మెల్లని పాపాయికి లాలనే ఆలంబన | child care tips | Sakshi
Sakshi News home page

మెల్లని పాపాయికి లాలనే ఆలంబన

Published Sun, Dec 22 2013 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

child care tips

పిల్లలు అల్లరి చేస్తుంటే... ‘ప్రాణాలు తోడేయకండ్రోయ్’ అని మొత్తుకుంటాం! పిల్లలు అసలే అల్లరి చేయకుండా ఉంటుంటే? అప్పుడూ... ప్రాణాలు తోడేసినట్లే ఉంటుంది! రెండిట్లో ఏది బెటర్? అల్లరి చేయడమే! అల్లరి అంటే చురుకుదనం, చలాకీదనం. అంతేకదా! హరివిల్లంటే రంగురంగులుగా ఉండాలి. పక్షులంటే కిలకిలలాడుతూ ఉండాలి. సెలయేరులంటే గలగలమంటూ ఉండాలి. పూలు, పూలతలు తలలూపుతూ ఉండాలి. పిల్లలంటే... ఇవన్నీ చేస్తూండాలి. కిలకిలమనాలి, కిసుక్కుమనాలి. గలగలలాడాలి, గెంతులేయాలి. కానీ కొంతమంది పిల్లలు ‘స్పెషల్’గా ఉంటారు. ఆ స్పెషాలిటీ పిల్లలది కాదనీ పుట్టుకతోవచ్చిన ఒక అసహజత్వమనీ తెలియగానే తల్లిదండ్రులు హతాశులవుతారు. అలా ఏం కానవసరం లేదని, కౌన్సెలింగ్‌తో వారిని తక్కిన పిల్లల్లా తీర్చిదిద్దవచ్చనీ భరోసా ఇచ్చేదే... ఈ వారం లాలిపాఠం...
 
 మూడు నెలల తన బుజ్జితండ్రికి లాలపోసి తీసుకొచ్చింది శ్రీజ. ఒళ్లు తుడిచి పౌడర్ వేస్తూ బిడ్డను చూసుకుంటూ మురిసిపోతోంది. ఎక్కువ ఏడవకుండా బుద్ధిగా ఉంటున్నాడని, రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నాడని ముచ్చటపడుతోంది. ఒకరోజు పోలియో డ్రాప్స్ వేయించడానికి, రొటీన్ చెకప్ కోసం పీడియాట్రీషియన్ దగ్గరకు తీసుకెళ్లింది. చైల్డ్ రెస్పాన్స్ నార్మల్‌గానే ఉంటోందా అనే సందేహంతో డాక్టర్ బిడ్డ ఎదురుగా చిటికె వేసి శబ్దం చేశారు, వెనుక వైపుగా పెద్ద శబ్దం చేశారు. బిడ్డ పెద్దగా స్పందించడం లేదని అర్థమైంది. శ్రీజను కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత డాక్టర్ తన సందేహం నిజమేనని నిర్ధారణకు వచ్చారు. ఆ మాటలను బట్టి తన బిడ్డ స్పెషల్ నీడ్స్ కిడ్ అని అర్థం కావడంతో శ్రీజకు భూమి కంపించినట్లయింది. ప్రపంచంలో ఇంతమంది పిల్లలు ఆరోగ్యంగా ఆడుతూ పాడుతూ ఉంటే తన బిడ్డకే ఇలా ఎందుకు? అని కుమిలిపోయింది.
 
 అన్నీ ప్రశ్నార్థకాలే !
 
 శ్రీజ కౌన్సెలర్‌ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ బిడ్డను పెంచుతోంది. నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు శ్రీజలో  ‘బాబుకు చదువెలా?’ అనే మరో ప్రశ్నార్థకం. ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో మెలగ గలిగేలా తీర్చిదిద్దడం ఎలా? అదసలు సాధ్యమేనా? వంటి సందేహాలతో కృశించిపోతోంది. అయితే అలా బెంగపడక్కరలేదు, మానసిక, శారీరక అవకరాలతో పుట్టిన స్పెషల్ కిడ్స్‌ని సాధారణమైన పిల్లల్లా తీర్చిదిద్దడం సాధ్యమేనంటారు వైద్య నిపుణులు. ఈ కింది సూచనలను పాటిస్తే ఈ పిల్లలు సాధారణ పిల్లల్లాగే సమాజంలో సులువుగా కలిసిపోగలరంటారు.
 
 ప్రత్యేకంగా పెంచాలి!
 
