తండ్రీ... అప్పుడే నూరేళ్లు నిండాయా..! | woman and young man one boy dead in road accidents | Sakshi
Sakshi News home page

పండగ నవ్వులు మాయం

Published Sat, Jan 13 2018 9:29 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

woman and young man one boy dead in road accidents - Sakshi

ఆ కుటుంబాల్లో సంక్రాంతి పంగడ నవ్వులు మాయమయ్యాయి. పెద్దలకు పూజలు చేయాల్సిన ఇళ్లల్లో చావు బాజాలు మోగాయి. కంటైనర్, కారు, బైక్‌ రూప ంలో మృత్యువు తమ కుటుంబీకులపైకి దూసుకొ చ్చింది. కంటైనర్‌ ఢీకొని మూలిపాడుకు చెందిన మహిళ, కారు ఢీకొని సంతవురిటికి చెందిన బాలుడు, బైక్‌ ఢీకొని జోగిపాడుకు చెందిన యువకుడు మృతి చెందారు. జిల్లాలో శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన ఈ దారుణ సంఘటనలకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి.

కాశీబుగ్గ: పండగకు కొత్త దుస్తులు కొనుక్కుని సంతోషంగా ఇంటికి వెళ్తున్న ఆ మహిళ నవ్వులు ఎంతో సేపు నిలవలేదు. కంటైనర్‌ రూపంలో దూసుకువచ్చిన మృత్యువు ఆమెను మింగేసి కుటుంబానికి పండగ సంతోషం లేకుండా చేసింది. పలాస మండలం కోసంగిపురం జాతీయ రహదారి కూడలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిట్ట పాపమ్మ (34)అనే మహిళ మృతి చెందారు. మందస మండలం సొండిపూడి పంచాయతీ పరిధిలో మూలిపాడు గ్రామానికి చెందిన పాపమ్మ పాల వ్యాపారం చేస్తుంటారు. ఈమెకు భర్త తారకేశు, ఇద్దరు కుమారులు శివ(20), కుమార్తె(17) ఉన్నారు. శుక్రవారం ఉదయం పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామంలో దుస్తులు కొనుగోలు చేసి స్వగ్రామానికి తిరుగుముఖం పట్టారు. కోసంగిపురం కూడలి వద్ద భోజనం కోసం రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న కంటైనర్‌ ఆమెను బలంగా ఢీకొంది. ఢీకొన్న తర్వాత కూడా వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు తమ వాహనాలతో వెంబడించి పట్టుకున్నారు. ప్రమాదంలో పాపమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. కళ్ల ముందే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యుల రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ ఎస్‌ఐ కేవీ సురేష్‌కుమార్‌ కేసు నమోదు చేశారు.

రాజాం సిటీ/జి.సిగడాం: సంక్రాంతి పండగకు కొత్త బట్టలు కొనుక్కుందామని వెళ్లిన ఆ బాలుడు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చి పసివాడి ప్రాణాలను బలికొని ఆ ఇంట్లో పండగ సందడిని చిదిమేసింది. వివరాల్లోకి వెళితే... జి.సిగడాం మండలంలో సంతవురిటి గ్రామానికి చెందిన కొత్తుర్తి రాకేష్‌(10) అనే బాలుడు తండ్రి సూర్యప్రకాష్‌తో కలిసి బట్టల కోసం శుక్రవారం పొందూరు వెళ్లాడు. బట్టలతో పాటు ఇంటికి కావలసిన వస్తుసామగ్రి కొనుగోలుచేసి తిరిగి వస్తుండగా మరికొన్ని క్షణాల్లో ఇంటికి చేరుతామన్న సమయంలో వీరు వస్తున్న సైకిల్‌ను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాకేష్‌ అక్కడికక్కడే మృతిచెందగా తండ్రి ప్రకాష్‌రావు తీవ్రగాయాలపాలయ్యాడు.

బతికున్నాడనుకుని అదేకారులో రాకేష్‌ను రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తల్లి అనితకుమారి, బంధువులు ఆస్పత్రికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు రోదన మిన్నంటింది. వీరిని ఆపడం ఎవరి తరమూకాలేదు. గాయాలపాలైన తండ్రి చికిత్సకు కూడా సహకరించలేదు. అమ్మా... నాన్నతో వెళ్లి నూడిల్స్‌ తింటానమ్మ అంటూ వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఆ తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. నేనింకా ఎవరికోసం బతికి ఉండాలంటూ నిర్జీవంగా ఉన్న కుమారుడుని పట్టుకొని విలపించింది. బంగారు ఆభరణాల తయారీ పనిచేసుకుంటూ ఒక్కగానొక్క కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని రోదిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు.

కొత్తూరు: పండగ పూట బంధువులు, స్నేహితులతో సరదాగా గడుపుకోవాల్సిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఇంటిలో సంక్రాంతి పూజలు జరగాల్సి ఉండగా చావు బాజాలు వినిపించాయి. ఏబీ రోడ్డులో కలిగాం కూడలి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని జోగిపాడుకు చెందిన రాయాల జగన్‌(28) అనే యువకుడు మృతి చెందాడు. ఈయనకు భార్య భారతి, పిల్లలు మణికంఠ, గౌతమి ఉన్నారు. ఈ సంఘటనపై మృతుని బంధువులు చెప్పిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. రాయాల జగన్‌ బైక్‌పై కొత్తూరు నుంచి స్వగ్రామం జోగిపాడు వెళుతుండగా ఏబీ రోడ్డులో కలిగాం కూడలి వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఈ కూడలి వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండడంతో ఎస్‌ఐ విజయకుమార్‌ ఆధ్వర్యంలో అదే సమయంలో డ్రమ్ములు ఏర్పాటు చేసేందుకు వాహనం నుంచి డ్రమ్ములు బయటకు తీస్తున్నారు. అయితే పోలీస్‌లు వాహన తనిఖీలు చేస్తున్నట్టు భావించిన జగన్‌ బైక్‌ను తిరిగి వెనకకు మళ్లించే ప్రయత్నం చేశాడు.

ఇంతలో వెనుక నుంచి వస్తున్న బైక్‌ జగన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో జగన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న ఎస్‌ఐ విజయకుమార్‌ తన జీపులో స్థానిక సీహెచ్‌సీకి తీసుకువెళ్లాడు. వైద్యాధికారి ప్రవీణ్‌ వైద్యం అందిస్తుండగా జగన్‌ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియడంతో వెంటనే భార్యతో పాటు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొన్నారు. జగన్‌ మృతదేహంను చూసిన భార్య భారతి, ఇద్దు పిల్లలతో పాటు తల్లి ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నాన్న చూడు నాన్న అంటూ పిల్లలు విలపించడంతో అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. జగన్‌ మృతి చెందడంతో మాకు దిక్కు ఎవరు అని భార్య గుండెలవిసేలా రోదిస్తుంది. వీరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. జగన్‌ కర్రపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ విజయకుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement