సంక్రాంతిని తెచ్చేది సూర్యుడే అయినా...
సూర్యుడికి నచ్చేది మాత్రం భోగి పండుగే!
ఉదయాన్నే వేసే భోగి మంటల్లో...
సాయంత్రం పోసే భోగి పళ్ల్లలో...
సూర్యఛాయలు దర్శనమిస్తాయి కాబట్టేపిల్లల్ని భోగిమంటల దగ్గర కూర్చోబెడతారు.
సూర్యుని రంగు, రూపం, పేరు ఉన్న భోగిపండ్లను పిల్లల తలపై పోస్తారు.
ఇవాళ భోగి.
మంటలు వేయడానికి కుదిరినా, కుదరకున్నా భోగిపండ్లను పోయడం మాత్రం మరువకండి.
పండగలు కళ తప్పకూడదంటే పిల్లల్ని మన సంప్రదాయాలకు దగ్గరగా
పెంచాలని చెప్పడమే ఈవారం ‘లాలిపాఠం’.
ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి అందరూ సంక్రాంతి కోసం ఎదురు చూస్తుంటే పిల్లలు భోగి పండుగకోసమే ఎదురు చూస్తారు. టపటపా తల మీద పడుతూ, కొత్త దుస్తులను తాకుతూ నేల మీదకు జారే భోగిపళ్ల వేడుకను మనోనేత్రం ముందు ఊహించుకుంటారు. అయితే ఇవన్నీ మునుపటి దృశ్యాలు. కాలం మారుతోంది... మారుతోంది ఏమిటి? చాలా మారింది. పాశ్చాత్య ప్రభావంతో కొత్త చదువులతోపాటు కొత్త వేడుకలు కూడా అలవాటయ్యాయి. క్రమంగా మన సంప్రదాయ పండుగలకు కళ తగ్గుతోంది. మన పండుగల కళ తగ్గకూడదంటే వాటిని పిల్లల చేత ఆచరింప చేయాలి.
తీపి జ్ఞాపకాలు!
భోగిపండుగ రోజు భోగిపళ్లు పోయించుకోవడం పిల్లలకో తీపి జ్ఞాపకం. తోటి పిల్లలు రావడం, బంధువులు, ఇరుగుపొరుగు వచ్చి రేగుపళ్లను తల మీద పోస్తూ దిష్టి తొలగిపోయి సుఖంగా ఉండాలని దీవిస్తుంటే... ఇవేవీ తెలియని చిన్న పిల్లలు కూడా వచ్చిన వాళ్లందరూ తమ సంతోషాన్ని కోరుతున్నారని గ్రహించి ఆనందంలో మునిగిపోతారు. సంక్రాంతి రోజు పితృదేవతలకు తర్పణాలు వదలడంలో కాలం చేసిన తాతయ్యలు, జేజవ్వలను తలుచుకుంటారు. వాళ్లతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. తాతయ్యల, జేజవ్వల ఫొటోలను ప్రేమతో అలంకరిస్తారు.
కనుమ రోజు పశువులకు మేత వేయిస్తే ప్రతి ప్రాణినీ ప్రేమించడం నేర్చుకుంటారు. నగరాల్లో పశువులు కనిపించడం కష్టమే, కానీ గోవులున్న ఆలయాలు ఉన్నాయి. ఒకసారి క్యాలెండర్‌ను తిరగేస్తే... రథసప్తమి, ఉగాది, వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి, మంగళగౌరీ వ్రతం, విజయదశమి, అట్లతద్దె, దీపావళి... మనం సంతోషంగా చేసుకోవాలే కానీ ఎన్ని రకాల వేడుకలో! ఉదాహరణకు దీపావళి వెళ్లిన తర్వాత సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్లడం, ఆమె అభిమానంతో వండిన పదార్థాలతో భోజనం చేయడం, ఆమెకు బహుమతి ఇవ్వడం వంటివన్నీ భగినీ హస్త భోజనం వేడుకలో భాగం.
ఇది అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని పెంచే పండుగ. పదేళ్ల పాపాయి చేత తమ్ముడికి లేదా అన్నయ్యకు ఇష్టమైన తీపిని తల్లి దగ్గరుండి చేయించడంలో ఉన్న ముచ్చటే వేరు. ఆ తీపి తిన్న తర్వాత కొడుకు చేత కూతురికి చిన్న బహుమతి ఇప్పిస్తే ఆ జ్ఞాపకం ఇంటిల్లిపాదికీ పదిలం. ఈ ముచ్చట్లన్నీ పిల్లల చేత చేయించాలి, వాళ్లకివన్నీ అనుభవంలోకి రావాలి.
పండుగలెందుకంటే...
పండుగలన్నీ మనుషుల మధ్య సామాజిక బాంధవ్యాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. తమ దగ్గరున్న దాన్ని ఎదుటివారికి ఇవ్వడాన్ని నేర్పిస్తాయి, ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాయి. ఇతరులతో కలిసి జీవించడాన్ని నేర్పిస్తాయి.
