పండగ పూట విషాదం | Road Accidents in Guntur | Sakshi
Sakshi News home page

పండగ పూట విషాదం

Published Thu, Jan 17 2019 1:52 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Road Accidents in Guntur - Sakshi

ఘటనాస్థలంలో మృతి చెందిన రాజశేఖర్‌

గుంటూరు, చిలకలూరిపేట రూరల్‌: సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెప్పతిరణాల మహోత్సవాన్ని పురస్కరించుకని టైర్‌ట్యూబ్‌లతో మంచినీటి చెరువులో తిరిగేందుకు ఉత్సాహం చూపిన ముగ్గురు యువకులు నీటమునిగారు. సమీపంలో ఉన్న మరో యువకుడు కాపాడడంతో ఇద్దరు యువకులు ఒడ్డుకు చేరగా, మరో యువకుడు మృతి చెందాడు.

మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన కోనంకి అరుణ చంద్రరావు ఇద్దరు కుమారులతో కలసి గత కొంతకాలం నుంచి యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో నివసిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు కోనంకి గోపి(21) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బంధుమిత్రులను కలసుకునేందుకు బుధవారం గ్రామానికి చేరుకున్నాడు. ఉదయం తోటి మిత్రులైన పూని గోపి, మద్దినగర్‌కు చెందిన వేముల సిద్దయ్యలు ముగ్గురూ కలిసి భారీ ట్యూబ్‌ సహాయంతో గ్రామంలోని మంచినీటి చెరువులో దిగారు. చెరువు మధ్య ప్రాంతానికి చేరుకునే తరణంలో ట్యూబ్‌ జారి ముగ్గురూ చెరువులో పడ్డారు. ముగ్గురూ చేతులు పైకి ఎత్తటంతో అదే తరుణంలో వారి సమీపంలో ఉన్న మద్దినగర్‌కు చెందిన వీరి మిత్రుడు తన్నీరు గోపి, గ్రామానికి చెందిన గొట్టిపాటి శంకర్‌ మరి కొందరు వేగంగా స్పందించి వారికి చెందిన ట్యూబ్‌లను గల్లంతైన వారికి అందించారు. పూని గోపి, సిద్దయ్యలు ట్యూబ్, మిత్రుల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం గ్రామస్తులు, అగ్నిమాపక శాఖ, రెవిన్యూ రూరల్‌ పోలీస్‌ సిబ్బంది వివిధ ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు.

జాతీయ డిసాస్టర్‌ బృందం(ఎన్డీఆర్‌ఎఫ్‌)కు సమాచారం అందించిన సాయంత్రానికి రంగంలోకి దిగి మంచినీటి చెరువు మధ్యభాగంలో యువకుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి బోట్ల సహాయంతో చెరువు గుట్టుకు చేర్చారు. దీంతో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు, ఫైర్, రెవెన్యూ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం తీవ్ర కృషి చేశారు.

ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు మృతి  
గుత్తికొండ(పిడుగురాళ్ల రూరల్‌): వరిగడ్డి ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి  చెందిన రైతులు జిలుగు నారాయణ ,యడ్లపల్లి నాగరత్తయ్య, బుజ్జిబాబులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ వెంకటేశ్వర్లులు కలిసి పశుగ్రాసం కోసం పొలానికి బయలుదేరారు. జూలకల్లు మేజర్‌ కాలువ గట్టు నుంచి రోడ్డుకు దిగుతుండగా ట్రాక్టర్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న  కాలువలోకి ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నారాయణ(64), నాగరత్తయ్య(62)లు మృతి చెందగా, బుజ్జిబాబు, వెంకటేశ్వర్లులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పట్టణంలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. మృతదేహాలను గురజాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పట్టణ సీఐ వీరేంద్రబాబు కేసు నమోదు చేశారు. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

అత్తారింటికి వచ్చిన క్రమంలో..
బొల్లాపల్లి: ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగవారం రాత్రి జరిగింది. బండ్లమోటు ఎస్‌ఐ నజీర్‌బేగ్‌ తెలిపిన వివరాల ప్రకారం  మండలంలోని అయ్యన్నపాలెం పంచాయతీ శివారు మేకలదిన్నె తండాకు చెందిన రామావతు శంకర నాయక్‌(24) తన బైకుపై రేమిడిచర్ల వస్తుండగా మూగచింతపాలెం నుంచి వస్తున్న ఏసుబోయిన చిన బ్రహ్మంకు చెందిన ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శంకర నాయక్‌ అక్కడికక్కడే మృతి చెందగ చిన బ్రహ్మంతో పాటు మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం గుంటూరు వైద్యశాలకు తరలించారు. మేకలదిన్నెకు చెందిన శంకర నాయక్‌కు రెండేళ్ల క్రితం రావులాపురం పంచాయతీ పరిధిలోని బోడిçపాలెం తండాకు నాగలక్ష్మిబాయితో వివాహమైంది. వీరికి ఆరు నెలల బాబు ఉన్నాడు. పండుగను పురస్కరించుకుని అత్తారింటికి వచ్చి, తన బావమరదులతో కలసి రేమిడిచర్ల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పుల్లలచెరువు మండలం మర్రివేముల పంచాయతీ శివారు గాజులపాలెం చెందిన చిన బ్రహ్మం, మరో వ్యక్తి  జీవనోపాధి కోసం మూగచింతపాలెం గ్రామంలో ఉంటున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ నజీర్‌బేగ్‌ తెలిపారు.

డివైడర్‌ను ఢీ కొట్టి..
గుంటూరు రూరల్‌: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడిన సంఘటన బుధవారం మండలంలోని గోరంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటన స్థలిలో స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సత్తెనపల్లి మండలం నందిగామకు చెందిన ఎన్‌ రాజశేఖర్‌(46) నగరంలోని గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని శ్రీనివాస అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సమయంలో స్వర్ణభారతినగర్‌లో తన స్నేహితుడి వద్దకు వచ్చాడు. అనంతరం తిరిగి తన స్నేహితుడుతో కలిసి ద్విచక్రవాహనంపై అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌కు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న స్నేహితుడుకి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ బాబురావు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆటో పల్టీ.. బాలిక మృతి
తాడికొండ: తీవ్ర పొగమంచు కారణంగా ఆటో పల్టీ కొట్టడంతో బాలిక తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తాడికొండ మండలం లాం– జొన్నలగడ్డ అడ్డరోడ్డు కూడలి వద్ద జరిగింది. వివరాల ప్రకారం అమరావతి మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన తాడేపల్లి భాగ్యలక్ష్మి సంక్రాంతి పండుగకు సొంతూరు ఏటుకూరు వెళ్లేందుకు మంగళవారం ఉదయం ఆటోలో బయలు దేరింది. ఆటో లాం దాటి జొన్నలగడ్డ అడ్డరోడ్డు వద్దకు చేరుకునే సరిగి పొగమంచు కమ్మేసి రోడ్డు కనిపించక పోవడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఘటనలో ఇద్దరు కుమార్తెలు శ్రీలక్ష్మి, మధులతలకు తీవ్రగాయాలు కాగా చికిత్స పొందుతూ శ్రీలక్ష్మీ(12) మృతి చెందింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement