాయక కృత్యం అంటారు. ఈ స్నానంతో భోగిపీడ వదిలిపోతుందని నమ్మకం. చంటిపిల్లలకు తలంటిపోసి, కొత్తదుస్తులు తొడుగుతారు. మధ్యాహ్నం భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లు, చిల్లర నాణేలు, చెరకు ముక్కలు, బంతిపూలు కలిపి పిల్లల తలమీద నుంచి దిగబార పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని బోడికలు పోయడం అంటారు. ఇది దృష్టిదోష పరిహారార్థం చేసే క్రతువు. ఇది ఆయుర్ వృద్ధికరం అని నమ్మకం. సంక్రాంతి... ప్రధానంగా పెద్దలను గుర్తు చేసుకునే రోజు. ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కొన్నిచోట్ల ఈ రోజున కంచు పాత్ర నిండా నువ్వులను నింపి దానం చేసే సంప్రదాయం ఉంది. శనిదోషం తొలగడానికి ఇలా చేస్తారు. ఈ రోజున పంచదార- నువ్వులు కలిపిన చిమ్మిలి ముద్దలను పిల్లల చేత ఇరుగు పొరుగుకి ఇప్పిస్తారు. - డాక్టర్ రేవూరి అనంతపద్మనాభరావు, పౌరాణిక వ్యాఖ్యాత -
మొగ్గ విరిసేవేళ...
నాలుగైదేళ్ల చిన్నారులకు అమ్మానాన్నలే అన్నీ ‘మా అమ్మకు అన్నీ తెలుసు, మా నాన్న హీరో, నాన్నను ఎవరూ ఏమీ చేయలేరు’... ఇదీ వాళ్ల ప్రపంచం. తల్లిదండ్రుల వెచ్చటి సంరక్షణలో నచ్చింది తినడం, హాయిగా ఆడుకోవడమే వారికి తెలుసు. సరిగ్గా అలాంటి సమయంలోనే అటు తల్లిదండ్రులను, ఇటు చిన్నారులను కూడా చదువు పేరుతో కాసేపు వేరు చేసేదే స్కూల్. ఈ దశలో తల్లిదండ్రులు తమ చిన్నారులను ఎటువంటి స్కూలుకు పంపాలి... అదే కాస్త పెద్ద పిల్లలైతే, వారు ప్రస్తుతం చదువుతున్న స్కూలు లేదా కాలేజీ మార్చాలా వద్దా అనే ఆలోచనలో మునిగిపోయి ఉన్న తల్లిదండ్రులకోసమే ఈ వారం లాలిపాఠం. రాబోయే విద్యాసంవత్సరానికి జనవరి నుంచే ప్రవేశాలు మొదలవుతుంటాయి కాబట్టి ఇంట్లో మూడేళ్ల పిల్లాడు ఉన్నాడంటే ఆ తల్లిదండ్రులకు ఇది కీలకదశగా అనిపిస్తుంటుంది. బంధువులు, స్నేహితులు ఎవరు కలిసినా ‘మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఆ స్కూలు బాగుందా’ అనే ప్రశ్నలే పలకరింపులవుతుంటాయి. నాలుగేళ్ల పాపాయికి కూడా ఇంట్లో తన గురించే చర్చ జరుగుతోందని తెలుస్తుంటుంది. తల్లిదండ్రుల మాటల్లో తన గురించి, స్కూలు అనే కొత్త పదంతో కలిపి చర్చ జరుగుతోందని తెలుసుకుంటారు. కానీ ‘స్కూలంటే ఏమిటి’ అనే సందేహం కూడా అదే సమయంలో వస్తుంది. ఈ వయసులో పిల్లలు తాము విన్న పదాలను, తెలిసిన పరిసరాలకు మేళవించి విశ్లేషిస్తుంటారు. ఇదే విషయాలను చెప్తూ పిల్లల్లో మానసికపరివర్తన ప్రధానంగా మూడు దశల్లో ఉంటుందన్నారు చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి. ఈ పరివర్తనలో భాగంగా విశ్లేషణ ధోరణితోపాటు ‘ఎందుకు, ఏమిటి, ఎలా’ అనే సందేహాలు కూడా కలుగుతుంటాయి. దాంతోపాటు ‘ఒకసారి ప్రయత్నించి చూద్దాం’ అనే ఆసక్తి కూడ కలుగుతుంది. మూడు నుంచి