అయితే పండుగలంటే మన దర్పాన్ని, డబ్బును, హోదాని ప్రదర్శించే వేదికలు కాదని, ఆడంబరాలు కాదని తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లలకు పండుగల పరమార్థాన్ని నేర్పించాలి. అమ్మాయి చేత ఇంటి ముందు రంగవల్లికలు పెట్టించి, అందులో గొబ్బెమ్మలు పెట్టడం తల్లి దగ్గరుండి చేయిస్తే, అబ్బాయికి గాలి పటాలు ఎలా ఎగురవేయాలో నేర్పించడం తండ్రి బాధ్యత. పళ్లెం నిండా బియ్యం పోసుకుని వేకువన వచ్చిన హరిదాసుకు వేయడానికి ‘నేనంటే నేను’ అని వాదులాడుకోవడం పిల్లల హక్కు. అయితే రోజుకొకరి చొప్పున ముప్పై రోజులను చెరి పదిహేను రోజులకు పంచడం అమ్మానాన్నల పెద్దరికం. గంగిరెద్దు, బుడబుక్కల వాళ్లు, కొమ్ము బూర ఊదే వాళ్లను చూసి జీవన వైవిధ్యాలను తెలుసుకుంటారు. వీళ్లందరికీ పంట పండించిన రైతు ధాన్యం ఇవ్వడం చూసి పరస్పర ఆధారితాలైన రకరకాల వృత్తులను తెలుసుకుంటారు.
ఆ అడుగు మన ఇంటినుంచే పడాలి!
ప్రతి పండుగకూ ఒక మూలం ఉంటుంది, ఆ మూలంలో ఒక కథ ఉంటుంది. ఆ కథ తెలియని తల్లిదండ్రుల తరం ఇది. దీనికి కారణం గత తరం తల్లిదండ్రుల పొరపాటే. ఈ తరం అమ్మానాన్నల బాల్యంలో ఆ కథలకు స్థానం లేకపోయినా ఆ కథలన్నీ పుస్తకాల్లో జీవించే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే గండి పడిన సంప్రదాయ వారధిని కదంబపూతతో నింపే అవకాశం ఈ తరం చిన్నపిల్లల అమ్మానాన్నల చేతిలో ఉంది. మన సంప్రదాయం కనుమరుగవుతోందని గగ్గోలు పెడితే ప్రయోజనం ఉండదు. సంప్రదాయాన్ని పరిరక్షించడం అనే పెద్ద పదానికి తొలి అడుగు ఇంటినుంచే పడాలి. ఆరోగ్య హేతువులైన మన సంప్రదాయాలను పిల్లల చేత ఆచరింప చేయాలి. అవన్నీ పిల్లలకు జ్ఞాపకాలుగా ఉండిపోవాలి. పెద్దయిన తర్వాత వాళ్లు తమ పిల్లలకు చెప్పుకోవడానికి మధురస్మృతులుగా మారాలి.
నేర్పించకపోతే ఏమవుతుంది... ఈ ప్రశ్న చిన్నదే కానీ సమాధానం చిన్నది కాదు. ‘ట్వింకిల్‌ట్వింకిల్ లిటిల్ స్టార్’ తరానికి చేత వెన్నముద్ద తెలియడం లేదు, చెంగల్వ పూదండను చూడడం లేదు. చిట్టిచిలకమ్మ వాళ్లకి కనిపించదు, వినాయకుడికి సమర్పించే పత్రిలో ఏమేమి ఉంటాయో తెలిసే అవకాశమే ఉండదు. ఆ పత్రిలోని ఔషధగుణాల మీద పాశ్చాత్యులు పేటెంట్ తీసుకుంటే... అప్పుడు ఇంటర్నెట్‌లో మారేడు దళాన్ని భారతీయులు పూజల్లో ఉపయోగించేవారని చదువుకుని ‘ఇది భారత్ గొప్పదనం’ అని తృప్తి పడడం వారి వంతవుతుంది. మన ఔషధాల ఔన్నత్యాన్ని మనం తెలుసుకోలేకపోయామని బాధపడడం అందరి వంతు అవుతుంది. మన తర్వాతి తరానికి ఈ దుస్థితి పట్టకుండా ఉండాలంటే పెద్దలం మనం పాటిద్దాం. తర్వాత మన పిల్లలు వాటిని ఆచరిస్తారు.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
భోగి పండుగ రోజు... భోగిమంటలు వేసి అభ్యంగన స్నానం చేస్తారు. దీనిని విధాయక కృత్యం అంటారు. ఈ స్నానంతో భోగిపీడ వదిలిపోతుందని నమ్మకం. చంటిపిల్లలకు తలంటిపోసి, కొత్తదుస్తులు తొడుగుతారు. మధ్యాహ్నం భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లు, చిల్లర నాణేలు, చెరకు ముక్కలు, బంతిపూలు కలిపి పిల్లల తలమీద నుంచి దిగబార పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని బోడికలు పోయడం అంటారు. ఇది దృష్టిదోష పరిహారార్థం చేసే క్రతువు. ఇది ఆయుర్ వృద్ధికరం అని నమ్మకం.
సంక్రాంతి... ప్రధానంగా పెద్దలను గుర్తు చేసుకునే రోజు. ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కొన్నిచోట్ల ఈ రోజున కంచు పాత్ర నిండా నువ్వులను నింపి దానం చేసే సంప్రదాయం ఉంది. శనిదోషం తొలగడానికి ఇలా చేస్తారు. ఈ రోజున పంచదార- నువ్వులు కలిపిన చిమ్మిలి ముద్దలను పిల్లల చేత ఇరుగు పొరుగుకి ఇప్పిస్తారు.
- డాక్టర్ రేవూరి అనంతపద్మనాభరావు, పౌరాణిక వ్యాఖ్యాత
పెద్దలు పాటిస్తే...పిల్లలూ ఆచరిస్తారు
Published Sun, Jan 12 2014 10:29 PM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
Advertisement
Advertisement