నాలుగైదేళ్ల చిన్నారులకు అమ్మానాన్నలే అన్నీ ‘మా అమ్మకు అన్నీ తెలుసు, మా నాన్న హీరో, నాన్నను ఎవరూ ఏమీ చేయలేరు’... ఇదీ వాళ్ల ప్రపంచం. తల్లిదండ్రుల వెచ్చటి సంరక్షణలో నచ్చింది తినడం, హాయిగా ఆడుకోవడమే వారికి తెలుసు. సరిగ్గా అలాంటి సమయంలోనే అటు తల్లిదండ్రులను, ఇటు చిన్నారులను కూడా చదువు పేరుతో కాసేపు వేరు చేసేదే స్కూల్. ఈ దశలో తల్లిదండ్రులు తమ చిన్నారులను ఎటువంటి స్కూలుకు పంపాలి... అదే కాస్త పెద్ద పిల్లలైతే, వారు ప్రస్తుతం చదువుతున్న స్కూలు లేదా కాలేజీ మార్చాలా వద్దా అనే ఆలోచనలో మునిగిపోయి ఉన్న తల్లిదండ్రులకోసమే ఈ వారం లాలిపాఠం.
రాబోయే విద్యాసంవత్సరానికి జనవరి నుంచే ప్రవేశాలు మొదలవుతుంటాయి కాబట్టి ఇంట్లో మూడేళ్ల పిల్లాడు ఉన్నాడంటే ఆ తల్లిదండ్రులకు ఇది కీలకదశగా అనిపిస్తుంటుంది. బంధువులు, స్నేహితులు ఎవరు కలిసినా ‘మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఆ స్కూలు బాగుందా’ అనే ప్రశ్నలే పలకరింపులవుతుంటాయి. నాలుగేళ్ల పాపాయికి కూడా ఇంట్లో తన గురించే చర్చ జరుగుతోందని తెలుస్తుంటుంది. తల్లిదండ్రుల మాటల్లో తన గురించి, స్కూలు అనే కొత్త పదంతో కలిపి చర్చ జరుగుతోందని తెలుసుకుంటారు. కానీ ‘స్కూలంటే ఏమిటి’ అనే సందేహం కూడా అదే సమయంలో వస్తుంది. ఈ వయసులో పిల్లలు తాము విన్న పదాలను, తెలిసిన పరిసరాలకు మేళవించి విశ్లేషిస్తుంటారు. ఇదే విషయాలను చెప్తూ పిల్లల్లో మానసికపరివర్తన ప్రధానంగా మూడు దశల్లో ఉంటుందన్నారు చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి. ఈ పరివర్తనలో భాగంగా విశ్లేషణ ధోరణితోపాటు ‘ఎందుకు, ఏమిటి, ఎలా’ అనే సందేహాలు కూడా కలుగుతుంటాయి. దాంతోపాటు ‘ఒకసారి ప్రయత్నించి చూద్దాం’ అనే ఆసక్తి కూడ కలుగుతుంది.
మూడు నుంచి ఐదేళ్ల వయసులో...
మంచికి - చెడుకి మధ్య తేడాతోపాటు తమకు రక్షణ ఎవరి దగ్గర ఉందనేది కూడా గ్రహిస్తారు. పిల్లలకు అమ్మకూచి, నాన్న కూచి అనే ముద్ర పడేది ఈ దశలోనే. తనకు ఎక్కువ ప్రేమను ఎవరు పంచుతున్నారు, తన ఇష్టానికి తగినట్లు ఎవరు చేస్తున్నారు... అని విశ్లేషించుకుంటారు. వారితో బాంధవ్యాన్ని పెంచుకుంటారు. సరిగ్గా ఇదే దశలో ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తల్లి గంటకు మించి కనిపించకపోతే పిల్లల్లో ఆందోళన (స్ట్రేంజర్ యాంగ్జయిటీ) మొదలవుతుంది. ఈ దశలో పిల్లలకు ఇంటికి దూరంగా కొన్ని గంటలు గడపాల్సి రావడం పెద్ద పరీక్ష. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రూపొందినదే ప్లేస్కూల్ విధానం. ప్లేస్కూల్ తల్లిదండ్రుల భూమికను నిర్వర్తించే ప్రదేశం కావాలి. ఈ వయసు పిల్లలు స్కూలుకు వెళ్లడానికి ఏడుస్తున్నారంటే అమ్మానాన్నలు కనిపించనందుకే. ఈ వయసులో స్కూలుకు వెళ్తారు, తోటి పిల్లలతో ఆడుకుంటారు, కొత్తవాళ్లతో మెలగడం నేర్చుకుంటారు... అంతవరకే ఆశించాలి తప్ప ఎంతో చదివేయాలని, పేజీలకు పేజీలు రాయాలని కోరుకోకూడదు.
ఎనిమిది నుంచి పదేళ్లు...
పిల్లలను ఆందోళనకు గురిచేసే మరో దశ సెకండరీ స్కూల్ సమయం. ‘ఇక ఆటలు తగ్గించుకోవాలి, క్రికెట్, డాన్సు ప్రాక్టీస్ మానేయాలి’, ‘మాథ్స్‌కి ట్యూషన్ పెట్టించాలి, లెక్కలు బాగా చెప్పే మాస్టారు గురించి వాకబు చేయండి’ అనే మాటలే వినబడుతుంటాయి ఇంట్లో. ఒక్కసారిగా మారిపోయిన ఇంటి వాతావరణం పిల్లల్ని బాధ్యతాయుతంగా మారుస్తుంది, అదేసమయంలో కొంతమంది పిల్లల్ని భయస్తులుగానూ మారుస్తుంది. ఆ భయానికి బానిసలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
స్కూలు మార్చడం తప్పనిసరా?