ఐదేళ్ల వయసులో... మంచికి - చెడుకి మధ్య తేడాతోపాటు తమకు రక్షణ ఎవరి దగ్గర ఉందనేది కూడా గ్రహిస్తారు. పిల్లలకు అమ్మకూచి, నాన్న కూచి అనే ముద్ర పడేది ఈ దశలోనే. తనకు ఎక్కువ ప్రేమను ఎవరు పంచుతున్నారు, తన ఇష్టానికి తగినట్లు ఎవరు చేస్తున్నారు... అని విశ్లేషించుకుంటారు. వారితో బాంధవ్యాన్ని పెంచుకుంటారు. సరిగ్గా ఇదే దశలో ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తల్లి గంటకు మించి కనిపించకపోతే పిల్లల్లో ఆందోళన (స్ట్రేంజర్ యాంగ్జయిటీ) మొదలవుతుంది. ఈ దశలో పిల్లలకు ఇంటికి దూరంగా కొన్ని గంటలు గడపాల్సి రావడం పెద్ద పరీక్ష. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రూపొందినదే ప్లేస్కూల్ విధానం. ప్లేస్కూల్ తల్లిదండ్రుల భూమికను నిర్వర్తించే ప్రదేశం కావాలి. ఈ వయసు పిల్లలు స్కూలుకు వెళ్లడానికి ఏడుస్తున్నారంటే అమ్మానాన్నలు కనిపించనందుకే. ఈ వయసులో స్కూలుకు వెళ్తారు, తోటి పిల్లలతో ఆడుకుంటారు, కొత్తవాళ్లతో మెలగడం నేర్చుకుంటారు... అంతవరకే ఆశించాలి తప్ప ఎంతో చదివేయాలని, పేజీలకు పేజీలు రాయాలని కోరుకోకూడదు. ఎనిమిది నుంచి పదేళ్లు... పిల్లలను ఆందోళనకు గురిచేసే మరో దశ సెకండరీ స్కూల్ సమయం. ‘ఇక ఆటలు తగ్గించుకోవాలి, క్రికెట్, డాన్సు ప్రాక్టీస్ మానేయాలి’, ‘మాథ్స్‌కి ట్యూషన్ పెట్టించాలి, లెక్కలు బాగా చెప్పే మాస్టారు గురించి వాకబు చేయండి’ అనే మాటలే వినబడుతుంటాయి ఇంట్లో. ఒక్కసారిగా మారిపోయిన ఇంటి వాతావరణం పిల్లల్ని బాధ్యతాయుతంగా మారుస్తుంది, అదేసమయంలో కొంతమంది పిల్లల్ని భయస్తులుగానూ మారుస్తుంది. ఆ భయానికి బానిసలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. స్కూలు మార్చడం తప్పనిసరా? ఆరవ తరగతికి స్కూలు మార్చడం నిజంగా అవసరమేనా, స్కూలు మారిస్తే వచ్చే ప్రయోజనాలేంటి, మార్చకపోతే వచ్చే నష్టాలేంటి... అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఉన్న స్కూల్లో ఇబ్బంది ఏంటి, ఇదే సమస్య మరో స్కూలులో ఉండవని నమ్మవచ్చా... ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మూడోదశ మొదలయ్యే సమయం... పిల్లల పరివర్తన మూడవ దశలో ఉన్నప్పుడు స్కూలు నుంచి కాలేజ్‌కి మారాల్సి ఉంటుంది. కాలేజ్‌ని అధ్యయనం చేయడంలో తల్లిదండ్రుల కోణం, పిల్లల కోణం పరస్పర భిన్నంగా ఉంటాయి. రెండు పార్టీల అభిప్రాయాలను కలబోసుకుని తుది నిర్ణయానికి రావాలి. కొంతమంది పిల్లలు ఇంటర్ మొదటి సంవత్సరంలో ‘కాలేజ్ మారుతాను’ అంటుంటారు. ఆ దశలో కాలేజ్ మార్చడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ‘కొత్త కాలేజ్ అంటే దూరపు కొండలు నునుపు’ వంటిదేనని సర్దిచెప్పాలి. ఆ వయసులో పిల్లలకు తల్లిదండ్రుల కౌన్సెలింగ్ సరిపోదు. నాలుగేళ్ల వయసులో తల్లి, తండ్రిని