 ‘స్పెషల్ కిడ్స్‌ని మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడం కష్టమైన పనే, కానీ అసాధ్యం మాత్రం కాద’ంటారు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నిర్వహకురాలు శైలజారావు. తమ స్కూల్లో నత్తి, స్లో లెర్నర్, ఇతర సమస్యలతో పుట్టిన పిల్లలకు సాధారణ పిల్లలతో కలిపి పాఠాలు చెప్తున్నట్లు, అలా చదువుకున్న వారిలో నేషనల్ ఓపెన్ స్కూల్ పరీక్ష రాసి టెన్త్ క్లాస్ పాసయినట్లు చెప్పారామె. ‘బాధపడుతూ కూర్చోవడం వల్ల, సమస్య నుంచి పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని స్వీకరించాలి. సమాజం నుంచి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి వీలుగా విల్‌పవర్‌ని పెంచుకోవాలి. పాఠశాలలు కూడా అన్నిరకాల పిల్లల్ని చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అటెన్షన్ డిజార్టర్‌తో బాధపడుతున్న పిల్లలకు పాఠాలను తేలిక పదాలతో నేర్పించాలి. అలా చేయగలిగితే స్పెషల్ కిడ్‌‌స కూడా సాధారణ పిల్లల్లాగే సమాజంలో కలిసిపోతారు. స్పెషల్ చిల్డ్రన్‌ని సాధారణ పిల్లల్లా తీర్చిదిద్దడం అంటే గతంలో అసలు ఊహకందని విషయం. ఇప్పుడు సమాజంలో అవగాహన పెరిగింది. పిల్లలకు, తల్లిదండ్రులకు సపోర్టు లభిస్తోంది. మా స్కూల్లో అంధ విద్యార్థులు చదువు, ఆటపాటల్లో రాణిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుంటే చాలు. స్పెషల్ కిడ్ నుంచి ఎక్ట్స్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ని ఆశించకూడదు కానీ నార్మల్ కిడ్‌గా మార్చడం సాధ్యమే’ అన్నారామె.
 
 గుర్తించిన వెంటనే..!
 
 స్పెషల్ కిడ్ అని గుర్తించిన తర్వాత ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించాలంటారు డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి. ‘‘స్పెషల్ చైల్డ్ విషయంలోనూ తల్లిదండ్రులు డాక్టర్‌కు ప్రతి సమస్యనూ వివరించాలి.  డాక్టర్  బిడ్డ పెంపకం గురించి తల్లిదండ్రులకు చెప్పిన సూత్రాలను యథాతథంగా పాటించాలి. తొలిదశలో ట్రీట్‌మెంట్ మొదలైతే మంచి ఫలితాలు ఉంటాయి. నత్తి విషయానికి వస్తే ఆందోళన, ఉద్వేగం ఎక్కువయ్యేకొద్దీ మాట పట్టేయడం కూడా ఎక్కువవుతుంది. ఆందోళనకరమైన పరిస్థితిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిదానంగా మాట్లాడితే మాట పట్టేయడం తగ్గుతుంది. ఆవేశంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండి, తర్వాత మెల్లగా మాట్లాడితే చెప్పదలుచుకున్న విషయాన్ని సులభంగా చెప్పవచ్చు. ఈ రకంగా తల్లిదండ్రులు ప్రాక్టీస్ చేయిస్తూ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి’’ అంటారాయన.
 
 సహనానికి ప్రతీకలు కావాలి!
 
 స్పీచ్ సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఇంట్లో చక్కగా మాట్లాడతారు. కానీ కొత్తవారితో మాట్లాడాలంటే భయపడుతుంటారు. నలుగురిలో ఉత్సాహంగా మాట్లాడబోయి మాట రాక బిక్కముఖం పెడతారు. అలాంటప్పుడు తల్లిదండ్రులకు ఏమీ పాలుపోక పిల్లల్ని అక్కడే దండిస్తుంటారు.  స్పెషల్ కిడ్‌‌స తల్లులు పిల్లలతో చాలా సహనంతో వ్యవహరించాలి. ఇది చాలా తప్పు. పిల్లలు ధైర్యం కోల్పోతుంటే వారికి ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ ఉండాలి. ‘ఇది చాలా చిన్న సమస్య, డాక్టర్ చెప్పినట్లు చేస్తుంటే తగ్గిపోతుంది’ అని నచ్చచెప్పాలి. డాక్టర్ కౌన్సెలింగ్ కంటే తల్లి కౌన్సెలింగ్ బాగా పనిచేస్తుంది.    
 

- వాకా మంజులారెడ్డి
 
 స్పెషల్ కిడ్స్ ఉన్న తల్లిదండ్రుల కోసం...
 
 కుటుంబ చరిత్రలో ఎవరికైనా సరే, నత్తి, మూగ, అంధత్వం, చెవిటితనం వంటి శారీరక లోపాలు లేదా ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్ వంటి మానసిక సమస్యలు  ఏమైనా ఉన్నట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక, శారీరక పెరుగుదలను ప్రత్యేక శ్రద్ధతో గమనించాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉన్నట్లు గమనిస్తే, ఆ పరిస్థితిని సత్వరంగా స్వీకరించి, మానసికంగా దృఢంగా మారాలి. సమాజం నుంచి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే విల్‌పవర్‌ని మనం పెంచుకుని, పిల్లల్లోనూ పెంచాలి. మనసులో ఏమాత్రం అసహనం, చిరాకు కలిగినా దానిని పిల్లల మీద ప్రదర్శించకూడదు. సంయమనం పాటిస్తూ ఇలాంటి పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పెంచితే స్పెషల్ కిడ్స్ కూడా అన్ని రంగాలలో బాగానే రాణిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement