ఆమె జీవితం...ఓ పెద్దబాలశిక్ష!!
‘నాన్నా! ఈ ఫ్రాక్ నచ్చలేదు... నేను వేసుకోను’ అంటూ విసిరేసిన బాల్యం ఆమెది
ఇంటి బయట కాలు పెట్టేది బాటా చెప్పులతోనే...
పదవ తరగతికి వచ్చేసరికి జడగంటలు కట్టిన పొడవాటి జడ...
ఆ జడను వయ్యారంగా తిప్పుకుంటూ నడిచే ఆత్మవిశ్వాసం ఆమె సొంతమైంది.
ఆ జీవితం ఒక్కసారిగా దూరమైంది... దూరంగా జరిగిపోయింది.
స్నేహితులిచ్చిన దుస్తులతో రోజులు వెళ్లదీయాల్సి వచ్చింది.
చీరకు కుచ్చిళ్లు పోసేది చిరుగులను కప్పుకోవడానికే అన్నట్లు మారిపోయింది.
రెండు రూపాయల పాకీజా చెప్పులతో రోడ్డు మీద మొదలైంది ఆమె ప్రయాణం.
పాతికేళ్లకే వందేళ్ల జీవితానుభవాన్ని చూసింది. బాధ్యతల బరువు మోసిన ఆ అనుభవమే...
ఇప్పుడు మూడు వందల మందికి ఉపాధినిస్తోంది!!
విమల తండ్రి ఎల్‌ఐసి ఆఫీసర్... రక్షణ వ్యవస్థ మాజీ ఉద్యోగి. మిలటరీ క్రమశిక్షణలో పెరగడంతో ఇల్లు బందిఖానాగా అనిపించి బయటి ప్రపంచం అందమైన హరివిల్లులా కనిపించసాగిందామెకు. పదహారేళ్ల వయసులో ఇల్లు దాటి ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమవివాహంలో తియ్యదనం నాలుగేళ్లు కూడా లేకపోయింది. ఇరవై ఏళ్లకే ఇద్దరు అమ్మాయిలకు తల్లైంది. ఆ తర్వాత ఇద్దరు మగపిల్లలు. జీవితం తక్కెడలో సమతుల్యం లోపించింది. ప్రేమ పెళ్లిలో తీపికంటే వైవాహిక జీవితంలో బాధ్యతలే బరువని తెలిసి వచ్చిందామెకు. దురదృష్టం ఏమిటంటే... ఇవేవీ ఆమె భర్త కొండయ్యకు పట్టలేదు. నలుగురు పిల్లల ఆకలి తీర్చడం తల్లిగా తన ధర్మం అనుకున్నారామె. భర్త బాధ్యతరాహిత్యం, నలుగురు పిల్లల పోషణ బాధ్యత ఆమెను సేల్స్‌గర్ల్‌గా మార్చాయి.
హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్‌లో సేల్స్‌గర్ల్‌గా చేరిన విమలానాయుడు అనేక కంపెనీలు మారి చివరికి సొంత ఏజెన్సీ ప్రారంభించారు. ‘‘1982లో పాతికమంది ప్రమోటర్స్‌తో ప్రారంభించి ఇప్పుడు మూడు వందల మందితో జాన్సన్స్ అండ్ జాన్సన్స్ వంటి బహుళజాతి కంపెనీలకు సేవలందిస్తున్నాం. ఈ ఏజెన్సీతోనే పిల్లలను చదివించి పెళ్లి చేశాను’’ అన్నారామె.
సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో చదివే రోజుల్లో పడిన తప్పటడుగు ఆమె జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పింది. ప్రమోటర్‌గా ఎండలో నడుస్తూ ఉంటే ఒకరోజు రోడ్డు మీద ఆమె అన్నయ్య ఎదురుపడ్డారు. అంతకాలం తర్వాత కనిపించిన చెల్లిని ఆత్మీయంగా పలకరించక పోగా... ‘నీ జీవితం రోడ్డుపాలే’ అనేసి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా జీవితం తలక్రిందులైన వైనాన్ని తలుచుకుంటూ ‘‘నాలాగ ఎవరూ జీవితంలో తప్పటడుగు వేయకూడదు. ప్రేమ, ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమించడానికి టీనేజ్ సరైన వయసు కాదని ఈ తరానికి తెలియాలి’’ అంటారామె.