మించిన వాళ్లు లేరనుకునే ఈ పిల్లలే పదహారు ఏళ్లకు అమ్మానాన్నలకంటే ఎక్కువ తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నారనే భావనలోకి వస్తారు. అందుకే స్పెషలిస్టుతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. పిల్లల చదువులో కీలకమైన మూడు దశలు, పిల్లల పరివర్తన చెందే ప్రధానమైన మూడుదశలూ ఒకేసారి కావడం యాదృచ్చికమే. కెరీర్ విషయంలో ఎవరి ప్రాధాన్యాలు ఎలా ఉన్నా, స్థూలంగా అందరూ పాటించాల్సిన అంశాలివన్నీ. - వాకా మంజులారెడ్డి ముద్ర వేయకూడదు! లేబిలింగ్ ఎఫెక్ట్... ‘మా అబ్బాయికి కెమిస్ట్రీ సరిగా రాదు, అమ్మాయికి మాథ్స్ కష్టం’ అని తల్లిదండ్రులు తరచూ అంటుండడం వల్ల పిల్లలు ‘బాబోయ్ కెమిస్ట్రీ నా వల్ల కాదు, మాథ్స్‌లో నేను పాసవడమే గొప్ప’ అని తమకు తామే ప్రకటించుకుంటుంటారు. నిజానికి అది తల్లిదండ్రులు తగిలించే ట్యాగ్. ఫలానా సబ్జెక్ట్‌లో వీక్ అని తెలిసినప్పుడు ‘సోషల్ ఆన్సర్స్ ఒకసారి చదివితే వచ్చేస్తున్నాయి కదా, సైన్స్‌లో అలా రాకపోతే రెండు-మూడుసార్లు ప్రయత్నించాలి అంతే’ అనే ధోరణితో పిల్లలను గాడిలో పెట్టాలి. ఉదాహరణకు - ఒకసారి రన్నింగ్రేస్లో వెనుకబడితే మరో ప్రయత్నం చేసేటప్పుడు ‘నువ్వు రన్నింగ్‌లో వేస్ట్. వద్దులే’ అనడం వల్ల పిల్లల్లో తాము రన్నింగ్రేస్కి ప్రయత్నం చేయకపోవడమే మంచిదనే అభిప్రాయం బలపడుతుంది. ప్రాథమిక పాఠశాల ఎంపిక ఇలా! యుకేజీ పూర్తయ్యేసరికి ఇన్ని రాయిస్తాం అనే స్కూలుకు బదులు పిల్లల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతాం అనే స్కూలుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా... ఆలోచనశక్తిని పెంపొందించే వాతావరణం ఉన్న స్కూలుకి మార్కులేయాలి. పిల్లలు ‘తానేంటి’ అని తమకు తాముగా తెలుసుకునే అవకాశం ఉన్న స్కూలు కావాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా ఉండాలి. ఇంటి తర్వాత ఎక్కువ సమయం గడపాల్సిన ప్రదేశం కాబట్టి పిల్లలు ‘భయం లేకుండా మెలగగలగాలి’. ఈ నాలుగు మూలస్తంభాలుగా ఉన్న పాఠశాలలో విద్యాభ్యాసం మొదలైతే పిల్లల్లో వికాసం బాగుంటుంది. హైస్కూలు స్థాయికి వస్తే పిల్లల్ని గ్రూప్ యాక్టివిటీలో పాల్గొనేటట్లు చూసే పాఠశాల అయితే మంచిది. - డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మానసికపరివర్తన చెందే ప్రధాన దశలు 1. మూడు నుంచి ఐదేళ్లు 2. ఎనిమిది నుంచి పదేళ్లు 3. 14 - 18 ఏళ్లు -
పువ్వులా వికసించనివ్వాలిపక్షిలా ఎగరనివ్వాలి