ఆరవ తరగతికి స్కూలు మార్చడం నిజంగా అవసరమేనా, స్కూలు మారిస్తే వచ్చే ప్రయోజనాలేంటి, మార్చకపోతే వచ్చే నష్టాలేంటి... అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఉన్న స్కూల్లో ఇబ్బంది ఏంటి, ఇదే సమస్య మరో స్కూలులో ఉండవని నమ్మవచ్చా... ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి.
మూడోదశ మొదలయ్యే సమయం...
పిల్లల పరివర్తన మూడవ దశలో ఉన్నప్పుడు స్కూలు నుంచి కాలేజ్‌కి మారాల్సి ఉంటుంది. కాలేజ్‌ని అధ్యయనం చేయడంలో తల్లిదండ్రుల కోణం, పిల్లల కోణం పరస్పర భిన్నంగా ఉంటాయి. రెండు పార్టీల అభిప్రాయాలను కలబోసుకుని తుది నిర్ణయానికి రావాలి. కొంతమంది పిల్లలు ఇంటర్ మొదటి సంవత్సరంలో ‘కాలేజ్ మారుతాను’ అంటుంటారు. ఆ దశలో కాలేజ్ మార్చడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ‘కొత్త కాలేజ్ అంటే దూరపు కొండలు నునుపు’ వంటిదేనని సర్దిచెప్పాలి. ఆ వయసులో పిల్లలకు తల్లిదండ్రుల కౌన్సెలింగ్ సరిపోదు. నాలుగేళ్ల వయసులో తల్లి, తండ్రిని మించిన వాళ్లు లేరనుకునే ఈ పిల్లలే పదహారు ఏళ్లకు అమ్మానాన్నలకంటే ఎక్కువ తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నారనే భావనలోకి వస్తారు. అందుకే స్పెషలిస్టుతో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
పిల్లల చదువులో కీలకమైన మూడు దశలు, పిల్లల పరివర్తన చెందే ప్రధానమైన మూడుదశలూ ఒకేసారి కావడం యాదృచ్చికమే. కెరీర్ విషయంలో ఎవరి ప్రాధాన్యాలు ఎలా ఉన్నా, స్థూలంగా అందరూ పాటించాల్సిన అంశాలివన్నీ.
- వాకా మంజులారెడ్డి
ముద్ర వేయకూడదు!
లేబిలింగ్ ఎఫెక్ట్... ‘మా అబ్బాయికి కెమిస్ట్రీ సరిగా రాదు, అమ్మాయికి మాథ్స్ కష్టం’ అని తల్లిదండ్రులు తరచూ అంటుండడం వల్ల పిల్లలు ‘బాబోయ్ కెమిస్ట్రీ నా వల్ల కాదు, మాథ్స్‌లో నేను పాసవడమే గొప్ప’ అని తమకు తామే ప్రకటించుకుంటుంటారు. నిజానికి అది తల్లిదండ్రులు తగిలించే ట్యాగ్. ఫలానా సబ్జెక్ట్‌లో వీక్ అని తెలిసినప్పుడు ‘సోషల్ ఆన్సర్స్ ఒకసారి చదివితే వచ్చేస్తున్నాయి కదా, సైన్స్‌లో అలా రాకపోతే రెండు-మూడుసార్లు ప్రయత్నించాలి అంతే’ అనే ధోరణితో పిల్లలను గాడిలో పెట్టాలి. ఉదాహరణకు - ఒకసారి రన్నింగ్‌రేస్‌లో వెనుకబడితే మరో ప్రయత్నం చేసేటప్పుడు ‘నువ్వు రన్నింగ్‌లో వేస్ట్. వద్దులే’ అనడం వల్ల పిల్లల్లో తాము రన్నింగ్‌రేస్‌కి ప్రయత్నం చేయకపోవడమే మంచిదనే అభిప్రాయం బలపడుతుంది.
ప్రాథమిక పాఠశాల ఎంపిక ఇలా!
యుకేజీ పూర్తయ్యేసరికి ఇన్ని రాయిస్తాం అనే స్కూలుకు బదులు పిల్లల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతాం అనే స్కూలుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా...
ఆలోచనశక్తిని పెంపొందించే వాతావరణం ఉన్న స్కూలుకి మార్కులేయాలి.
పిల్లలు ‘తానేంటి’ అని తమకు తాముగా తెలుసుకునే అవకాశం ఉన్న స్కూలు కావాలి.
పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా ఉండాలి.
ఇంటి తర్వాత ఎక్కువ సమయం గడపాల్సిన ప్రదేశం కాబట్టి పిల్లలు ‘భయం లేకుండా మెలగగలగాలి’.
ఈ నాలుగు మూలస్తంభాలుగా ఉన్న పాఠశాలలో విద్యాభ్యాసం మొదలైతే పిల్లల్లో వికాసం బాగుంటుంది.
హైస్కూలు స్థాయికి వస్తే పిల్లల్ని గ్రూప్ యాక్టివిటీలో పాల్గొనేటట్లు చూసే పాఠశాల అయితే మంచిది.
- డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి
మానసికపరివర్తన చెందే ప్రధాన దశలు
1. మూడు నుంచి ఐదేళ్లు
2. ఎనిమిది నుంచి పదేళ్లు
3. 14 - 18 ఏళ్లు