పిల్లల జీవితం తనలా కాకూడదని...
తాను చేసిన పొరపాటే చేస్తుందేమోననే భయంతో పెద్దమ్మాయికి పదో తరగతి పూర్తవగానే పెళ్లిచేశారు విమల. రెండో అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి కొంత భరోసా వచ్చిందంటారామె. ‘‘మోసానికీ బలి కాదనే ధైర్యంతో కాలేజ్‌లో చేర్పించాను. ఇప్పుడు ఎంబిఎ గోల్డ్ మెడలిస్ట్. పెద్దబ్బాయి డిగ్రీ సగంలోనే మానేసి నాతోపాటు ఏజెన్సీ చూసుకుంటున్నాడు. రెండో అబ్బాయి ఎం.ఎ చేశాడు. ఉద్యోగం, పిల్లల బాధ్యతలన్నీ ఒక ఎత్తయితే నాకు రోజూ సాయంత్రం ఏడయ్యేసరికి ఆందోళనతో మనసంతా కకావికలమయ్యేది.
తాగి ఫలానా చోట పడి ఉన్నాడని ఎక్కడి నుంచి కబురు వస్తుందో, ఎక్కడికెళ్లి ఆ మనిషిని ఇంటికి తీసుకురావాల్సి వస్తుందోనని గుండె దడదడలాడేది’’ అన్నారామె దుంఖాన్ని దిగమింగుకుంటూ. చిలకలగూడలో మహిళలకు ఇప్పుడు విమలానాయుడు ఓ పెద్దదిక్కు. వారి కష్టాలను పంచుకునే పెద్దక్క. మైత్రి బృందాలతో వారికి ఉపాధి మార్గాలను చూపిస్తున్నారామె. ప్రభుత్వ పథకాలను తమ వాకిళ్లకు తెచ్చుకుంటున్నారు. వీటన్నింటికీ సారా ఉద్యమంలో పాల్గొనడమే కారణం అంటారామె.
తనకు చేతనైన సాయం!
రంజాన్ మాసంలో గురువారాలు మసీదులో లుంగీలు, పండ్లు పంచుతూ కనిపిస్తారు విమల. చర్చ్‌లో మేరీమాతకు కిరీటం పెట్టి సంతోషిస్తారు. సాయిబాబాకి ఊయల ఊపుతూ ఆనందిస్తారు. తన ప్రమోటర్స్ పెళ్లికి మట్టెలు, తాళిబొట్టు ఇస్తారు. ‘‘అమ్మానాన్నల మనసు కష్టపెట్టిన పాపం నాది. నేను చేసిన తప్పులను పరిహరించమని అందరు దేవుళ్లనూ ఇలా వేడుకుంటున్నా’’ అంటారు. విమలానాయుడు జీవితం తెరిచిన పుస్తకం. అందులోని ప్రతి అక్షరం మరొకరికి హెచ్చరిక కావాలనేది ఆమె కోరిక. జీవితంలో ఎలాంటి పొరపాటు చేయకూడదో తనను చూసి తెలుసుకోమంటారు. జీవితానికి ఎదురు నిలబడి గెలవవచ్చు అనడానికి కూడా పాఠం తన జీవితమే- అంటారామె.
- వాకా మంజులారెడ్డి, ఫొటోలు: జి. రాజేశ్
మద్యం మహమ్మారి చేసే వినాశం ఏంటో నేను అనుభవించాను. ఆ గుండెమంట నన్ను సారా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేలా చేసింది. మా స్థానిక మహిళలను సమీకరించి ఉద్యమం చేశాం. అందరికంటే పెద్ద బాధితురాలిని కాబట్టి సారా ఉద్యమంలో మా కాలనీ వాళ్లకు నేనే పెద్ద దిక్కయ్యాను. ఇప్పటికీ వాళ్లకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అవసరం వచ్చినా తమతో రమ్మని అడుగుతుంటారు. కుట్టుశిక్షణ తరగతులు, మగ్గం వర్క్‌లో శిక్షణ అలా ప్రారంభించినవే.
- విమలానాయుడు