పూలు వాటికవే వికసిస్తాయి. మనం వెళ్లి మొక్కల ఎదురుగా కూర్చుని ‘కమాన్ బేబీ... గ్రోఅప్ గ్రోఅప్’ అనే పనే లేదు. పక్షులు వాటంతటవే ఎగురుతాయి. మనం వెళ్లి వాటి రెక్కల్లో ప్రొపెల్లర్లు అమర్చి టపటపమని పైకి ఎగరేయనవసరం లేదు. పిల్లలు కూడా పూలు, పక్షుల వంటివారే. నెమ్మదిగా, క్రమబద్ధంగా ఎదుగుతారు. రెక్కలు వచ్చినప్పుడు వాళ్లే ఎగురుతారు. ఈలోపు - మనం తొందరపడకూడదు. వారిని తొందరపెట్టకూడదు. తొందర పడితే, తొందర పెడితే ఏమౌతుందన్నదే... ఈవారం ‘లాలిపాఠం’... పిల్లలంటే... అమ్మానాన్నల ప్రేమకు ప్రతిరూపాలు. కడుపులో బిడ్డ పూర్తిగా ఒక రూపాన్ని సంతరించుకోక ముందే తల్లి కళ్లలో ఒక ఆకారం రూపుదిద్దుకుంటుంది. ఆ రూపం తల్లిని మురిపిస్తుంది. కడుపులో బిడ్డ కదలికలు మొదలై చిట్టిచేతులతో తల్లిని తాకుతుంటే తల్లి గిలిగింతలకు లోనవుతుంది. ఆ బుజ్జి చేతులు పెద్దయ్యాక ఏం చేయాలనే కలలు కూడా అప్పుడే మొదలవుతాయి. ఇక బిడ్డను చూసుకున్న తర్వాత తన ప్రేమను, కలలను రంగరించి బిడ్డకు ఉగ్గుపడుతుంది. బిడ్డకు ఒక్కో నెల నిండుతుంటే తల్లిదండ్రులు రోజుకోసారి బిడ్డ ఎదుగుదలను బేరీజు వేసుకుంటూ గడుపుతుంటారు. ఆ మమకారంలో... నిన్న పాకడం మొదలు పెట్టిన పాపాయి రేపటికి నడవాలన్నంత ఆతృత ఉంటుంది. బిడ్డను చేతుల్లోనే పెంచాలన్నంత తపన ఉంటుంది ఆ ప్రేమలో. పిల్లల్ని ప్రేమతో పెంచడమే కాదు పరిణతితో పెంచడం చాలా అవసరం అంటారు చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి. పిల్లల మీద నుంచి దృష్టి మరలనివ్వకుండా పెంచడం తప్పుకాదు, పైగా చాలా అవసరం కూడా. అయితే అది ఏ వయసు వరకు... అనే స్పృహ తల్లిదండ్రులకు ఉండాలంటారాయన. పక్షులు గుడ్లు పొదిగి పిల్లల్ని పెడతాయి. పిల్లలకు రెక్కలు వచ్చే వరకు తల్లి పక్షి తన రెక్కల మాటున కాపాడుతుంది. ఆహారాన్ని నోటితో తెచ్చి పిల్లల నోట్లో పెడుతుంది. రెక్కలు వచ్చిన తర్వాత ఆహార సేకరణ నేర్పిస్తుంది. ఆహారాన్ని సేకరించడంలో నైపుణ్యం వచ్చిన తర్వాత పిల్లల్ని గూటిలో ఉండనివ్వవు పెద్ద పక్షులు. ఇది ప్రకృతి సిద్ధంగా పిల్లల్ని పెంచడంలో పాటించాల్సిన సూత్రం. ‘పువ్వు దానంతట అదే వికసించాలి, ముందుగా వికసింపచేయాలని ప్రయత్నించరాదు, అలాగే స్వతహాగా వికసిస్తున్న పువ్వుకు చేతులు అడ్డుపెట్టి నిరోధించరాదు’ అని చెబుతూ పిల్లల పెంపకంలో కొన్ని ప్రాథమిక సూత్రాలను వివరించారు. పిల్లల్ని రక్షణవలయంలో పెంచాల్సిన దశ, పిల్లలకు ప్రవర్తన నియమాలు నేర్పించాల్సిన దశ, సూచనలిచ్చి వారి పనులు వారి చేతనే చేయించాల్సిన దశ, పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయాలు, వారు చేస్తుంటే దూరం నుంచి పర్యవేక్షించాల్సిన పరిస్థితులు, తమ నిర్ణయాలను తామే తీసుకునేటట్లు ఎప్పుడు ప్రోత్సహించాలి... వంటి వివరాలను తెలియచేశారు. ఆరేళ్ల వరకు... చంటిబిడ్డగా ఉన్నప్పుడు క్షణక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఊహ తెలియడం మొదలైనప్పటి నుంచి కొద్దికొద్దిగా దూరం అలవాటు చేయాలి. పాపాయిని బొమ్మల ముందు కూర్చోబెట్టి ఐదు - పది నిమిషాల సేపు తల్లి కనిపించకుండా ఆడుకోనివ్వాలి. ఈ సమయంలో బిడ్డ కదలికను గమనిస్తూ ఉండాలి. సొంతంగా తన ప్రపంచంలో తానుగా కొంతసమయం గడపడం అలవాటు చేయాలి. ఆరేళ్ల వరకు పిల్లల మీద తల్లిదండ్రుల నియంత్రణ, రక్షణ 80 శాతం ఉండాలి. ఆరు నుంచి పదేళ్ల వరకు... ఈ వయసులో పేరెంట్స్ నేర్పాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే... ముందు వెనుకలు చూసుకోకుండా కొత్తవాళ్ల దగ్గరకు వెళ్లడాన్ని నివారించాలి. తెలియనివారితో వెళ్లడం, వాళ్లు ఇచ్చినవి తినడం వంటి విషయాల్లో జాగ్రత్త చెప్పాలి. అలాగే ఈ వయసులో... ఎక్కడ ఆడుకోవచ్చు, ఎక్కడ ఆడుకోకూడదు వంటివి చెప్పడంతోబాటు వాహనాలను చూసుకోకుండా రోడ్డు మీద పరుగులు తీస్తే ఎదురయ్యే ప్రమాదాలు ఎలా ఉంటాయో చెప్పాలి. చెప్పినట్లు వినకుండా దూకుడుగా వెళ్తుంటే నియంత్రించాలి. ప్రవర్తన నియమాలు నేర్పించడానికి కూడా సరైన వయసు ఇదే. పదేళ్లు దాటితే... పదేళ్లు నిండిన పిల్లల పెంపకంలో నిశితంగా ఉంటూ నియంత్రణ తగ్గించాలి. 10-13 ఏళ్ల వయసు పిల్లల మీద తల్లిదండ్రుల నియంత్రణ 40 శాతానికి మించకూడదు. ఈ వయసులో తమ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉంటోందని పిల్లలు నమ్మాలి. టీనేజ్‌లో... టీనేజ్ పిల్లలతో వ్యవహరించేటప్పుడు మరీ సున్నితంగా ఉండాలి. ఈ దశలో పిల్లలు చైల్డ్‌హుడ్ దశ దాటారనే విషయాన్ని జీర్ణించుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండరు. పిల్లల్లో మాత్రం తాము చిన్న పిల్లలం కాదనే అభిప్రాయంతోపాటు తాము పెద్దయ్యాం అనుకుంటుంటారు. ఈ వయసు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారు చెప్పిన విషయాన్ని విని ఆశ్చర్యం ప్రకటించాలి, అది నిజమా అన్నట్లు ఆసక్తి కనబరచాలి. పిల్లల ఉత్సాహాన్ని గమనించి బయటి పనులు చెప్పి చక్కబెట్టుకుని రమ్మని ప్రోత్సహించాలి. వ్యక్తిత్వం వికసించే వయసులో... టీనేజ్ పూర్తయి 20 ఏళ్లు వచ్చేసరికి పిల్లలకు తమ హక్కులేంటో తెలుసుకోగలుగుతారు. తల్లిదండ్రులు ఏకధాటిగా ఎంత చెప్పినా అది వాళ్ల మెదడును చేరదు. చెప్పడం మానేసి చర్చించడం మొదలుపెట్టాలి. పిల్లలను మాట్లాడనివ్వాలి, అభిప్రాయాలను వ్యక్తం చేయనివ్వాలి. ఈ వయసు పిల్లలకు తల్లిదండ్రులు తమ అనుభవాలను చెప్పాలి. ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అనే నియమావళిని వివరించాలి. ఇలాంటి సందర్భంలో ‘మేము ఇలా చేశాం, ఇలాంటి ఫలితాన్ని సాధించాం’ అని చెప్పి వదిలేస్తే చాలు. పిల్లలు తామున్న పరిస్థితికి అన్వయించుకుని విశ్లేషించుకుంటారు. వారిలో ఈ ఆలోచన సాగుతున్నట్లు పైకి తెలియనివ్వరు, కానీ ప్రతి విషయాన్నీ బేరీజు వేసుకుని తామెలా చేయాలనే అవగాహనకు వస్తుంటారు. మార్గదర్శనంగా మాత్రమే..! ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. పిల్లలు ఈ వయసులో తాత్కాలికంగానే ఆలోచిస్తారు, దీర్ఘకాల ప్రయోజనాలను ఆశించి నిర్ణయం తీసుకోవడం చాలా తక్కువ. వాళ్ల నిర్ణయం లోపభూయిష్టంగా ఉన్నట్లు అనిపించినా కూడా దానిని ఒక్కమాటలో కొట్టిపారేయడం మంచిది కాదు. అందులో సహేతుకమైన సందేహాలను లేవనెత్తి పరిష్కారం వాళ్లనే చెప్పమనాలి, అవసరమైతే సవరణలను సూచించాలి. తల్లిదండ్రుల పాత్ర కీలకంగా మారేది ఇప్పుడే. అయితే ఆ రోల్ పిల్లలను నియంత్రించేదిగా ఉండకూడదు, దిక్సూచిగా, మార్గదర్శనంగా మాత్రమే ఉండాలి. - వాకా మంజులారెడ్డి ఊహకు వాస్తవానికి తేడా... ఆరేళ్లలోపు పిల్లలకు వాస్తవానికి, ఊహాజనితానికి మధ్య తేడా తెలియదు. కథల్లో విన్న పులి, నక్క నిజంగానే మాట్లాడతాయి అనుకుంటారు. కార్టూన్ చానెల్స్ చూస్తూ ఆ పాత్రలు చేసిన పనులు నిజంగా జరుగుతాయనుకుంటారు. పిల్లలకు ఈ తేడా తెలిసేటట్లు చెప్పడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ. ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు తల్లిదండ్రుల నియంత్రణ అరవై శాతానికి పరిమితం కావాలి. ఏ బొమ్మలతో ఆడుకోవాలి, ఏ దుస్తులు ధరించాలనే నిర్ణయాలను వాళ్లకే వదిలేయాలి. ఇవి చిన్న విషయాలే, కానీ పిల్లల్లో... ‘తమ ఇష్టాన్ని అమ్మానాన్నలు కాదనరు’ అనే నమ్మకం కలిగించడం చాలా అవసరం. - డా. కల్యాణ్‌చక్రవర్తి చైల్డ్ సైకియాట్రిస్ట్ -
మెల్లని పాపాయికి లాలనే ఆలంబన
పిల్లలు అల్లరి చేస్తుంటే... ‘ప్రాణాలు తోడేయకండ్రోయ్’ అని మొత్తుకుంటాం! పిల్లలు అసలే అల్లరి చేయకుండా ఉంటుంటే? అప్పుడూ... ప్రాణాలు తోడేసినట్లే ఉంటుంది! రెండిట్లో ఏది బెటర్? అల్లరి చేయడమే! అల్లరి అంటే చురుకుదనం, చలాకీదనం. అంతేకదా! హరివిల్లంటే రంగురంగులుగా ఉండాలి. పక్షులంటే కిలకిలలాడుతూ ఉండాలి. సెలయేరులంటే గలగలమంటూ ఉండాలి. పూలు, పూలతలు తలలూపుతూ ఉండాలి. పిల్లలంటే... ఇవన్నీ చేస్తూండాలి. కిలకిలమనాలి, కిసుక్కుమనాలి. గలగలలాడాలి, గెంతులేయాలి. కానీ కొంతమంది పిల్లలు ‘స్పెషల్’గా ఉంటారు. ఆ స్పెషాలిటీ పిల్లలది కాదనీ పుట్టుకతోవచ్చిన ఒక అసహజత్వమనీ తెలియగానే తల్లిదండ్రులు హతాశులవుతారు. అలా ఏం కానవసరం లేదని, కౌన్సెలింగ్‌తో వారిని తక్కిన పిల్లల్లా తీర్చిదిద్దవచ్చనీ భరోసా ఇచ్చేదే... ఈ వారం లాలిపాఠం... మూడు నెలల తన బుజ్జితండ్రికి లాలపోసి తీసుకొచ్చింది శ్రీజ. ఒళ్లు తుడిచి పౌడర్ వేస్తూ బిడ్డను చూసుకుంటూ మురిసిపోతోంది. ఎక్కువ ఏడవకుండా బుద్ధిగా ఉంటున్నాడని, రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నాడని ముచ్చటపడుతోంది. ఒకరోజు పోలియో డ్రాప్స్ వేయించడానికి, రొటీన్ చెకప్ కోసం పీడియాట్రీషియన్ దగ్గరకు తీసుకెళ్లింది. చైల్డ్ రెస్పాన్స్ నార్మల్‌గానే ఉంటోందా అనే సందేహంతో డాక్టర్ బిడ్డ ఎదురుగా చిటికె వేసి శబ్దం చేశారు, వెనుక వైపుగా పెద్ద శబ్దం చేశారు. బిడ్డ పెద్దగా స్పందించడం లేదని అర్థమైంది. శ్రీజను కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత డాక్టర్ తన సందేహం నిజమేనని నిర్ధారణకు వచ్చారు. ఆ మాటలను బట్టి తన బిడ్డ స్పెషల్ నీడ్స్ కిడ్ అని అర్థం కావడంతో శ్రీజకు భూమి కంపించినట్లయింది. ప్రపంచంలో ఇంతమంది పిల్లలు ఆరోగ్యంగా ఆడుతూ పాడుతూ ఉంటే తన బిడ్డకే ఇలా ఎందుకు? అని కుమిలిపోయింది. అన్నీ ప్రశ్నార్థకాలే ! శ్రీజ కౌన్సెలర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ బిడ్డను పెంచుతోంది. నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు శ్రీజలో ‘బాబుకు చదువెలా?’ అనే మరో ప్రశ్నార్థకం. ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో మెలగ గలిగేలా తీర్చిదిద్దడం ఎలా? అదసలు సాధ్యమేనా? వంటి సందేహాలతో కృశించిపోతోంది. అయితే అలా బెంగపడక్కరలేదు, మానసిక, శారీరక అవకరాలతో పుట్టిన స్పెషల్ కిడ్స్‌ని సాధారణమైన పిల్లల్లా తీర్చిదిద్దడం సాధ్యమేనంటారు వైద్య నిపుణులు. ఈ కింది సూచనలను పాటిస్తే ఈ పిల్లలు సాధారణ పిల్లల్లాగే సమాజంలో సులువుగా కలిసిపోగలరంటారు. ప్రత్యేకంగా పెంచాలి! ‘స్పెషల్ కిడ్స్‌ని మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడం కష్టమైన పనే, కానీ అసాధ్యం మాత్రం కాద’ంటారు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నిర్వహకురాలు శైలజారావు. తమ స్కూల్లో నత్తి, స్లో లెర్నర్, ఇతర సమస్యలతో పుట్టిన పిల్లలకు సాధారణ పిల్లలతో కలిపి పాఠాలు చెప్తున్నట్లు, అలా చదువుకున్న వారిలో నేషనల్ ఓపెన్ స్కూల్ పరీక్ష రాసి టెన్త్ క్లాస్ పాసయినట్లు చెప్పారామె. ‘బాధపడుతూ కూర్చోవడం వల్ల, సమస్య నుంచి పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని స్వీకరించాలి. సమాజం నుంచి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి వీలుగా విల్‌పవర్‌ని పెంచుకోవాలి. పాఠశాలలు కూడా అన్నిరకాల పిల్లల్ని చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అటెన్షన్ డిజార్టర్‌తో బాధపడుతున్న పిల్లలకు పాఠాలను తేలిక పదాలతో నేర్పించాలి. అలా చేయగలిగితే స్పెషల్ కిడ్స కూడా సాధారణ పిల్లల్లాగే సమాజంలో కలిసిపోతారు. స్పెషల్ చిల్డ్రన్ని సాధారణ పిల్లల్లా తీర్చిదిద్దడం అంటే గతంలో అసలు ఊహకందని విషయం. ఇప్పుడు సమాజంలో అవగాహన పెరిగింది. పిల్లలకు, తల్లిదండ్రులకు సపోర్టు లభిస్తోంది. మా స్కూల్లో అంధ విద్యార్థులు చదువు, ఆటపాటల్లో రాణిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుంటే చాలు. స్పెషల్ కిడ్ నుంచి ఎక్ట్స్రార్డినరీ పెర్ఫార్మెన్స్ని ఆశించకూడదు కానీ నార్మల్ కిడ్‌గా మార్చడం సాధ్యమే’ అన్నారామె. గుర్తించిన వెంటనే..! స్పెషల్ కిడ్ అని గుర్తించిన తర్వాత ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించాలంటారు డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి. ‘‘స్పెషల్ చైల్డ్ విషయంలోనూ తల్లిదండ్రులు డాక్టర్‌కు ప్రతి సమస్యనూ వివరించాలి. డాక్టర్ బిడ్డ పెంపకం గురించి తల్లిదండ్రులకు చెప్పిన సూత్రాలను యథాతథంగా పాటించాలి. తొలిదశలో ట్రీట్మెంట్ మొదలైతే మంచి ఫలితాలు ఉంటాయి. నత్తి విషయానికి వస్తే ఆందోళన, ఉద్వేగం ఎక్కువయ్యేకొద్దీ మాట పట్టేయడం కూడా ఎక్కువవుతుంది. ఆందోళనకరమైన పరిస్థితిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిదానంగా మాట్లాడితే మాట పట్టేయడం తగ్గుతుంది. ఆవేశంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండి, తర్వాత మెల్లగా మాట్లాడితే చెప్పదలుచుకున్న విషయాన్ని సులభంగా చెప్పవచ్చు. ఈ రకంగా తల్లిదండ్రులు ప్రాక్టీస్ చేయిస్తూ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి’’ అంటారాయన. సహనానికి ప్రతీకలు కావాలి! స్పీచ్ సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఇంట్లో చక్కగా మాట్లాడతారు. కానీ కొత్తవారితో మాట్లాడాలంటే భయపడుతుంటారు. నలుగురిలో ఉత్సాహంగా మాట్లాడబోయి మాట రాక బిక్కముఖం పెడతారు. అలాంటప్పుడు తల్లిదండ్రులకు ఏమీ పాలుపోక పిల్లల్ని అక్కడే దండిస్తుంటారు. స్పెషల్ కిడ్స తల్లులు పిల్లలతో చాలా సహనంతో వ్యవహరించాలి. ఇది చాలా తప్పు. పిల్లలు ధైర్యం కోల్పోతుంటే వారికి ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ ఉండాలి. ‘ఇది చాలా చిన్న సమస్య, డాక్టర్ చెప్పినట్లు చేస్తుంటే తగ్గిపోతుంది’ అని నచ్చచెప్పాలి. డాక్టర్ కౌన్సెలింగ్ కంటే తల్లి కౌన్సెలింగ్ బాగా పనిచేస్తుంది. - వాకా మంజులారెడ్డి స్పెషల్ కిడ్స్ ఉన్న తల్లిదండ్రుల కోసం... కుటుంబ చరిత్రలో ఎవరికైనా సరే, నత్తి, మూగ, అంధత్వం, చెవిటితనం వంటి శారీరక లోపాలు లేదా ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్ వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక, శారీరక పెరుగుదలను ప్రత్యేక శ్రద్ధతో గమనించాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉన్నట్లు గమనిస్తే, ఆ పరిస్థితిని సత్వరంగా స్వీకరించి, మానసికంగా దృఢంగా మారాలి. సమాజం నుంచి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే విల్‌పవర్‌ని మనం పెంచుకుని, పిల్లల్లోనూ పెంచాలి. మనసులో ఏమాత్రం అసహనం, చిరాకు కలిగినా దానిని పిల్లల మీద ప్రదర్శించకూడదు. సంయమనం పాటిస్తూ ఇలాంటి పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పెంచితే స్పెషల్ కిడ్స్ కూడా అన్ని రంగాలలో బాగానే రాణిస్తారు.